ముంబై: ఐటీ, ఇంధన కంపెనీల షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు మంగళవారం దాదాపు లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సెంటిమెంట్‌ను బలపరిచాయి. సెన్సెక్స్ 455 పాయింట్లు పెరిగి 72,186 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 158 పాయింట్లు బలపడి 21,929 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో రోజంతా లాభాల్లో ట్రేడయ్యాయి.
ఒక దశలో సెన్సెక్స్ 530 పాయింట్లు పెరిగి 72,261 వద్ద, నిఫ్టీ 179 పాయింట్లు బలపడి 72,261 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒకశాతానికి పైగా రాణించాయి. సెన్సెక్స్ 455 పాయింట్లు పెరగడంతో బీఎస్‌ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్ల విలువ రూ.4.27 లక్షల కోట్లు పెరిగి రూ.386.88 లక్షల కోట్లకు చేరింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.93 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1096 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఆసియాలో హాంగ్‌కాంగ్ 4%, చైనా 3%, థాయిలాండ్ 1%, ఇండోనేసియా, తైవాన్ సూచీలు అరశాతం చొప్పున పెరిగాయి. యూరప్ మార్కెట్లు 0.50% – 0.75% చొప్పున లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.
► వరుస 3 రోజుల్లో 42% పతనాన్ని చవిచూసిన పేటీఎం షేరు కోలుకుంది. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్‌ఈలో 3% లాభపడి రూ.452 వద్ద స్థిరపడింది.
► టీసీఎస్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. ఐటీ షేర్లలో ర్యాలీలో భాగంగా టీసీఎస్ షేరు ట్రేడింగ్‌లో 4.5% ర్యాలీ చేసి రూ.4,150 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. చివరికి 4% లాభపడి రూ.4,133 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment