డాక్టరుగారూ! మా తమ్ముడు బయట అందరితో చాలా బాగా ఉంటాడు. ఇంట్లో మాత్రం ఎప్పుడూ భార్యతో కొట్లాటలే! భార్యను విపరీతంగా అనుమానిస్తాడు. చాలామందితో సంబంధాలున్నాయని తిట్టడం కొట్టడం కూడా చేశాడు. నిజానికి వాడి భార్య చాలా మంచి అమ్మాయి. ఈ బాధలు భరించలేక మూడేళ్ళ క్రిందట ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు. సంవత్సరం కిందట మళ్ళీ మా పెద్దలు రెండో వివాహం చేశారు. మళ్ళీ అదే విధంగా ఈమెను కూడా అనుమానించి వేధిస్తున్నాడు. మావాడు ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో మాకర్థం కావడం లేదు. ఈమె కూడా వీడు పెట్టే బాధలు తట్టుకోలేక ఏమైనా చేసుకుంటుందేమోనని మాకు భయంగా ఉంది. మా తమ్ముడికి ఇలా మళ్ళీ పెళ్ళి చేయడం మా తప్పేనంటారా! అసలు మావాడెందుకు ఇలా చేస్తున్నాడో దయచేసి చెప్పండి.
– పద్మావతి, గిద్దలూరు
మీ తమ్ముడు ‘డెల్యూజనల్ డిసార్డర్’ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు మీరు రాసిన దాన్ని బట్టి అర్థమవుతుంది. దీనిని ‘ఒథెల్లో సిండ్రోమ్’ అని కూడా అంటారు. షేక్‌స్పియర్ రాసిన ‘ఒథెల్లో’ నాటకంలోని ఇతివృత్తం కూడా ఇలాగే ఉంటుంది. ఎలాంటి ఆధారాలు లేకున్నా, వాస్తవం కాకపోయినా జీవిత భాగస్వామి శీలాన్ని శంకించి ఇలా వేధించడం ఒక విధమైన మానసిక జబ్బే! మెదడులోని కొన్ని రసాయనిక చర్యలవల్ల, వారసత్వంగా వచ్చే జీన్స్ ప్రభావం వల్లనూ కొందరికి ఈ వ్యాధి వస్తుంది.
ఇది కూడా ఒక మానసిక రుగ్మత అని తెలియక మీరు మీ తమ్ముడికి మళ్లీ వివాహం చేసి పెద్దపొరపాటు చేశారు. మీ మరదలు చాలా మంచిదని మీరే చెబుతున్నారు కదా... మొదట్లోనే మీవాడిని మానసిక వైద్యునికి చూపించి తగిన చికిత్స చేయించి ఉంటే, మీ మరదలు అలా ఆత్మహత్య చేసుకొని ఉండకపోవచ్చు. ఏమైనా, మీ తమ్ముడికి వచ్చే ఈ అనుమానాలను తగ్గించేందుకు, మంచి మందులు, ఇతర చికిత్సా పద్ధతులు ఉన్నాయి.
ఇంకో అఘాయిత్యం జరగక ముందే వెంటనే మీ తమ్ముణ్ణి దగ్గర్లోని సైకియాట్రిస్ట్‌కు చూపించి వైద్యం చేయిస్తే మీ వాడు పూర్తిగా ఆ భ్రమలు, భ్రాంతుల నుండి బయటపడి రెండో భార్యతో సంతోషంగా సంసారం చేయగలడు. ఆలస్యం చేయకుండా మానసిక వైద్య చికిత్స చేయించండి.
(చదవండి: సూర్యరశ్మికి కొదువ లేదు..ఐనా ఆ విటమిన్ లోపమే ఎక్కువ ఎందుకు..?)
Comments
Please login to add a commentAdd a comment