మాయ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ప్రఖ్యాత ఎమ్మెన్సీలో పనిచేస్తోంది. ఎప్పుడూ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఆమె చలాకీతనం చూసి రవి ఇష్టపడ్డాడు, ప్రపోజ్ చేశాడు, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో బాగానే ఉంది. ఇద్దరూ కలసి పార్టీలు, పబ్‌లంటూ తిరిగేవారు. పండంటి బిడ్డ పుట్టింది. ఆ తర్వాత మాయ ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది.
బిడ్డను కూడా పట్టించుకోకుండా జిమ్, యోగా అంటూ తిరుగుతోంది. అందంగా కనిపించాలని, సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలవాలని ఎక్స్‌పోజింగ్ డ్రెస్‌లేస్తోంది. కారణం లేకుండానే ఏడుస్తోంది, అరుస్తోంది, ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరిస్తోంది. ఆవేశంలో ఆమె ఏమైనా చేసుకుంటే అది తన మెడకు చుట్టుకుంటుందని రవి హడలి పోతున్నాడు. ఈ నేపథ్యంలో మిత్రుల సలహా మేరకు ఇద్దరూ కౌన్సెలింగ్‌కి వెళ్లారు.
ఒక వ్యక్తి సమస్యను అర్థం చేసుకోవాలంటే వారి కుటుంబ, సాంస్కృతిక నేపథ్యం అవసరం. మాయ లేకలేక పుట్టిన పిల్ల. దాంతో ఆమె బాల్యం ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగింది. ఆటలు, పాటలు, నాట్యంలో ముందుండేది. ఆమె ఏం చేసినా పేరెంట్స్ కాదనేవారు కాదు. తప్పు చేసినా సంబరంగా చప్పట్లు కొట్టేవారు. దాంతో ఇతరులు మెచ్చుకుంటేనే, సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఉంటేనే సెల్ఫ్ వాల్యూ ఉంటుందనే భావన ఆమెలో ఏర్పడింది.
మాయతో ఓ గంట మాట్లాడాక ఆమె హిస్ట్రియోనిక్ పర్సనాలిటీ డిజార్డర్(ఏ్కఈ)తో బాధపడుతున్నట్లు అర్థమయింది. సైకోడయాగ్నసిస్‌లోనూ అదే నిర్ధారణైంది. దీనికి కాగ్నిటివ్–బిహేవియరల్ థెరపీ (ఇఆఖీ), సైకోడైనమిక్ టెక్నిక్స్‌ల కలయికగా చికిత్స ఉంటుంది. ఇది మాయ తన సెల్ఫ్ ఇమేజ్‌ను పెంచుకోవడంలో ఇవి సహాయపడతాయి.
ప్రతికూల ఆలోచనా విధానాలను గుర్తించి, సవాలు చేస్తుంది. ఒత్తిడిని జయించడానికి ఆరోగ్యకరమైన కోపింగ్ మెకానిజమ్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆ దంపతులు అంగీకారం మేరకు వారానికో సెషన్ షెడ్యూల్ అయింది. ఆరు నెలల్లో మాయ ప్రవర్తనలో ఆశించిన మార్పులు కనిపించాయి.
అసలిదేమిటి?
వ్యక్తిత్వ లోపాలుగా కనిపించే మానసిక రుగ్మతలను పర్సనాలిటీ డిజార్డర్స్ అంటారు. ఇవి దాదాపు తొమ్మిదిశాతం మందిలో ఉంటాయి. ఒక శాతం ప్రజల్లో హెచ్‌పీడీ కనిపిస్తుంది. ఇందులో వ్యక్తి ఇతరుల దృష్టిని ఆకర్షించేందుకు నాటకీయంగా భావోద్వేగాలను ప్రదర్శిస్తారు. ఇతరులను మానిప్యులేట్ చేసేందుకు ఎత్తులు వేస్తుంటారు. ఇది యుక్తవయస్సులో మొదలవుతుంది.
ఎలాగైనా ఆకట్టుకోవాల్సిందే..
నిరంతరం ఇతరుల భరోసా లేదా ఆమోదం అవసరం కావడం
ఇతరుల దృష్టిని ఆకర్షించే ప్రవర్తనల్లో మునిగిపోవడం ·
అందుకోసం మితిమీరిన భావోద్వేగాలను ప్రదర్శించడం
బలహీనత, అనారోగ్య లక్షణాలను ప్రదర్శించడం
రూపంపై అతిగా శ్రద్ధ చూపడం, ఎక్స్‌పోజింగ్‌గా ఉండే దుస్తులు ధరించడం
లైంగికంగా రెచ్చగొట్టేలా ప్రవర్తించడం
ఆత్మహత్య బెదిరింపులతో ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడటం
అస్థిరమైన మనోభావాలు, అభిప్రాయాలు, నమ్మకాలు
ఎవరూ పట్టించుకోకపోతే నిరాశకు గురవడం
మందుల్లేవు, థెరపీనే మార్గం..
వ్యక్తిత్వ లోపాలను ఎవరూ గుర్తించరు. గుర్తించినా చికిత్స తీసుకోరు. దీన్ని తగ్గించే మందులూ లేవు. ముందుగా రుగ్మతను గుర్తించడం, దానికి సైకోథెరపీ ద్వారా చికిత్స తీసుకోవడం అవసరం. దానికి ముందుగా జీవనశైలిలో మార్పుద్వారా.. కొంతవరకు సంస్కరించుకోవచ్చు.
అతి గారాబమూ కారణమే..
- కొన్ని కుటుంబాలలో హెచ్‌పీడీ కొనసాగుతుంది. అందుకే దీనికి జన్యుపరమైన సంబంధం ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
- బాల్యంలో కుటుంబ సభ్యుడి మరణం, లేదా హింసకు గురికావడం వంటివి తీవ్ర ప్రభావాన్ని చూపించవచ్చు. వ్యక్తిత్వ లోపంలో భాగంగా మారవచ్చు.
- హద్దులు లేని, అతిగా ఆనందించే పేరెంటింగ్ స్టైల్‌లో పెరిగిన పిల్లల్లో ఈ డిజార్డర్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.
- నాటకీయ, అస్థిర, అనుచిత లైంగిక ప్రవర్తనను ప్రదర్శించే తల్లిదండ్రులు కూడా కారణం కావచ్చు.
ఎలాగంటే..
రోజూ వ్యాయామం చేయడం
తిండి, నిద్ర షెడ్యూల్స్ చేసుకోవడం
ఆల్కహాల్, డ్రగ్స్ లాంటివి మానుకోవడం
మిమ్మల్ని ట్రాక్‌లో ఉంచడానికి స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల సహాయాన్ని పొందడం
సైకోథెరపీ ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనంలో తేలింది
హెచ్‌పీడీకి ప్రత్యేకించి మందులు లేకపోయినా, దానివల్ల వచ్చే ఆందోళన, నిరాశలను తగ్గించేందుకు మందులు ఉపయోగ పడతాయి
యోగా, బయో ఫీడ్‌బ్యాక్ వంటి మైండ్‌ఫుల్‌నెస్ పద్ధతులు వ్యక్తిత్వ లోపాలతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా సహాయ పడవచ్చు
కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా వీలైనంత త్వరగా వ్యక్తిత్వ రుగ్మతల నుంచి బయటపడవచ్చు.
సైకాలజిస్ట్ విశేష్
Comments
Please login to add a commentAdd a comment