తనను తాను ప్రేమించుకోవడం అందరికీ ఉండే సహజాతం. ఇదే లేకపోతే మనిషి మనుగడే కష్టం
మెడి క్షనరీ
తనను తాను ప్రేమించుకోవడం అందరికీ ఉండే సహజాతం. ఇదే లేకపోతే మనిషి మనుగడే కష్టం. అయితే కొందరు తమ గొప్పలు తాము అదేపనిగా చెబుతుంటారు. ఇది కూడా పెద్ద సమస్య కాదు. నిజానికి అలా ఉండటం వల్లనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. కానీ తన సామర్థ్యాలను అతిగా ఊహించుకొని తప్పులు చేస్తుంటే మాత్రం ఇది సమస్య అవుతుంది. తనను తాను ప్రేమించుకోవడం మితిమీరితే దాన్ని ఒక మానసిక సమస్యగా పరిగణిస్తారు నిపుణులు.
దీన్ని వ్యక్తిత్వానికి, మూర్తిమత్వానికి (పర్సనాలిటీ)కి సంబంధించిన ఆరోగ్య సమస్యగా డాక్టర్లు పేర్కొంటారు. ఇలా తమ పట్ల తమకు ఉన్న అతి ప్రేమ రుగ్మతను నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ (ఎన్‌పీడీ)గా చెబుతారు. ఒకరు తనను తాను ఎంతగా ప్రేమించుకుంటాడనేందుకు ‘నార్సిసస్’ అనే వ్యక్తి ఒక తార్కాణం. ఆ గ్రీకు పురాణపురుషుడు నీళ్లలోని తన ప్రతిబింబాన్నీ తాను చూసుకొని ఎప్పుడూ మురిసిపోతుంటాడు. ఆయన పేరిటే ఈ రుగ్మతకు ‘నార్సిస్టిక్ పర్సనాటిటీ డిజార్డర్’ అనే పేరు వచ్చింది.