sovereign rating
-
ప్రభుత్వాధికారులతో మూడీస్ భేటీ.. భారత్ రేటింగ్ అప్‌గ్రేడ్‌పై ఆశలు!
న్యూఢిల్లీ: త్వరలో భారత సార్వభౌమ రేటింగ్‌ను సమీక్షించనున్న నేపథ్యంలో రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ సానుకూలాంశాలను ప్రభుత్వ అధికారులు వివరించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెడుతుండటం, విదేశీ మారక నిల్వలు 600 బిలియన్ డాలర్లకు చేరుతుండటం, సంస్కరణల అమలు తీరుతెన్నులు తదితర అంశాల గురించి తెలిపారు. ప్రభుత్వం తలపెట్టిన డిజిన్వెస్ట్‌మెంట్ ప్రణాళిక గురించి మూడీస్ ప్రతినిధులు చర్చించారు. మొత్తం మీద మూడీస్ ప్రతినిధులు కూడా సానుకూలంగా స్పందించారని, రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉందని సమావేశం అనంతరం ఒక అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన శాఖలన్నింటి నుంచి, అలాగే నీతి ఆయోగ్ నుంచి అధికారులు ఇందులో పాల్గొన్నారు. మూడీస్ ప్రస్తుతం భారత్‌కు.. పెట్టుబడులకు అత్యంత కనిష్ట స్థాయి అయిన బీఏఏ3 సార్వభౌమ రేటింగ్ కొనసాగిస్తోంది. దీన్ని అప్‌గ్రేడ్ చేస్తే ఇన్వెస్టర్లకు భారత్‌లో రిస్కులు తక్కువగా ఉంటాయన్న సంకేతం వెడుతుంది. తద్వారా తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను సమకూర్చుకునే అవకాశం లభిస్తుంది. -
భళా.. భారత్, కానీ.. ప్రభుత్వ ఆదాయాలు - వ్యయాల పరిస్థితే బలహీనం!
న్యూఢిల్లీ: భారత్ సావరిన్ రేటింగ్ విషయంలో యథాతథ వైఖరిని అవలంభిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఫిచ్ తన తాజా ప్రకటనలో పేర్కొంది. చక్కటి వృద్ధి తీరు, అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులను తట్టుకొని నిలబడ్డం వంటి అంశాల నేపథ్యంలో రేటింగ్‌ను స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ మైనస్’గా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అయితే ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాల విషయంలో పరిస్థితి బలహీనంగా ఉందని కూడా హెచ్చరించింది. ‘బీబీబీ మైనస్’ అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్. చెత్త రేటింగ్‌కు ఒక అంచె అధికం. 2006 ఆగస్టు నుంచి ఇదే రేటింగ్‌ను ఫిచ్ కొనసాగిస్తోంది. మరో రెండు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజాలు– మూడీస్, స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) కూడా భారత్‌కు ఇదే తరహా రేటింగ్‌ను ఇస్తున్నాయి. అంతర్జాతీయంగా దేశంలోకి పెట్టుబడులు రావడానికి ఆయా సంస్థలు ఇచ్చే రేటింగ్స్ కీలకం. ఫిచ్ విశ్లేషణలో కొన్ని ముఖ్యాంశాలు.. ♦లాంగ్–టర్మ్ ఫారిన్ కరెన్సీ ఇష్యూయర్ డిఫాల్ట్ రేటింగ్ (ఐడీఆర్) స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ మైనస్’గా కొనసాగుతుంది. పటిష్ట వృద్ధి ధోరణి సావరిన్ రేటింగ్‌కు మద్దతిస్తున్న ప్రధాన అంశం. ♦ చెక్కుచెదరని పెట్టుబడుల అవకాశాల నేపథ్యంలో భారత్ వృద్ధి 2023 ఏప్రిల్–2024 మార్చి (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం) మధ్య 6 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. 2022–23లో 7 శాతం వృద్ధి రేటు అంచనాకాగా, 2024–25లో ఎకానమీ స్పీడ్‌ను 6.7 శాతంగా అంచనావేస్తున్నాం. ♦ తోటి ఎకానమీలతో పోల్చితే భారత్ వృద్ధి అవుట్‌లుక్ బాగుంది. దీనితోపాటు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులను తట్టుకునే సామర్థ్యం వల్ల గత ఏడాదికాలంగా పురోగమన బాటలో పయనిస్తోంది. ♦ ప్రభుత్వం మౌలిక రంగంపై పెడుతున్న ప్రత్యేక దృష్టి నేపథ్యంలో గత కొన్నేళ్లుగా కార్పొరేట్, బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లో సానుకూల ధోరణి కనిపిస్తోంది. దీనితో ప్రైవేట్ రంగం బలమైన పెట్టుబడితో వృద్ధి బాటపై ఉన్నట్లు కనిపిస్తోంది. ♦ సేవా రంగ ఎగుమతులకు భారత్ మంచి అవకాశాలు పొందవచ్చు. ♦ గత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం సగటును 6.7 శాతం ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5.8 శాతంగా నమోదుకావచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న 6% అప్పర్బాండ్ కన్నా ఇది 20 బేసిస్ పాయింట్లు తక్కువ. బలహీనతలు ఇవీ.. దేశం కొన్ని బలహీనతలనూ ఎదుర్కొంటోంది. ఆదాయాలు–వ్యయాలు, అధిక లోటు, దీనిని తగ్గించడానికి ప్రభుత్వ వ్యయాల కోత, రుణ భారం, ప్రపంచబ్యాంక్ గవర్నెన్స్ సూచీలుసహా, జీడీపీ తలసరి ఆదాయంసహా కొన్ని వ్యవస్థాగత సూచీలు ఇక్కడ ప్రస్తావనాంశాలు. ద్రవ్యోల్బణం సవాళ్లు, పెరుగుతున్న వడ్డీరేట్లు, అంతర్జాతీయంగా డిమాండ్ పరిస్థితుల మందగమనం, మహమ్మారికి సంబంధించి సమసిపోని సవాళ్లు– అనుమానాలు వంటివీ ఎకానమీ పురోగతికి సవాళ్లుగా ఉన్నాయి. కార్మిక శక్తి భాగస్వామ్యం ఎకానమీలో ఇంకా బలహీనంగానే ఉంది. సంస్కరణల అమలు బాట ఒడిదుడుకులుగానే ఉంది. భారత్ మార్కెట్ అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తున్నప్పటికీ, ఈ ప్రయోజనాలను అందిపుచ్చుకోవడానికి సంబంధించి తగిన సంస్కరణలతో భారత్ సంసిద్ధంగా ఉందా? లేదా అన్న అంశంపై అనిశ్చితి నెలకొంది. భారత్ ప్రభుత్వ రుణ భారం 2022–23లో 82.8%గా (జీడీపీలో) ఉంటుందని భావిస్తున్నాం. -
తగిన స్థాయిలో భారత్ ఫారెక్స్ నిల్వలు
న్యూఢిల్లీ: భారత్ విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు తగిన స్థాయిలో ఉన్నాయని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. అమెరికాలో కఠిన ద్రవ్య విధానం, అంతర్జాతీయంగా కమోడీటీ ధరల తీవ్రత వంటి సవాళ్లను తట్టుకోగలిగిన స్థాయిలో ఈ నిల్వలు ఉన్నట్లు తెలిపింది. ఈ పటిష్టత నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎదురయ్యే సవాళ్ల వల్ల దేశానికి ప్రస్తుతం ఇస్తున్న సావరిన్ రేటింగ్‌కు వచ్చిన ఇబ్బంది ఏదీ లేదని భరోసా ఇచ్చింది. ఈ ఏడాది జనవరి సెప్టెంబర్ మధ్య ఫారెక్స్ నిల్వలు దాదాపు 100 బిలియన్ డాలర్లు తగ్గి, 533 బిలియన్ డాలర్లు చేరినప్పటికీ.. దేశ దాదాపు 10 నెలల దిగుమతుల అవసరాలకు ఇవి సరిపోతాయని అంచనా. తాజా పరిస్థితులపై ఫిచ్ రేటింగ్ వెలువరించిన తాజా నివేదిక అంశాలను పరిశీలిస్తే.. ► భారత్‌లోకి వచ్చీ–పోయే విదేశీ నిధుల మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించి కరెంట్ అకౌంట్ ఖాతా లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.4 శాతంగా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (1.2 శాతం) భారీగా పెరిగినప్పటికీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ► పబ్లిక్ ఫైనాన్స్ పరిస్థితులు రేటింగ్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. భారత్ సావరిన్ రుణ అంశాలు అంతర్జాతీయ ఫైనాన్సింగ్‌పై పరిమితంగానే ఆధారపడడం ఇక్కడ గమనార్హం. దీనివల్ల ప్రపంచ అస్థిరత నుండి భారతదేశం తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం లేదు. భారీ ఫారెక్స్ నిల్వలు రుణ చెల్లింపు సామర్థ్యానికి భరోసాను ఇస్తాయి. స్వల్పకాలిక అంతర్జాతీయ రుణం మొత్తం ఫారెక్స్ నిల్వల్లో కేవలం 24 శాతమే ఉండడం సానుకూల అంశం. ► 2022 రెండవ త్రైమాసికంలో భారత్ స్థూల విదేశీ రుణం జీడీపీలో 18.6 శాతంగా ఉంది. 2021 ‘బీబీబీ’ రేటెడ్ సావరిన్ దేశాల 72 శాతంతో పోల్చితే ఇది చాలా తక్కువ. ► భారత్ ఎగుమతులపై యూరోపియన్, అమెరికా మార్కెట్ల మందగమన ప్రభావం సమీప కాలంలో ఉండవచ్చు. అయితే 2022–23లో క్యాడ్ 3.4 శాతం (జీడీపీలో) ఉన్నా, 2023– 24లో ఇది 2 శాతానికి తగ్గే అవకాశం ఉంది. భారత్ ఎగుమతుల్లో ప్రధానమైన ఇంధన ధరల తగ్గుతాయన్న అంచనాలు దీనికి కారణం. రేటింగ్స్ ఇలా... భారత్‌కు ఫిచ్ ‘బీబీబీ– (జూన్‌లో నెగటివ్ అవుట్‌లుక్ నుంచి స్టేబుల్ అవుట్‌లుక్‌కు పెంపు) రేటింగ్ ఇస్తోంది. ఎస్అండ్పీ ‘బీబీబీ–’ రేటింగ్‌ను కలిగి ఉంది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ బీఏఏ3 (స్టేబుల్ అవుట్‌లుక్) రేటింగ్‌ను ఇస్తోంది. ఈ రేటింగ్స్ చెత్ గ్రేడ్‌కు ఒక అంచె ఎక్కువ. ఒక దేశం లేదా కంపెనీల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు రేటింగ్ సంస్థల రేటింగ్‌ను ప్రాతిపదికగా తీసుకునే సంగతి తెలిసిందే. -
భారత్ రేటింగ్ అంచనా పెంపు
న్యూఢిల్లీ: భారతదేశ సార్వభౌమ రేటింగ్‌కు సంబంధించి ‘అవుట్‌లుక్’ను అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఫిచ్ రెండేళ్ల తర్వాత ‘నెగెటివ్’ నుండి ‘స్థిరం’కు అప్‌గ్రేడ్ చేసింది. వేగవంతమైన ఆర్థిక పునరుద్ధరణ వల్ల మధ్య–కాల వృద్ధికి ఎదురయ్యే సవాళ్లు తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే రేటింగ్‌ను మాత్రం ‘బీబీబీ (–) మైనస్’గా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. భారత్ సార్వభౌమ రేటింగ్‌ను ఫిచ్ 2006 ఆగస్టులో ‘బీబీబీ–’కు అప్‌గ్రేడ్ చేసింది. అప్పటి నుంచి ఇదే రేటింగ్ కొనసాగుతోంది. అయితే అయితే అవుట్‌లుక్ మ్రాతం ‘స్టేబుల్’–‘నెగటివ్’మధ్య ఊగిసలాడుతోంది. భారత్ ఎకానమీ రికవరీ వేగవంతంగా ఉందని, ఫైనాన్షియల్ రంగం బలహీనతలు తగ్గుతున్నాయని ఫిచ్ తాజాగా పేర్కొంది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరల తీవ్రత వల్ల సవాళ్లు ఉన్పప్పటికీ ఎకానమీకి ఉన్న సానుకూల అంశాలు తమ తాజా నిర్ణయానికి కారణమని తెలిపింది. మరిన్ని అంశాలను పరిశీలిస్తే.. ► ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022–23లో భారత్ ఎకానమీ అంచనాలను 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గిస్తున్నాం. మార్చిలో వేసిన అంచనాలు 8.5 శాతం నుంచి 7.8 శాతానికి కుదిస్తున్నాం. అంతర్జాతీయ కమోడిటీ ధరల తీవ్రత, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, కఠిన ద్రవ్య విధానం దీనికి కారణాలు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ 8.7 శాతం పురోగమించింది. ► కోవిడ్ –10 మహమ్మారి షాక్ నుండి భారతదేశ ఆర్థిక వ్యవస్థ దృఢమైన రికవరీని కొనసాగిస్తోంది. ► సహచర వర్థమాన దేశాలతో పోల్చితే భారత్ పటిష్ట వృద్ధిలో పయనిస్తోంది. ఇది ఎకానమీపై మా అవుట్‌లుక్ మారడానికి కారణం. -
సావరిన్ రేటింగ్ పెంచండి..!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– మూడీస్ ప్రతినిధులతో సెపె్టంబర్ 28న భారత్ ఆర్థికశాఖ అధికారులు సమావేశంకానున్నారు. దేశ సావరిన్ రేటింగ్ పెంపు చేయాలని ఈ సందర్భంగా మూడీస్ ప్రతినిధులకు భారత్ అధికారులు విజ్ఞప్తి చేయనున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. మహమ్మారి ప్రేరిత సవాళ్ల నుంచి ఎకానమీ వేగంగా రికవరీ చెందుతోందని మూడీస్ ప్రతినిధులకు వివరించే అవకాశం ఉంది. సంస్కరణలను, రికవరీ వేగవంతానికి ఆయా సంస్కరణలు ఇస్తున్న తోడ్పాటు వంటి అంశాలూ ఈ సమావేశంలో చర్చకు వచ్చే వీలుంది. దేశం 2021–22 బడ్జెట్ తీరు, ద్రవ్యలోటు, రుణ పరిస్థితులు కూడా సమావేశంలో చోటుచేసుకోనున్నాయి. ప్రతియేడాదీ ఆర్థికశాఖ అధికారులు గ్లోబల్ రేటింగ్ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతారు. వచ్చే వారం సమావేశం కూడా ఈ తరహాలో జరుగుతున్నదేనని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కొద్ది నెలల క్రితం మరో రేటింగ్ దిగ్గజం– ఫిచ్‌తో కూడా ఆర్థిక శాఖ అధికారులు సమావేశమయ్యారు. ప్రస్తుతం ‘బీఏఏ3’ రేటింగ్... 13 సంవత్సరాల తర్వాత నవంబర్ 2017లో భారత్ సావరిన్ రేటింగ్‌ను మూడీస్ ‘బీఏఏ3’ నుంచి ‘బీఏఏ2’కు అప్‌గ్రేడ్ చేసింది. అయితే గత ఏడాది తిరిగి ‘బీఏఏ2’ నుంచి ‘బీఏఏ3’కు డౌన్‌గ్రేడ్ చేసింది. పాలసీల్లో అమల్లో సవాళ్లు, ద్రవ్యలోటు తీవ్రత వంటి అంశాలను దీనికి కారణంగా చూపింది. ‘బీఏఏ3’ జంక్ (చెత్త) స్టేటస్‌కు ఒక అంచె ఎక్కువ. రేటింగ్ దిగ్గజ సంస్థలు ఫిచ్, ఎస్అండ్పీ కూడా భారత్‌కు చెత్త స్టేటస్‌కన్నా ఒక అంచె అధిక రేటింగ్‌నే ఇస్తున్నాయి. భారత్ దీనిపట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. భారత్ ఆర్థిక మూలస్తంభాల పటిష్టతను రేటింగ్ సంస్థలు పట్టించుకోవడంలేదన్నది వారి ఆరోపణ. అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఇచ్చే సావరిన్ రేటింగ్ ప్రాతిపదికగానే ఒక దేశంలో పెట్టుబడుల నిర్ణయాలను పెట్టుబడిదారులు తీసుకుంటారు. -
భారత్‌కు ఇంకాస్త మంచి రేటింగ్ ఇవ్వొచ్చు
న్యూఢిల్లీ: భారత్‌కు మరింత మంచి రేటింగ్ ఇవ్వవచ్చని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ పేర్కొన్నారు. విదేశీ మారకద్రవ్య నిల్వలు, ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్‌లోటు, రుణ భారం వంటి పలు భారత ఆర్థిక ప్రాథమిక అంశాలు రేటింగ్ పెంపునకు తగిన విధమైన పటిష్టతతో ఉన్నాయని గురువారం విలేకరులతో అన్నారు. జూన్ ప్రారంభంలోనే భారత్‌కు ఇస్తున్న సార్వభౌమ (సావరిన్ రేటింగ్) రేటింగ్ ‘బీఏఏ2’ నుంచి ‘బీఏఏ3’ కి మూడీస్ తగించడం, ఇక బుధవారం మరో అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– ఎస్అండ్పీ భారత్ రేటింగ్‌ను ‘బీబీబీ–’గానే (రెండు సంస్థల రేటింగ్– ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి జంక్ గ్రేడ్‌కు ఒక అంచె ఎక్కువ) కొనసాగిస్తున్నట్లు ప్రకటించడం వంటి అంశాలు సీఈఏ ప్రకటన నేపథ్యం. రేటింగ్‌ల విషయంలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థల నిర్ణయాల తర్వాత ఇందుకు సంబంధించి ప్రభుత్వంలో కీలక అధికార స్థాయి నుంచి వచ్చిన స్పందన ఇది. సుబ్రమణ్యన్ అభిప్రాయాల్లో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► రుణ పునః చెల్లింపులకు సంబంధించి భారత్ సామర్థ్యం ఎంతో పటిష్టంగా ఉంది. ► భారత్ ఆర్థిక సంస్కరణలు సత్ఫలితాలను అందిస్తాయని సూచిస్తాయని రేటింగ్ సంస్థలు, భారత్ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచీ అధిక వృద్ధి బాటకు మళ్లుతుందని అంచనాలు వేస్తున్న సంగతి గమనార్హం. ► భారత్ ‘ఠి’ (వీ షేప్డ్– వేగవంతమైన ఆర్థిక రికవరీకి సంకేతం) నమూనా రికవరీ సాధిస్తుందనడంలో సందేహం లేదు. స్పానిష్ ఫ్లూ తరువాత ఇదే తరహా పరిస్థితి కనిపించింది. ► ఆర్థిక వ్యవస్థలో రికవరీపై ఈ ఏడాది వృద్ధి ఆధారపడి ఉంటుంది. ఈ ఏడాది రెండవ భాగం నుంచైనా రికవరీ ఉంటుందా? లేదా వచ్చే ఏడాదే ఇక ఇది సాధ్యమవుతుందా? అన్న విషయం ఇంకా అస్పష్టంగా ఉంది. ► అయితే ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తగిన అన్ని చర్యలూ తీసుకోవడంపై ఆర్థిక వ్యవస్థ కసరత్తు చేస్తోంది. అలాగే ద్రవ్యలోటు కట్టడికీ ప్రయత్నిస్తుంది. ► ప్రైవేటైజేషన్ విధానం విషయంలో బ్యాంకింగ్ వ్యూహాత్మక రంగంగా ఉంది. ► మొండిబకాయిల పరిష్కారానికి ‘బ్యాడ్ బ్యాంక్’ ఏర్పాటు అంతగా ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. -
భారత్‌కు సావరిన్ రేటింగ్ కట్
న్యూఢిల్లీ: భారత్‌కు ఇస్తున్న సార్వభౌమ స్థాయి (సావరిన్ రేటింగ్)ని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తగ్గించింది. ఇప్పటి వరకూ ఈ రేటింగ్ ‘బీఏఏ2’ అయితే దీనిని ‘బీఏఏ3’కి తగ్గిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇక భారత్ రేటింగ్ అవుట్‌లుక్‌ను కూడా నెగటివ్‌లోనే కొనసాగించనున్నట్లు పేర్కొంది. డౌన్‌గ్రేడ్‌కు ప్రధాన కారణాలు... ► కోవిడ్–19 మహమ్మారి భారత్ ఆర్థిక పరిస్థితులను దెబ్బతీసింది. అయితే రేటింగ్ డౌన్‌గ్రేడ్‌కు ఇది ఒక్కటే కారణం కాదు. ► తీసుకుంటున్న పలు విధాన నిర్ణయాల అమల్లో పలు సవాళ్లు ఎదురుకానున్నాయి. ► ఆయా అంశాల నేపథ్యంలో వృద్ధిరేటు సుదీర్ఘకాలం అట్టడుగునే కొనసాగనుంది. ► ఇక ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యపరమైన ఒత్తిడులు కూడా ఎదురుకానున్నాయి. తక్కువ ఆదాయం–వ్యయాలు పెరగడం వంటి అంశాల నేపథ్యంలో ఇందుకు సంబంధించి నికర వ్యత్యాసం... ద్రవ్యలోటు మరింతగా కట్టుతప్పే అవకాశం ఉంది. ► ఫైనాన్షియల్ సెక్టార్లో ఒత్తిడి నెలకొనే అవకాశాలు సుస్పష్టం. 2020–21లో జీడీపీ 4 శాతం క్షీణత కోవిడ్–19 సృష్టించిన నష్టంసహా పలు కారణాల వల్ల 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక వ్యవస్థ 4 శాతం క్షీణ రేటును నమోదుచేసుకునే అవకాశం ఉందని మూడీస్ పేర్కొంది. నిజానికి కోవిడ్ మహమ్మారి దాడికి ముందే భారత ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన విషయాన్ని కూడా మూడీస్ ప్రస్తావించింది. పెరగనున్న రుణ భారం: దీర్ఘకాలం వృద్ధి రేటు దిగువస్థాయిలోనే కొనసాగే పరిస్థితులు ఉండడం వల్ల రుణ భారం తగ్గించుకోవడం ప్రభుత్వానికి కొంత క్లిష్టంగా మారే వీలుంది. కరోనాకు ముందు 2019–20లో భారత్ ప్రభుత్వం రుణ నిష్పత్తి జీడీపీలో 72% ఉంటే, ఇది ఈ ఆర్థిక సంవత్సరం 84%కి పెరిగే అవకాశం ఉంది. అయితే రుణ భారాన్ని తగ్గించుకోవడం స్వల్పకాలంలో సాధ్యమయ్యే అవకాశంలేదు. బీఏఏ– రేటెడ్ దేశాలతో పోల్చితే భారత్‌పై అధిక వడ్డీరేటు భారం ఉంది. బీఏఏ స్టేబుల్ దేశాలతో పోల్చితే మూడు రెట్లు ఈ భారం అధికంగా ఉందని మూడీస్ పేర్కొంది. ప్రైవేటు రంగంలో పొదుపులు, ప్రభుత్వ డెట్ మెచ్యూరిటీలు దీర్ఘకాలంలో ఉండడం రుణ భారం, వడ్డీ చెల్లింపుల విషయం లో కొంత సానుకూల విషయం. ఏమిటి ఈ రేటింగ్..? ఒక దేశ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయన్న అంశంపై అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థలు రేటింగ్ ఇస్తుంటాయి. ఎస్అండ్పీ, ఫిచ్, మూడీస్ ఇందులో ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. ఆయా దిగ్గజ సంస్థలు ఇచ్చే రేటింగ్ ప్రాతిపదికనే ఒక దేశం అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించగలుగుతుంది. దేశ సీనియర్ ఆర్థిక శాఖ అధికారులు సైతం దేశానికి సంబంధించి ఆర్థిక పరిస్థితులను అధికారికంగా రేటింగ్ సంస్థల ప్రతినిధులకు వివరించి, రేటింగ్ పెంచవలసినదిగా కోరతారంటే, ఆయా సంస్థలు ఇచ్చే సావరిన్ రేటింగ్ ఒక దేశం పెట్టుబడులను ఆకర్షించడంలో ఎంతగా దోహదపడుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మూడీస్ ఇచ్చిన రేటింగ్ ‘బీఏఏ3’ నెగటివ్ అవుట్‌లుక్ కూడా ఇప్పటికీ ‘ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్’ పరిధిలోకే వస్తుందన్న విషయం గమనార్హం. అయితే ‘జంక్’ గ్రేడ్‌కు ఇది ఒక మెట్టు ఎక్కువ. మిగిలిన రెండు సంస్థలు ప్రస్తుతం భారత్‌కు మూడీస్ ఇస్తున్న రేటింగ్ ‘బీఏఏ3 నెగటివ్’కు సరిసమానమైనవే కావడం గమనార్హం. 2017, నవంబర్‌లో మూడీస్ రేటింగ్ అప్‌గ్రేడ్ చేసినా, అటు తర్వాత రెండు దఫాల్లో క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. కరెన్సీకీ కోత భారత ప్రభుత్వ ఫారిన్ కరెన్సీ అండ్ లోకల్ కరెన్సీ దీర్ఘకాలిక జారీ రేటింగ్స్‌ను కూడా మూడీస్ ‘బీఏఏ2 నుంచి బీఏఏ 3’కి తగ్గించింది. అలాగే భారత్ లోకల్ కరెన్సీ సీనియర్ అన్సెక్యూర్డ్ రేటింగ్స్‌నూ ‘బీఏఏ2 నుంచి బీఏఏ 3’కి కుదించింది. ఇక షార్ట్‌టర్మ్ లోకల్ కరెన్సీ రేటింగ్‌ను ‘పీ–2 నుంచి పీ–3’కి తగ్గించింది. వీటికి సంబంధించి అవుట్‌లుక్‌ను నెగటివ్‌గా పేర్కొంది. ఊహించిందే... భారత్‌కు సంబంధించి ఫిచ్, ఎస్‌అండ్‌పీలు బీఏఏ3 నెగటివ్‌కు సరిసమానమైన రేటింగ్స్ కొనసాగిస్తున్నందువల్ల మూడీస్ కూడా ఈ మేరకు సర్దుబాటు చేస్తుందని మార్కెట్ మొదటి నుంచీ ఊహిస్తూ వస్తోంది. అయితే ఈ రేటింగ్ కూడా భారత్‌కు ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ హోదానే ఇస్తోంది. దీనివల్ల బాండ్, రూపాయి మార్కెట్లో భారీ మార్పు ఏదీ ఉండబోదని మేము భావిస్తున్నాం. – కే. హరిహర్, ట్రెజరర్, ఫస్ట్‌రాండ్ బ్యాంక్ -
భారత్ రేటింగ్‌కు సానుకూల చర్య
♦ ఎఫ్‌డీఐ నిబంధనల సరళీకరణపై మూడీస్ ♦ ఉత్పాదకత, వృద్ధి జోరు పెరుగుతాయ్ న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సరళీకరించడం సార్వభౌమ రేటింగ్‌కు సానుకూల చర్య అని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ తెలిపింది. ఎఫ్‌డీఐ నిబంధనలు సరళీకరించడం సంస్కరణల జోరును కొనసాగించడాన్ని సూచిస్తోందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సంస్థ తన తాజా నివేదికలో పేర్కొంది. గత వారం ప్రభుత్వం పౌర విమానయానం, రిటైల్, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీస్... తదితర 9 రంగాల్లో ఎఫ్‌డీఐ నిబంధనలను సరళీకరిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎఫ్‌డీఐ నిబంధనలను ప్రస్తుత ప్రభుత్వం సరళీకరించడం ఇది రెండోసారి. ఎఫ్‌డీఐల సరళీకరణ ఉత్పాదకత జోరును పెంచుతుందని, రానున్న 3-5 ఏళ్లలో ఆర్థిక వృద్ధికి తోడ్పాటునందిస్తుందంటున్న ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే.., ⇒ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు మందగించిన తరుణంలో భారత్ విదేశీ రుణ అవసరాలను తీర్చడానికి ఈ ఎఫ్‌డీఐలు తోడ్పడుతాయి. అధిక ఎఫ్‌డీఐలు భారత్ విదేశీ ఆర్థిక అవసరాలను కొంత మేర తగ్గిస్తాయి. ⇒ అయితే ఒక్క అధిక ఎఫ్‌డీఐల వల్లనే అధిక వృద్ధి, ఉత్పాదకత సాధ్యం కాదు. ⇒ భారత్ మొత్తం ఫిక్స్డ్ అసెట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఎఫ్‌డీఐల ప్రస్తుత వాటా 10 శాతం కంటే తక్కువగానే ఉంది. దేశీయ ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇది ప్రత్యామ్నాయం కాదు. ⇒ గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం భారత్ పెట్టుబడుల్లో వృద్ధి 3.9 శాతం మాత్రమే. ⇒ గత ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రికార్డ్ స్థాయిలో, 3,600 కోట్ల డాలర్లు వచ్చాయి. అంతక్రితం మూడేళ్లలో సగటున 2,420 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలే వచ్చాయి.