భారత్ రేటింగ్కు సానుకూల చర్య
♦ ఎఫ్‌డీఐ నిబంధనల సరళీకరణపై మూడీస్
♦ ఉత్పాదకత, వృద్ధి జోరు పెరుగుతాయ్
న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సరళీకరించడం సార్వభౌమ రేటింగ్‌కు సానుకూల చర్య అని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ తెలిపింది. ఎఫ్‌డీఐ నిబంధనలు సరళీకరించడం సంస్కరణల జోరును కొనసాగించడాన్ని సూచిస్తోందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సంస్థ తన తాజా నివేదికలో పేర్కొంది. గత వారం ప్రభుత్వం పౌర విమానయానం, రిటైల్, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీస్... తదితర 9 రంగాల్లో ఎఫ్‌డీఐ నిబంధనలను సరళీకరిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎఫ్‌డీఐ నిబంధనలను ప్రస్తుత ప్రభుత్వం సరళీకరించడం ఇది రెండోసారి. ఎఫ్‌డీఐల సరళీకరణ ఉత్పాదకత జోరును పెంచుతుందని, రానున్న 3-5 ఏళ్లలో ఆర్థిక వృద్ధికి తోడ్పాటునందిస్తుందంటున్న ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే..,
⇒ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు మందగించిన తరుణంలో భారత్ విదేశీ రుణ అవసరాలను తీర్చడానికి ఈ ఎఫ్‌డీఐలు తోడ్పడుతాయి. అధిక ఎఫ్‌డీఐలు భారత్ విదేశీ ఆర్థిక అవసరాలను కొంత మేర తగ్గిస్తాయి.
⇒ అయితే ఒక్క అధిక ఎఫ్‌డీఐల వల్లనే అధిక వృద్ధి, ఉత్పాదకత సాధ్యం కాదు.
⇒ భారత్ మొత్తం ఫిక్స్‌డ్ అసెట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఎఫ్‌డీఐల ప్రస్తుత వాటా 10 శాతం కంటే తక్కువగానే ఉంది. దేశీయ ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇది ప్రత్యామ్నాయం కాదు.
⇒ గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం భారత్ పెట్టుబడుల్లో వృద్ధి 3.9 శాతం మాత్రమే.
⇒ గత ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రికార్డ్ స్థాయిలో, 3,600 కోట్ల డాలర్లు వచ్చాయి. అంతక్రితం మూడేళ్లలో సగటున 2,420 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలే వచ్చాయి.