
న్యూఢిల్లీ: త్వరలో భారత సార్వభౌమ రేటింగ్‌ను సమీక్షించనున్న నేపథ్యంలో రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ సానుకూలాంశాలను ప్రభుత్వ అధికారులు వివరించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెడుతుండటం, విదేశీ మారక నిల్వలు 600 బిలియన్ డాలర్లకు చేరుతుండటం, సంస్కరణల అమలు తీరుతెన్నులు తదితర అంశాల గురించి తెలిపారు.
ప్రభుత్వం తలపెట్టిన డిజిన్వెస్ట్‌మెంట్ ప్రణాళిక గురించి మూడీస్ ప్రతినిధులు చర్చించారు. మొత్తం మీద మూడీస్ ప్రతినిధులు కూడా సానుకూలంగా స్పందించారని, రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉందని సమావేశం అనంతరం ఒక అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన శాఖలన్నింటి నుంచి, అలాగే నీతి ఆయోగ్ నుంచి అధికారులు ఇందులో పాల్గొన్నారు.
మూడీస్ ప్రస్తుతం భారత్‌కు.. పెట్టుబడులకు అత్యంత కనిష్ట స్థాయి అయిన బీఏఏ3 సార్వభౌమ రేటింగ్ కొనసాగిస్తోంది. దీన్ని అప్‌గ్రేడ్ చేస్తే ఇన్వెస్టర్లకు భారత్‌లో రిస్కులు తక్కువగా ఉంటాయన్న సంకేతం వెడుతుంది. తద్వారా తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను సమకూర్చుకునే అవకాశం లభిస్తుంది.