ముంబై: ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ అమెరికా రుణ రేటింగ్‌ను తగ్గించడంతో బుధవారం ఈక్విటీ మార్కెట్లు బేర్‌మన్నాయి. దేశీయ బెంచ్ మార్క్ సూచీలు ఒక శాతానికి పైగా కుప్పకూలాయి. ఫలితంగా దలాల్ స్ట్రీట్‌లో రూ.3.46 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఉదయం సెన్సెక్స్ 395 పాయింట్ల నష్టంతో 66,064 వద్ద, నిఫ్టీ 79 పాయింట్లు పతనమై 19,655 వద్ద మొదలయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాల ప్రభావంతో రోజంతా నష్టాల్లో కదలాడాయి.
విస్తృత స్థాయిలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఆయా రంగాల సూచీలు గరిష్టంగా రెండున్నర శాతం వరకు క్షీణించాయి. ఒక దశలో సెన్సెక్స్ 1027 పాయింట్లు నష్టపోయి 65,432 వద్ద, నిఫ్టీ 311 పాయింట్లు క్షీణించి 19,423 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చాయి. చివర్లో కనిష్ట స్థాయిల వద్ద స్వల్ప కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 677 పాయింట్లు నష్టపోయి 65,783 వద్ద ముగిసింది. నిఫ్టీ 207 పాయింట్లు పతనమై 19,527 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్, ఆటో షేర్లలో పెద్ద ఎత్తున విక్రయాలు తలెత్తాయి. దీంతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలూ ఒకశాతానికి పైగా పతనమయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1878 కోట్లను, సంస్థాగత ఇన్వెస్టర్లు స్వల్పంగా రూ.2 కోట్లను షేర్లను విక్రయించారు.
రూపాయి ఆరునెలల్లో అతిపెద్ద పతనం
రూపాయి విలువ ఆరు నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. డాలర్ మారకంలో 45 పైసలు కరిగిపోయి 82.67 వద్ద స్థిరపడింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ భారీ పతనం, విదేశీ ఇన్వెస్టర్లు నిధుల ఉపసంహరణలు ఇందుకు కారణమయ్యాయి. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 82.38 వద్ద మొదలైంది. ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇంట్రాడే కనిష్ట స్థాయి(82.67) వద్ద ముగిసింది. ‘ప్రపంచ మార్కెట్లో రిస్క్ తీసుకునే సామర్థ్యం తగ్గిపోవడంతో పాటు ఆసియా కరెన్సీల బలహీన ట్రేడింగ్‌తో రూపాయి భారీగా నష్టపోయింది. అంతర్జాతీయ కరెన్సీ విలువల్లో డాలర్ బలపడటమూ దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచింది’ అని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు.
ఒక్క రోజులో రూ.3.46 లక్షల కోట్ల నష్టం
సెన్సెక్స్ ఒక శాతానికి పైగా క్షీణించడంతో దలాల్ స్ట్రీట్‌లో రూ.3.46 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రూ.303 లక్షల కోట్లకు దిగివచి్చంది.
నష్టాలు ఎందుకంటే
► ‘గత 20 ఏళ్లలో అమెరికా అప్పుల కుప్పగా మారింది. పాలనా వ్యవస్థలో స్థిరమైన క్షీణత కనిపిస్తుంది. యూఎస్ రుణ రేటింగ్‌ను ఏఏఏ నుంచి ఏఏప్లస్ రేటింగ్‌కు తగ్గిస్తున్నాము’ అని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తెలిపింది. ఈ ప్రకటన ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది.
► ఫిచ్ రేటింగ్ కుదింపుతో పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్ల నుంచి బాండ్లలోకి మళ్లాయి. అమెరికా పదేళ్ల కాలపరిమిత బాండ్లపై రాబడి ఏకంగా 4% పెరిగింది.
► యూరో జోన్, చైనా జూలై పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరాశపరచడంతో అంతర్జాతీయ వృద్ధి భయాలు వెంటాడాయి. ఈ పరిణామాలతో ఆసియా, యూరప్ మార్కెట్లు 2–1% క్షీణించాయి. ఈ ప్రతికూల ప్రభావం దేశీయ మార్కెట్‌పై పడింది.
► దేశీయంగా గడిచిన నాలుగు నెలల్లో సూచీలు 13% ర్యాలీ చేయడంతో గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్లో పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గుచూపారు.
Comments
Please login to add a commentAdd a comment