credit ratings
-
మార్కెట్లపై ‘ఫిచ్’ పంచ్
ముంబై: ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ అమెరికా రుణ రేటింగ్‌ను తగ్గించడంతో బుధవారం ఈక్విటీ మార్కెట్లు బేర్మన్నాయి. దేశీయ బెంచ్ మార్క్ సూచీలు ఒక శాతానికి పైగా కుప్పకూలాయి. ఫలితంగా దలాల్ స్ట్రీట్‌లో రూ.3.46 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఉదయం సెన్సెక్స్ 395 పాయింట్ల నష్టంతో 66,064 వద్ద, నిఫ్టీ 79 పాయింట్లు పతనమై 19,655 వద్ద మొదలయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాల ప్రభావంతో రోజంతా నష్టాల్లో కదలాడాయి. విస్తృత స్థాయిలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఆయా రంగాల సూచీలు గరిష్టంగా రెండున్నర శాతం వరకు క్షీణించాయి. ఒక దశలో సెన్సెక్స్ 1027 పాయింట్లు నష్టపోయి 65,432 వద్ద, నిఫ్టీ 311 పాయింట్లు క్షీణించి 19,423 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చాయి. చివర్లో కనిష్ట స్థాయిల వద్ద స్వల్ప కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 677 పాయింట్లు నష్టపోయి 65,783 వద్ద ముగిసింది. నిఫ్టీ 207 పాయింట్లు పతనమై 19,527 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్, ఆటో షేర్లలో పెద్ద ఎత్తున విక్రయాలు తలెత్తాయి. దీంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలూ ఒకశాతానికి పైగా పతనమయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1878 కోట్లను, సంస్థాగత ఇన్వెస్టర్లు స్వల్పంగా రూ.2 కోట్లను షేర్లను విక్రయించారు. రూపాయి ఆరునెలల్లో అతిపెద్ద పతనం రూపాయి విలువ ఆరు నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. డాలర్ మారకంలో 45 పైసలు కరిగిపోయి 82.67 వద్ద స్థిరపడింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ భారీ పతనం, విదేశీ ఇన్వెస్టర్లు నిధుల ఉపసంహరణలు ఇందుకు కారణమయ్యాయి. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 82.38 వద్ద మొదలైంది. ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇంట్రాడే కనిష్ట స్థాయి(82.67) వద్ద ముగిసింది. ‘ప్రపంచ మార్కెట్లో రిస్క్ తీసుకునే సామర్థ్యం తగ్గిపోవడంతో పాటు ఆసియా కరెన్సీల బలహీన ట్రేడింగ్‌తో రూపాయి భారీగా నష్టపోయింది. అంతర్జాతీయ కరెన్సీ విలువల్లో డాలర్ బలపడటమూ దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచింది’ అని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. ఒక్క రోజులో రూ.3.46 లక్షల కోట్ల నష్టం సెన్సెక్స్ ఒక శాతానికి పైగా క్షీణించడంతో దలాల్ స్ట్రీట్‌లో రూ.3.46 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రూ.303 లక్షల కోట్లకు దిగివచి్చంది. నష్టాలు ఎందుకంటే ► ‘గత 20 ఏళ్లలో అమెరికా అప్పుల కుప్పగా మారింది. పాలనా వ్యవస్థలో స్థిరమైన క్షీణత కనిపిస్తుంది. యూఎస్ రుణ రేటింగ్‌ను ఏఏఏ నుంచి ఏఏప్లస్ రేటింగ్‌కు తగ్గిస్తున్నాము’ అని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తెలిపింది. ఈ ప్రకటన ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది. ► ఫిచ్ రేటింగ్ కుదింపుతో పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్ల నుంచి బాండ్లలోకి మళ్లాయి. అమెరికా పదేళ్ల కాలపరిమిత బాండ్లపై రాబడి ఏకంగా 4% పెరిగింది. ► యూరో జోన్, చైనా జూలై పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరాశపరచడంతో అంతర్జాతీయ వృద్ధి భయాలు వెంటాడాయి. ఈ పరిణామాలతో ఆసియా, యూరప్ మార్కెట్లు 2–1% క్షీణించాయి. ఈ ప్రతికూల ప్రభావం దేశీయ మార్కెట్‌పై పడింది. ► దేశీయంగా గడిచిన నాలుగు నెలల్లో సూచీలు 13% ర్యాలీ చేయడంతో గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్లో పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గుచూపారు. -
మళ్లీ లాభాల్లోకి దేశీ ఎయిర్‌లైన్స్
ముంబై: కోవిడ్ మహమ్మారి ధాటికి కుదేలైన దేశీ విమానయాన సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మళ్లీ లాభాల బాట పట్టనున్నాయి. వ్యయాలపరమైన ఒత్తిళ్లు తగ్గడం, రుణభారాన్ని తగ్గించుకోవడం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఇచ్చిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఏవియేషన్ పరిశ్రమ ఈ ఆర్థిక సంవత్సరంలో తమ నష్టాల భారాన్ని 75–80 శాతం మేర రూ. 3,500–4,500 కోట్లకు తగ్గించుకోనున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఇది రూ. 17,500 కోట్లుగా నమోదైంది. ప్యాసింజర్ల ట్రాఫిక్ గణనీయంగా మెరుగుపడటం, వ్యయాలపరమైన ఒత్తిళ్లు తగ్గుతుండటం వంటివి ఎయిర్‌లైన్స్ నిర్వహణ పనితీరుపై సానుకూల ప్రభావం చూపుతున్నాయి. దేశీయంగా విమానయానంలో 75 శాతం వాటా ఉన్న మూడు పెద్ద ఎయిర్‌లైన్స్‌పై విశ్లేషణ ఆధారంగా క్రిసిల్ ఈ అంచనాలు రూపొందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ ట్రాఫిక్ .. కోవిడ్ పూర్వ స్థాయిని అధిగమించవచ్చని, చార్జీలు అప్పటితో పోలిస్తే 20–25 శాతం అధిక స్థాయిలో ఉండవచ్చని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ గౌతమ్ షాహి తెలిపారు. విమాన ఇంధన ధరలు సగటున తగ్గడం కూడా దీనికి తోడైతే ఎయిర్‌లైన్స్ నిర్వహణ పనితీరు మెరుగుపడి, అవి లాభాల్లోకి మళ్లగలవని ఆయన పేర్కొన్నారు. మరిన్ని కీలకాంశాలు.. ► 2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే (కోవిడ్ పూర్వం) ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకూ 9 నెలల కాలంలో దేశీ, అంతర్జాతీయ ప్యాసింజర్ ట్రాఫిక్ వరుసగా 90 శాతం, 98 శాతానికి కోలుకుంది. ► అంతర్జాతీయ సర్వీసులను కూడా పునరుద్ధరించడంతో బిజినెస్, విహార ప్రయాణాలు సైతం పెరిగాయి. ద్వితీయార్ధంలో పండుగల సీజన్ కూడా వేగవంతమైన రికవరీకి ఊతమిచ్చింది. ► అంతర్జాతీయంగా సవాళ్లు నెలకొన్నా భారత్ ఎదుర్కొని నిలబడుతున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరమూ ఇదే తీరు కొనసాగవచ్చని అంచనాలున్నాయి. ► చార్జీలపై పరిమితులను తొలగించడమనేది విమానయాన సంస్థలు తమ వ్యయాల భారాన్ని ప్రయాణికులకు బదలాయించేందుకు ఉపయోగపడుతోంది. ► ఏవియేషన్ రంగం వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 8,000–10,000 కోట్ల ఈక్విటీని సమకూర్చుకోనుంది. విమానాల సంఖ్యను పెంచుకునేందుకు, ప్రస్తుతమున్న వాటిని సరిచేసుకునేందుకు నిధులను వెచ్చించనుంది. ► నిర్వహణ పనితీరు మెరుగుపడటం, ఈక్విటీ నిధులను సమకూర్చుకోవడం వంటి అంశాల కారణంగా స్వల్ప–మధ్యకాలికంగా విమానయాన సంస్థలు రుణాలపై ఆధారపడటం తగ్గనుంది. ► బడా ఎయిర్‌లైన్‌ను (ఎయిరిండియా) ప్రైవేటీకరించిన నేపథ్యంలో రుణ భారం తగ్గి, ఫలితంగా వడ్డీ వ్యయాలూ తగ్గి పరిశ్రమ లాభదాయకత మెరుగుపడనుంది. ► అయితే, సమయానికి ఈక్విటీని సమకూర్చుకోవడం, విమానాల కొనుగోలు కోసం తీసుకునే రుణాలు, కొత్త వైరస్‌లేవైనా వచ్చి కోవిడ్–19 కేసులు మళ్లీ పెరగడం వంటి అంశాలను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. -
బ్రిక్వర్క్స్పై సెబీ కొరడా
న్యూఢిల్లీ: పదే పదే నిబంధనలను ఉల్లంఘిస్తోందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (సీఆర్ఏ) బ్రిక్‌వర్క్ రేటింగ్స్ ఇండియాపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొరడా ఝుళిపించింది. సంస్థ లైసెన్సును రద్దు చేసింది. ఆరు నెలల్లోగా కార్యకలాపాలాన్నీ నిలిపివేయాలని ఆదేశించింది. కొత్తగా క్లయింట్లను తీసుకోరాదంటూ నిషేధం విధించింది. ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీపై సెబీ ఇంత తీవ్ర చర్యలు తీసుకోవడం బహుశా ఇదే తొలిసారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. రేటింగ్స్ ఇచ్చే క్రమంలో నిర్దేశిత ప్రక్రియలు పాటించడంలోనూ, మదింపు విషయంలో సరిగ్గా వ్యవహరించడంలోనూ బ్రిక్‌వర్క్ విఫలమైందని సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. అంతే కాకుండా కంపెనీలకు తాను ఇచ్చిన రేటింగ్స్‌ను సమర్ధించుకునేందుకు అవసరమైన రికార్డులను భద్రపర్చుకోవడంలోనూ సంస్థ విఫలమైందని వ్యాఖ్యానించింది. ‘ఒక సీఆర్ఏగా బ్రిక్‌వర్క్ తన విధులను నిర్వర్తించడానికి సంబంధించి నైపుణ్యాలను ఉపయోగించుకోవడంలోనూ, జాగ్రత్తలు తీసుకోవడంలోను విఫలమైంది. ఇన్వెస్టర్లకు భద్రత కల్పించడంతో పాటు క్రమబద్ధంగా సెక్యూరిటీల మార్కెట్లను అభివృద్ధి చేయాలన్న నిబంధనల లక్ష్యాలకు తూట్లు పొడించింది‘ అని సెబీ ఆక్షేపించింది. అనేక దఫాలుగా తనిఖీలు చేసి, దిద్దుబాటు చర్యలను సూచిస్తూ, జరిమానాలు విధిస్తూ ఉన్నప్పటికీ బ్రిక్‌వర్క్ తన వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదని పేర్కొంది. ‘ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్ వ్యవస్థను కాపాడేందుకు నియంత్రణ సంస్థపరంగా కఠినమైన చర్యలు అవసరమని భావిస్తున్నాను‘ అని ఉత్తర్వుల్లో సెబీ హోల్‌టైమ్ సభ్యుడు అశ్వని భాటియా పేర్కొన్నారు. పదే పదే ఉల్లంఘనలు .. 2014 ఏప్రిల్ నుంచి 2015 సెప్టెంబర్, 2017 ఏప్రిల్–2018 సెప్టెంబర్ మధ్య బ్రిక్వర్క్లో సెబీ తనిఖీలు నిర్వహించింది. ఆయా సందర్భాల్లో పలు ఉల్లంఘనలు ఉన్నట్లు గుర్తించింది. వాటిపై విడిగా విచారణ జరిపింది. ఆ తర్వాత 2020 జనవరిలో ఆర్బీఐతో కలిసి 2018 అక్టోబర్–2019 నవంబర్ మధ్యకాలానికి సంబంధించి బ్రిక్‌వర్క్ రికార్డులను తనిఖీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా ఆర్బీఐతో కలిసి 2019 డిసెంబర్–2022 జనవరి మధ్య కాలానికి సంబంధించిన రికార్డులు, పత్రాలను తనిఖీ చేసింది. వీటన్నింటిలోనూ దాదాపు ఒకే తరహా ఉల్లంఘనలు బైటపడ్డాయి. -
దేశీ విమానయానం 59% అప్..
ముంబై: గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 59 శాతం పెరిగి 8.4 కోట్లకు చేరి ఉంటుందని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. తాము ముందుగా అంచనా వేసిన 8–8.2 కోట్లతో పోలిస్తే ఇది కొంత ఎక్కువే అయినా.. కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే దాదాపు 40 శాతం తక్కువని సంస్థ వైస్ ప్రెసిడెంట్ సుప్రియో బెనర్జీ తెలిపారు. భౌగోళిక–రాజకీయ సమస్యలతో ఆకాశాన్నంటుతున్న విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలు సమీప కాలంలోనూ ఏవియేషన్ పరిశ్రమకు సవాలుగా కొనసాగే అవకాశం ఉందన్నారు. పరిశ్రమ లాభదాయకతను నిర్దేశించే అంశాల్లో ఇవి కీలకంగా ఉంటాయని బెనర్జీ పేర్కొన్నారు. ఇక్రా నివేదిక ప్రకారం.. మహమ్మారి ప్రభావాలు తగ్గుముఖం పడుతూ.. విమానయానం పుంజుకుంటున్న నేపథ్యంలో సీక్వెన్షియల్ ప్రాతిపదికన మార్చిలో ప్రయాణికుల సంఖ్య 37 శాతం పెరిగి 1.06 కోట్లుగా నమోదైంది. ఫిబ్రవరిలో ఇది 77 లక్షలుగా ఉంది. గతేడాది మార్చితో (78 లక్షలు) పోలిస్తే 35 శాతం వృద్ధి చెందింది. ఫ్లయిట్లు 12 శాతం వృద్ధి.. గతేడాది మార్చితో పోలిస్తే ఫ్లయిట్ల సంఖ్య 12 శాతం పెరిగి 71,548 నుంచి 80,217కి చేరిందని ఇక్రా తెలిపింది. ఫిబ్రవరితో పోలిస్తే సర్వీసులు 42 శాతం పెరిగాయి. కోవిడ్–19 థర్డ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం పట్టడం, టీకాల ప్రక్రియ వేగం పుంజుకోవడం, ప్రయాణాలపై ఆంక్షలను ఎత్తివేస్తుండటం వంటి అంశాలు ఇందుకు దోహదపడినట్లు ఇక్రా వివరించింది. ఒక్కో ఫ్లయిట్లో ప్రయాణికుల సంఖ్య ఫిబ్రవరిలో సగటున 135గా ఉండగా మార్చిలో 132గా నమోదైంది. దాదాపు రెండేళ్ల అంతరాయం తర్వాత మార్చి 27 నుండి అంతర్జాతీయ విమానయాన సర్వీసులు ప్రారంభం కావడం ఏవియేషన్ రంగానికి సానుకూలాంశమని ఇక్రా పేర్కొంది. రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా తలెత్తిన భౌగోళిక–రాజకీయ సమస్యలు, క్రూడాయిల్ రేట్ల పెరుగుదల వంటి అంశాలతో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏటీఎఫ్ ధరలు 93 శాతం ఎగిసినట్లు వివరించింది. ఏవియేషన్ రంగానికి ఏటీఎఫ్ ధరలపరమైన సవాళ్లు కొనసాగుతాయని, 2023 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయాలపై ఇవి తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఇక్రా తెలిపింది. -
విమాన ప్రయాణికులు పెరుగుతున్నారు...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆగస్ట్‌లో 66 లక్షల మంది విమాన ప్రయాణం చేశారు. జూలైతో పోలిస్తే ఈ సంఖ్య 31 శాతం అధికమని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ‘ప్రయాణికుల సంఖ్య పరిమితి అధికమవడం, మహమ్మారి తగ్గుముఖం పట్టడం ఈ పెరుగుదలకు కారణం. జూలైలో దేశీయంగా 51 లక్షల మంది వివిధ నగరాలను చుట్టి వచ్చారు. 2020 ఆగస్ట్‌తో పోలిస్తే గత నెలలో ప్రయాణికుల సంఖ్య 131 శాతం అధికమైంది. గతేడాది ఈ కాలంలో 28.3 లక్షల మంది ప్రయాణం చేశా రు. ఆగస్ట్‌లో కోలుకోవడం జరిగినప్పటికీ సె కండ్ వేవ్ కారణంగా డిమాండ్‌పై ఒత్తిడి కొనసాగుతోంది. కస్టమర్లు అవసరమైతే మాత్రమే ప్రయాణిస్తున్నారు’ అని ఇక్రా తెలిపింది. అధికమైన సరీ్వసులు.. దేశవ్యాప్తంగా 2021 ఆగస్ట్‌లో 57,500 విమాన సరీ్వసులు నడిచాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 28,834 మాత్రమే. ఈ ఏడాది జూలైతో పోలిస్తే గత నెలలో 22 శాతం పెరుగుదల. ఆగస్ట్‌లో సగటున 1,900 సరీ్వసులు నమోదయ్యాయి. 2020 ఆగస్ట్‌లో ఇది 900 మాత్రమే. 2021 జూలైలో ఈ సంఖ్య 1,500 ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సగటున రోజుకు 2,000 సరీ్వసులు నడవడం గమనార్హం. ఆగస్ట్‌లో ఒక్కో విమానంలో సగటున 114 మంది ప్రయాణించారు. జూలైలో ఈ సంఖ్య 106 ఉంది. ఇక విమాన టికెట్ల ధరలను ఆగస్ట్ 12–31 మధ్య 10–13 శాతం పెంచేందుకు పౌర విమానయాన శాఖ అనుమతిచి్చంది’ అని ఇక్రా వివరించింది. -
‘బి–పోస్ట్’ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: స్వయం సహాయక సంఘాల మహిళల బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ఐటీ విభాగం ఎమర్జింగ్ టెక్నాలజీ బ్లాక్‌చెయిన్‌తో రూపొందించిన ‘బ్లాక్‌చెయిన్ – ప్రొటెక్షన్ ఆఫ్ స్త్రీ నిధి ట్రాన్జాక్షన్స్’(బీ–పోస్ట్)ను గురువారం ప్రారంభించారు. ఈ విధానం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 1.5 లక్షల మంది సంఘాలకు చెందిన మహిళలు ‘స్త్రీ నిధి’ద్వారా మంజూరయ్యే రుణాలకు క్రెడిట్ రేటింగ్ పొందే అవకాశం ఉంటుంది. తద్వారా బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి రుణాలు పొందే వీలు కలుగుతుంది. హైదరాబాద్‌కు చెందిన కాగ్నిటోచెయిన్ అనే స్టార్టప్ ‘బీ పోస్ట్’ను ప్రయోగాత్మకంగా రూపొందించింది. ఈవిధానంతో రుణవితరణ, చెల్లింపులు సులువు కానున్నాయి. పౌరసేవల్లో టెక్నాలజీ వినియోగం: జయేశ్ రంజన్ పౌర సేవలను అందించే టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం ముందు వరుసలో ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అ న్నారు. పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాతో కలిసి గురువారం ఆయన బీ–పోస్ట్‌ను ఆవిష్కరించారు. బ్యాంకు లావాదేవీలపై అవగాహన లేని నిరుపేద మహిళలకు బీ పోస్ట్ ద్వారా సమర్థవంతంగా సేవలు అందుతాయన్నారు. కార్యక్రమంలో స్త్రీ నిధి రూరల్ ఎండీ విద్యాసాగర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఒకటా, రెండా.. ఎన్ని డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి?
నేను గత కొంత కాలంగా కెనర రొబెకో ఎమర్జింగ్ ఈక్విటీస్ ఫండ్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇది మంచి ఫండేనా? నేను 15–20 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇన్నేళ్లు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? –కిన్నెర, విశాఖపట్టణం కెనర రొబెకొ ఎమర్జింగ్ ఈక్విటీస్ ఫండ్... గత కొంత కాలంగా మంచి పనితీరునే కనబరుస్తోంది. ఈ కేటగిరీలో నిలకడైన పనితీరు కనబరుస్తున్న మంచి ఫండ్స్‌లో ఇది కూడా ఒకటి. అందుకని 15–20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్‌కు మీరు మంచి ఫండ్‌నే ఎంచుకున్నారని చెప్పవచ్చు. ఇక ఇన్నేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు ముఖ్యంగా మూడు ముఖ్య విషయాలు గుర్తుంచుకోవాలి. మార్కెట్లో ఎలాంటి పరిస్థితులున్నా మీ సిప్‌లు ఆపకూడదు. మార్కెట్ పతనమై ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్నా. మీ పెట్టుబడులను ఆపకండి. రెండోది కనీసం ఏడాదికొక్కసారైన మీ సిప్ మొత్తాన్ని కనీసం 10 శాతమైనా పెంచండి. మూడోది ముఖ్యమైనది... కనీసం ఏడాదికి ఒక్కసారైనా మీ ఫండ్ పనితీరును మదింపు చేయడం. ఫండ్ పనితీరు సంతృప్తికరంగా ఉంటే, సిప్‌లు కొనసాగించండి. ఆశించిన స్థాయిలో లేకుంటే ఈ కేటగిరీలోనే మంచి పనితీరును కనబరుస్తున్న మరో ఫండ్‌కు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదలాయించండి. నేను అల్ట్రా–షార్ట్ డ్యూరేషన్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఒకే ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా ? లేక రెండు–మూడు ఫండ్స్‌ను ఎంచుకోమంటారా?ఒక ఫండ్ క్రెడిట్ రేటింగ్ వివరాలను ఎలా అర్థం చేసుకోవాలి.? –ఈశ్వర్, తిరుపతి మీరు మూడు నెలల నుంచి ఏడాది కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు అల్ట్రా షార్ట్–డ్యూరేషన్ ఫండ్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేసేది పెద్ద మొత్తమైతే, రెండు వేర్వేరు ఫండ్ హౌస్‌లకు సంబంధించిన రెండు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. చిన్న మొత్తమైతే ఒక ఫండ్ సరిపోతుంది. ఒక సంస్థ ఆర్థిక స్థితిగతులు, ఆ కంపెనీ రుణ చెల్లింపుల అంచనాలకు సంబంధించిన క్రెడిట్ రిస్క్‌ను క్రెడిట్ రేటింగ్ మనకు వెల్లడిస్తుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఒక కంపెనీ రుణ సాధనాలకు రేటింగ్‌ను క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇస్తుంది. అల్ట్రా షార్ట్–డ్యురేషన్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ముఖ్యంగా రెండు విషయాలు గమనంలో ఉంచుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న ఫండ్... డబల్ ఏ (ఏఏ), అంతకంటే దిగువ రేటింగ్ ఉన్న సాధనాల్లో తక్కువ మొత్తంలోనే ఇన్వెస్ట్ చేసి ఉండాలి. రెండో విషయం డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇటీవలి పనితీరును మాత్రమే పరిగణలోకి తీసుకోకూడదు. కనీసం మూడేళ్ల పనితీరును పరిశీలించిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయాలి. సాధారణంగా చాలా మంది ఇన్వెస్టర్లు ఇటీవలి కాలంలో మంచి పనితీరు కనబరిచిన ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. డెట్ ఫండ్స్ విషయంలో ఇది సరైన నిర్ణయం కాదు. అధిక రాబడులు ఉన్నాయంటే, రిస్క్ కూడా అధికంగానే ఉందని అర్థం. ఇలాంటి ఫండ్స్‌కు దూరంగా ఉండటమే మంచిది. ఇన్వెస్ట్‌మెంట్‌కు భద్రత కూడా ముఖ్యమైన విషయమే కదా ! నేను ప్రతి నెలా కొంత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఫండ్స్‌లో గ్రోత్ ఆప్షన్‌ను ఎంచుకోవాలా? డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలా? తగిన సలహా ఇవ్వండి. –కిరణ్, నెల్లూరు 2018 బడ్జెట్‌కు ముందు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు గ్రోత్ ఆప్షన్‌ను ఎంచుకోవాలా ? డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలా అనే విషయానికి ప్రాధాన్యత అధికంగానే ఉండేది. ఇన్వెస్టర్ వయస్సు, ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న మొత్తం, ఎంత కాలం ఇన్వెస్ట్ చేస్తారు...ఈ అంశాలన్నీ పరిగనలోకి తీసుకొని పెద్ద కసరత్తే చేసి నిర్ణయం తీసుకోవలసి వచ్చేది. ప్రస్తుతం రెండు రకాల ప్లాన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, ఎవరూ డివిడెండ్ ప్లాన్ల జోలికి వెళ్లడం లేదు. గతంలో ఎలా ఉండేదంటే, మీరు ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాది కాలం పాటు కొనసాగించి ఉంటే, మీకు వచ్చే రాబడులపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సి ఉండేది కాదు. అలాగే డివిడెండ్లపై కూడా ఎలాంటి పన్నులు ఉండేవి కావు. ఇప్పుడు మాత్రం 10 శాతం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీని) చెల్లించాల్సి ఉంటుంది. మీరు డివిడెండ్ ప్లాన్‌ను ఎంచుకుంటే మీకు వచ్చే రాబడుల్లో 10 శాతం తగ్గుతాయి. ఉదాహరణకు ఒక ఫండ్ రూ.10 డివిడెండ్ ప్రకటించిందనుకోండి. మీకు రూ.9 మాత్రమే వస్తుంది. అందుకని డివిడెండ్ ప్లాన్‌ను కాకుండా గ్రోత్ ప్లాన్‌ను ఎంచుకోండి. -
దేశ ఆర్థిక వ్యవస్థకు మరో షాక్
దేశ ఆర్థిక వ్యవస్థకు మరో షాక్ తగిలింది. తాజాగా మూడీస్ ఇన్వెస్టర్ సంస్థ భారత క్రెడిట్ రేటింగ్స్ అంచనాలను తగ్గించింది. గత ఆరు సంవత్సరాలలో ఎన్నడు లేని విధంగా దేశ వృద్ధి రేటు 5 శాతం కనిష్టానికి పడిపోయిందని నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వ లక్ష్యానికి(3.3 శాతం) భిన్నంగా 2020 నాటికి జీడీపీలో 3.7శాతం లోటు బడ్జెట్‌కు కేటాయించబోతున్నట్లు మూడీస్ అంచనా వేసింది. దీర్ఘకాలిక ఆర్థిక మందగమనం, రుణబారం నేపథ్యంలో రేటింగ్స్ తగ్గాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు దీర్ఘకాలికంగా ఆర్థిక వృద్థి మందగమనం వల్ల ఆదాయాల తగ్గుదలతో పాటు మెరుగైన జీవన ప్రమాణాలు పొందలేరని, తద్వారా పెట్టబడులకు విఘాతం కలుగుతుందని మూడీస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ విలియమ్ ఫోస్టర్ తెలిపారు. మూడీస్ ప్రకటన తర్వాత ఒక నెల రోజులు డాలర్, రూపాయలను పంపిణీ చేయలేమని ఫార్వర్డ్స్ రోస్ ప్రకటించడం గమనార్హం. వినియాగదారుల రుణాలు తీర్చడంలో ప్రధాన వనరుగా ఉన్న బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థలలో సమస్యలు అంత త్వరగా తీరబోవని తెలిపింది. మరోవైపు ఫిచ్ రేటింగ్స్, ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ మాత్రం ఇప్పటికీ భారతదేశ దృక్పథాన్ని అభినంధించడం విశేషం. -
మరోసారి కుప్పకూలిన ఆర్ కామ్
రిలయన్స్ కమ్యూనికేషన్ షేర్లు మరో సారి కుప్పకూలాయి. రేటింగ్ ఏజెన్సీలు ఫిచ్, మూడీస్ మంగళవారం మళ్లీ కంపెనీ క్రెడిట్ రేటింగ్ ను తగ్గించడంతో బుధవారం కంపెనీ షేర్లకు భారీగా దెబ్బకొట్టింది. నేటి ట్రేడింగ్ లో 4 శాతం పైగా పడిపోయిన ఆర్ కామ్ షేర్లు, కనిష్టంగా రూ.19 వద్ద నమోదయ్యాయి. మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్ లో కంపెనీ రూ.948 కోట్ల నష్టాలను ప్రకటించిన దగ్గర్నుంచి ఆర్ కామ్ 24 శాతం మేర పడిపోయింది. అన్న ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ జియో దెబ్బకు ఆర్ కామ్ కోలుకోలేని నష్టాలను ఎదుర్కొంటోంది. ముందటి ఆర్థిక సంవత్సరంలో 79 కోట్ల లాభాలను ఆర్ కామ్ నమోదుచేయగా.. ముగిసిన ఈ ఏడాదిలో భారీ నష్టాలను మూటగట్టుకుంది. రుణభారం నుంచి గట్టెక్కడానికి బ్యాంకర్లు తమకు ఏడు నెలల సమయమిచ్చారని రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ చెప్పడంతో, ఆర్ కామ్ షేర్లు సోమవారం ట్రేడింగ్ లో 4.6 శాతం మేర లాభపడ్డాయి. కానీ పెరుగుతున్న రుణాలపై మళ్లీ ఆందోళనలు రేకెత్తడంతో సోమవారం వచ్చిన లాభాలు తుడిచిపెట్టుకుపోయాయి. మంగళవారం రోజు ఫిచ్, మూడీస్ లు మరోసారి కంపెనీ రేటింగ్ ను డౌన్ గ్రేడింగ్ చేశాయి. ఫిచ్ ఈ సంస్థను కనిష్ట కేటగిరిలోకి డౌన్ గ్రేడ్ చేయగా.. మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసు రెండో కనిష్ట కేటగిరీలోకి డౌన్ గ్రేడ్ చేసింది. కంపెనీ అవుట్ లుక్ నెగిటివ్ గా ఉందంటూ మూడీస్ తన ప్రకటనలో పేర్కొంది. వారం క్రితమే మూడీస్ ఆర్ కామ్ రేటింగ్ ను బీ2 నుంచి సీఏఏ1 కు తగ్గించింది. ఫిచ్, మూడీస్ మాత్రమే కాక, ఐక్రా, కేర్ లు కూడా కంపెనీ రేటింగ్స్ ను సవరించాయి. ఈ ఏడాది మార్చి 31 వరకు ఆర్ కామ్ నికర రుణం రూ.45వేల కోట్లకు పెరిగింది.