ఒకటా, రెండా.. ఎన్ని డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి? | How Many Debt Funds Should Invest One or Two | Sakshi
Sakshi News home page

ఒకటా, రెండా.. ఎన్ని డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి?

Published Mon, Nov 25 2019 3:04 AM | Last Updated on Mon, Nov 25 2019 3:04 AM

 How Many Debt Funds Should Invest One or Two - Sakshi

నేను గత కొంత కాలంగా కెనర రొబెకో  ఎమర్జింగ్‌ ఈక్విటీస్‌ ఫండ్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఇది మంచి ఫండేనా? నేను 15–20 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. ఇన్నేళ్లు ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?     
–కిన్నెర, విశాఖపట్టణం  

కెనర రొబెకొ ఎమర్జింగ్‌ ఈక్విటీస్‌ ఫండ్‌... గత కొంత కాలంగా మంచి పనితీరునే కనబరుస్తోంది. ఈ కేటగిరీలో నిలకడైన పనితీరు కనబరుస్తున్న మంచి ఫండ్స్‌లో ఇది కూడా ఒకటి. అందుకని 15–20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్‌కు మీరు మంచి ఫండ్‌నే ఎంచుకున్నారని చెప్పవచ్చు. ఇక ఇన్నేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు మీరు ముఖ్యంగా మూడు ముఖ్య విషయాలు గుర్తుంచుకోవాలి. మార్కెట్‌లో ఎలాంటి పరిస్థితులున్నా మీ సిప్‌లు ఆపకూడదు. మార్కెట్‌ పతనమై ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్నా. మీ పెట్టుబడులను ఆపకండి. రెండోది కనీసం ఏడాదికొక్కసారైన మీ సిప్‌ మొత్తాన్ని కనీసం 10 శాతమైనా పెంచండి. మూడోది ముఖ్యమైనది... కనీసం ఏడాదికి ఒక్కసారైనా మీ ఫండ్‌ పనితీరును మదింపు చేయడం. ఫండ్‌ పనితీరు సంతృప్తికరంగా ఉంటే, సిప్‌లు కొనసాగించండి. ఆశించిన స్థాయిలో లేకుంటే ఈ కేటగిరీలోనే మంచి పనితీరును కనబరుస్తున్న మరో ఫండ్‌కు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదలాయించండి.  

నేను అల్ట్రా–షార్ట్‌ డ్యూరేషన్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఒకే ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటారా ? లేక రెండు–మూడు ఫండ్స్‌ను ఎంచుకోమంటారా?ఒక ఫండ్‌ క్రెడిట్‌ రేటింగ్‌ వివరాలను ఎలా అర్థం చేసుకోవాలి.?   
 –ఈశ్వర్, తిరుపతి  
మీరు మూడు నెలల నుంచి ఏడాది కాలానికి ఇన్వెస్ట్‌ చేయాలనుకున్నప్పుడు అల్ట్రా షార్ట్‌–డ్యూరేషన్‌ ఫండ్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. మీరు ఇన్వెస్ట్‌ చేసేది పెద్ద మొత్తమైతే, రెండు వేర్వేరు ఫండ్‌ హౌస్‌లకు సంబంధించిన రెండు ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. చిన్న మొత్తమైతే ఒక ఫండ్‌ సరిపోతుంది. ఒక సంస్థ ఆర్థిక స్థితిగతులు, ఆ కంపెనీ రుణ చెల్లింపుల అంచనాలకు సంబంధించిన క్రెడిట్‌ రిస్క్‌ను క్రెడిట్‌ రేటింగ్‌ మనకు వెల్లడిస్తుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఒక కంపెనీ రుణ సాధనాలకు రేటింగ్‌ను క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఇస్తుంది. అల్ట్రా షార్ట్‌–డ్యురేషన్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు ముఖ్యంగా రెండు విషయాలు గమనంలో ఉంచుకోవాలి. మీరు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్న ఫండ్‌... డబల్‌ ఏ (ఏఏ), అంతకంటే దిగువ రేటింగ్‌ ఉన్న సాధనాల్లో తక్కువ మొత్తంలోనే ఇన్వెస్ట్‌ చేసి ఉండాలి. రెండో విషయం డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు ఇటీవలి పనితీరును మాత్రమే పరిగణలోకి తీసుకోకూడదు. కనీసం మూడేళ్ల పనితీరును పరిశీలించిన తర్వాతనే ఇన్వెస్ట్‌ చేయాలి. సాధారణంగా చాలా మంది ఇన్వెస్టర్లు ఇటీవలి కాలంలో మంచి పనితీరు కనబరిచిన ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారు. డెట్‌ ఫండ్స్‌ విషయంలో  ఇది సరైన నిర్ణయం కాదు. అధిక రాబడులు ఉన్నాయంటే, రిస్క్‌ కూడా అధికంగానే ఉందని అర్థం. ఇలాంటి ఫండ్స్‌కు దూరంగా ఉండటమే మంచిది. ఇన్వెస్ట్‌మెంట్‌కు భద్రత కూడా ముఖ్యమైన విషయమే కదా !  

నేను ప్రతి నెలా కొంత మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఫండ్స్‌లో గ్రోత్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలా? డివిడెండ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలా?  తగిన సలహా ఇవ్వండి.
–కిరణ్, నెల్లూరు  
2018 బడ్జెట్‌కు ముందు ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు గ్రోత్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలా ? డివిడెండ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలా అనే విషయానికి ప్రాధాన్యత అధికంగానే ఉండేది. ఇన్వెస్టర్‌ వయస్సు, ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్న మొత్తం, ఎంత కాలం ఇన్వెస్ట్‌ చేస్తారు...ఈ అంశాలన్నీ పరిగనలోకి తీసుకొని పెద్ద కసరత్తే చేసి నిర్ణయం తీసుకోవలసి వచ్చేది. ప్రస్తుతం రెండు రకాల ప్లాన్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ, ఎవరూ డివిడెండ్‌ ప్లాన్‌ల జోలికి వెళ్లడం లేదు. గతంలో ఎలా ఉండేదంటే, మీరు ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేశారనుకుందాం. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాది కాలం పాటు కొనసాగించి ఉంటే, మీకు వచ్చే రాబడులపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సి ఉండేది కాదు. అలాగే డివిడెండ్లపై కూడా ఎలాంటి పన్నులు ఉండేవి కావు. ఇప్పుడు మాత్రం 10 శాతం డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌(డీడీటీని) చెల్లించాల్సి ఉంటుంది. మీరు డివిడెండ్‌ ప్లాన్‌ను ఎంచుకుంటే మీకు వచ్చే రాబడుల్లో 10 శాతం తగ్గుతాయి. ఉదాహరణకు ఒక ఫండ్‌ రూ.10 డివిడెండ్‌ ప్రకటించిందనుకోండి. మీకు రూ.9 మాత్రమే వస్తుంది. అందుకని డివిడెండ్‌ ప్లాన్‌ను కాకుండా గ్రోత్‌ ప్లాన్‌ను ఎంచుకోండి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement