రిస్క్ పెద్దగా భరించలేని వారు, అదే సమయంలో ఈక్విటీ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాలని భావించే వారు యూటీఐ ఈక్విటీ ఫండ్‌ను పరిశీలించొచ్చు. ఇది మల్టీక్యాప్ ఫండ్. ఇప్పటి వరకు రాబడుల చరిత్ర మెరుగ్గా ఉంది. ముఖ్యంగా గత ఏడాది కాలంలో చెప్పుకోదగ్గ స్థాయిలో పనితీరు ఉంది. 2017లో ఏకంగా 30 శాతం మేర ఈ పథకం ఎన్‌ఏవీ పెరిగింది. అయితే, ఈ విభాగం సగటు రాబడుల కంటే తక్కువే.
కానీ, ఈ ఏడాది మాత్రం ఇప్పటి వరకు 1.3 శాతం మేర రాబడులు ఇచ్చింది. కానీ, ఈ ఏడాది మల్టీ క్యాప్ విభాగం సగటు రాబడులు 8.6 శాతం ప్రతికూలంగా ఉన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా తీవ్ర ఒడిదుడుకులతో కూడిన ఈ ఏడాదిలో ప్రతికూల సమయాల్లోనూ అనుకూల పనితీరు చూపించిన ఈ పథకాన్ని రిస్క్ తక్కువ ఉండాలని భావించే వారు తప్పక పరిశీలించొచ్చు. ఈ పథకం రాబడుల చరిత్ర గొప్పగా లేదు. కానీ, స్థిరంగా తక్కువ ఆటుపోట్లతో ఉన్నందున రిస్క్ తక్కువగా ఉండాలనుకునే వారికి మంచి ఆప్షన్.
దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు
ఈ పథకం 2008, 2011 కరెక్షన్ సమయాల్లో నష్టాలను పరిమితం చేయడం గమనార్హం. ఐదేళ్ల కాలం, ఏడేళ్లు, పదేళ్ల కాలంలో చూస్తే సగటున మెరుగైన రాబడులు ఉన్నాయి. ఈ పథకం రాబడులకు ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ 200 సూచీ ప్రామాణికం. ఏడాది కాలంలో ఈ పథకం రాబడులు 5.9 శాతం అయితే, బీఎస్‌ఈ 200 రాబడులు 0.9 శాతమే ఉన్నాయి. మూడేళ్లలో చూసుకుంటే ఈ పథకం రాబడులు 8.9 శాతంగా ఉంటే, బీఎస్‌ఈ 200 రాబడులు మాత్రం కాస్త ఎక్కువగా 9.1 శాతం మేర ఉన్నాయి.
ఇక ఐదేళ్ల కాలంలో ఈ పథకం సగటున వార్షికంగా 15.8 శాతం రాబడులు ఇచ్చింది. ఇదే కాలంలో బీఎస్‌ఈ 200 రాబడులు 13.4 శాతంగానే ఉన్నాయి. ఏడేళ్ల కాలంలో వార్షిక రాబడులు 14.2 శాతం, పదేళ్ల కాలంలో వార్షిక రాబడులు 16.7 శాతం చొప్పున ఉన్నాయి. మరి ఈ కాలంలో బీఎస్‌ఈ 200 రాబడులు 12 శాతం, 13.5 శాతం చొప్పున ఉన్నాయి. సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మరింత మెరుగైన రాబడులు అందుకునే అవకాశం ఉంటుంది.
విధానం..: 2015, 2016 సంవత్సరాల్లో ఈ పథకం పనితీరు తక్కువగా ఉండటానికి కారణం... సాఫ్ట్‌వేర్ రంగ పనితీరు ఆశాజనకంగా లేకపోవడం వల్లే. యూటీఐ ఈక్విటీ ఫండ్ ఐటీ రంగానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఆ రెండు సంవత్సరాల్లో మెరుగైన పనితీరు చూపించలేకపోయింది. కానీ, ఆ తర్వాత, ఈ ఏడాది మెరుగైన పనితీరుకు ఐటీ రంగ స్టాక్స్ దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు.
58 శాతం నిధులను లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో, 32 శాతం నిధులను మిడ్‌క్యాప్ విభాగంలో, మిగిలిన నిధులను స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. బ్యాంకులు, సాఫ్ట్‌వేర్, ఫార్మా, ఫైనాన్స్ ఈ పథకం పెట్టుబడులకు ప్రాధాన్య రంగాలుగా ఉన్నాయి. అయితే, గడిచిన ఏడాది కాలంలో బ్యాంకింగ్ రంగంలో పెట్టుబడులను కొంత మేర తగ్గించుకోవడం గమనార్హం. అదే కాలంలో సాఫ్ట్‌వేర్, ఇండస్ట్రియల్ ప్రోడక్టు కంపెనీల్లో పెట్టుబడులను పెంచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment