స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లో పెట్టుబడి ఓకేనా? | Is it ok to Investment in Small Cap Funds? | Sakshi
Sakshi News home page

స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లో పెట్టుబడి ఓకేనా?

Published Mon, Apr 24 2017 12:31 AM | Last Updated on Tue, Sep 5 2017 9:31 AM

స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లో పెట్టుబడి ఓకేనా?

స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లో పెట్టుబడి ఓకేనా?

దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే ఈక్విటీ ఫండ్స్‌ను పరిశీలించమని మీరు తరచూ చెబుతుంటారు కదా!  ఎందుకని? భాను ప్రకాశ్, విశాఖపట్నం
ఈక్విటీ (షేర్‌) ద్వారా కంపెనీ యాజమాన్యంలో కొంత వాటాను మీరు పొందవచ్చు. అంటే కంపెనీకి లాభాలు వస్తే మీకు వాటిల్లో భాగముంటుందని అర్థం.  కంపెనీ పనితీరు బాగుంటే ఆ కంపెనీ అమ్మకాలు, లాభాలు పెరుగుతాయి. అలాకాకుండా స్థిరమైన ఆదాయాన్నిచ్చే సాధనాల్లో రాబడులు, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే స్థాయిలో ఉండవు. రెండో విషయం... ఒక మంచి కంపెనీ ఎప్పటికప్పుడు తన మార్కెట్‌ వాటాను పెంచుకుంటూ, గరిష్ట రాబడులను పొందే ప్రయత్నాలు చేస్తుంది.

ఈ ప్రయత్నాల వల్ల ఆ కంపెనీ షేర్‌ ధర పెరుగుతూ ఉంటుంది. అయితే కంపెనీలన్నీ ఇలా మంచి రాబడులిస్తాయని చెప్పలేం. చాలా కంపెనీలు ఒక స్థాయికి వచ్చాక వాటిలో పెద్దగా వృద్ధి ఉండదు. ఈక్విటీ ఫండ్స్‌ విషయానికొస్తే, ఎంతో అనుభవముండే ఫండ్‌ మేనేజర్లు... ఆకర్షణీయమైన ధరల్లో ఉండి భవిష్యత్తులో మంచి రాబడులనిచ్చే కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తారు. కంపెనీ ఫండమెంటల్స్, కంపెనీ భవిష్యత్, భవిష్యత్తు ప్రభుత్వ విధానాలు... ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మంచి కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తారు. ఈ ఫండ్స్‌లో  సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో పెట్టుబడి పెడితే మార్కెట్‌ ఒడిదుడుకుల నుంచి రక్షణ లభిస్తుంది.

అత్యవసర నిధి కోసం కొంత మొత్తం ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. దేన్లో చేస్తే బాగుంటుంది?    ఖలీల్, విజయవాడ
అత్యవసరాల కోసం ఇన్వెస్ట్‌ చేయడమనేది వ్యక్తులను బట్టి మారుతుంది. వ్యక్తులు, వారిపై ఆధారపడిన వాళ్లు, వాళ్ల ఆదాయం, అవసరాలు, వాళ్లు అంచనా వేసే అత్యవసర ఖర్చుల్ని బట్టి ఇది మారుతుం ది. అత్యవసర నిధిని 2–3 స్థాయిలుగా విభజించుకోవాలి. మీ పిల్లలు, తల్లిదండ్రులు కూడా మీ వద్దే ఉన్నారనుకోండి. మీరు కొంత మొత్తం ఇంట్లోనే ఉంచుకోవాలి. ఇది మొదటి స్థాయి. దీనివల్ల రాబడులేమీ రాకపోయినా, మీకు అత్యంత సౌకర్యంగా ఉంటుంది. రెండో స్థాయి లో కొంత మొత్తాన్ని స్వీప్‌–ఇన్‌ సౌకర్యమున్న సేవింగ్స్‌ ఖాతాలో ఉంచుకోవాలి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీరు డబ్బులు తీసుకోగలుగుతారు.

మీకు వైద్య, జీవిత బీమా పాలసీలున్న పక్షంలో పెద్ద మొత్తాన్ని  సేవింగ్స్‌ ఖాతాలో ఉంచుకోవాల్సిన అవసరం లేదు. మూడో స్థాయలో కొంత మొత్తాన్ని ఆల్ట్రా–షార్ట్‌ టర్మ్‌ లేదా షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయాలి. స్వల్పకాలిక నోటీస్‌తోనే వీటి నుంచి సొమ్ములను విత్‌డ్రా చేసుకోవచ్చు. మీ ఆదాయం, అవసరాలు, ఎదురయ్యే అత్యవసర పరిస్థితులు.. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఏ స్థాయిల్లో ఎంత.. అంటే ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? సేవిం గ్స్‌ ఖాతాలో ఎంత మొత్తం డిపాజిట్‌ చేయాలి? ఆల్ట్రా–షార్ట్‌ టర్మ్‌ లే దా షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ఫండ్స్‌ల్లో ఎంత వరకూ ఇన్వెస్ట్‌  చేయాలో నిర్ణయిం చుకోవాలి. మీరు ఉద్యోగస్తులైతే కనీసం ఆరునెలల జీతాన్ని అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఇదే సూత్రం అందరికీ వర్తించదు. అత్యవసర అంచనాలను బట్టి ఈ మొత్తం మారుతుంది.

ప్రస్తుతం స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ మంచి రాబడులనిస్తున్నాయని, అందుకని స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయమని మిత్రుడొకరు చెప్తున్నారు.  నిజమేనా? తగిన సలహా ఇవ్వండి.     జాన్సన్, వరంగల్‌
మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌.. డైవర్సిఫికేషన్‌ ప్రధాన లక్ష్యంగా ఉండాలి. అన్ని కేటగిరీ ఫండ్స్‌ ఒక్కోసారి మంచి రాబడులు ఇస్తాయి. మరోసారి నష్టాలను ఇస్తాయి. ఇదంతా ఒక వృత్తంలాంటిది. గత 5–10 ఏళ్లలో స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ మంచి రాబడులనే ఇచ్చాయి. అయితే గత 2–3 సంవత్సరాల్లో మంచి స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ కూడా చెప్పుకోదగ్గ రాబడులనివ్వలేదు. త్వరలో మార్కెట్‌ ఒకింత పతనమయ్యే అవకాశాలున్నాయని అంచనా. ఈ పరిస్థితుల్లో స్మాల్‌ క్యాప్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడం ఒకింత రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే. అందుకని వీటికి బదులుగా మల్టీ–క్యాప్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడం మంచిది.

ఈ మల్టీ క్యాప్‌ ఫండ్స్‌లో స్మాల్‌ క్యాప్‌ షేర్లు కూడా ఉంటాయి. స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌  విషయంలో ఇన్వెస్టర్లు 2008 సంవత్సరాన్ని అసలు మరచిపోకూడదు. ఆ సంవత్సరంలో స్మాల్‌–క్యాప్‌ ఫండ్స్‌ 70–80 శాతం పడిపోయాయి. అయితే ఈ తరహా మార్కెట్‌ పరిస్థితులు తరచూ తలెత్తే అవకాశాలు లేవనే చెప్పాలి. అయినప్పటికీ, మార్కెట్‌ భారీగా పడిపోతే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కూడా భారీగా నష్టపోవచ్చు. అందుకనే మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను డైవర్సిఫై చేయాలి. స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ నుంచి మంచి రాబడులు పొందాలనుకుంటే మార్కెట్‌ పరిస్థితులు బాగాలేనప్పుడే వాటిల్లో ఇన్వెస్ట్‌ చేయాలి.

ఎస్‌బీఐ మ్యాగ్నమ్‌ బ్యాలెన్స్‌డ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మూడేళ్ల తరవాత కనీసం 10 శాతం రాబడులు వస్తాయని సదరు ఏజెంట్‌ చెప్తున్నాడు. దీన్లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడులే వస్తాయా ? లేకుంటే నా డబ్బులు నష్టపోయే పరిస్థితులుంటాయా?      భావన, హైదరాబాద్‌
సాధారణంగా చూస్తే, బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌ మంచివి. సురక్షితమైనవి. మూడేళ్లలో బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌ 10 శాతం రాబడులనివ్వగలవు. మీరు ఇన్వెస్ట్‌ చేసిన ఫండ్‌ పనితీరు బాగుంటే అంతకుమించిన రాబడులు కూడా రావచ్చు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌ రాబడులు ఎక్కువే ఉంటాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఇంత రాబడి వస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌ ఇంత మొత్తం రాబడులు ఇస్తాయని ఖచ్చితంగా చెప్పలేము. దీర్ఘకాలంలో ఇవి మంచి రాబడులనే ఇస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement