మరోసారి కుప్పకూలిన ఆర్ కామ్
మరోసారి కుప్పకూలిన ఆర్ కామ్
Published Wed, Jun 7 2017 12:22 PM | Last Updated on Thu, Apr 4 2019 5:41 PM
రిలయన్స్ కమ్యూనికేషన్ షేర్లు మరో సారి కుప్పకూలాయి. రేటింగ్ ఏజెన్సీలు ఫిచ్, మూడీస్ మంగళవారం మళ్లీ కంపెనీ క్రెడిట్ రేటింగ్ ను తగ్గించడంతో బుధవారం కంపెనీ షేర్లకు భారీగా దెబ్బకొట్టింది. నేటి ట్రేడింగ్ లో 4 శాతం పైగా పడిపోయిన ఆర్ కామ్ షేర్లు, కనిష్టంగా రూ.19 వద్ద నమోదయ్యాయి. మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్ లో కంపెనీ రూ.948 కోట్ల నష్టాలను ప్రకటించిన దగ్గర్నుంచి ఆర్ కామ్ 24 శాతం మేర పడిపోయింది. అన్న ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ జియో దెబ్బకు ఆర్ కామ్ కోలుకోలేని నష్టాలను ఎదుర్కొంటోంది. ముందటి ఆర్థిక సంవత్సరంలో 79 కోట్ల లాభాలను ఆర్ కామ్ నమోదుచేయగా.. ముగిసిన ఈ ఏడాదిలో భారీ నష్టాలను మూటగట్టుకుంది. రుణభారం నుంచి గట్టెక్కడానికి బ్యాంకర్లు తమకు ఏడు నెలల సమయమిచ్చారని రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ చెప్పడంతో, ఆర్ కామ్ షేర్లు సోమవారం ట్రేడింగ్ లో 4.6 శాతం మేర లాభపడ్డాయి.
కానీ పెరుగుతున్న రుణాలపై మళ్లీ ఆందోళనలు రేకెత్తడంతో సోమవారం వచ్చిన లాభాలు తుడిచిపెట్టుకుపోయాయి. మంగళవారం రోజు ఫిచ్, మూడీస్ లు మరోసారి కంపెనీ రేటింగ్ ను డౌన్ గ్రేడింగ్ చేశాయి. ఫిచ్ ఈ సంస్థను కనిష్ట కేటగిరిలోకి డౌన్ గ్రేడ్ చేయగా.. మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసు రెండో కనిష్ట కేటగిరీలోకి డౌన్ గ్రేడ్ చేసింది. కంపెనీ అవుట్ లుక్ నెగిటివ్ గా ఉందంటూ మూడీస్ తన ప్రకటనలో పేర్కొంది. వారం క్రితమే మూడీస్ ఆర్ కామ్ రేటింగ్ ను బీ2 నుంచి సీఏఏ1 కు తగ్గించింది. ఫిచ్, మూడీస్ మాత్రమే కాక, ఐక్రా, కేర్ లు కూడా కంపెనీ రేటింగ్స్ ను సవరించాయి. ఈ ఏడాది మార్చి 31 వరకు ఆర్ కామ్ నికర రుణం రూ.45వేల కోట్లకు పెరిగింది.
Advertisement
Advertisement