RCom
-
ఆర్‌కామ్ టవర్, ఫైబర్ కోసం రూ.3,720 కోట్లు
న్యూఢిల్లీ: లిక్విడేషన్‌లో ఉన్న ఆర్‌కామ్ టవర్, ఫైబర్ ఆస్తుల కోసం (రిలయన్స్ ఇన్ఫ్రాటెల్) రూ.3,720 కోట్లను ఎస్క్రో ఖాతాలో జమ చేస్తామని రిలయన్స్ జియో ప్రతిపాదన చేసింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) టవర్, ఫైబర్ ఆస్తుల కోసం రూ.3,720 కోట్ల బిడ్‌ను రిలయన్స్ 2019 నవంబర్లోనే సమర్పించం గమనార్హం. దీరికి రుణదాతల కమిటీ కూడా ఆమోదం తెలిపింది. ఈ మేరకు చెల్లింపులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు జియో అనుబంధ కంపెనీ రిలయన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు తెలిపింది. ఆలస్యం చేయడం వల్ల ఆస్తుల విలువ క్షీణిస్తుందంటూ.. దివాలా పరిష్కార ప్రణాళిక మేరకు వెంటనే చెల్లించేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలిపింది. -
రంగంలోకి బ్యాంకులు : చిక్కుల్లో అంబానీ
సాక్షి, న్యూఢిల్లీ: అప్పుల సంక్షోభంలో కూరుకుపోయిన పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి మరోఎదురు దెబ్బ తగిలింది. 717 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.5,354 కోట్లు) విలువైన బాకీలపై మూడు చైనా బ్యాంకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చైనా బ్యాంకులు ఇప్పుడు అనిల్ అంబానీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తులను వివరాలను అంచనా వేసేందుకు సిద్ధపడుతున్నాయి. లండన్ కోర్టు ఉత్తర్వుల మేరకు బకాయిల వసూలుకు రంగంలోకి దిగాయి. తమకు రావాల్సిన రుణ బకాయిలకోసం అందుబాటులో ఉన్న చట్టపరమైన అన్నిమార్గాలను ఉపయోగించుకుంటామని ప్రకటించాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబానీపై వ్యక్తిగత దివాలా చర్యలకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో చైనా బ్యాంకుల చర్యలకు అడ్డంకులు తప్పవని భావిస్తున్నారు. (కోర్టు ఫీజుల కోసం నగలు అమ్ముకున్నా: అంబానీ) అనిల్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) అంబానీ పర్సనల్ గ్యారంటీతో, చైనాకు చెందిన మూడు బ్యాంకుల నుంచి 2012లో 925 మిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. కానీ దివాలాతీసిన ఆర్‌కామ్ ఈ రుణాన్ని పూర్తిగా చెల్లించడంలో విఫలమైంది. దీంతో ఈ బకాయిల వసూలు కోసం కోర్టును ఆశ్రయించగా, చైనా బ్యాంకులకు రూ .5,226 కోట్లు చెల్లించాలని మే 22 న కోర్టు అనిల్ అంబానీని ఆదేశించింది. జూన్ 29 నాటికి, అంబానీ చెల్లించాల్సిన అప్పు 717.67 మిలియన్ డాలర్లకు పెరిగింది. అయితే తన దగ్గర చిల్లిగవ్వలేదనీ, బాకీ చెల్లించే స్తోమత లేదని అంబానీ వాదిస్తున్నారు. కోర్టు ఫీజుల కోసం తనభార్య నగలు అమ్మి, అతి సాధారణ జీవితాన్ని గడుపుతున్నానంటూ తాజాగా వాదించిన సంగతి తెలిసిందే. అయితే అంబానీ వాదనతో విబేధిస్తున్న బ్యాంకులు అప్పులు కట్టాల్సిందేనని స్పష్టం చేశాయి. -
నాది సాదాసీదా జీవితం: అనిల్ అంబానీ
లండన్: ప్రపంచ దేశాలను చైనా వణికిస్తుంటే..రిలయన్స్ అనిల్ అంబానీ చైనాకే ఝలక్ ఇచ్చారు. చైనాకు చెందిన మూడు బ్యాంకు రుణాల చెల్లింపునకు తనది పూచీ కాదన్నారు. తనది చాలా విలాసవంత జీవితమంటూ వస్తున్నవన్నీ వదంతులేనన్నారు. ‘నాది చాలా క్రమశిక్షణాయుత జీవితం. అవసరాలు చాలా పరిమితం. ఒకే ఒక్క కారు వాడుతున్నాను. కోర్టు ఫీజులు చెల్లించేందుకు బంగారాన్ని అమ్ముకున్నాను’ అని వివరించారు. చైనా బ్యాంకులతో తలెత్తిన రుణ ఒప్పందం వివాదంపై లండన్ కోర్టుకు ఆయన ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు. తనకు ఖరీదైన చాలా కార్లున్నాయనీ, విలాసవంతమైన జీవితమంటూ లాయర్ అడిగిన ప్రశ్నకు అనిల్.. అవన్నీ మీడియా సృష్టించిన కల్పిత వార్తలని కొట్టిపారేశారు. ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్, చైనా డెవలప్మెంట్ బ్యాంక్, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనాల నుంచి 2012లో 925 మిలియన్ డాలర్ల మేర ఆర్‌కామ్ రుణం తీసుకుంది. పూచీకత్తుగా ఉన్న అనిల్ అంబానీయే ఆ మొత్తం చెల్లించాలంటూ బ్యాంకులు కోరుతున్నాయి. ఈ మేరకు బ్రిటన్ కోర్టులో దావా వేశాయి. ఆ రుణంలో కొంత మొత్తం చెల్లించాలంటూ కోర్టు ఈ ఏడాది మేలో ఆదేశించింది. అనిల్ చెల్లించకపోవడంతో ఆయన్ను వీడియో లింక్ ద్వారా క్రాస్ ఎగ్జామిన్ చేసి, ఆస్తుల వివరాలు రాబట్టేందుకు బ్యాంకు తరఫు లాయర్లకు కోర్టు అనుమతిచ్చింది. ఈ మేరకు శనివారం జరిగిన విచారణలో అనిల్ పై విషయాలను వెల్లడించారు. -
అనిల్ అంబానీకి ‘సుప్రీం’ ఊరట
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ గ్రూప్ (అడాగ్)లో భాగమైన ఆర్‌కామ్, రిలయన్స్ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్‌టీఐఎల్)కు ఇచ్చిన రూ.1,200 కోట్ల రుణాల రికవరీకి సంబంధించి ఆయనపై వ్యక్తిగత దివాలా చర్యలు చేపట్టడానికి అనుమతించాలని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దాఖలు చేసిన అప్పిలేట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చి న స్టేను తొలగించాలనీ ఎస్బీఐ చేసిన విజ్ఞప్తికి న్యాయమూర్తులు ఎల్ఎన్ రావు, హేమంత్ గుప్తా, ఎస్. రవీంద్ర భట్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. అయితే ఈ అంశానికి ఉన్న ప్రాధాన్యత రీత్యా, తదుపరి విచారణలు ఏమీ లేకుండా అక్టోబర్ 6న కేసు విచారణను చేపట్టి తుది తీర్పు ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం ఢిల్లీ హై కోర్టుకు సూచించడం ఈ కేసులో మరో కీలకాంశం. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏదైనా మార్పు కోరుకుంటే, సంబంధిత న్యాయస్థానాన్నే ఆశ్రయించవచ్చని కూడా ఎస్బీఐకి ధర్మాసనం సూచించింది. వివరాల్లోకి వెళ్తే..: ఆర్‌కామ్, రిలయన్స్ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్‌టీఐఎల్)కు 2016 ఆగస్టులో ఎస్బీఐ రుణం మంజూరు చేసింది. ఆర్‌కామ్‌కు రూ. 565 కోట్లు, ఆర్‌టీఐఎల్‌కు రూ. 635 కోట్లు రుణం అందింది. ఈ రుణం మొండిబకాయిగా మారడంతో, అనిల్ అంబానీ ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తును ఎస్బీఐ రుణ బాకీల కింద జప్తు చేసుకోవాలని నిర్ణయించింది. తదుపరి అనిల్ అంబానీకి నోటీసులు కూడా జారీ చేసినప్పటికీ స్పందన రాలేదు. దీనితో ఎన్సీఎల్టీ, ముంబై బెంచ్‌ని ఆశ్రయించింది. గ్యారంటర్‌పైనా విచారణ జరపవచ్చని నిబంధనల్లో స్పష్టంగా ఉందని తన వాదనల్లో పేర్కొంది. దీంతో ఏకీభవిస్తూ, ఎన్సీఎల్టీ అనిల్ ఆస్తులపై దివాలా ప్రక్రియకు వీలుగా మధ్యంతర పరిష్కార నిపుణుడి (ఆర్పీ)ని నియమి స్తూ ఆగస్టు 21న ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు అదేనెల 27న స్టే ఇస్తూ, తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేసింది. ఈ స్టే ఉత్తర్వు్యను ఎస్బీఐ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
అంబానీపై దివాలా చర్యలు : సుప్రీంకు ఎస్బీఐ
సాక్షి, ముంబై: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీపై వ్యక్తిగత దివాలా చర్యలపై విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) అధినేత అనిల్ అంబానీ దాదాపు రూ. 1,200 కోట్ల రుణాల ఎగవేతకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పును అమల్లోకి తెస్తే తనకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని ఎస్బిఐ తన పిటిషన్లో పేర్కొంది. (అనిల్ అంబానీపై దివాలా చర్యల నిలుపుదల) కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి హైకోర్టు తమకు అవకాశం ఇవ్వలేదని ఎస్బీఐ వాదించింది. సుమారు 1707 కోట్లు ప్రజాధనం బ్యాంకుకు రుణపడి ఉన్న అంబానీకి వ్యతిరేకంగా దివాలా తీర్పును నిలిపివేయడాన్ని సమర్థించలేమని తెలిపింది. ఆగస్టు 27 న జస్టిస్ విపిన్ సంఘీ, రజ్నీష్లతో కూడిన త్రిసభ్య ధర్మానసం మధ్యంతర పరిష్కార నిపుణుడి (ఆర్పీ)ని నియమిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఇచ్చిన ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తమ వాదనలు తెలియజేయాలని ఇన్సా ల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ), ఎస్బీఐలకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదావేసింది. -
ఎస్బీఐ లోన్ : అనిల్ అంబానీకి ఊరట
సాక్షి,న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి భారీ ఊరట లభించింది.1200 కోట్ల రూపాయల రుణం విషయంలో ఎస్బీఐ చేపట్టనున్న దివాలా చర్యలను ఢిల్లీ హైకోర్టు అడ్డుకుంది. ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ సోదరుడు, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీపై దాఖలైన దివాలా పిటిషన్‌ను కోర్టు గురువారం నిలిపివేసింది. అలాగే ఆస్తులను విక్రయించకుండా అనిల్ అంబానీని నిలువరిస్తూ ఆదేశాలు జారీచేసింది. (చదవండి : అనిల్ అంబానీకి ఎస్బీఐ షాక్) అడాగ్ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్ తీసుకున్న కార్పొరేట్ రుణాలపై అనిల్ అంబానీ వ్యక్తిగత హామీ ఇచ్చారు. ఇవి మొండి బకాయిలుగా మారటంతో దివాలా చట్టం ప్రకారం అంబానీ నుంచి రూ.1200 కోట్లను రాబట్టేందుకు ఎస్బీఐ రంగంలోకి దిగింది. కార్పొరేట్ రుణాల చెల్లింపుల ప్రక్రియకు ఒక రిజల్యూషన్ ప్రొఫెషనల్‌ను నియమించాలని కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఎస్బీఐ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మొబైల్ సేవల్ సంస్థ ఆర్‌కామ్ 2002లో అనిల్ అంబానీ ప్రారంభించారు. కానీ పోటీకి నిలబడలేక, భారీ అప్పుల్లో కూరుకుపోయింది. ఆ తరువాత 2016లో ముకేశ్ అంబానీ సృష్టించిన జియో సునామీతో మరింత కుదేలై దివాలా తీసింది. అటు 2017 జనవరిలో రుణ చెల్లింపులో డిఫాల్ట్ కావడంతో ఆర్‌ఐటిఎల్ రుణాన్ని 26 ఆగస్టు 2016 నుండి నిరర్ధక ఆస్తిగా ప్రకటించింది బ్యాంకు. ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు మూతపడ్డాయి. మరోవైపుఈ విషయం కార్పొరేట్ రుణానికి సంబంధించినదని, వ్యక్తిగత రుణానికి చెందినది కాదని అడాగ్ గ్రూపు గతంలోనే ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలోనే రుణ పరిష్కార ప్రణాళికలకు రుణదాతలు అంగీకరించారని, ట్రైబ్యునల్ ఆమోదం కోసం వేచి చూస్తున్నట్టు తెలిపింది. -
టెలికం బాకీలు... రిజర్వ్‌లో సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: టెలికం సంస్థలు కట్టాల్సిన ఏజీఆర్ బాకీలపై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఆర్‌కామ్ తదితర సంస్థల నుంచి స్పెక్ట్రం తీసుకున్నందుకు గాను రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కూడా అదనంగా బాకీలు కట్టాల్సి ఉంటుందా అన్న దానిపై కూడా స్పష్టతనివ్వనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) ఫార్ములా ప్రకారం టెలికం సంస్థలు కట్టాల్సిన స్పెక్ట్రం యూసేజీ చార్జీలు, లైసెన్సు ఫీజు బాకీలకు సంబంధించిన కేసుపై సోమవారం కూడా విచారణ కొనసాగింది. ఒకవేళ స్పెక్ట్రం విక్రేత గానీ బాకీలు కట్టకుండా అమ్మేసిన పక్షంలో ఆ బకాయీలన్నీ కొనుగోలు సంస్థకు బదిలీ అవుతాయని సుప్రీం కోర్టు పేర్కొంది. ఒకవేళ టెల్కోలు గానీ బాకీలు కట్టేందుకు సిద్ధంగా లేకపోతే స్పెక్ట్రం కేటాయింపును పూర్తిగా రద్దు చేయాలని ఆదేశిస్తామని స్పష్టం చేసింది. అయితే, స్పెక్ట్రం రద్దు చేసిన పక్షంలో ప్రభుత్వానికి గానీ బ్యాంకులకు గానీ దక్కేది ఏమీ ఉండదని జియో తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే తెలిపారు. విక్రేత, కొనుగోలుదారు నుంచి విడివిడిగా లేదా సంయుక్తంగా బాకీలను తాము వసూలు చేసుకోవచ్చని టెలికం శాఖ (డాట్) వెల్లడించింది. ఈ వాదనల దరిమిలా దివాలా చర్యలు ఎదుర్కొంటున్న టెలికం సంస్థలు.. స్పెక్ట్రంను విక్రయించవచ్చా అన్న అంశంతో పాటు వాటి నుంచి ప్రభుత్వం ఏజీఆర్‌పరమైన బాకీలను ఎలా రాబట్టాలి అన్న దానిపైన సుప్రీం కోర్టు ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది. ఏజీఆర్ బకాయిల విషయంలో సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపునకు విజ్ఞప్తి మరోవైపు, ఏజీఆర్ బకాయిలపై సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ టెలికం ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ కేంద్రాన్ని కోరింది. అదనంగా లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలను కట్టాల్సి రానుండటంతో దీనికి సర్వీస్ ట్యాక్స్ కూడా తోడైతే మరింత భారం అవుతుందని జూలై 17న కేంద్ర టెలికం శాఖకు రాసిన లేఖలో సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 2016 – మార్చి 2017 మధ్యకాలంలో సర్వీస్ ట్యాక్స్ బాకీల కింద టెలికం సంస్థలు రూ. 6,600 కోట్లు కట్టినట్లు తెలిపారు. -
చైనా బ్యాంకులకు వ్యక్తిగత హామీ ఇవ్వలేదు
ముంబై: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) మూడు చైనా బ్యాంకుల నుంచి 2012లో తీసుకున్న రుణాలకు తాను ఎటువంటి వ్యక్తిగత హామీ ఇవ్వలేదని పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ మరోసారి స్పష్టం చేశారు. అనిల్ అంబానీకి వ్యతిరేకంగా చైనా బ్యాంకులు బ్రిటన్ కోర్టును ఆశ్రయించగా.. వ్యక్తిగత హామీ ఇచ్చినందుకు చైనా బ్యాంకులకు 717 మిలియన్ డాలర్లు (సుమారు రూ.5వేల కోట్లకుపైగా) చెల్లించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎస్బీఐ సైతం ఆర్‌కామ్ రుణానికి సంబంధించి వ్యక్తిగత హామీ ఇచ్చిన అనిల్ అంబానీ నుంచి రూ.1,200 కోట్లు వసూలు చేసుకునేందుకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్సీఎల్టీ) ఆశ్రయించింది. ఈ విషయాలపై రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్ కంపెనీల వాటాదారుల వార్షిక సమావేశంలో (ఆన్లైన్ ద్వారా నిర్వహించారు) అనిల్ అంబానీ స్పష్టతనిచ్చారు. ఈ రెండు కేసుల్లోనూ (ఎస్బీఐ, చైనా బ్యాంకులు) రుణాలను గ్రూపు కంపెనీ (ఆర్‌కామ్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్) తీసుకున్నవే కానీ, తనకోసం కాదని అనిల్ పేర్కొన్నారు. చైనీ బ్యాంకులతో నాన్ బైండింగ్ లెటర్ ఆఫ్ కంఫర్ట్ కుదుర్చుకునేందుకు తాను పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చానే కానీ, హామీపై సంతకం చేయలేదని చెప్పారు. ఆర్‌కామ్ దివాలా కేసులో తుది ఫలితం ఆధారంగా చైనా బ్యాంకులకు ఎంత ఇచ్చేదీ తేలుతుందన్నారు. వాటాలు పెంచుకుంటాం: గ్రూపు కంపెనీలు రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్లో ప్రమోటర్లు వాటాల పెంచుకోవాలని నిర్ణయించినట్టు అనిల్ అంబానీ వాటాదారులకు తెలిపారు. మార్చి నాటికి రిలయన్స్ పవర్లో ప్రమోటర్లు, ప్రమోటర్ల సంస్థలకు 19.29 శాతం వాటా ఉండగా, రిలయన్స్ ఇన్ఫ్రాలో 14.7 శాతం మిగిలి ఉంది. -
రూ.1200 కోట్లు చెల్లించండి: ఎస్బీఐ
అనిల్ అంబానీ నుంచి రూ.1,200 కోట్లకు పైగా వసూలు చేసేందుకు ఎస్బీఐ సిద్ధమైంది. గతంలో రిలయన్స్ కమ్యూనికేషన్ తీసుకున్న రుణాలకు అనిల్ అంబానీ వ్యక్తిగత హామీ ఇచ్చారని., ఇప్పుడు వ్యక్తిగత హామి ఇచ్చిన రుణాన్ని అతనే చెల్లించాలంటూ ఎస్బీఐ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. బీఎస్వీ ప్రకాష్ కుమార్ అధ్యక్షతన ఎన్సీఎల్టీ బెంచ్ గురువారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అనిల్ తరుపున న్యాయవాదులు తమకు కొన్ని రోజుల గడువు కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన బెంచ్ వారికి వారం రోజుల గడువు ఇచ్చింది. "ఈ విషయం రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ సంస్థలు పొందిన కార్పొరేట్ రుణానికి సంబంధించినది. అంతేకాని ఇది అంబానీ వ్యక్తిగత రుణానికి సంబంధించనది కాదు. ఈ అంశంపై అంబానీ తగిన విధంగా స్పందిస్తారు.’’ అని అనిల్ అంబానీ అధికార ప్రతినిధి ఒక ఈ-మెయిల్ ద్వారా స్పందించారు. అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు ఇచ్చిన రుణాలకు వ్యక్తిగత హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆర్‌కామ్ దివాళా కేసు ఎన్సీఎల్టీ విచారణలో ఉంది. వ్యక్తిగత హామి ఇచ్చిన రుణాన్ని రాబట్టాలనే యోచనలో ఉన్నట్లు ఎస్బీఐ అధికారి ఒకరు తెలిపారు. వ్యక్తిగత దివాలా కేసులపై నిషేధం లేనందున, ఈ విషయంపై అత్యవసర విచారణ జరపాల్సిందిన ఎన్సీఎల్టీని కోరినట్లు అతను తెలిపారు. అలాగే వ్యక్తిగత ఖాతాలు వివరాలు, వాటి పనితీరు లాంటి అంశాలపై వ్యాఖ్యానించకూడదనేది బ్యాంక్ పాలసీ కాబట్టి పూర్తి వివరాలను తాను వెల్లడించలేనని ఎస్బీఐ అధికారి చెప్పుకొచ్చారు. -
ఆర్‌కామ్ దివాలా ప్రణాళికకు ఆమోదం
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాలా పరిష్కార ప్రణాళికకు ఎస్బీఐ బోర్డు ఆమోదం తెలిపింది. ఆర్‌కామ్ రుణదాతల కమిటీ (సీవోసీ)లోనూ ఎస్బీఐ బోర్డు సానుకూలంగా ఓటు వేయనుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. సీవోసీలో ఆర్‌కామ్ పరిష్కార ప్రణాళికపై ఓటింగ్ మొదలైందని, ఈ నెల 4న ముగుస్తుందని పేర్కొన్నాయి. పరిష్కార ప్రణాళిక కింద బ్యాంకులకు రూ.23,000 కోట్లు వసూలు కానున్నాయి. యూవీ అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ రూ.14,700 కోట్లకు బిడ్ వేయగా, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ టవర్, ఫైబర్ ఆస్తుల కోసం రిలయన్స్ జియో రూ.4,700 కోట్ల బిడ్ వేసింది. -
అనిల్ అంబానీకి భారీ ఊరట
సాక్షి,న్యూఢిల్లీ : రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్‌కామ్) వివాదంలో కేంద్రానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆర్‌కామ్‌కు రూ.104 కోట్లు చెల్లించాల్సిందేనని సుప్రీం తేల్చి చెప్పింది. టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అప్పిలేట్ ట్రైబ్యునల్(టీడీఎస్ఏటీ) తీర్పుని సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. కేంద్రం అప్పీల్లో ఎలాంటి యోగ్యత కనిపించడం లేదని జస్టిస్ ఆర్ ఎఫ్ నారీమన్, జస్టిస్ రవీంద్ర భట్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. అత్యున్నత న్యాయస్థానం కేంద్రం అభ్యర్థనను తిరస్కరించిన నేపథ్యంలో ప్రభుత్వం రూ .104 కోట్లను ఆర్‌కామ్‌కు తిరిగి చెల్లించాల్సి వుంది. బకాయిలకు సంబంధించి ఆర్‌కామ్, టెలికాం విభాగం మధ్య ఉన్నఅనేక వివాదాల్లో ఇదొకటి కావడం గమనార్హం. కాగా స్పెక్ట్రం కోసం బ్యాంక్ గ్యారెంటీ బ్యాలెన్స్‌గా అనిల్ అంబానీ నేతృత్వంలోని ఆర్‌కామ్ చెల్లించిన రూ.908 కోట్ల పూచీకత్తులో.. రూ.774కోట్ల ఛార్జీల మొత్తం పోనూ మిగిలిన సొమ్మును తిరిగి చెల్లించేలా కేంద్రాన్ని ఆదేశించాలని ఆర్‌కామ్ డిసెంబర్ 2018లో టీడీఎస్‌ఏటీని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ట్రైబ్యునల్ ఇంకా దాదాపు రూ.104కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఇప్పటికే రూ.30.33 కోట్లు ఆర్‌కామ్‌కు చెల్లించింది. ఈ ఆదేశాన్ని ప్రభుత్వం సవాలు చేసింది. కాగా భారీ వ్యాపార నష్టాలు, పెరుగుతున్న అప్పుల కారణంగా ఆర్‌కామ్ 3 సంవత్సరాల క్రితం కార్యకలాపాలను మూసివేసింది. 2019 లో దివాలా తీసిన సంగతి తెలిసిందే. -
జీసీఎక్స్ దివాలా పిటిషన్
అనిల్ అంబానీకి చెందిన మరో కంపెనీ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. అనిల్ అంబానీ టెలికాం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కు చెందిన యూనిట్ దివాలా రక్షణ కోసం దాఖలు చేసింది. ప్రపంచలోనే అతిపెద్ద అండర్ వాటర్ కేబుల్ నెట్‌వర్క్‌కు యజమాని జీసీఎక్స్ లిమిటెడ్ 350 మిలియన్ డాలర్లు విలువైన బాండ్ల చెల్లింపులు చేయడంలో విఫలం అయింది. ఈ బాండ్లకు ఆగస్టు 1 మెచ్యూర్ తేదీగా ఉంది. మరోవైపు అంబానీ నియంత్రణలో ఉన్న అడాగ్‌కు చెందిన రిలయన్స్ నావెల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ కూడా తీవ్రమైన నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. దీనికితోడు బాండ్లకు చెల్లింపులు చేసేందుకు జీసీఎక్స్ చేసిన ప్రయత్నాలు మొత్తం విఫలం అయ్యాయి. దీంతో రుణాన్ని వాటాలుగా మార్చే అంశాన్ని కూడా పరిశీలించారు. చివరకు అదీ విఫలం కావడంతో డెలావర్ కోర్టులో దివాలాకు సంబంధించి చాప్టర్ 11 పిటిషన్‌ను దాఖలు చేసింది. కాగా అనిల్ అంబానీ అప్పుల సంక్షోభంలో కొ ట్టుమిట్టాడుతున్నసంగతి తెలిసిందే. ఆస్తుల విక్రయం ద్వారా 3.1బిలియన్ డాలర్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకొంది. -
అనిల్ అంబానీపై మరో పిడుగు
సాక్షి, ముంబై : అప్పులు, దివాలా ఊబిలో కూరుకుపోయి అస్తులను అమ్ముకుంటున్న పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి మరో భారీ షాక్ తగిలింది. చైనాకు చెందిన పలు బ్యాంకులు ఆర్‌కాం బకాయిలకు సంబంధించి కనీసం 2.1 బిలియన్ డాలర్లు అప్పు కట్టాల్సిందేనని డిమాండ్ చేశాయి. ఇప్పటికే భారీగాసంపదను కోల్పోయి ప్రపంచ బిలియనీర్ల జాబితాలోంచి కిందికి పడిపోయిన అనిల్ అంబానీ నెత్తిన మరో పిడుగు పడినట్టైంది. చైనా డెవలప్మెంట్ బ్యాంక్, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనాలు అనిల్ అంబానీ కంపెనీకు పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చాయి అప్పులు ఇచ్చాయి. ప్రస్తుతం ఇవి అప్పులను రాబట్టేందుకు సిద్ధమయ్యాయి. జూన్ 13 నాటికి ఏడు టాప్ బ్యాంకులకు కంపెనీలు చెల్లించాల్సిన రుణాల వివరాలు ఇలా ఉన్నాయి. చైనా ప్రభుత్వరంగ బ్యాంకు చైనా డెవలప్మెంట్ బ్యాంక్.. రూ.9,860 కోట్ల (1.4 బిలియన్ డాలర్లు). ఎగ్జిమ్ బ్యాంక్ ఆప్ చైనా రూ.3,360 కోట్లు, కమర్షియల్ బ్యాంక్ ఆప్ చైనా రూ.1,554 కోట్లుగా ఉంది. దీనికితోడు దేశీయంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ. 4910 కోట్లు, బ్యాంకు ఆఫ్ బరోడా రూ. 2 700 కోట్లు, యాక్సిస్ బ్యాంకు రూ. 2090 కోట్లు మాడిసన్ పసిఫిక్ ట్రస్ట్‌కు రూ.2350 కోట్లు బకాయి ఉంది. ఈ మొత్తం అప్పులు రూ.57,382 కోట్లుగా ఉంది. ఇది కాకుండా రష్యాకు చెందిన బీటీబీ కేపిటల్ ఆఫ్ రష్యాకు రూ.511 కోట్లు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ (లండన్), డాయిష్ బ్యాంక్ (హాంగ్‌కాంగ్) డీబీఎస్ బ్యాంక్, ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్‌లతో పాటు ఇతరులకు బకాయిలు పేరుకుపోయాయి. రుణాలకు సంబంధించిన వివరాలను రిలయన్స్ కమ్యూనికేషన్స్ సోమవారం విడుదల చేసింది. కాగా ఆర్‌కామ్, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో మధ్య రూ.17,300 కోట్ల కొనుగోలు ఒప్పందానికి సిద్ధమయ్యాయి. కానీ రెగ్యులేటరీ సమస్యల కారణంగా ఈ డీల్‌కు బ్రేక్‌పడింది. ఇది ఇలా వుంటే ఆస్తులు అమ్మి అయినా మొత్తం అప్పులు తీర్చేస్తామని ఇటీవల అనిల్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అప్పులన్నీ తీర్చేస్తాం!
సాక్షి, న్యూఢిల్లీ : అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) ఛైర్మన్ అనిల్ అంబానీ కీలక ప్రకటన చేశారు. అప్పులు చెల్లించడానికి తాము పూర్తిగా కట్టుబడి వున్నామని ప్రకటించారు. మంగళవారం ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో అనిల్ అంబానీ ఈ మేరకు హామీ ఇచ్చారు. 2018 ఏప్రిల్ మరియు మే 2019 మధ్య కాలంలో ఇప్పటికే వడ్డీ సహా రూ. 35వేల కోట్ల రూపాయల రుణాలను తిరిగి చెల్లించామని పేర్కొన్నారు. ఆస్తులు విక్రయం, తనఖా ద్వారా ఈ అప్పులను తీర్చినట్టు తెలిపారు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి తమకు ఎటువంటి సహాయం అందలేదని స్పష్టం చేశారు. ఆర్థికపరమైన సవాళ్లు, ఇబ్బందులు ఎన్ని ఉన్నా రుణాలను పూర్తిగా తీర్చడానికి కట్టుబడి వున్నామన్నారు. ఈ పక్రియ వివిధ దశల్లో ఇప్పటికే అమల్లో ఉందని చెప్పారు. ఈ క్రమంలో రిలయన్స్ గ్రూపునకు చెందిన వాటాదారులు, ఉద్యోగుల పూర్తి మద్దతు తమకు లభిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 2014 నాటి ఆర్‌కాం- ఎరిక్సన్ ఇండియా డీల్‌కు సంబంధించి అనిల్ అంబానీకి చెందిన ఆర్‌కాం 1,500 కోట్ల రూపాయల నగదు చెల్లించలేదని నేషనల్ కంపెనీ లా అప్పెల్లేట్ ట్రిబ్యునల్ ముందు ఎరిక్సన్ ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 15 లోగా ఎరిక్సన్ అప్పులు తీర్చివేయాలని లేదంటే, 12 శాతం వడ్డీతో మొత్తం చెల్లించాల్సి వుంటుందని గత ఏడాది అక్టోబర్‌లో ఆర్‌కాంను సుప్రీం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రూ.25వేల కోట్ల విలువైన ఆస్తులు (స్పెక్ట్రమ్, ఫైబర్, టెలికాం టవర్లు, కొన్ని రియల్ ఎస్టేట్) విక్రయానికి అనుమతిని మంజూరు చేసింది. అయినా ఈ చెల్లింపుల్లో సంస్థ పదే పదే విఫలం కావడంతో కోర్టు ధిక్కరణ, జరిమానాను కూడా ఎదర్కోవాల్సి వచ్చింది. దీంతో 453 కోట్ల రూపాయలను తక్షణమే ఎరిక్సన్కు చెల్లించాలని సుప్రీంకోర్టు గత నెలలో ఆదేశించిన విషయం తెలిసిందే. -
ఆర్‌కాం దివాలా ప్రక్రియ షురూ
అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కాం) నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దివాలా ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. అలాగే దివాలా ప్రక్రియనుంచి మినహాయింపు ఇవ్వాలన్న అభ్యర్థనను ఎన్సీఎల్టీ గురువారం అంగీకరించింది. దివాలా ప్రక్రియలో 357రోజుల (మే 30, 2018 నంచి ఏప్రిల్ 30 2019) కాలానికి మినహాయింపు ఇవ్వాలని ఆర్‌కామ్ కోరగా ట్రైబ్యునల్ ఇందుకు సమ్మతించింది. అనంతరం తదుపరి విచారణను మే30వ తేదీకి వాయిదా వేసింది. ఎస్బీఐతో పాటు వివిధ బ్యాంకులకు ఆర్‌కామ్ రూ.50వేల కోట్ల వరకు అప్పు ఉంది. ఆర్థిక ఇబ్బందులతో రుణాలు చెల్లించని పరిస్థితికి దిగజారింది. దీంతో దివాలా పెట్టేందుకు కంపెనీ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. గురువారం మరోసారి విచారణ జరిపిన ట్రైబ్యునల్ కంపెనీ దివాలా ప్రక్రియకు అనుమతి ఇస్తూ సంస్థ బోర్డును రద్దు చేసింది. కొత్త రిసొల్యూషన్ ప్రొఫెషనల్‌ను అపాయింట్ చేసింది. అంతేకాకుండా ఎస్బీఐ నేతృత్వంలోని 31 బ్యాంకు కన్సార్షియానికి క్రెడిటర్స్ కమిటీ ఏర్పాటుకు అనుమతిచ్చింది. ఇప్పటికే దాఖలైన దివాలా పిటిషన్ పైన నేషనల్ కంపెనీ లా అప్పెలట్ ట్రైబ్యునల్, సుప్రీం కోర్టు స్టే విధించాయి. ఈ నేపథ్యంలో ఈ 357 రోజుల కాలానికి మినహాయింపు ఇవ్వాలని ఆర్‌కాం కోరింది. ఇందుకు ట్రైబ్యునల్ ఒప్పుకుంది. ఈ కేసులో తదుపరి విచారణను మే 30 నాటికి వాయిదా వేసింది. అప్పటి లోగా కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని రిసొల్యూషన్ ప్రొఫెషనల్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక ఇబ్బందులు ఆర్‌కాం గత కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. రెండేళ్ల క్రితం కార్యకలాపాలు నిలిపేసింది. దీంతో ఆర్.కామ్ స్పెక్ట్రంను జియోకు విక్రయించేందుకు సిద్ధపడింది. కానీ వివాదాల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అనుమతులు అందలేదు. -
అబ్బే... అదెలా కుదురుతుంది!
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్వీడన్ టెలికం సంస్థ ఎరిక్సన్కు బాకీ చెల్లింపునకు ఆదాయ పన్ను రిఫండ్ ద్వారా తమ బ్యాంక్ ఖాతాకు వచ్చిన రు.260 కోట్లను వినియోగించాలన్న ఆర్‌కామ్ ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలిగింది. ఇందుకు అనుమతించాలంటూ ఆర్‌కామ్ చేసిన విజ్ఞప్తిని ఫైనాన్షియల్ క్రెడిటార్స్ (రుణ దాతలు) తోసిపుచ్చారు. ఈ మేరకు తమ వాదనలను ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్)లో వినిపించారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆర్‌కామ్.. ప్రస్తుతం దివాలా ప్రక్రియ అమలు కోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్సీఎల్టీ) ఆశ్రయించాలని నిర్ణయించింది. దీనితో సంస్థ ఏ చెల్లింపులు జరపాలన్నా తప్పనిసరిగా రుణదాతల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను రిఫండ్స్ ఆర్‌కామ్ వినియోగంపై విధించిన మారటోరియంను తొలగించాలని అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఆర్‌కామ్ ఆశ్రయించింది. ఆయితే మారటోరియం తొలగించరాదని రుణ గ్రహీతలు తమ వాదనలు వినిపించారు. కేసు తదుపరి విచారణ మార్చి 11న జరుగుతుంది. 8వ తేదీలోపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)సహా కంపెనీ ఫైనాన్షియల్ క్రెడిటార్స్ తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించాల్సి ఉంటుంది. ఎరిక్సన్కు బకాయిల కేసులో ఇప్పటికే ఆర్‌కామ్ 118 కోట్లు డిపాజిట్ చేసింది. మిగిలిన మొత్తం రూ.453 కోట్లను నాలుగు వారాల్లో చెల్లించకుండా మూడు నెలలు కంపెనీ చీఫ్ అనిల్ అంబానీ, మరో ఇరుగ్రూపు సంస్థల డైరెక్టర్లు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ఈ నెల 20వ తేదీన అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. దీనితో కంపెనీ నిధుల సమీకరణ ప్రయత్నాలను తీవ్రతరం చేసింది. -
బాకీ కట్టకపోతే జైలు శిక్షే!
న్యూఢిల్లీ: ఎరిక్సన్కు చెల్లించాల్సిన బకాయిల కేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మన్, వ్యాపారవేత్త అనిల్ అంబానీపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎరిక్సన్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసులో బుధవారం తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు... రూ.550 కోట్ల బకాయి చెల్లించకుండా తన ఉత్తర్వులను ఉల్లంఘించారని, ఇది పూర్తిగా ధిక్కరణ కిందకే వస్తుందని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లో రూ.453 కోట్లు కనక ఎరిక్సన్కు చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్ష తప్పదని స్పష్టం చేసింది. ఈ కేసులో ఆర్‌కామ్ చైర్మన్ అనిల్‌తో పాటు రిలయన్స్ టెలికం చైర్మన్ సతీశ్ సేథ్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ చైర్పర్సన్ చిరహా విరాణికి కూడా సుప్రీంకోర్టు ఇదే హెచ్చరికలు చేసింది. తన మునుపటి ఉత్తర్వులకు సంబంధించి ఇచ్చిన హామీలను వీరు నిలబెట్టుకోలేదని, తద్వారా ముగ్గురూ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘‘ఉద్దేశపూర్వకంగానే వీరు ఎరిక్సన్కు నిధులివ్వలేదని భావించాల్సి వస్తోంది’’ అని సుప్రీం పేర్కొంది. ధర్మాసనం ఈ హెచ్చరిక చేస్తున్న సమయంలో అనిల్ అంబానీ సహా ముగ్గురూ కోర్టు హాల్లోనే ఉన్నారు. అనిల్ తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహత్గీ తమ వాదనలు వినిపించారు. రూ.453 కోట్లు చెల్లించడం ద్వారా ‘కోర్టు ధిక్కరణ’ వేటు నుంచి తప్పుకోగలుగుతారని న్యాయమూర్తులు ఎఫ్ఎఫ్ నారిమన్, వినీత్ సరన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టంచేసింది. రిలయన్స్ ఎటువంటింటి బేషరతు క్షమాపణలు చెప్పినా, దాన్ని ఆమోదించాల్సిన పనిలేదని కూడా సుప్రీం కోర్టు పేర్కొంది. కోటి డిపాజిట్ చేయకపోతే మరో నెల జైలు ఆర్‌కామ్, రిలయన్స్ టెలికమ్యూనికేషన్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ రూ.కోటి చొప్పున 4 వారాల్లో రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని కూడా ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. లేదంటే ఈ కంపెనీల చైర్ పర్సన్లు మరో నెల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది. కాగా అత్యున్నత న్యాయస్థానం రిజిస్ట్రీ వద్ద రిలయన్స్ గ్రూప్ డిపాజిట్ చేసిన రూ.118 కోట్లను వారం రోజుల్లో ఎరిక్సన్కు పంపిణీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘‘రూ.550 కోట్లు ఎరిక్సన్కు చెల్లించడానికి మూడు రిలయన్స్ కంపెనీలకూ 120 రోజుల గడువిచ్చాం. తర్వాత దీనిని మరో 60 రోజులూ పొడిగించాం. అయినా దీనిని కంపెనీలు పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పుడు వచ్చి రూ.118 కోట్లు చెల్లిస్తామనడం సరికాదు. బకాయి మొత్తం కట్టాల్సిందే.’’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు న్యాయపాలనకు అడ్డంకులని పేర్కొంది. సుప్రీం ఉత్తర్వుల్ని గౌరవిస్తాం: రోహత్గీ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడిన కొద్ది నిమిషాల తరువాత అనిల్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ విలేకరులతో మాట్లాడుతూ, ‘‘అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులపట్ల గౌరవం ఉంది. ఎరిక్సన్కు బకాయిలపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను గ్రూప్ పాటిస్తుందన్న విశ్వాసం ఉంది. బకాయిల చెల్లింపుల విషయంలో ఇబ్బందులున్నా, ఉన్నత న్యాయస్థానం తన ఆదేశాలను తాను ఇచ్చింది’’ అని అన్నారు. జియోతో ఒప్పందం వైఫల్యంవల్లే: అనిల్ తనకు రావాల్సిన డబ్బుపై ఎరిక్సన్ తీవ్ర విమర్శలే చేసింది. రిలయన్స్ గ్రూప్‌కు రఫేల్ జెట్ డీల్‌లో పెట్టుబడి పెట్టడానికి డబ్బు ఉందికానీ, తన రూ.550 కోట్ల బకాయి తీర్చడానికి మాత్రం లేదని విమర్శించింది. అయితే అనిల్ గ్రూప్ దీనిని తీవ్రంగా ఖండించింది. తన సోదరుడు ముకేశ్ అంబానీ నియంత్రణలోని రిలయన్స్ జియోతో తన ఆస్తుల విక్రయ ఒప్పందం విఫలమైందని, తన కంపెనీ దివాలా ప్రొసీడింగ్స్‌లోకి వెళ్లాల్సి వచ్చిందని ఆయన ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. ఎరిక్సన్కు బకాయిలు చెల్లిండానికి చేయాల్సిందంతా చేసినా, ఫలితం రాలేదని తెలిపారు. గ్రూప్ షేర్ల పతనం తాజా పరిణామంతో రిలయన్స్ గ్రూప్ షేర్లు భారీగా నష్టపోయాయి. రిలయన్స్ కమ్యూనికేషన్: రూ.5.45– రూ.6.15 కనిష్ట, గరిష్ట స్థాయిల్లో తిరిగిన ఈ షేర్ ధర చివరకు 4.17 శాతం (0.25పైసలు) నష్టపోయి రూ.5.75 వద్ద ముగిసింది. రిలయన్స్ క్యాపిటల్: రూ.135.10–రూ.152.50 మధ్య తిరిగిన ఈ షేర్ ధర చివరకు 4.30 శాతం నష్టంతో చివరకు 144.95 వద్ద ముగిసింది. నష్టపోయిన ఇతర షేర్లను చూస్తే, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ (4.07 శాతం), రిలయన్స్ నావెల్ అండ్ ఇంజనీరింగ్ (2.34 శాతం), రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (2.29 శాతం), రిలయన్స్ పవర్ (0.92 శాతం) ఉన్నాయి. ఈ స్టాక్స్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 10.3 శాతం వరకూ కూడా పడటం గమనార్హం. కేసు క్రమం ఇదీ... ►ఆర్‌కామ్ దేశవ్యాప్త టెలికం నెట్వర్క్ నిర్వహణకు అనిల్ గ్రూప్‌తో 2014లో ఎరిక్సన్ ఇండియా ఏడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. రూ.1,500 కోట్లకుపైగా బకాయిలు చెల్లించలేదని ఆరోపించింది. ► రూ.47,000 కోట్లకుపైగా రుణ భారంలో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్, తనకు బకాయిలు చెల్లించలేకపోవడంతో, ఎరిక్సన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. గత ఏడాది మే నెలలో ఈ పిటిషన్‌ను ట్రిబ్యునల్ అడ్మిట్ చేసుకుంది. ► అయితే ఈ కేసును ఆర్‌కామ్ సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంది. ఇందుకు వీలుగా రూ.550 కోట్లు చెల్లిస్తానని హామీ ఇచ్చింది. 2018 సెప్టెంబర్ 30 లోపు ఈ చెల్లింపులు జరుపుతామని పేర్కొంది. ► ఈ హామీకి కట్టుబడకపోవడంతో ఎరిక్సన్ సెప్టెంబర్‌లో సుప్రీంను ఆశ్రయించింది. ► ఎరిక్సన్కు చెల్లించాల్సిన బకాయిలపై గతేడాది అక్టోబర్ 23న ఆర్‌కామ్‌కు అత్యున్నత న్యాయస్థానం చివరి అవకాశం ఇచ్చింది. డిసెంబర్ 15లోపు బకాయిలు మొత్తం చెల్లించాలని ఆదేశించింది. జాప్యం జరిగితే ఇందుకు సంబంధించి మొత్తంపై 12 శాతం వార్షిక వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసింది. ►డిసెంబర్ 15లోపు ఆర్‌కామ్ బకాయిలు చెల్లించలేకపోతే, ఎరిక్సన్ కోర్టు ధిక్కరణ కేసు ప్రొసీడింగ్స్‌ను ప్రారంభించవచ్చని సూచించింది. ►అయితే ఆ లోపూ బకాయిలు చెల్లించలేకపోవడంతో జనవరి 4న ఎరిక్సన్ మళ్లీ సుప్రీం కోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ► దీనిపై బుధవారం సుప్రీం కోర్టు తన తీర్పును ప్రకటించింది. -
అనిల్ అంబానీ పని అయిపోయిందా..?
అన్నదమ్ములిద్దరూ దాదాపు ఒకే దగ్గర జర్నీ ప్రారంభించారు. కానీ ఒకరు ఆకాశామే హద్దుగా ఎదుగుతుంటే.. మరొకరు అధఃపాతాళం లోతుల్లోకి జారిపోతున్నారు. దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో నువ్వా, నేనా అన్నట్లుగా ఒకప్పుడు అన్న ముకేశ్ అంబానీతో పోటీపడిన అనిల్ అంబానీ ప్రస్తుతం ఆ లిస్టులో ఎక్కడో కిందికి పడిపోయారు. అన్న ముకేశ్ అంబానీ 47 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా రాజ్యమేలుతుండగా.. 2 బిలియన్ డాలర్లకు పడిపోయిన సంపదతో తమ్ముడు అనిల్ అంబానీ కనీసం దేశీ కుబేరుల లిస్టులోనూ చోటు కోసం తంటాలు పడే పరిస్థితికి తగ్గిపోయారు. దశాబ్ద కాలంలో అన్న ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.లక్ష కోట్ల నుంచి రూ. 8 లక్షల కోట్లకు ఎగిసినప్పటికీ... అడ్డదిడ్డంగా ఎడాపెడా కంపెనీలు ఏర్పాటు చేస్తూ, సంబంధంలేని రంగాల్లోకి దూరేస్తూ.. అప్పులు పెంచుకుంటూ పోయిన అనిల్ అంబానీ సారథ్యంలోని అడాగ్ గ్రూప్ విలువ వేల కోట్ల స్థాయికి పడిపోయింది. పదేళ్ల క్రితం రూ. 1.7 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో అగ్రశ్రేణి సంస్థగా వెలుగొందిన ఫ్లాగ్ షిప్ కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) ప్రస్తుతం దాదాపు రూ. 50,000 కోట్ల పైచిలుకు రుణాల భారంతో కుదేలై.. దివాలా తీసింది. గ్రూప్‌లోని మిగతా కంపెనీలు నానా తంటాలు పడుతున్నాయి. ఆర్‌కామ్ దివాలా ప్రకటనతో సోమవారం అడాగ్ గ్రూప్ సంస్థల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. గ్రూప్‌లో కీలకమైన అయిదు సంస్థల మార్కెట్ విలువ ఒక్క రోజే ఏకంగా రూ.5,831 కోట్ల మేర పడిపోయింది. ఈ నేపథ్యంలో సంక్షోభంలో చిక్కుకున్న అనిల్, అడాగ్ గ్రూప్ కంపెనీలు, కారణాలపై ‘సాక్షి’ బిజినెస్ విభాగం అందిస్తున్న ప్రత్యేక కథనమిది... సరి సమానంగా విభజన... వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ మరణానంతరం సోదరులిద్దరి మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోవటంతో 2005లో దాదాపు రూ.90,000 కోట్ల రిలయన్స్ సామ్రాజ్యం రెండుగా చీలిపోయింది. ఇందులో ముడిచమురు కంపెనీ అన్న ముకేశ్‌కు రాగా.. టెలికం, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫ్రా, పవర్ వంటి కీలక సంస్థలు అనిల్ చేతికి దక్కాయి. అవిభాజ్య గ్రూప్‌లో అనిల్ అంబానీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా (సీఎఫ్ఓ) వ్యవహరించేవారు. వ్యాపార భారాన్ని భుజాలపై మోయడం కన్నా.. డీల్స్ కుదర్చడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. కాకపోతే విభజన తరవాత భారీ సామ్రాజ్యాన్ని నిర్వహించాల్సిన బాధ్యత మీద పడటంతో.. ఆయన సామర్థ్యాలకు పరీక్ష మొదలైంది. సవాళ్లూ ఒక్కొక్కటిగా ఎదురవటం మొదలెట్టాయి. వ్యాపార విస్తరణ కాంక్షతో సంబంధం లేని రంగాల్లోకి కూడా చొచ్చుకుపోయారు అనిల్. చివరకు అప్పుల భారం పేరుకుపోయిన ఆర్‌కామ్ రూపంలో సంక్షోభం బయటపడింది. వచ్చే ఆదాయాలు వడ్డీలు కట్టడానికి కూడా సరిపోని పరిస్థితుల్లోకి గ్రూప్ దిగజారిపోయింది. ముంబైలో తొలి మెట్రో లైన్ నిర్మించిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ... గతేడాది ఆగస్టులో బాండ్లను చెల్లించలేక చేతులెత్తేసింది. 2008లో రికార్డ్ ఐపీవోకి వచ్చిన రిలయన్స్ పవర్ షేరు.. అప్పట్నుంచీ పడుతూనే ఉంది. కాస్త లాభసాటిగా ఉండే ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం రిలయన్స్ క్యాపిటల్‌కి కూడా కష్టాలు తప్పలేదు. మొత్తానికి సంక్షోభంలోకి పడిపోయిన కొన్ని గ్రూప్ కంపెనీలను చూస్తే.. ఆర్‌కామ్: కాల్ డిస్కనెక్ట్.. 2010లో 17% మార్కెట్ వాటాతో దేశీ టెలికంలో ఆర్‌కామ్ రెండో స్థానంలో ఉండేది. 2016లో అన్న ముకేశ్ ఎంట్రీ తర్వాత ఇది పదవ స్థానానికి పడిపోయి.. టాప్ కంపెనీల లిస్టు నుంచి తప్పుకుంది. ఒకప్పుడు రూ.1.7 లక్షల కోట్ల మార్కెట్ విలువతో అగ్రస్థానంలో వెలుగొందిన ఆర్‌కామ్ ఇప్పుడు రూ.45 వేల కోట్ల పైచిలుకు రుణ భారంలో ఉంది. చివరికి ప్రధానమైన మొబైల్ వ్యాపారాన్ని అన్న కంపెనీకే అమ్మేసినా.. స్పెక్ట్రం బాకీల వివాదంతో డీల్ ముందుకు సాగడం లేదు. బాకీలు ఎగ్గొట్టినందుకు కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలంటూ ఎరిక్సన్ వంటి కంపెనీలు కోర్టులను ఆశ్రయించాయి. 1.8 బిలియన్ డాలర్ల విదేశీ రుణాన్ని వసూలు చేసుకునేం దుకు చైనా డెవలప్మెంట్ బ్యాంక్ కూడా దివాలా పిటిషన్ వేసింది. సినిమా... అట్టర్ ఫ్లాప్ ఒకప్పటి సినీతార టీనా మునీమ్‌ను వివాహం చేసుకున్న అనిల్ అంబానీ .. తన అడాగ్ గ్రూప్ ద్వారా గ్లామర్ ప్రపంచ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టారు. ఫిలిమ్ ప్రాసెసింగ్, ప్రొడక్షన్, పంపిణీ రంగాల్లోని యాడ్ ల్యాబ్స్ సంస్థ కొనుగోలుతో ఆరంభంలో భారీగానే విస్తరించారు. 2008 నాటికి దాదాపు 700 స్క్రీన్స్‌తో దేశంలోనే అతి పెద్ద మల్టీప్లెక్స్ ఆపరేటర్‌గా అనిల్ ఎదిగారు. కానీ 2014 నాటికి ఈ మీడియా వైభవం తగ్గిపోయింది. రుణాల భారం తగ్గించుకోవడానికి వందల కొద్దీ స్క్రీన్స్‌ను తెగనమ్ముకోవాల్సి వచ్చింది. సంబంధం లేని గ్లామర్ బిజినెస్‌లోకి దూకి అనిల్ దానిపై దృష్టి పెట్టడం వల్ల ప్రధాన గ్రూప్ కంపెనీల పనితీరు దెబ్బతిన్నదనే విమర్శలూ ఉన్నాయి. అసెట్స్ అమ్మకాలకు ఆటంకాలు.. మరోపక్క, అప్పుల భారాలను తగ్గించుకోవడానికి అనిల్ అంబానీ పెద్ద ఎత్తున అసెట్స్‌ను విక్రయిస్తున్నారు. ఇప్పటికే సిమెంట్, టెలికం టవర్స్ మొదలైన వాటిని అమ్మేశారు. కానీ.. ఒక్కో వ్యాపార విభాగంలో ఒక్కో సమస్య కారణంగా అసెట్స్ విక్రయం పూర్తి స్థాయిలో ముందుకు జరగడం లేదు. రూ. 1,00,000 కోట్లు.. 2018 మార్చి ఆఖరు నాటికి అడాగ్ రుణభారం ఇది. ఏటా వడ్డీల కిందే రూ. 10,000 కోట్లు. రూ. 4,00,000 కోట్లు.. గరిష్ట స్థాయిలో అడాగ్ గ్రూప్‌లోని 5 ప్రధాన సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్. ప్రస్తుతం రూ. 50 వేల కోట్ల కన్నా తక్కువకి పడిపోయింది. రక్షణ... బ్యాక్ ఫైర్! ఉన్న సమస్యలు సరిపోవన్నట్లు.. అనిల్ అంబానీ 2016లో పిపావవ్ మెరైన్ అండ్ ఆఫ్‌షోర్ (రిలయన్స్ నేవల్గా పేరు మారింది) యాజమాన్య వాటాలను కొనుక్కున్నారు. ఇది భారతీయ నేవీ కోసం యుద్ధనౌకల నిర్మాణం, మరమ్మతుల సర్వీసులు అందిస్తుంది. సమస్యల్లో ఉన్న ఇన్ఫ్రా నుంచి పుష్కలమైన అవకాశాలున్న డిఫెన్స్ వైపుగా వెడితే అడాగ్‌ను కాపాడుకోవచ్చని అనిల్ భావించారు. కానీ, ఈ ప్రయోగమూ దెబ్బతింది. అయినా.. అసలు భారీ నష్టాలు, అప్పులతో కుదేలైన ఈ సంస్థను ఎందుకు కొన్నారనేది ఎవరికీ అర్థం కాలేదు. రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి ఫ్రాన్స్ కంపెనీ డస్సాల్ట్‌తో ఈ కంపెనీ జట్టు కట్టడంపై ప్రస్తుతం వివాదం నడుస్తోంది. అనిల్ అంబానీకి మేలు చేసేందుకు ప్రభుత్వమే ఈ రెండింటి మధ్య డీల్ కుదిర్చిందంటూ విపక్షాలు విమర్శల దాడి చేస్తున్నాయి. 45 బిలియన్ డాలర్ల వ్యత్యాసం.. ఫోర్బ్స్ మ్యాగజైన్ గణాంకాల ప్రకారం 2007లో అనిల్ సంపద 45 బిలియన్ డాలర్లు. అన్న ముకేశ్ సంపద 49 బిలియన్ డాలర్లు. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి 2018కి వస్తే ఫోర్బ్స్ ఇండియా కుబేరుల లిస్టులో ముకేశ్ 47.3 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా.. 2.44 బిలియన్ డాలర్ల సంపదతో అనిల్ 66వ స్థానానికి పడిపోయారు. అసలెక్కడ తేడా కొట్టింది..? కేవలం దశాబ్దం కాలంలో అనిల్ సామ్రాజ్యం కుప్పకూలడానికి దారి తీసిన కారణాలేంటి. డీల్ మేకర్‌గా, వ్యాపార నిర్వహణలో ఇన్వెస్టర్ల నమ్మకం చూరగొన్న అనిల్ అంబానీ గ్రాఫ్ ఎందుకిలా పడిపోయింది? 2008లో రికార్డు స్థాయిలో రిలయన్స్ పవర్ రూ.11,500 కోట్ల నిధుల కోసం ఐపీఓకు వచ్చినపుడు... అది రికార్డు స్థాయిలో 70 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయింది. మరలాంటప్పుడు.. ఎక్కడ తేడా కొట్టింది? నిర్వహణ లోపమా? సమర్థమంతమైన టీమ్ లేకపోవడం వల్లా? లేదా ఒకదానితో మరొక దానికి సంబంధం లేకుండా కుప్పతెప్పలుగా కంపెనీలు పెట్టేయడం వల్లా? లేదా ఎకాయెకిన ఆకాశానికి నిచ్చెనలేసేయాలన్న అత్యుత్సాహంతో దొరికిన చోటల్లా అడ్డగోలుగా అప్పులు చేసేసి.. రుణభారం పెంచేసుకోవడం వల్లా? వ్యాపార పరిస్థితులు పూర్తిగా దెబ్బతినడం వల్లా? తరచి చూస్తే సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ప్రధాన కారణాల గురించి వెతుక్కుంటూ పోతే అంతు ఉండదన్నది పరిశీలకుల అభిప్రాయం. అయితే, అన్నింటికీ వ్యాపార పరిస్థితులు బాగా లేకపోవడం, దురదృష్టం అనుకోవడానికి ఉండదని.. ఆయన ప్రారంభించిన అనేక కంపెనీలే ఒకదాన్ని మరొకటి దెబ్బతీశాయని.. వాటాదారుల ప్రయోజనాలను ఘోరంగా దెబ్బతీశాయని విమర్శలు వస్తున్నాయి. కాస్తంత ఇబ్బందికరమైనదే అయినా.. సోషల్ మీడియా యాప్స్‌లో అన్నదమ్ములపై ఒక సెటైర్ కూడా ప్రచారంలోకి వచ్చింది. అన్న ముకేశ్ అంటే ’ము–క్యాష్’ (డబ్బుల మూట) అని, తమ్ముడు అనిల్ అంటే ’అ–నిల్’ (సున్నా) అంటూ వ్యంగ్యోక్తులు కూడా నడిచాయి. -
ఆర్‌కాం సంచలన నిర్ణయం : షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై : అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) సంచలన నిర్ణయం తీసుకుంది. దివాళా పిటిషన్ దాఖలు చేయాలని అనూహ్యంగా నిర్ణయించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ద్వారా ఫాస్ట్ ట్రాక్ తీర్మానం కోరనున్నామని కంపెనీ రెగ్యులేటరీ సమాచారంలో తెలియజేసింది. దీంతో సోమవారం నాటి మార్కెట్లో అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్(అడాగ్) కంపెనీ షేర్లకు భారీ షాక్ తగిలింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో అన్ని షేర్లు భారీగా నష్టపోతున్నాయి. సుమారు రూ.40వేల కోట్ల మేర రుణ పరిష్కారాలకు సంబంధించిన అంశంలో 40 రుణదాత సంస్థల నుంచి సంపూర్ణ అనుమతి లభించకపోవడంతో ఆర్‌కామ్ తాజా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గత 18నెలలుగా ఆస్తుల విక్రయం ద్వారా రుణ చెల్లింపులకు ప్రయత్నించినప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రుణ పరిష్కార అంశం ముందుకు సాగలేదని ఆర్‌కామ్ తెలిపింది. దీంతో జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)ను ఆశ్రయించనున్నట్లు పేర్కొంది. దీంతో అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇతర గ్రూపు కంపెనీల షేర్లు కూడా పడిపోయాయి. ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళన కారణంగా నెలకొన్న అమ్మకాలతో ముఖ్యంగా ఆర్‌కామ్ షేరు 48 శాతం పతనమైంది. ఒక దశలో54.3 శాతం కుప్పకూలి, 5.30 రూపాయల వద్ద రికార్డు కనిష్టానికి చేరింది. దీంతోపాటు అడాగ్ గ్రూప్‌లోని రిలయన్స్ కేపిటల్ (12.5శాతం), రిలయన్స్ పవర్ (13శాతం), రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ నిప్పన్ లైఫ్, రిలయన్స్ నావల్ తదితర కౌంటర్లు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. -
అంబానీకి సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎరిక్సన్ ఇండియా దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై స్పందన కోరుతూ సోమవారం నోటీసులు జారీ చేసింది. దీనికి నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాల్సిందిగా జస్టిస్ ఆర్.ఎఫ్. నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం అంబానీ, ఇతరులను ఆదేశించింది. అయితే బకాయి కింద రూ.118కోట్లను అంగీకరించాల్సిందిగా ఆర్‌కాం తరపున వాదించిన న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహతగి కోర్టును కోరారు. అయితే ఎరిక్‌సన్‌దీనికి ససేమిరా అంది. మొత్తం బకాయిని డిపాజిట్ చేయాలని తేల్చి చెప్పింది. దీంతో కోర్టు రిజిస్ట్రీలో రూ. 118 కోట్ల డిమాండ్ డ్రాఫ్ట్‌ను డిపాజిట్ చేయాల్సింగా ఆర్‌కాంను కోరింది. అలాగే రిలయన్స్ జియోతో కూర్చొని చర్చించి సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా ఆర్‌కాంకు నారిమన్ సూచించారు. పరస్పరం సమస్యను పరిష్కరించుకోని పక్షంతో తామేమి చేయలేమని వ్యాఖ్యానించారు. మరోవైపు స్పెక్ట్రం ట్రేడ్ మార్గదర్శకాలకు కట్టుబడి ఆర్‌కాం కొనుగోళ్లపై సిద్ధంగా ఉన్నారా అని జియోను కూడా కోర్టు ప్రశ్నించింది. అయితే ముందస్తు బకాయిలతో ఉన్న సమస్యల నేపథ్యంలో, ఆర్‌కాంకు ఫిజికల్ గ్యారంటీ ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమని జియో సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే కోర్టుకు తెలిపారు. స్వీడిష్ టెలికాం పరికరాల తయారీదారు ఎరిక్సన్ ఇటీవల ఆర్‌కాంపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. అనిల్ అంబానీని అరెస్టు చేయాలని, దేశం విడిచి పారిపోకుండా నియంత్రించాలంటూ ఎరిక్సన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమకు చెల్లించాల్సిన రూ.550 కోట్లు చెల్లించకుండా కావాలని తాత్సారం చేస్తోందని ఆరోపించింది. బకాయిల చెల్లింపునకు వ్యక్తిగతంగా హామీ ఇచ్చిన అనిల్ అంబానీ గడువు తీరినా స్పందించడం లేదని, తద్వారా కోర్టు గడువును కూడా ఉల్లంఘించారని ఎరిక్సన్ తన పిటిషన్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. -
అనిల్ అంబానీని జైలుకు పంపండి!
సాక్షి, న్యూఢిల్లీ : రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఛైర్మన్ అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అనిల్ అంబానీని నిర్బంధించాలని కోరుతూ స్వీడన్‌కు చెందిన టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ అప్పులు చెల్లించకుండా విదేశాలకు పారిపోకుండా చూడాలని సుప్రీంను కోరింది. ఆర్‌కాం ఛైర్మన్ అనిల్ అంబానీని జైలుకు పంపి, విదేశాలకు పారిపోకుండా అడ్డుకోవాలని ఎరిక్సన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తద్వారా రూ.550 కోట్ల బాకీని వడ్డీతో సహా చెల్లించేలా చూడాలంటూ గురువారం రెండవ పిటిషన్ దాఖలు చేసింది. అలాగే రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ టెలికాం లిమిటెడ్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ అనిల్ సహా ఈ కంపెనీలకు చెందిన ఇతర అధికారులు దేశం విడిచిపోకుండా నివారించేలా హోం మంత్రిత్వశాఖ ద్వారా చర్యలు తీసుకోవాలని కోరింది. అంతేకాదు గడువులోపు బాకీ చెల్లించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకుగాను అనిల్ అంబానీని జైలుకు పంపాలని డిమాండ్ చేసింది. చాలాకాలంగా ఆర్‌కాం చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్నాం..550 కోట్ల రూపాయల చెల్లింపునకు అంబానీ కోర్టులో వ్యక్తిగత హామీ ఇచ్చారు, కానీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం ఇది రెండవసారి. ఈ నేపథ్యంలో ఆర్‌కాంపై దివాలా చర్యలు చేపట్టాలని ఎరిక్సన్ సీనియర్ అడ్వకేట్ అనిల్ ఖేర్ వ్యాఖ్యానించారు. -
జియో, ఆర్‌కామ్ ఒప్పంద గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: వైర్లెస్ ఆస్తుల విక్రయానికి సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందం గడువును పొడిగించుకుంటున్నట్లు ఆర్‌కామ్, జియో ప్రకటించాయి. ఆర్‌కామ్‌కు చెందిన స్పెక్ట్రం డీల్‌కు టెలికం శాఖ నుంచి అనుమతులు రాని నేపథ్యంలో ఈ డీల్‌ను పొడిగించుకోవాలని ఇరు కంపెనీలు నిర్ణయించుకున్నాయి. ‘‘రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో కుదుర్చుకున్న ఆస్తుల కొనుగోలు ఒప్పంద కాలపరిమితిని 2019 జూన్ 28 వరకు ఆర్‌జియో పొడిగించుకుంది’’అని రిలయన్స్ ఇండస్ట్రీస్ సోమవారం ప్రకటించింది. ప్రభుత్వపరమైన అన్ని రకాల అనుమతులు, ఆమోదాలు, రుణదాతల అంగీకారం పొంది సదరు ఆస్తులపై ఉన్న చిక్కులన్నీ తీరాకే కొనుగోలు జరుగుతుందని తెలిపింది. టవర్లు, ఫైబర్, ఎంసీఎన్, స్పెక్ట్రమ్ విక్రయానికి సంబంధించి ఆర్‌జియోతో కుదుర్చుకున్న ఒప్పంద కాలపరిమితిని పొడిగించుకున్నట్లు ఆర్‌కామ్ సైతం విడిగా ప్రకటించింది. పలు సందేహాల నేపథ్యం... జియోకు స్పెక్ట్రం విక్రయానికి సంబంధించి తమకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను జారీ చేయాలని ఆర్‌కామ్ చాలా రోజులుగా టెలికం శాఖను అభ్యర్థిస్తూ వస్తోంది. కానీ ఇరు కంపెనీల మధ్య ఈ డీల్‌కు సంబంధించిన చెల్లింపులపై టెలికం శాఖ పలు సందేహాలు వ్యక్తం చేస్తోంది. వీటిపై సమాధానమిచ్చేందుకు ఆర్‌జియో, ఆర్‌కామ్ ప్రతినిధులు ఈ నెలలో టెలికం సెక్రటరీతో సమావేశమయ్యారు. ఈ విషయంలో బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలన్న టెలికం శాఖ డిమాండ్‌ను టెలికం ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు తిరస్కరించినట్లు ఆర్‌కామ్ గుర్తు చేసింది. బ్యాంకు గ్యారెంటీ బదులు తమ అనుబంధ సంస్థ ఆర్రియల్టీ ద్వారా అవసరమైన కార్పొరేట్ గ్యారెంటీ ఇస్తామని తెలిపింది. అందువల్ల ఇక అభ్యంతరాలకు ఎలాంటి అవకాశం లేదని ఆర్‌కామ్ పేర్కొంది. టెలికం శాఖ మాత్రం డీల్‌కు ఆమోదముద్ర వేసేందుకు ఇంకా అంగీకరించలేదు. ముఖ్యంగా చెల్లింపుల బకాయిలు, ఇతర చార్జీలపై ఇంకా స్పష్టత రావాలని టెలికం శాఖ భావిస్తోంది. ముఖ్యంగా డీల్‌కు సంబంధించి ఆర్‌కామ్‌కు ఎలాంటి గ్యారెంటీ కూడా ఇవ్వటానికి జియో అంగీకరించలేదు. అందుకని టెలికం శాఖ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. దీంతో ఇరు కంపెనీలు ఒప్పంద కాలపరిమితిని పొడిగించుకున్నాయి. -
స్పెక్ట్రం డీల్ : అంబానీకి భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కాం)కు సుప్రీంకోర్ టుభారీ ఊరట కల్పించింది. సోదరుడు ముకేశ్ అంబానీకి చెందిన టెలికాం సంస్థ జియోకు స్పెక్ట్రం అమ్మకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా జియోకు ఆస్తుల అమ్మకానికి సంబంధించిన అడ్డంకులను అత్యున్నత న్యాయస్థానం తొలగించింది. అయితే గ్యారంటీ నగదు చెల్లించిన తరువాత మాత్రమే తుది ఆమోదం లభిస్తుందంటూ నిబంధన విధించింది. డాట్ వద్ద గ్యారంటీ నగదు చెల్లించిన అనంతరం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లభిస్తుందని సుప్రీకోర్టు స్పష్టం చేసింది. సేల్కున్నఅడ్డంకులను తొలగిస్తూ సుప్రీం శుక్రారం కీలక తీర్పునిచ్చింది. రెండు రోజుల్లో 1400 కోట్ల రూపాయల కార్పొరేట్ గ్యారంటీ చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం చెల్లించిన అనంతరం వారం రోజుల్లో ఎన్వోసీ జారీ చేయాల్సిందిగా టెలికాం విభాగం (డాట్)ను సుప్రీం కోరింది. రూ.46వేల కోట్ల రుణభారం అప్పుల భారం నుంచి బయటపడేందుకు వైర్లెస్ స్పెక్ట్రం, టవర్, ఫైబర్, మీడియా కన్వర్జెన్స్ నోడ్ (ఎంసిఎన్) ఆస్తులను జియోకు విక్రయించేందుకు ఆర్‌కాం సిద్ధమైంది. సుమారు రూ.46వేల కోట్ల రుణభారాన్ని తగ్గించుకునే వ్యూహంలో స్పెక్ట్రం ఆస్తుల అమ్మకం ఆర్‌కాంకు చాలా ముఖ్యం. -
అంబానీ బ్రదర్స్ డీల్‌కు సుప్రీం బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ: అప్పుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్‌కు అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్సకు చెందిన ఆస్తుల విక్రయ ఒప్పందానికి సుప్రీం బ్రేక్ వేసింది. దీనికి సంబంధించి ఇటీవల ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) ఇచ్చిన ఆర్డర్‌పై స్టే విధించింది. ఆర్‌కాం టవర్ సంస్థలో 4శాతం వాటా వున్న హెచ్ఎస్బీసీ డైసీ ఇన్వెస్ట్మెgట్స్ (మారిషియస్) లిమిటెడ్ సవాల్‌ను కోర్టు స్వీకరించింది. దీనిపై మైనారిటీ వాటాదారుల వాదనలు వినడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. దఈ వార్తలతో స్టాక్మార్కెట్లో ఆర్‌కాం కౌంటర్ 2శాతానికిపైగా నష్టాలతో కొనసాగుతోంది. ఆస్తుల విక్రయానికి ఎన్సీఎల్టీ ఆమోదం లభించిందని రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఏప్రిల్ 5న ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చింది. దీని ద్వారా 25,000 కోట్ల రూపాయల రుణాన్ని చెల్లించనున్నామని తెలిపింది. కాగా స్పెక్ట్రమ్, మొబైల్ టవర్లు, ఫైబర్ నెట్వర్క్,మల్టీ ఛానెల్ నెట్వర్క్(ఎంసీఎన్‌ఎస్)విక్రయించేందుకు గత ఏడాది డిసెంబర్లో రిలయన్స్ జియోతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
అంబానీకి సుప్రీంకోర్టు ఊరట
న్యూఢిల్లీ : రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తులు విక్రయించకుండా బొంబై హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో స్వీడిష్ గేర్ మేకర్ ఎరిక్సన్కు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. చట్ట ప్రకారం ఆర్‌కామ్ ఆస్తులను విక్రయించుకోవచ్చని క్రెడిటార్లకు టాప్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఆర్‌కామ్ స్పెక్ట్రమ్, ఫైబర్, రియల్ ఎస్టేట్, స్విచ్చింగ్ నోడ్స్ వంటి వాటిని విక్రయించుకోవచ్చని పేర్కొంది. దీంతో ఆర్‌కామ్ షేర్లు లాభాల జోరు కొనసాగిస్తోంది. ఆర్‌కామ్ షేర్లు దాదాపు 2.5 శాతం లాభపడ్డాయి. మార్చి మొదట్లో తమ ఆస్తులు విక్రయించకుండా ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ విధించిన ఆదేశాలను ఛాలెంజ్ చేస్తూ అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ బొంబై హైకోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది. కానీ ఫిర్యాదును హైకోర్టు కొట్టిపారేసి, ఆర్బిట్రేషన్ అనుమతి లేకుండా ఎలాంటి ఆస్తులు విక్రయించకూడదని, ఆస్తుల విక్రయంపై స్టే విధించింది. ఎరిక్సన్ ఏబీకి చెందిన ఇండియన్ విభాగానికి రిలయన్స్ కమ్యూనికేషన్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన విషయమే ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉంది. దీంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ విక్రయిద్దామన్న ఆస్తులు విక్రయించకుండా.. డీల్స్ బదలాయింపులు చేయడానికి వీలులేకుండా కోర్టు మార్చిలో మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కానీ ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆస్తులు విక్రయించుకునే విషయంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు భారీ ఊరట లభించింది. అప్పుల కుప్పలో కొట్టుమిట్టాడుతున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన ఆస్తులను అన్న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోకు అమ్మేసి, ఆ అప్పులను కొంతమేర తగ్గించుకోవాలనుకుంటోంది. ప్రస్తుతం ఆర్‌కామ్‌కు దాదాపు రూ.45వేల కోట్ల అప్పులున్నాయి.