ఆఫర్ అదుర్స్ : రూ.70కే ఏడాదంతా అపరిమిత డేటా
రిలయన్స్ జియో ఎప్పుడైతే టెలికాం మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిందో ఇక అప్పటి నుంచి కస్టమర్లకు డేటా పండుగ ప్రారంభమైంది. జియో దెబ్బకు కంపెనీలన్నీ వరుస పెట్టి డేటా ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ నుంచి వొడాఫోన్, బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌సెల్, ఆర్‌కామ్ వరకు అన్నీ డేటా ఆఫర్లతో అదరగొడుతున్నాయి. తాజాగా ఇండిపెండెన్స్ డేకి ముందస్తుగా రిలయన్స్ మొబైల్ 'డేటా కీ ఆజాదీ' ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ కింద 70 రూపాయలకే ఏడాదంతా అపరిమిత 2జీ డేటాను అందించనున్నట్టు పేర్కొంది. డేటాతో పాటు 56 రూపాయల టాక్ టైమ్‌ను అందించనున్నట్టు తెలిపింది.
ఈ ఆఫర్ ఆగస్టు 14 నుంచి ఆగస్టు 16 మధ్యలోనే ఉంటుంది. రిలయన్స్ డేటా కీ ఆజాదీతో 70 రూపాయలకే ఏడాది పాటు అపరిమిత 2జీ డేటాను పొందుతూ, ఫ్రీడంతో ఆనందం వ్యక్తంచేయడంటూ రిలయన్స్ మొబైల్ సోమవారం ఓ ట్వీట్ చేసింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ స్పెషల్ ఆఫర్‌ను అందిస్తున్నట్టు తన యాడ్‌లో పేర్కొంది. మరోవైపు జియోకి పోటీగా 4 రోజుల క్రితమే రూ.299 నెలవారీ రెంటల్ ప్లాన్‌ను ఆర్‌కామ్ ప్రకటించింది. దీని కింద అపరిమిత కాల్స్, టెక్ట్స్, డేటాను అందించనున్నట్టు పేర్కొంది. కాగ, జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆర్‌కామ్ భారీగా రూ.1,210 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాలను మూటగట్టుకుంది. రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఆర్‌కామ్ ఈ నష్టాలను ప్రకటించడం ఇది మూడోసారి.