
ఆర్‌కామ్, రిలయన్స్ జియో.. స్పెక్ట్రం ఒప్పందం
న్యూఢిల్లీ: టెలికం స్పెక్ట్రం ట్రేడింగ్, షేరింగ్‌కు సంబంధించి రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), రిలయన్స్ జియో (ఆర్‌జియో) ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఇరు కంపెనీలు 17 సర్కిళ్లలో స్పెక్ట్రంను పరస్పరం పంచుకుంటాయి. 9 సర్వీస్ ఏరియాల్లో ఆర్‌కామ్‌కు చెందిన సీడీఎంఏ గ్రేడ్ 800 మెగాహెట్జ్ స్పెక్ట్రంను ఆర్‌జియో ఉపయోగించుకుంటుంది. తద్వారా .. త్వరలో దేశంలోనే అతి పెద్ద 4జీ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను ప్రారంభించనున్న ఆర్‌జియోకు 18 టెలికం సర్కిళ్లలో 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో, 17 సర్కిల్స్‌లో 800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో, మొత్తం 22 టె లికం సర్కిల్స్‌లో 2300 మెగాహెట్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రం దక్కినట్లవుతుంది.
అటు స్పెక్ట్రం ట్రేడింగ్‌తో ఆర్‌కామ్‌కు దాదాపు రూ. 4,500 కోట్లు లభించనున్నాయి. 16 సర్కిల్స్‌లో స్పెక్ట్రం లిబరలైజేషన్ (ట్రేడింగ్, షేరింగ్ తదితర అవసరాలకు ఉపయోగించుకునేందుకు అనుమతించినందుకు గాను) కోసం టెలికం శాఖకు చెల్లించాల్సిన రూ. 5,384 కోట్ల ఫీజుకి ఆర్‌కామ్ ఈ నిధులను ఉపయోగించుకోనుంది. మిగతా మొత్తాన్ని ఇతరత్రా స్థిరాస్తి అసెట్స్ విక్రయాల ద్వారా సమకూర్చుకోనుంది. పరస్పర సహకారం కారణంగా ఇరు కంపెనీల నెట్‌వర్క్ సామర్థ్యాలు మెరుగుపడటంతో పాటు వ్యయాలు గణనీయంగా తగ్గగలవని ఆర్‌కామ్ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, స్పెక్ట్రం ట్రేడింగ్‌కి సంబంధించి టెలికం రంగంలో ఇది రెండో ఒప్పందం. దాదాపు రూ. 3,310 కోట్లు చెల్లించి రెండు సర్కిల్స్‌లో స్పెక్ట్రం కొనుక్కునేందుకు వీడియోకాన్‌తో ఐడియా ఒప్పందం కుదుర్చుకుంది.