తెలుగువారికి బంపర్ ఆఫర్: 70జీబీ 4జీ డేటా
న్యూఢిల్లీ : అన్న ముఖేష్ అంబానీకి పోటీగా తమ్ముడు కూడా టెలికాం మార్కెట్లో సంచలన ఆఫర్లతో దుమ్మురేపుతున్నారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్ నేడు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం 148 రూపాయలకే 70జీబీ 4జీ డేటా అందించనున్నట్టు తెలిపింది. ''సూపర్ వాల్యు'' టారిఫ్ ప్లాన్ లో భాగంగా ఈ ఆఫర్ ను ఆర్కామ్ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని సర్కిళ్ల యూజర్లకు మాత్రమేనని తెలిపింది. రోజుకు 1జీబీ డేటా చొప్పున 70 రోజుల వరకు ఈ డేటా ప్యాక్ అందించనుంది. దీంతో పాటు 50 రూపాయల టాక్ టైమ్ కూడా యూజర్లకు కల్పించనుంది. ఈ ప్లాన్ లో బెనిఫిట్స్ కింద యూజర్లకు ఇతర నెట్ వర్క్ లకు చేసుకునే వాయిస్ కాల్స్ కు నిమిషానికి 25 పైసల ఛార్జీని వసూలు చేయనుంది. రిపోర్టుల ప్రకారం ఎఫ్‌ఆర్సీ 54, ఎఫ్ఆర్సీ 61 ప్లాన్స్ ను కూడా కంపెనీ లాంచ్ చేయనున్నట్టు తెలిసింది.
54 రూపాయల ప్లాన్ కింద రోజుకు 1జీబీ 4జీ డేటాను 28 రోజుల వరకు అందించనుంది. ఈ టారిఫ్ ప్యాక్ లోనే రిలయన్స్ టూ రిలయన్స్ కాల్స్ కు నిమిషానికి 10 పైసలు, ఇతర లోకల్, ఎస్టీడీ కాల్స్ కు నిమిషానికి 25 పైసలు ఛార్జీ పడనుంది. అదేవిధంగా 61 రూపాయల ప్లాన్ కింద రోజుకు 1జీబీ 4జీ డేటాను, రిలయన్స్ టూ రిలయన్స్ కాల్స్ కు ఆరు సెకన్లకు 1 పైసా, లోకల్, ఎస్టీడీ కాల్స్ కు రెండు సెకన్లకు 1 పైసా ఆఫర్ చేయనుంది. అచ్చం ఆర్కామ్ ప్లాన్ మాదిరిగానే, ఎయిర్ టెల్ రూ.399 రీఛార్జిపై రోజుకు 1జీబీ డేటాను, అపరిమిత కాలింగ్ ను 56 రోజుల వరకు ఆఫర్ చేస్తోంది. ఐడియా సెల్యులార్ ప్లాన్ 447 కూడా ఇదేమాదిరి ఉండనుంది. వీటికి పోటీగా, అన్నకు ధీటుగా ఆర్కామ్ తన ప్లాన్స్ ను ప్రకటించింది.