సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలంలో లభ్యతగా ఉన్న జలాలను ఇరు రాష్ట్రాల అవసరాలకు కేటాయిస్తూ కృష్ణాబోర్డు కీలక నిర్ణయం చేసింది. శ్రీశైలంలోకి వస్తున్న వరద దృష్ట్యా, తమ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలన్న తెలంగాణ, ఏపీల అభ్యర్థన మేరకు తెలంగాణకు 30 టీఎంసీలు, ఏపీకి 25 టీఎంసీలు కేటాయించింది.
ఇందులో తెలంగాణకు శ్రీశైలం నుంచి కల్వకుర్తి ద్వారా 10 టీఎంసీలు, సాగర్ నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 6 టీఎంసీలు, మిషన్ భగీరథ అవసరాలకు 2 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వలకు 12 టీఎంసీలు కేటాయించగా, ఏపీకి శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు 9 టీఎంసీలు, హంద్రీనీవాకు 5 టీఎంసీలు, సాగర్ కింద కుడి కాల్వకు 7.5, ఎడమ కాల్వకు 3.5 టీఎంసీలు కేటాయించింది. ఇరురాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాల దృష్ట్యా ఆగస్టు వరకు మొత్తంగా 55 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు అవకాశమిచ్చింది.
ఈ మేరకు కృష్ణాబోర్డు సభ్య కార్యదర్శి పరమేశం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాశారు. ఎగువ కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్ నిండటం, అక్కడి నుంచి దిగువ శ్రీశైలానికి ప్రవాహాలు పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే శ్రీశైలంలోకి ఈ వాటర్ ఇయర్‌లో కొత్తగా 120 టీఎంసీల నీరొచ్చి చేరింది. ఆగస్టు వరకు 25 టీఎంసీలు కావాలని ఏపీ, 30 టీఎంసీలు కావాలని తెలంగాణ ఇండెంట్లు సమర్పించాయి.
ప్రస్తుతం శ్రీశైలంలో కనీస నీటిమట్టం 834 అడుగులకు ఎగువన వినియోగార్హమైన నీరు 82.74 టీఎంసీలు ఉండగా, సాగర్‌లో కనీస నీటిమట్టం 510 అడుగులకు ఎగువన 1.87 టీఎంసీల లభ్యత ఉంది. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని ఇరు రాష్ట్రాలకు అడిగిన మేర నీటిని పంచుతూ కృష్ణాబోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. సాగర్ ఎడమ కాల్వలకు నీటి సరఫరాకు వీలుగా ప్రాజెక్టులో 520 అడుగులు నిర్వహించాల్సి ఉందని, అందుకు వీలుగా శ్రీశైలం నుంచి ఆవిరి, సరఫరా నష్టాలను కలుపుకొని 52 టీఎంసీలు విడుదల చేయాలని ఉత్తర్వుల్లో బోర్డు పేర్కొంది.
విద్యుదుత్పత్తి చెరిసగం..
ఈ నెల 28 నుంచి వచ్చే నెల 22 వరకు రోజుకు 2 టీఎంసీల చొప్పున శ్రీశైలం నుంచి సాగర్‌కు పవర్‌హౌజ్‌ల ద్వారా విడుదల చేయాలని సూచించింది. విద్యుదుత్పత్తిని చెరిసగం పంచుకోవాలని పేర్కొం ది. సాగర్ ఎడమ కాల్వల కింద నీరు చివరి వరకు చేరుకునేలా ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించింది.
ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే నీటి డేటాను ఇరు రాష్ట్రాలు ఆమోదించి బోర్డుకు పంపాలని తెలిపింది. 2015లో నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన అవగాహన మేరకు ఈ నీటి విడుదలలో బోర్డు ఆదేశాలు పాటించాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment