సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో కనీస నీటిమట్టాలకు దిగువన వాడుకునే నీటి వాటాలపై లొల్లి మొదలైంది.కనీస నీటిమట్టానికి(ఎండీడీఎల్) ఎగువన ఉన్న నీటి పంపకాల విషయంలో ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంగీకరించిన 36ః64 నిష్పత్తిని, ఎండీడీఎల్ దిగువకు వెళ్లి తీసుకునే నీటి విషయంలో మార్చాల్సిన అవసరాన్ని తెలంగాణ పట్టుబడుతుండటం తో వివాదం ముదిరే అవకాశాలు కనిపిస్తున్నా యి. వాటా నిష్పత్తిని మార్చాలంటున్న తెలంగాణ వినతిని బోర్డు, ఏపీ వ్యతిరేకించే అవకాశాల నేపథ్యంలో వివాదం ఏ తీరానికి చేరు తుందన్నది ఆసక్తిగా మారింది.
ఇరు రాష్ట్రాల మ«ధ్య కుదిరిన అవగాహన మేరకు ప్రస్తుత ఏడాదిలో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో ఎండీ డీఎల్‌కు ఎగువన ఉన్న లభ్యత నీటిని ఏపీ 66 శాతం, తెలంగాణ 34 శాతం వాటా పద్ధతిన వాడుకుంటున్నాయి. ప్రస్తుతం శ్రీశైలంలో కనీస నీటిమట్టం 834 అడుగులకు ఎగువన 6.73 టీఎంసీలు, సాగర్‌లో కనీస నీటిమట్టం 510 అడుగులకు ఎగువన 18.70 టీఎంసీలు కలిపి మొత్తంగా 25.73 టీఎంసీలు లభ్యతగా ఉన్నాయి. ఈ నీటిని నిర్ణయించిన దామాషా పద్ధతినే ఇరు రాష్ట్రాలకు బోర్డు పంచింది. కనీస నీటిమట్టాలకు దిగువన నీటినీ ఇదే రీతిన రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా పంచుతామనే సంకేతాలిచ్చింది.
ఇక్కడే సమ స్య తలెత్తుతోంది. ఎండీడీఎల్ ఎగువన సాగు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాటాలు నిర్ణయించగా, దిగువన నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలని తెలంగాణ చెబుతోంది. బచావత్ అవార్డు ప్రకారం, తాగునీటి అవసరాలకు జరిగిన కేటాయింపుల్లో చెన్నై, హైదరాబాద్ మహా నగర తాగునీటి అవసరాలను పొందుపరిచారు. ఇందులో చెన్నై తాగునీటికి కావాల్సిన 15 టీఎంసీల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీ మధ్య 5 టీఎంసీల చొప్పున వాటా కేటాయించారు.
వీటిల్లో ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతీయ వాటాలుగా విభజించారు. దీని ప్రకారం ఒక్కో ప్రాంతానికి సుమారుగా 1.7 టీఎంసీల వాటా వచ్చింది. హైదరాబాద్ తాగునీటికి 16.5 టీఎంసీల ను కేటాయించారు. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని లెక్కిస్తే ఏపీకి తాగునీటిపరంగా 31 శాతం, తెలంగాణకు 69 శాతంగా వాటా తేలుతుందని తెలంగాణ నీటి పారుదల వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇదే సూత్రాన్ని అన్వయించి ప్రస్తుతం ఎండీడీఎల్ దిగువన లభ్యతగా ఉన్న నీటిని పంచాలని కోరుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలంలో కనీస నీటి మట్టాలకు దిగువన 800 అడుగులు, సాగర్‌లో 500 అడుగుల దిగువకు వెళ్లి నీటిని తీసుకోవాలని బోర్డు సమక్షంలో ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. ఈ మట్టాల్లో నీటి లభ్యత 41.23 టీఎంసీలుగా ఉంది ఈ నీటిని తెలంగాణకు 69 శాతం, ఏపీకి 31 శాతం నిష్పత్తిన పంచితే తెలంగాణకు 28.23 టీఎంసీ, ఏపీకి 13 టీఎంసీల మేర దక్కుతా యని తెలంగాణ స్పష్టం చేస్తోంది.
ఏపీకి 30..తెలంగాణకు 45 టీఎంసీలు అంటున్న బోర్డు..
శ్రీశైలం, సాగర్‌లో ఎండీడీఎల్ దిగువన నిర్ణయించిన మట్టాల్లో 41.23 టీఎంసీల లభ్యత ఉందంటూ కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం గురువారం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాశారు. ఎండీడీఎల్ ఎగువన ఉన్న నీటిని కలుపుకుని వాటా ప్రకారం తెలంగాణకు 45 టీఎంసీలు, ఏపీ 30 టీఎంసీల నీరు ఆగస్టు వరకు తాగు, సాగు అవసరాలకు దక్కుతాయన్నారు. ఎండీడీఎల్ దిగువన తాగునీటి అవసరాలను పేర్కొంటూ తమకు ఇండెంట్‌లు సమర్పిస్తే అందుకు అనుగుణంగా నీటి విడుదలకు ఆదేశాలు ఇస్తామని లేఖలో స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment