హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వరసగా రెండేళ్లు ఎలాంటి వ్యాపార కార్యకలాపాలూ లేకుంటే... ఆ కంపెనీల కథ కంచికేనా..? రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌ఓసీ) ఇపుడదే చేస్తోంది. 2016–17, 2017–18లో బ్యాలెన్స్ షీట్స్‌ను సమర్పించని 15,659 కంపెనీలను ఈ నెలాఖరులోగా ఆర్‌వోసీ రికార్డులను నుంచి తొలగించనున్నట్లు ఇండియన్ కార్పొరేట్ లా సర్వీసెస్ (ఐసీఎల్‌ఎస్) సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. నిబంధనలను సక్రమంగా పాటించని 29 వేలకు పైగా కంపెనీలకు నోటీసులిచ్చామని, దీన్లో 15,659 కంపెనీలు సరైన రీతిలో స్పందించలేదని ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారాయన.
త్వరలో సెబీ నుంచి జాబితా..
ఆర్‌వోసీ హైదరాబాద్ రికార్డుల ప్రకారం.. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో 1,27,400 కంపెనీలున్నాయి. ఇందులో తెలంగాణలో లక్ష వరకు ఉన్నాయి. ఆర్‌వోసీ నిబంధనల అతిక్రమణ కారణంగా గతేడాది దేశవ్యాప్తంగా 2 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయటం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవి దాదాపు 20 వేల కంపెనీలున్నాయి. దీంతో ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లోని కంపెనీల సంఖ్య 95 వేలకు చేరుతుందని ఆయన చెప్పారు. త్వరలోనే సెబీ నుంచి ఓ జాబితా వెలువడనుందని, దాన్లోని కంపెనీల్లో సోదాలు చేయాల్సిందిగా ఆదేశించారని కూడా ఆయన చెప్పారు.
విజయవాడలో ఆర్‌వోసీ..
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని కంపెనీల కార్యకలాపాలను ఆర్‌వోసీ హైదరాబాదే పర్యవేక్షిస్తోంది. ఇందులో 13 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారని.. దీంతో రెండు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించడం సవాల్‌గా మారుతోందని ఓ అధికారి చెప్పారు. అందుకే ఏపీలోని విజయవాడలో ప్రత్యేకంగా ఆర్‌వోసీని ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. 3 నెలల్లో కార్యాలయాన్ని ప్రారంభిస్తామని, ఏపీ ఆర్‌వోసీ కిందికి 23 వేల కంపెనీలు వస్తాయని ఆయన చెప్పారు.
ఆడిటర్లు, సీఏ, సెక్రటరీలపై నియంత్రణ..
ఇక నుంచి కంపెనీల కార్యకలాపాలపైనే కాకుండా ఆడిటర్లు, కంపెనీ సెక్రటరీ, చార్టర్డ్ అకౌంటెంట్లపైనా ఆర్‌వోసీ నియంత్రణ ఉంటుంది. నిబంధనలను అతిక్రమించిన ఆడిటర్లు, సీఏ, సెక్రటరీలను నిషేధించే అధికారాలూ ఆర్‌వోసీ చేతిలో ఉంటాయి. తాజా నిబంధనల ప్రకారం.. గతంలో మాదిరిగా ఆన్‌లైన్‌లో ఆర్‌వోసీకి దరఖాస్తు చేసి కంపెనీ రిజిస్టర్డ్ అడ్రస్ మార్చుకోవటం కాకుండా.. చిరునామాను ఎందుకు మారుస్తున్నారో సంబంధిత ఆర్‌వోసీకి వెల్లడించాలి. అది సహేతుకమైన కారణం అనిపిస్తేనే ఆర్‌వోసీ అనుమతిస్తుంది. కొన్ని కంపెనీలు స్థానికంగా ప్రజలను, పెట్టుబడిదారులను మోసం చేసి రాత్రికి రాత్రే అడ్రస్‌లను మార్చేస్తుండమే దీనికి కారణం. పైపెచ్చు కంపెనీ ఆడిటర్లు, చార్టర్డ్ అకౌంటెంట్, సెక్రటరీలు తమకు తాముగా ఉద్యోగం మానేసినా లేదా కంపెనీయే వారిని తొలగించినా కారణాన్ని ఆర్‌వోసీకి వివరించాలి. కొన్ని కంపెనీలు తమకు అనుకూలంగా వ్యవహరించని ఉద్యోగులను తొలగించి, ఆ స్థానంలో వేరే ఉద్యోగులను నియమించుకొని అవకతవకలకు పాల్పడుతున్నాయని.. గుజరాత్‌లో 20 కంపెనీలు ఇలాగే వ్యవహరించినట్లు సోదాల్లో తేలిందని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
ఏపీ, తెలంగాణల్లో 15,659 కంపెనీలు ఔట్!
Published Fri, Aug 3 2018 12:53 AM | Last Updated on Sat, Aug 18 2018 6:00 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment