కంపెనీల వారీగా నిర్దేశించిన లక్ష్యం, పురోగతిపై తనిఖీలు నిర్వహిస్తాం: తుమ్మల
ఫలితాలివ్వని ఆయిల్‌పామ్ కంపెనీలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలోని విత్తన కంపెనీలు విత్తనాలను సరఫరా చేయాల్సిందేనని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. విత్తన కంపెనీలకు నిర్దేశించిన లక్ష్యాల సాధనను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. శనివారం మంత్రి చాంబర్‌లో వ్యవసాయ, సహకార శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విత్తన ప్యాకెట్లు కంపెనీ నుంచి రైతులకు చేరే వరకు నిఘా వ్యవస్థ కట్టుదిట్టంగా పనిచేయాలని సూచించారు.
పచ్చిరొట్ట విత్తనాల పంపిణీపై వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హరిత వివరిస్తూ రూ.61.15 కోట్లు విలువగల 1,09,937 క్వింటాళ్ళ విత్తనాలను రైతులకు అందచేశామని వివరించారు. గతేడాది జూన్15 నాటికి 64,34,215 పత్తి ప్యాకెట్లు రైతులకు అందుబాటులో ఉంచగా, ఈసారి 1,02,45,888 ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని, రైతులు ఇప్పటికే 62 లక్షల ప్యాకెట్లు కొనుగోలు చేశారని తెలిపారు. రాష్ట్రంలో 7,97,194 మెట్రిక్ టన్నుల యూరియా, 75,278 మెట్రిక్ టన్నుల డీఏపీ, 4,27,057 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 26,396 మెట్రిక్ టన్నుల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ ఎరువులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు వివరించారు.
పంటల నమోదు పారదర్శకంగా ఉండాలి
రాష్ట్రంలో పంటల నమోదు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి లోపాలకు తావులేకుండా సజావుగా జరపాలని మంత్రి తుమ్మల సంబంధింత అధికారులను ఆదేశించారు. నిర్దేశిత లక్ష్యాల మేర ఫలితాలు చూపని ఆయిల్ పామ్ కంపెనీలకు నోటీసులు ఇవ్వాలని ఉద్యానవన శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. డ్రిప్, స్ప్రింక్లర్స్ సౌకర్యం కేవలం ఆయిల్ పామ్ పంటలకే కాకుండా ఇతర పంటలకూ వర్తింపజేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment