oil palm
-
రైతన్నలూ.. ఆయిల్‌పాం సాగు చేయండి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘రైతులంతా ఆయిల్‌పాం సాగుపై దృష్టి పెట్టాలి. మొదటి మూడే ళ్లు మీకు పెట్టుబడి పెట్టే బాధ్యత మాది. అంతర పంటలు వేస్తే బోనస్ ఇచ్చే బాధ్యత కూడా మాదే. మీ పంటను ఇంటి వద్దే కొనిపించే బాధ్యత తీసు కుంటాం. వెంటనే మీ ఖాతాలో డబ్బులు వేస్తాం. పామాయిల్ పంట వేయండి.. మీ బతుకుల్లో వెలుగులు నింపలేకపోతే వ్యవసాయ శాఖపరంగా మీరు ఏ శిక్ష విధించినా దానికి సిద్ధంగా ఉంటాం. రైతులకు నష్టం రాకుండా చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌లో మూడు రోజుల రైతు పండుగ సదస్సును పద్మశ్రీ అవార్డుగ్రహీత, రైతు వెంకటరెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సదస్సులో మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, ఆహార పదార్థాలకు సంబంధించి రైతులకు అవగాహన కల్పించేలా మైదానంలో ఏర్పాటు చేసిన 117 స్టాళ్లు, ఎగ్జిబిట్లను తిలకించిన అనంతరం సదస్సులో మంత్రి తుమ్మల మాట్లాడారు. రాష్ట్రానికి అప్పులు, కష్టాలు ఉన్నా రైతాంగాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నట్లు తెలిపారు.అనుకున్నవన్నీ నాలుగేళ్లలో చేస్తాం..రైతులు తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని, వచ్చే నాలుగేళ్లలో అనుకున్న వ న్నీ చేసి అన్నదాతల చేత శెభాష్ అనిపించుకుంటా మని మంత్రి తుమ్మల చెప్పారు. బీఆర్ఎస్ నేతలు పదేళ్లు వ్యవసాయాన్ని ఎలా ఆగం చేశారో, ఈ పది నెలల్లో ఏ రకంగా ఆదుకున్నామో ఈ నెల 30న జరి గే సభలో సీఎం రేవంత్‌రెడ్డి చెబుతారని తుమ్మల తెలిపారు. రైతులను సమీకరించి సంక్రాంతికి ముందే రైతు పండుగను నిర్వహించుకుంటామన్నారు.సాగు దండగ కాదు.. పండగని వైఎస్ నిరూపించారు: దామోదరఉమ్మడి ఏపీలో 2003–04లో వ్యవసాయం దండగ అని ప్రచారం జరిగితే 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమైన ప్రాజెక్టు లను చేపట్టి కొంత వరకు పూర్తి చేశారని.. వ్యవసాయం దండగ కాదు.. పండగని నిరూ పించారని మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా ఇన్ చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొ న్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వ్యవసా య రంగాన్ని నిర్లక్ష్యం చేసినా ప్రస్తుత ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలు తీసుకొన వాటిని సాకారం చేసుకుంటూ ముందుకు సాగుతోందన్నారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ రైతులు సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల పెట్టుబడులు తగ్గి లాభాలు పెరుగుతాయన్నా రు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెలేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
బొప్పాయి, నిమ్మ, కోకో, టమాటా, ఆయిల్‌పాం.. ఉత్పాదకతలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్ర వృద్ధిలో ఉద్యానపంటలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఏపీ ఉద్యానపంటల హబ్‌గా మారుతోంది. బొప్పాయి, నిమ్మ, కోకో, టమాటా, ఆయిల్‌పాం ఉత్పాదకతలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, మిరప, మామిడి, స్వీట్ ఆరెంజ్, పసుపు ఉత్పాదకతలో రెండోస్థానంలో ఉందని 2023–24 సామాజిక ఆర్థికసర్వే వెల్లడించింది. 2023–24లో కొత్తగా 1,43,329 ఎకరాల్లో ఉద్యానపంటల సాగు చేపట్టినట్లు తెలిపింది.ఉద్యానపంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, ప్రధానంగా రాయలసీమ ప్రాంతం ఉద్యాన హబ్‌గా తయారవుతోందని పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 45.58 లక్షల ఎకరాల్లో ఉద్యానపంటలు సాగవుతుండగా.. అందులో 43 శాతం (19.50 లక్షల ఎకరాల్లో) రాయలసీమలోనే సాగవుతున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ఉద్యానపంటల ఉత్పత్తి 366.53 లక్షల మెట్రిక్ టన్నులుండగా.. అందులో 52 శాతం (189.69 లక్షల మెట్రిక్ టన్నులు) రాయలసీమలోనే ఉత్పత్తి అవుతున్నట్లు వివరించింది. మెట్ట ప్రాంతాల్లో తక్కువ ఆదాయం వచ్చే పంటలకు బదులు ఎక్కువ లాభదాయకమైన ఉద్యానపంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపింది. ఉద్యానపంటల ఉత్పాదకత, నాణ్యత పెంపుదల కోసం ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాల ద్వారా తోటబడి పేరుతో సలహాలు, సూచనలు ఇస్తోందని, అలాగే విపత్తుల్లో దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకుందని తెలిపింది. 2023–24లో ఉద్యానపంటలు దెబ్బతిన్న 1.31 లక్షల మంది రైతులకు రూ.139.31 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ చెల్లించినట్లు వెల్లడించింది. ఏపీ ఉద్యానపంటల అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించిందని సర్వే తెలిపింది. ఇప్పటివరకు 1,62,071 మెట్రిక్ టన్నులను వివిధ దేశాలకు ఎగుమతి చేసినట్లు తెలిపింది. రాయలసీమలో సేకరణ కేంద్రాలను, ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వివరించింది. -
ఎట్టకేలకు పెరిగిన ఆయిల్‌పామ్ ధర
సాక్షి, అమరావతి: క్రూడ్ పామాయిల్(సీపీవో)పై కేంద్రం దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించడం, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ధరల ప్రభావంతో దేశీయంగా ఆయిల్‌పామ్ ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో రూ.13,950 ఉన్న తాజా ఆయిల్ పామ్ గెలల (ఎఫ్‌ఎఫ్‌బీ) టన్ను ధర రూ.19,040కి పెరిగింది. సీజన్‌కు ముందుగానే ఓఈఆర్ (ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో)ను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో ఏపీ కంటే మంచి ధరను తెలంగాణ రైతులు పొందగలుగుతున్నారు.దిగుమతి సుంకం పునరుద్ధరణతో..ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో దేశీయంగా పెరిగిన వంటనూనె ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా సీపీవోపై 49 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 2022లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. అదే సమయంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్స్ ధరలు టన్ను రూ.77వేల దిగువకు పడిపోయాయి. ఫలితంగా టన్ను రూ.23,635 నుంచి గతేడాది అక్టోబర్‌లో రూ.12,100కు పడిపోయింది.వయబిలిటీ ధరను సవరించడంతో పాటు క్రూడ్ పామ్ ఆయిల్(సీపీఓ)పై దిగుమతి సుంకాలను పునరుద్ధరించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. ఫలితంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో క్రూడ్ ఆయిల్స్‌పై 20 శాతం చొప్పున దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించడంతో పాటు సోయాపై 5.5 శాతం నుంచి 27.50 శాతం, రిఫైన్డ్ ఆయిల్స్‌పై 13.75 శాతం నుంచి 35.75 శాతానికి దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.అంతర్జాతీయ ధరల ప్రభావందీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు టన్ను రూ.1.25 లక్షలకు పెరిగింది. ఫలితంగా దేశీయంగా పామాయిల్ సేకరణ ధరలు పెరుగుతూ వచ్చాయి. అడ్‌హక్ కమిటీ నిర్ణయించిన ధర ప్రకారం నవంబర్ నెలకు సంబంధించి రాష్ట్రంలోని రైతులకు టన్ను రూ.19,040 చొప్పున ధర లభిస్తోంది. కాగా తెలంగాణాæ రాష్ట్ర ప్రభుత్వం సీజన్ ప్రారంభంలోనే ఓఈఆర్ను ప్రకటించడంతో టన్ను రూ.19,150 చొప్పున ధర లభిస్తోంది. గడిచిన ఐదేళ్లు మాదిరిగానే 2024–25 సంవత్సరానికి కూడా ఓఈఆర్ ప్రకటించాలని ఆయిల్‌పామ్ రైతులు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఓఈఆర్ ప్రకటనలో జరుగుతున్న జాప్యం రానున్న ఆర్థిక సంవత్సరంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయిల్‌పామ్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఓఈఆర్ ప్రకటిస్తే రైతులకు మరింత మేలుదిగుమతి సుంకం పునరుద్ధరణ, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుదల ప్రభావంతో దేశీయంగా పామాయిల్ సేకరణ ధరలు పెరుగుతున్నాయి. రెండు నెలల క్రితం రూ.13,950 ఉన్న టన్ను గెలల ధర ప్రస్తుతం రూ.19 వేలకు పైగా పలుకుతోంది. మరింత పెరిగే అవకాశం కూడా కన్పిస్తోంది. గతంలో మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం ఓఈఆర్ ప్రకటిస్తే ఆయిల్‌పామ్ రైతులకు మేలు కలుగుతుంది. – కె.క్రాంతికుమార్, ప్రధాన కార్యదర్శి, జాతీయ ఆయిల్‌పామ్ రైతుల సంఘం -
ఆయిల్‌పామ్.. ధర పతనం
ఆయిల్‌పామ్ ధరలు తిరోగమనం బాట పట్టాయి. క్రూడ్ ఆయిల్‌పై కేంద్రం దిగుమతి సుంకం రద్దు చేయడం, ఇతర కారణాలతో ఆయిల్‌పామ్ ధరలు భారీగా పడిపోతున్నాయి. గతేడాదితో పోల్చితే 40 శాతం మేర ధర తగ్గింది. అంతర్జాతీయంగా వచ్చే 30 ఏళ్ల వరకు ఆయిల్‌పామ్‌కు విపరీతంగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతుండగా దానికి విరుద్ధంగా ధరలు పతనమవుతున్నాయి. ఐదేళ్ల నుంచి వరుసగా ధరలు పెరుగుతూ వచ్చి మళ్లీ ఈ ఏడాది రివర్స్‌లో పయనిస్తున్నాయి. ఆయిల్‌పామ్ సాగులో దేశంలోనే ఏలూరు జిల్లా మొదటి స్థానంలో నిలుస్తుంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు: వాణిజ్య పంటల్లో అగ్రగామిగా ఉన్న ఆయిల్‌పామ్ సాగు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అధికంగా ఉంది. దేశంలోనే సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 1.62 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగు జరుగుతుండగా ఒక్క ఏలూరు జిల్లాలోనే 48,968.8 హెక్టార్లలో, పశ్చిమగోదావరి జిల్లాలో 3 వేల హెక్టార్లు సాగులో ఉంది. సుమారుగా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు కలిపి 1.30 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్, కోకో, కొబ్బరి, మిరియాలు, ఇతర సుగంధ ద్రవ్యాలు అంతర పంటగా వేసుకునే వీలు ఆయిల్‌పామ్‌కు ఉండటంతో లక్షా 30 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌తో పాటు అత్యధిక శాతం కోకో అంతర పంటగా ఉంది.ప్రధానంగా గోదావరి పరీవాహక ప్రాంతం కావడంతో గాలిలో 85 శాతం తేమ ఉండటంతో ఆయిల్‌పామ్ సాగుకు జిల్లా పూర్తి అనుకూలంగా ఉంటుంది. ఇసుకతో కూడిన ఎర్రని నేలలు కావడం, కృష్ణా, గోదావరి డెల్టా మధ్య ప్రాంతం కావడంతో గాలిలో తేమ శాతం ఉండటం వాతావరణం పూర్తి అనుకూలంగా ఉండటంతో ఆయిల్‌పామ్ సాగు అత్యధికంగా సాగుతుంది. మార్కెట్ ధరలతో నిమిత్తం లేకుండా దీర్ఘకాలిక పంటగా దీన్ని అత్యధిక శాతం సాగు చేస్తున్నారు. తిరోగమనంలో ధరలుఆయిల్పామ్ ధరలు తిరోగమనంలో కొనసాగుతున్నాయి. 2017లో సగటున రూ.8 వేలు ఉన్న ధర అంతర్జాతీయ పరిణామాలు డిమాండ్ కారణంగా 2022 నాటికి టన్ను ధర అత్యధికంగా రూ.26 వేలకు చేరింది. ఆ తరువాత క్రూడ్ ఆయిల్‌పై దిగుమతి సుంకం రద్దు చేయడంతో ఆయిల్‌పామ్ ధర తిరోగమన బాట పట్టి గతేడాది రూ.23 వేలు సగటున ఉండగా ప్రస్తుతం రూ.13,180కు పరిమితమైంది. రెండేళ్ల క్రితం వరకు కేంద్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్ ఇంపోర్ట్‌పై డ్యూటీ (దిగుమతి సుంకం) విధించింది. ఐదేళ్ల క్రితం వరకు ఇంపోర్ట్ డ్యూటీ 30 శాతం ఉండగా తర్వాత 20 శాతానికి తగ్గించారు.గతేడాది పూర్తిగా రద్దు చేయడంతో దేశంలోని ప్రధాన కంపెనీలు దిగుమతులపై ఆధారపడుతున్నాయి. వాస్తవానికి 10 లక్షల టన్నులు ఏటా డిమాండ్ ఉంటే 2 లక్షల టన్నులు కూడా ఉత్పత్తి లేని పరిస్థితి. ఈ క్రమంలో డిమాండ్ అధికంగా ఉండాలి. అయితే ఇంపోర్ట్ డ్యూటీ పూర్తిగా రద్దు చేయడంతో దిగుమతుల పైనే అత్యధికంగా ఆధారపడటంతో స్థానిక మార్కెట్లో ధరలు పూర్తిగా పతనమయ్యాయి. ఈ ఏడాది మళ్లీ ఇంపోర్టు డ్యూటీ విధించే అవకాశం ఉంది. ఇంపోర్ట్ డ్యూటీ అమలులోకి వస్తే ఆయిల్‌పామ్ ధరలు కొంతైనా పెరిగే అవకాశం ఉంది.ఏలూరు జిల్లాలో భారీగా సాగుఏలూరు జిల్లాలో 14 మండలాల్లో అత్యధికంగా ఆయిల్‌పామ్ సాగు జరుగుతుంది. 2019–20లో 72,860 హెక్టార్లు, 2020–21లో 70,963 హెక్టార్లు, 2022023లో 48,836 హెక్టార్లు, 2023–24లో 48,968.8 హెక్టార్లలో సాగు విస్తీర్ణంలో ఉంది. ప్రధానంగా టి.నర్సాపురం మండలంలో 16190 ఎకరాలు, కామవరపుకోట మండలంలో 16,078 ఎకరాలు, ద్వారకాతిరుమల మండలంలో 17,504 ఎకరాలు, చింతలపూడి మండలంలో 18,304 ఎకరాలు, జంగారెడ్డిగూడెం మండలంలో 8,422 ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. హెక్టారుకు నాలుగేళ్లు కలిపి రూ.71 వేలు సబ్సిడీ రూపంలో ఇవ్వడం, 30 ఏళ్ల పాటు దిగుబడి వచ్చే పంట కావడంతో ఆయిల్‌పామ్ సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఆయిల్‌పామ్‌ను పామాయిల్ పరిశ్రమలు తక్కువ గాను, కాస్మొటిక్స్ ఇతర అనుబంధ పరిశ్రమలకు ఎక్కువగా వినియోగిస్తున్నారు. -
విత్తన కంపెనీల టార్గెట్‌పై విజిలెన్స్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలోని విత్తన కంపెనీలు విత్తనాలను సరఫరా చేయాల్సిందేనని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. విత్తన కంపెనీలకు నిర్దేశించిన లక్ష్యాల సాధనను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. శనివారం మంత్రి చాంబర్లో వ్యవసాయ, సహకార శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విత్తన ప్యాకెట్లు కంపెనీ నుంచి రైతులకు చేరే వరకు నిఘా వ్యవస్థ కట్టుదిట్టంగా పనిచేయాలని సూచించారు.పచ్చిరొట్ట విత్తనాల పంపిణీపై వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హరిత వివరిస్తూ రూ.61.15 కోట్లు విలువగల 1,09,937 క్వింటాళ్ళ విత్తనాలను రైతులకు అందచేశామని వివరించారు. గతేడాది జూన్15 నాటికి 64,34,215 పత్తి ప్యాకెట్లు రైతులకు అందుబాటులో ఉంచగా, ఈసారి 1,02,45,888 ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని, రైతులు ఇప్పటికే 62 లక్షల ప్యాకెట్లు కొనుగోలు చేశారని తెలిపారు. రాష్ట్రంలో 7,97,194 మెట్రిక్ టన్నుల యూరియా, 75,278 మెట్రిక్ టన్నుల డీఏపీ, 4,27,057 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 26,396 మెట్రిక్ టన్నుల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ ఎరువులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు వివరించారు. పంటల నమోదు పారదర్శకంగా ఉండాలి రాష్ట్రంలో పంటల నమోదు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి లోపాలకు తావులేకుండా సజావుగా జరపాలని మంత్రి తుమ్మల సంబంధింత అధికారులను ఆదేశించారు. నిర్దేశిత లక్ష్యాల మేర ఫలితాలు చూపని ఆయిల్ పామ్ కంపెనీలకు నోటీసులు ఇవ్వాలని ఉద్యానవన శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. డ్రిప్, స్ప్రింక్లర్స్ సౌకర్యం కేవలం ఆయిల్ పామ్ పంటలకే కాకుండా ఇతర పంటలకూ వర్తింపజేయాలని సూచించారు. -
ప్రభుత్వ ఆధ్వర్యంలో 5 పామాయిల్ పరిశ్రమలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పామాయిల్ సాగుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని.. ఆయిల్ పామ్ సాగు రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతాంగం ఆయిల్ పామ్ సాగువైపు మొగ్గుచూపేలా అధికార యంత్రాంగం దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం ఆయన సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మూడు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొత్తం 5 ఆయిల్ పామ్ పరిశ్రమలు నెలకొల్పే ఫైలుపై తొలి సంతకం చేశారు. రూ. 1,050 కోట్లతో ఈ పరిశ్రమలను స్థాపించనున్నారు. తర్వాత రాష్ట్రంలోని 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేలా రూ. 4.07 కోట్లతో సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని తీర్చిదిద్దేందుకు అవసరమైన రెండో ఫైలుపై సంతకం చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులకు తరచూ అవగాహన సదస్సులు నిర్వహించేందుకు వీలుగా రైతు వేదికలను తీర్చిదిద్దుతామన్నారు. సహకార వ్యవస్థలో పారదర్శకమైన పాలన అందించేందుకు వివిధ విభాగాలను పూర్తిగా కంప్యూటరీకరణ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా.. మంత్రి మూడో ఫైలుపై సంతకం చేశారు. ఈ సందర్భంగా గద్వాలకు చెందిన పట్టు పరిశ్రమశాఖ అధికారి జగన్నాథ్ కుమారుడు ఆశిష్ కుమార్‌కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం కలి్పస్తూ నియామక పత్రం అందజేశారు. తర్వాత అధికారులతో తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో ఏడాదికి ఒకటి చొప్పున పామాయిల్ పరిశ్రమలను ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నెలకొల్పుతామన్నారు. పామాయిల్ సాగు విస్తరణకు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లుల స్థాపన ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పామాయిల్ ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుతో రైతులకు ఎళ్లవేళలా మార్కెట్ అందుబాటులోకి వస్తుందన్నారు. సంప్రదాయ పంటలతో పోలిస్తే పామాయిల్ సాగుతో రైతులకు ఎకరాకు రూ. లక్ష వరకు ఆదాయం సమకూరుతుందన్నారు. అలాగే అంతరపంటలతో అదనపు ఆదా యం లభిస్తుందన్నారు. ఆయిల్ ఫెడ్ ఏటా 40 వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు పెంచేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తుమ్మల తెలిపారు. -
రైతులకు అధిక ఆదాయాన్ని అందించే పామ్ ఆయిల్
-
వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు
-
ఆయిల్ పామ్ సాగుచేస్తూ మంచి లాభాలు పొందుతున్న రైతులు
-
పామ్ రైతుల కోసం సబ్సిడీ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం
-
ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నర్సరీల్లో పెంపకం
-
రైతులకు అధిక లాభాలు ఇచ్చే ఆయిల్ పామ్
-
పామ్ ఆయిల్ : ప్రతి మొక్కపై రూ.90 వరకు సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం
-
ఈశాన్య రాష్ట్రాలతో గోద్రెజ్ ఆగ్రోవెట్ ఎంవోయూ
న్యూఢిల్లీ: దేశీయంగా ఆయిల్ పామ్ సాగును పెంచేందుకు సంబంధించి ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు గోద్రెజ్ ఆగ్రోవెట్ ఎండీ బలరాం సింగ్ యాదవ్ తెలిపారు. అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాలు వీటిలో ఉన్నట్లు వివరించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విజయవంతంగా ఆయిల్ పామ్ సాగు నిర్వహిస్తున్న తాము ఈశాన్య రాష్ట్రాల్లోనూ దాన్ని పునరావృతం చేయాలని భావిస్తున్నట్లు యాదవ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన మెగా ఆయిల్ ప్లాంటేషన్ డ్రైవ్‌లో భాగంగా ఆయిల్ పామ్ సాగుపై అవగాహన పెంచేందుకు ఉద్దేశించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ఆగస్టు 5 వరకూ ఈ డ్రైవ్ కొనసాగనుంది. ఈ సమావేశంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్, ది సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మొదలైనవి పాల్గొన్నాయి. -
ఆయిల్‌పాం సాగుకు అనుమతి ఎప్పుడో?
సాక్షి, హైదరాబాద్: వచ్చే సీజన్లో (2023–24) రూ. వెయ్యి కోట్లతో 2 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగుకు రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించిన ఉద్యానశాఖ... ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు అతీగతి లేదు. ఈ విషయంలో కేంద్రం నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని ఉద్యాన శాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే కేంద్రం 2 లక్షల ఎకరాలకు ఆమోదం తెలుపుతుందా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 1.78 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం చేయాలని లక్ష్యం నిర్దేశించుకోగా ఇప్పటివరకు అందులో 82 వేల ఎకరాలలోపే సాగైంది. అంటే లక్ష్యంలో సగం కూడా చేరుకోలేని పరిస్థితి నెలకొంది. రైతులకు భరోసా కల్పించడంలో విఫలం... ఆయిల్‌పాం సాగు విస్తీర్ణాన్ని రానున్న కాలంలో ఏకంగా 20 లక్షల ఎకరాలకు తీసుకెళ్లాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ సంస్థ ఆయిల్‌ఫెడ్ పరిధిలోనే ఉన్న ఆయిల్‌పాం సాగును కొత్తగా 10 ప్రైవేటు కంపెనీలకు సైతం అప్పగించింది. 2022–23 వ్యవసాయ సీజన్లో 27 జిల్లాల్లో 1.78 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగును లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 1.40 లక్షల ఎకరాల వరకు మాత్రమే రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో లక్ష ఎకరాలకు చెందిన రైతులు మాత్రమే డ్రిప్ పరికరాలను ఏర్పాటు కోసం వారి వాటా సొమ్ము చెల్లించినట్లు తెలిసింది. డ్రిప్ సౌకర్యం కల్పించకపోవడం వల్ల కొన్నిచోట్ల వేయలేదు. డ్రిప్ సౌకర్యం కల్పించాలంటే రైతులకు ఉద్యానశాఖ సబ్సిడీ కల్పిస్తుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు నూటికి నూరు శాతం, బీసీ రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందజేస్తుంది. కాబట్టి జీఎస్టీతో కలుపుకొని ఒక్కో రైతు దాదాపు రూ. 5–6 వేలు చెల్లించాలి. ఆ మేరకు రైతుల నుంచి డ్రిప్ వాటాను రాబట్టలేకపోతున్నారు. అనేకచోట్ల రైతులు ఆయిల్‌పాం సాగుపై అవగాహన లేకపోవడంతో ముందుకు రావడంలేదని తెలిసింది. ఆ మేరకు భరోసా కల్పించడంలో ఉద్యానశాఖ అధికారులతోపాటు కంపెనీలు కూడా విఫలమవుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పతంజలి పెట్టుబడుల బాట
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం పతంజలి ఫుడ్స్ పెట్టుబడుల బాట పట్టింది. రానున్న ఐదేళ్లలో రూ. 1,500 కోట్లు వెచ్చించనున్నట్లు కంపెనీ సీఈవో సంజీవ్ ఆస్తానా తెలియజేశారు. ప్రధానంగా ఆయిల్ పామ్ బిజినెస్‌ను పెంచుకునేందుకు నిధులను వెచి్చంచనున్నట్లు పేర్కొన్నారు. గతంలో రుచీ సోయాగా కార్యకలాపాలు కొనసాగించిన కంపెనీ రానున్న ఐదేళ్లలో రూ. 50,000 కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు విభిన్న ప్రొడక్టుల విడుదల, పంపిణీని విస్తరించడం తదితర ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇప్పటికే కంపెనీ తగినన్ని పెట్టుబడి వ్యయాలతో సామర్థ్య విస్తరణ చేపట్టినట్లు సంజీవ్ ప్రస్తావించారు. దీంతో తొలినాళ్లలో కంటే చివరి రెండేళ్లలో అధికంగా పెట్టుబడులు వెచి్చంచనున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం కంపెనీ 64,000 హెక్టార్లలో చేస్తున్న సాగు ద్వారా తగిన ప్రతిఫలాన్ని అందుకున్నట్లు వెల్లడించారు. వెరసి ఆయిల్ పామ్ ప్లాంటేషన్ భారీ బిజినెస్‌గా ఆవిర్భవించినట్లు వెల్లడించారు. వంటనూనెల జాతీయ మిషన్‌లో భాగంగా భవిష్యత్‌లో ఐదు లక్షల హెక్టార్ల ప్లాంటేషన్‌కు కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. ఈశాన్య ప్రాంతంలోని అస్సామ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, త్రిపుర, నాగాలాండ్‌లలో వీటిని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. దక్షిణాదిలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో భారీ సాగును నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ బాటలో తెలంగాణ, కర్ణాటకలోనూ పామాయిల్ ప్లాంటేషన్‌కు తెరతీయగా.. ఒడిషా, చత్తీస్‌గఢ్, గుజరాత్ తదితర రాష్ట్రాలలోనూ విస్తరించే ప్రణాళికల్లో ఉన్నట్లు వివరించారు. -
పంటలకు రుణ పరిమితి...'వరి, పత్తికి ఎకరాకు రూ. 45 వేలు'
సాక్షి, హైదరాబాద్: వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, మిర్చి తదితర పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (రుణ పరిమితి) పెరిగింది. కొన్ని కొత్త రకాల పంటలకు కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను ఖరారు చేశారు. రానున్న వ్యవసాయ సీజన్‌కు సంబంధించిన రుణ పరిమితిని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఖరారు చేసింది. రాష్ట్రంలో పండించే దాదాపు 123 రకాల పంటలకు 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఎంతెంత రుణాలు ఇవ్వాలన్న దానిపై టెస్కాబ్ భారీ కసరత్తు చేసింది. సాగు ఖర్చు, ఉత్పాదకత, నీటి వసతి ఆధారంగా రుణ నిర్ధారణ చేసింది. సంబంధిత రుణ పరిమితి నివేదికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ)కి పంపించింది. తాము ఖరారు చేసినట్లుగా రైతులకు పంట రుణాలు ఇవ్వాలని సూచించింది. రాష్ట్రంలో అత్యధికంగా సాగు చేసే పత్తి, వరి పంటలకు ఎకరానికి రూ.45 వేలు ఖరారు చేసింది. సాగునీటి ప్రాజెక్టులు ఉన్నచోట వరికి 2022–23లో రూ.36 వేల నుంచి రూ.40 వేల పంట రుణాలను ఇవ్వగా ఈసారి రూ. 42 వేల నుంచి రూ. 45 వేలకు పెంచింది. అలాగే శ్రీ పద్ధతిలో సాగు చేసే వరికి రూ. 36 వేల నుంచి రూ. 38 వేలుగా ఖరారు చేసింది. ఇక వరి విత్తనోత్పత్తికి కూడా రూ.5 వేలు అదనంగా పెంచింది. 2022–23లో రూ. 45 వేలుండగా, ఇప్పుడు రూ. 50 వేలుగా ఖరారు చేసింది. ఇక పత్తికి గతేడాది రుణ పరిమితి రూ. 38 వేల నుంచి రూ. 40 వేలు ఉండగా, ఇప్పుడు దాన్ని రూ. 42 వేల నుంచి రూ. 45 వేల వరకు పెంచింది. ఆయిల్‌పాంకు ఎకరానికి రూ. 42 వేల రుణం... ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గతేడాది మాదిరిగానే ఆయిల్‌పాం పంటలు సాగు చేసే రైతులకు రుణ పరిమితి ఖరారు చేసింది. ఎకరానికి రూ. 40 వేల నుంచి రూ. 42 వేల వరకు రుణ పరిమితి ఉండగా, ఈసారి కూడా అంతే ఖరారు చేసింది. ఇక కీలకమైన మిర్చికి రూ. 75 వేల నుంచి రూ. 80 వేల వరకు పెంచింది. సాగునీటి వసతి ఉన్నచోట మినుము పంటకు ఎకరాకు రూ. 18–21 వేలు, సాగునీటి వసతి లేని చోట రూ. 15–17 వేలు ఖరారు చేశారు. సేంద్రీయ పద్ధతిలో పండించే మినుముకు రూ. 18–21 వేలు ఖరారు చేశారు. శనగకు రూ. 24 నుంచి రూ. 26 వేలు చేశారు. సాగునీటి వసతి కలిగిన ఏరియాలో మొక్కజొన్నకు రూ. 30–34 వేలుగా, నీటి వసతి లేనిచోట రూ. 26–28 వేలు ఖరారైంది. కందికి సాగునీటి వసతి ప్రాంతాల్లో రూ. 21–24 వేలు, సాగునీటి వసతి లేని ప్రాంతాల్లో రూ. 18–21 వేలు ఖరారు చేశారు. సోయాబీన్‌కు రూ. 26 వేల నుంచి రూ. 28 వేలు ఇస్తారు. సోయా విత్తనోత్పత్తి రైతులకు రూ. 34 వేల నుంచి రూ. 36 వేల వరకు ఇస్తారు. ఉల్లి సాగుకు రూ.45 వేలు ఉల్లిగడ్డ సాగుకు గతంలో ఎకరానికి రూ.37 వేల నుంచి రూ.42 వేలు ఇవ్వగా, ఇప్పుడు రూ. 40 వేల నుంచి రూ. 45 వేలకు పెంచారు. పట్టుకు రూ. 35 వేల నుంచి రూ. 40 వేలుగా ఖరారు చేశారు. ఇక పత్తి విత్తనాన్ని సాగు చేసే రైతులకు గణనీయంగా పెంచారు. గతంలో రూ. 1.10 లక్షల నుంచి రూ.1.40 లక్షల వరకు ఉండగా, ఇప్పుడు రూ. 1.30 లక్షల నుంచి రూ. లక్షన్నరకు ఖరారు చేశారు. పసుపు సాగుకు రూ. 80 వేల నుంచి రూ. 85 వేల వరకు ఇస్తారు. టస్సర్ కల్చర్ (ఒకరకమైన పట్టు) సాగుకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు ఇస్తారు. -
సిరులు కురిపిస్తున్న ఆయిల్‌పామ్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలో ఆయిల్‌పామ్ రైతు పంట పండుతున్నది. గతేడాది కంటే ఈ ఏడాది ధర తగ్గినప్పటికీ సాగు విస్తీర్ణం మాత్రం ఏలూరు జిల్లాలో గణనీయంగా పెరుగుతున్నది. రాష్ట్రంలో పామాయిల్ సాగు తొమ్మిది జిల్లాల్లో ఉండగా.. అందులో మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలోని సాగు విస్తీర్ణం మొత్తంతో పోలి్చతే జిల్లాలోనే సుమారు 50 శాతం ఉండటం విశేషం. గడిచిన నాలుగేళ్లలో ఏటా సగటున నాలుగు వేల ఎకరాల చొప్పున పామాయిల్ సాగు పెరుగుతూ వస్తున్నది. ప్రభుత్వ ప్రోత్సాహం.. ఉమ్మడి పశి్చమలో 1988లో ఆయిల్‌పామ్ సాగు జిల్లాకు పరిచయమైంది. 1992లో టీఎంఓపీ పథకం ద్వారా దీన్ని ప్రారంభించి పెదవేగి ఆయిల్‌ఫెడ్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో 1996 నుంచి జిల్లాలో సాగు విస్తీర్ణం పెరగడం ప్రారంభమైంది. అధిక ఆదాయంతో పాటు అంతర పంటలకు అవకాశం ఉన్న ఆయిల్‌పామ్‌ను ప్రభుత్వం ప్రోత్సహించడంతో మెట్ట ప్రాంతంలో రైతులు ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి చూపారు. ఆయిల్‌పామ్ కంపెనీల ద్వారా మొక్కలను సబ్సిడీపై రైతులకు అందించి హెక్టారుకు రూ.5,250 చొప్పున మొదటి నాలుగేళ్ల పాటు నిర్వహణ ఖర్చుల పేరుతో రైతుకు జమ చేస్తున్నారు. జిల్లాలోని 22 మండలాల్లో 2,16,192 ఎకరాల్లో ఈ ఏడాది ఆయిల్‌పామ్ సాగవుతోంది. పామాయిల్ మొక్క ఇవ్వడం మొదలుకుని దిగుమతి వచ్చేవరకు అన్నీ ఆయిల్‌పామ్ కంపెనీలు చూస్తుండడం, సాగుకు సబ్సిడీలు ఉండడం, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండడంతో మెట్ట ప్రాంతంలో ప్రధాన పంటగా మారిపోయింది. ప్రతి ఏటా ముడిచమురు, పామాయిల్ ధరలను ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం, ఆయిల్‌ఫెడ్ కంపెనీలు కలిసి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో (ఓఈఆర్) ప్రకారం ధర నిర్ణయిస్తాయి. గతేడాది అంతర్జాతీయంగా పామాయిల్‌కు విపరీతమైన డిమాండ్ ఉండడంతో రికార్డు స్థాయిలో టన్ను ధర రూ.23 వేలకు చేరింది. ఆయిల్‌పామ్ చరిత్రలో ఇదే అత్యధిక ధర. ఈ ఏడాది అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో ప్రస్తుతం టన్ను రూ.13,400గా ఉంది. మార్కెట్ ధరలతో నిమిత్తం లేకుండా సాగు జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రధానంగా ఎకరాకు 10 టన్నుల దిగుబడి రావడం, ఐదో సంవత్సరం నుంచే దిగుబడి వస్తుండటంతో సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఐదో ఏడాది నుంచి దిగుబడి ప్రారంభమై ప్రతి మొక్క 30 ఏళ్ల వరకు దిగుబడి ఇస్తుంది. నీటి వనరులు మినహా ఎలాంటి నిర్వహణ ఖర్చులూ ఉండకపోవడంతో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. జిల్లాలో 2.16 లక్షల ఎకరాల్లో... ఉమ్మడి పశి్చమగోదావరి జిల్లాలో 2,16,190 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగులో ఉంది. జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు అనుకూలంగా ఉందని, 3.12 లక్షల ఎకరాలు పామాయిల్ సాగుకు అనుకూలమైన ప్రాంతంగా ఉందని ఉద్యాన శాఖాధికారులు నిర్ధారించారు. దీనిలో 2.16 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉంది. కామవరపుకోట, చింతలపూడి, టి.నర్సాపురం, ద్వారకాతిరుమల మండలాల్లో ఇది అధికం. జిల్లాలో నవభారత్ ఆగ్రో, 3 గోద్రేజ్ ఆర్గో వెట్ కంపెనీలు, ఏపీ ఆయిల్‌ఫెడ్, పతంజలి ఫుడ్స్, ఫుడ్స్ అండ్ ప్యాడ్స్ తదితర కంపెనీల ద్వారా మొక్క సరఫరా నుంచి కొనుగోలు వరకు కొనసాగుతోంది. ప్రతి కంపెనీకి కొన్ని మండలాలు కేటాయించి, వాటి పరిధిలో మొక్క సరఫరా నుంచి కొనుగోలు వరకు ఉద్యానవన శాఖ పర్యవేక్షణలో కంపెనీయే నిర్వహించేలా చూస్తున్నారు. ఉద్యానవన శాఖ ద్వారా ప్రోత్సాహం ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తోంది. జిల్లాలో సాగు విస్తీర్ణం పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. సాగుకు సంబంధించి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి, ఇతర సాంకేతిక పరమైన పరిష్కారాల కోసం ఆయిల్‌ఫెడ్ పరిశోధనా స్థానం కూడా ఉంది. సాగులో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. – ఎ.దుర్గేష్, ఇన్చార్జి డీడీ -
రుణమాఫీపై నీలినీడలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతు రుణమాఫీపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత ఎన్నికల సందర్భంగా లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తామన్న సర్కారు ఇందుకు రూ. 19,198 కోట్లు లెక్కగట్టగా ఇప్పటివరకు రూ. 37 వేలలోపు రుణాలున్న రైతులకు రూ. 1,207 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇంకా రూ. 17,991 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం ఈ ఏడాదితో ముగుస్తుంది. కానీ రుణమాఫీకి ప్రభుత్వం 2023–24 బడ్జెట్లో రూ. 6,380 కోట్లే కేటాయించింది. అంటే అవసరమైన సొమ్ములో దాదాపు మూడో వంతు కేటాయించారు. మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ. 19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 5.66 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేయగా మరో 31 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత కేటాయింపుతో ఎంతమంది రైతులు లబ్ధిపొందుతారన్నది స్పష్టం కావాల్సి ఉంది. పంటనష్ట పరిహారానికి ఈ‘సారీ’... రాష్ట్రంలో కొత్తగా పంటల బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించినా ఈ బడ్జెట్లో దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. వాస్తవంగా నెల కిందట దీనికి సంబంధించి వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో ప్రభుత్వం సమావేశం నిర్వహించింది. రాష్ట్రంలో కొత్తగా బెంగాల్ తరహా పంటల బీమా పథకాన్ని ప్రారంభించి రైతులను ఆదుకోవాలని నిర్ణయించింది. కానీ చివరకు బడ్జెట్లో రైతులకు నిరాశ కలిగించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి 2020లో వైదొలిగాక రాష్ట్రంలో ఎలాంటి పంటల బీమా పథకం అమలు కావడంలేదు. దీంతో పంట నష్టం జరిగినా రైతులకు పరిహారం అందని పరిస్థితి నెలకొంది. మూడు పథకాలకే సింహభాగం కేటాయింపులు.. 2022–23 బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ. 24,254 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి బడ్జెట్లో రూ. 26,831 కోట్లు కేటాయించింది. అంటే గత బడ్జెట్‌కన్నా సుమారు రూ. 2,500 కోట్ల మేర కేటాయింపులు పెంచింది. అయితే ఈసారి మొత్తం కేటాయింపుల్లో రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ పథకాలకే సింహభాగం కేటాయించింది. రైతుబంధుకు 2022–23లో రూ. 14,800 కోట్లు కేటాయిస్తే 2023–24 బడ్జెట్లో రూ. 15,075 కోట్లు కేటాయించింది. రైతు బీమాకు 2022–23లో రూ. 1,466 కోట్లు కేటాయింపులు చేయగా ఈసారి బడ్జెట్లో రూ. 1,589 కోట్ల మేర కేటాయింపులు చేసింది. రైతు రుణమాఫీకి 2022–23 బడ్జెట్లో రూ. 4 వేల కోట్లు కేటాయించి విడుదల చేయని ప్రభుత్వం ఈసారి రూ. 6,380 కోట్లు కేటాయించింది. ఈసారి మొత్తం వ్యవసాయ బడ్జెట్లో ఈ మూడు పథకాలకే రూ. 23,049 కోట్లు కేటాయించింది. వ్యవసాయ విస్తరణ, అభివృద్ధికి కేటాయించింది తక్కువేనన్న విమర్శలున్నాయి. ప్రగతి పద్దులో వ్యవసాయ కేటాయింపులు ►వ్యవసాయ యాంత్రీకరణకు ప్రగతి పద్దులో రూ. 377.35 కోట్లు కేటాయించారు. ►రైతులకు విత్తనాల సరఫరా కోసం రూ. 39.25 కోట్లు ►ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ. 75 కోట్లు ►కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ. 17.50 కోట్లు ►రైతుబంధు సమితికి రూ. 3 కోట్లు ►రైతువేదికలకు రూ. 12 కోట్లు ►మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్‌కు రూ. 75.47 కోట్లు ►వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలకు రూ. 1.99 కోట్లు ►విత్తనాభివృద్ధి సంస్థకు సాయం రూ. 25 కోట్లు ►మైక్రో ఇరిగేషన్‌కు కేవలం రూ. 1.25 కోట్లు ►ఉద్యాన కార్యకలాపాలకు ప్రోత్సాహం రూ. 7.50 కోట్లు ►ప్రభుత్వ ఉద్యానవనాల అభివృద్ధికి రూ. 3.50 కోట్లు రుణమాఫీ కోసం 31 లక్షల మంది ఎదురుచూపు ►ఊసేలేని పంటల బీమా పథకం.. రైతులకు తప్పని నిరాశ ►అత్యధికంగా రైతుబంధుకు రూ.15,075 కోట్లు కేటాయింపు ఆయిల్‌పామ్ సాగుకు రూ. వెయ్యి కోట్లు... రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఆయిల్‌పామ్ సాగుపై ప్రత్యేక దృష్టిపెట్టింది. నీటివనరులు పుష్కలంగా ఉండటంతో వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. రానున్న కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది దాదాపు 2 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు కేటాయించింది. ఇది ప్రజల బడ్జెట్ వ్యవసాయ రంగానికి రూ. 26,831 కోట్లు కేటాయించడంపై వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజల బడ్జెట్ అని, తమది రైతు ప్రభుత్వమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ సాగునీటి రంగానికి రూ. 26,885 కోట్లు కేటాయించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఆయిల్‌పామ్ సాగుకు రూ.వెయ్యి కోట్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. 2014 నుంచి ఇప్పటివరకు వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 1,91,612 కోట్లు ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. సీఎంకేసీఆర్ రైతు, వ్యవసాయ అనుకూల విధానాలు దేశానికి ఆదర్శమన్నారు. – వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి కేటాయింపే..ఖర్చేది? వ్యవసాయరంగ మొత్తం కేటాయింపుల్లో రైతుబంధుకు, రైతుబీమా పథకాలకు తప్ప మిగిలిన వాటికి కేటాయించిన నిధులను ఎక్కువగా ఖర్చు చేయడం లేదని రైతు స్వరాజ్య వేదిక నాయకులు కన్నెగంటి రవి, విస్సా కిరణ్‌కుమార్ ఆరోపించారు. రైతు బంధుకు భారీగా నిధులు కేటాయిస్తున్నప్పటికీ ఆ నిధులలో కనీసం 40 శాతం నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్నారు. ముఖ్యంగా ఈ నిధులు వ్యవసాయం చేయని రైతులకు, వ్యవసాయం చేయని భూములకు కూడా పంపిణీ చేస్తున్నారన్నారు. రాష్ట్ర సాగుదారుల్లో 35 శాతంగా ఉన్న కౌలు రైతులకుగానీ, పోడు రైతులకుగానీ, భూమిపై హక్కులులేని మహిళా రైతులకుగానీ ఒక్క రూపాయి కూడా రైతుబంధు సాయం అందడం లేదన్నారు. – రైతు స్వరాజ్య వేదిక -
అయిదేళ్లలో మరో 60వేల హెక్టార్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అగ్రి–బిజినెస్ సంస్థ గోద్రెజ్ ఆగ్రోవెట్ దేశవ్యాప్తంగాను, తెలుగు రాష్ట్రాల్లోను ఆయిల్ పామ్ ప్లాంటేషన్ సామర్థ్యాలను మరింతగా విస్తరిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం సుమారు 4,000 హెక్టార్లగా ఉన్న విస్తీర్ణాన్ని వచ్చే మూడేళ్లలో 20,000 హెక్టార్లకు పెంచుకోవాలని నిర్దేశించుకుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 41,000 హెక్టార్లు ఉండగా మరో 10–15 వేల హెక్టార్లను జోడించుకోనుంది. మొత్తం మీద దేశవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో మరో 60,000 హెక్టార్లు జోడించుకోవాలని నిర్దేశించుకున్నట్లు గోద్రెజ్ ఆయిల్ పామ్ వ్యాపార విభాగం సీఈవో సౌగత నియోగి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ప్రస్తుతం ఆగ్రోవెట్ కింద 65,000 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగవుతోంది. 350 టన్నులకు క్రషింగ్ సామర్థ్యం.. తాజా విస్తరణతో తమ క్రషింగ్ సామర్థ్యం ప్రస్తుతం గంటకు 205 టన్నుల నుంచి 350 టన్నులకు పెరగనున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం 2030 నాటికి సుమారు రూ. 600 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా తమకు 6 ప్లాంట్లు ఉండగా వాటిలో మూడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్లు చెప్పారు. ఏపీలోని ప్లాంట్ల సామర్థ్యం గంటకు 190 టన్నులుగా ఉంది. రైతులకు అవసరమైన సేవలు అందించేందుకు 2027 నాటికి కొత్తగా 50 సమాధాన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని నియోగి చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో ఒక సెంటర్ ఉండగా 2027 నాటికి ఈ సంఖ్యను 10కి పెంచుకోనున్నట్లు, ఏపీలో మూడు ఉండగా ఈ మార్చి నాటికి మరో రెండు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. 2022–23లో సుమారు రూ. 1,300 కోట్లుగా ఉన్న తమ టర్నోవరు తదుపరి ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు నియోగి తెలిపారు. కేంద్ర పథకంతో ప్రోత్సాహం.. దేశీయంగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు 2021లో కేంద్రం రూ. 11,080 కోట్లతో నేషన ల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్–ఆయిల్ పామ్ (ఎన్ఎంఈవో–ఓపీ) పేరుతో ప్యాకేజీ ప్రకటించింది. దీనితో ప్రాథమికంగా రైతుకు సబ్సిడీలు, మద్దతు ధర తరహా వ్యవస్థ రూపంలో లబ్ధి చేకూరుతుందని నియోగి చెప్పారు. కొత్త పాలసీతో పామ్ ప్లాంటేషన్‌ను వచ్చే 5–6 ఏళ్లలో ప్రస్తుతమున్న దాదాపు 3 లక్షల హెక్టార్ల నుంచి 10 లక్షల హెక్టార్లకు పెంచాలని కేంద్రం నిర్దేశించుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం దేశీయంగా 80 లక్షల టన్నుల పామాయిల్ వినియోగం ఉంటుండగా దేశీయంగా 4 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తవుతోందని, 76 లక్షల టన్నులు దిగుమతి చేసుకోవాల్సి ఉంటోందని ఆయన చెప్పారు. ఈ స్కీముతో 2030 నాటికి ఉత్ప త్తి 30 లక్షల టన్నులకు చేరుకోగలదని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అప్పటికి పెరిగే డి మాండ్లో 30 శాతానికి సరిపడే మొత్తాన్ని దేశీయంగా ఉత్పత్తి చేసుకోగలమని పేర్కొన్నారు. ప్రస్తుతం తలసరి వినియో గం ఏటా 18 కిలోలుగా ఉండగా 2030 నాటికి ఇది 24–25 కిలోల స్థాయికి చేరవచ్చని అంచనాలు ఉన్నాయని నియోగి వివరించారు. -
52 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటాం
సాక్షి, హైదరాబాద్: కేవలం ఒక్క ఏడాదిలోనే 52 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటి రికార్డు సృష్టించామని, మొక్కలు నాటేందుకు తగిన నిధులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. అదే విధంగా కంపెనీలు గ్రామాల వారీగా అవగాహన సమావేశాలు నిర్వహించాలని, రైతు వేదికలలో శిక్షణ ఇప్పించాలని, ఆయిల్ పామ్ మీద ఆదాయం వచ్చే వరకు రైతులు అంతర పంటలు వేసుకునేందుకు వారికి అవగాహన, ఇతర సహకారం కల్పించాలని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగుపై శనివారం రెడ్‌హిల్స్ ఉద్యాన శిక్షణ కేంద్రంలో మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 ఆయిల్ పామ్ కంపెనీల ద్వారా 1,502 ఎకరాల్లో 38 ఆయిల్ పామ్ మొక్కల నర్సరీలు ఏర్పాటు చేశామని తెలిపారు. వచ్చే మూడు నెలల్లో మరో 70 వేల ఎకరాల్లో మొక్కలు నాటడం పూర్తి కావాలని ఆదేశించారు. 2023– 24 లో నాటేందుకు అందుబాటులో కోటి ఆయిల్ పామ్ మొక్కలు ఉన్నాయని, ఇవి మరో 1.50 లక్షల ఎకరాలకు సరిపోతాయని స్పష్టం చేశారు. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుకు ఆయిల్ ఫెడ్ ద్వారా 458 ఎకరాల భూమి సేకరణ జరిగిందని, నిర్మల్, వనపర్తి, మంచిర్యాలలలో ఈ మిల్లుల ఏర్పాటుకు ప్రీ యూనిక్, మ్యాట్రిక్స్ కంపెనీలకు టీఎస్ఐఐసీ ద్వారా భూమి కేటాయింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బొప్పాస్పల్లి విత్తన క్షేత్రంలో ఆయిల్ పామ్ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. నల్లగొండ జిల్లా డిండి వ్యవసాయ క్షేత్రం, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం మాల్ తుమ్మెద విత్తన క్షేత్రంలో ఆయిల్ పామ్ మొక్కల కేంద్రాల ఏర్పాటుపై పరిశీలనకు అధికారులను ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఉద్యాన శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఆయిల్ ఫెడ్ ఎండీ సురేందర్, జేడీ సరోజిని, ఉద్యాన శాఖ అధికారులు, ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకూ ఆయిల్‌పామ్ విస్తరణ
సాక్షి, అమరావతి: నీటి సౌకర్యం గల ప్రతి ప్రాంతంలోనూ ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఉభయ గోదావరి, ఏలూరు, కోనసీమ, కాకినాడ, కృష్ణా జిల్లాలకే పరిమితమైన ఆయిల్‌పామ్ సాగును ఇకపై ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ పరిధిలోని అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోనూ విస్తరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 17 జిల్లాల పరిధిలో 236 మండలాల్లో ఆయిల్‌పామ్ సాగవుతుండగా.. తాజాగా మరో 117 మండలాలను నోటిఫై చేశారు. ఆయిల్‌పామ్ సాగులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 9 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలు ఉండగా.. ఏపీలో 4.81 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. తాజాగా నోటిఫై చేసిన 117 మండలాల్లో ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మండలాల పరిధిలో రానున్న నాలుగేళ్లలో రూ.617.50 కోట్లను రైతులకు ప్రోత్సాహకాల రూపంలో అందజేస్తారు. ఆయిల్‌పామ్ మొక్కల కొనుగోలు, అంతర పంటల సాగు, నిర్వహణ, యాంత్రీకరణ కోసం ఈ నిధులను వినియోగిస్తామని వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ వై.మధుసూదనరెడ్డి వెల్లడించారు. -
తెలంగాణ రాష్ట్ర రుణ లక్ష్యం రూ. 1.85 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 1.85 లక్షల కోట్ల రుణ లక్ష్యాన్ని నాబార్డు ప్రకటించింది. ఈ మేరకు 2023–24కు సంబంధించిన ఫోకస్ పేపర్‌ను గురువారం విడుదల చేసింది. మొత్తం ప్రాధాన్యత రంగాల్లో రూ. 1,85,327 కోట్ల రుణ లక్ష్యం కాగా అందులో వ్యవసాయ, అనుబంధ రంగాల రుణ లక్ష్యం రూ. 1,12,762 కోట్లుగా లెక్కగట్టింది. వ్యవసాయ రుణాల్లో కీలకమైన పంట రుణాలకు రూ. 73,436 కోట్లు ఇవ్వాలని బ్యాంకర్లకు నాబార్డు సూచించింది. రుణ లక్ష్య ఫోకస్ పేపర్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ విడుదల చేశారు. 2022–23 రాష్ట్ర రుణ లక్ష్యం రూ. 1,66,257 కోట్లు కాగా, అందులో వ్యవసాయ, అనుబంధాల రుణ లక్ష్యం రూ. 1.01 లక్షల కోట్లు. ప్రస్తుత ఏడాది కంటే వచ్చే ఏడాదికి రాష్ట్ర రుణ ప్రణాళిక రూ. 19,070 కోట్లు ఎక్కువగా ఉంది. సాగులో దేశానికే రోల్‌మోడల్ తెలంగాణ: మంత్రి హరీశ్ రైతు సంక్షేమ పథకాలతో తెలంగాణ వ్యవసాయ రంగం దేశానికి రోల్ మోడల్‌గా మారిందని, దేశం యావత్తూ రాష్ట్రం వైపు చూస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. నాబార్డు వార్షిక రుణ ప్రణాళిక విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను కేంద్ర ప్రభుత్వం ఇతర పేర్లతో దేశవ్యాప్తంగా అమలు చేస్తోందని చెప్పారు. మిషన్ కాకతీయ పథకాన్ని అమృత్ సరోవర్ పేరుతో, రైతుబంధు పథకాన్ని పీఎం కిసాన్ పేరుతో అమలు చేస్తోందని గుర్తుచేశారు. ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో సాగుభూమి, పంటల దిగుబడి భారీగా పెరిగిందన్నారు. రాష్ట్ర జీఎస్డీపీలో వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా 19 శాతంగా ఉందన్నారు. అదే దేశ జీడీపీలో వ్యవసాయరంగ వాటా కేవలం 3.5 శాతమేనని చెప్పారు. తెలంగాణలో వ్యవసాయ, అనుబంధ రంగాల వృద్ధిరేటు 10 శాతంగా నమోదైతే దేశంలో కేవలం 3 శాతంగానే ఉందని వివరించారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 1.34 కోట్ల ఎకరాల నుంచి 2.03 కోట్ల ఎకరాలకు పెరిగిందని, ధాన్యం దిగుబడి 68 లక్షల టన్నుల నుంచి 2.49 కోట్ల టన్నులకు పెరిగిందన్నారు. దేశంలో వ్యవసాయ రంగానికి మరే రాష్ట్రం ఖర్చు చేయని విధంగా తెలంగాణ భారీగా నిధులను వెచ్చించిందన్నారు. ఆయిల్‌పాం సాగుకు చేయుత ఇవ్వాలి... నాబార్డు మూడు అంశాలపై దృష్టిపెట్టి అధిక రుణాలు ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని సాగు చేస్తోందని, ఈ పంట సాగు చేసే రైతులను ప్రోత్సహించేందుకు విరివిగా రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వరిసాగులో నాట్లకు యాంత్రీకరణను ప్రోత్సహించి యంత్రాలు అందించాలన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇవ్వాలని నాబార్డును కోరారు. సంగమేశ్వర–బసవేశ్వర ప్రాజెక్టుకు రుణ ప్రతిపాదన కూడా పెట్టామని, దీనికి త్వరగా అనుమతి ఇవ్వా లని నాబార్డు సీజీఎం సుశీల చింతలను కోరారు. తలసరి ఆదాయం రూ. 2.75 లక్షలు: సీఎస్ రాష్ట్ర తలసరి ఆదాయం ప్రస్తుతం రూ. 2.75 లక్షలుగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు సమయానికి ఇప్పటికీ ఇది రెట్టింపు అయిందన్నారు. జీఎస్డీపీ దేశంలోకెల్లా అత్యధికంగా రాష్ట్రంలోనే ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు రామకృష్ణారావు, రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
పామాయిల్ సాగుకు 4.36 లక్షల హెక్టార్లు అనుకూలం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పామాయిల్ సాగును ప్రోత్సహించేందుకు కేంద్రప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా 27.99 లక్షల హెక్టార్ల భూమి పామాయిల్ సాగుకు యోగ్యంగా ఉండగా, అందులో 4.36 లక్షల హెక్టార్లు తెలంగాణలో ఉన్నాయని పేర్కొన్నారు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్– ఆయిల్‌పామ్ కింద పామాయిల్ సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల, కామారెడ్డి, ఖమ్మం, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నల్లగొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి వంటి జిల్లాలో ఈ భూమి విస్తరించి ఉందని, పామాయిల్ సాగు తెలంగాణ రైతులకు పెద్దఎత్తున లబ్ధిని చేకూరుస్తుందని వెల్లడించారు. పామాయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశంలో 2019–20 నాటికి 3.5 లక్షల హెక్టార్లలో ఉన్న పామాయిల్ సాగును 2025–26 నాటికి 10 లక్షల హెక్టార్లకు పెంచాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈశాన్య రాష్ట్రాలలో 3.28 లక్షల హెక్టార్ల భూమిని, మిగిలిన రాష్ట్రాలన్నీ కలిపి 3.22 లక్షల హెక్టార్ల భూమిని పామాయిల్ సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు చెప్పారు. ఈ పథకం అంచనా వ్యయం రూ. 11,040 కోట్లు కాగా, అందులో ఈశాన్య రాష్ట్రాలకు 90:10 ప్రాతిపదికన, మిగిలిన రాష్ట్రాలకు 60:40 ప్రాతిపదికన భారత ప్రభుత్వం రూ. 8,844 కోట్లు ఖర్చు చేయనుందని వివరించారు. మొత్తం వ్యయంలో రూ. 5,170 కోట్లను తెలంగాణ వంటి జనరల్ కేటగిరీ రాష్ట్రాలకు కేటాయించగా అందులో భారత ప్రభుత్వం చెల్లించవలసిన వాటా రూ.3,560 కోట్లుగా ఉందని తెలిపారు. ఎస్సీ 17, ఎస్టీలకు 8 శాతం చొప్పున లబ్ధి రైతులకు లబ్ధి చేకూర్చటమే ప్రధాన ఉద్దేశంగా నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్– ఆయిల్‌పామ్ మార్గదర్శకాలను రూపొందించారు. ఈ పథకం కింద వనరులన్నింటినీ 17 శాతం ఎస్సీలకు, 8 శాతం ఎస్టీలకు లబ్ధి చేకూర్చటానికి కేటాయించారు. జనాభా ప్రాతిపదికన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ/ఎస్టీలకు కేటాయింపులు చేయటానికి వీలు కల్పించారు. -
అధికారుల అలసత్వం.. విదేశాల నుంచి తెచ్చి.. వృథాగా వేసి..
సాక్షి, హైదరాబాద్: ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఆయిల్‌పామ్‌ను 20 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఆయిల్ ఫెడ్ పరిధిలో ఉన్న ఆయిల్‌పాం సాగు బాధ్యతను కొత్తగా ప్రైవేట్ కంపెనీలకు అప్పగించింది. రాష్ట్రంలో 10 ప్రైవేట్ కంపెనీలకు వివిధ జిల్లాల్లో ఆయిల్‌పాం సాగుకు అవసరమైన ఏర్పాట్లు చేసే బాధ్యత అప్పగించింది. 2022–23 వ్యవసాయ సీజన్లో 1.78 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ణయించింది. కానీ ఆయిల్‌పామ్ విత్తనాలు సిద్ధంగా ఉన్నా, సాగుకు రైతులను ప్రోత్సహించడంలో ఉద్యానశాఖ విఫలమైందన్న ఆరోపణలున్నాయి. దీంతో రూ.కోట్లు పోసి విదేశాల నుంచి కొనుగోలు చేసిన లక్షలాది మొక్కలు నర్సరీల్లో వృథాగా పడివున్నాయి. మొలక విత్తనాలను మలేషియా, కోస్టారికా, ఇండోనేషియా, థాయ్‌లాండ్ తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. అవి నిర్ణీత కాలం వరకే ఉంటాయి. అప్పటివరకు వాటి నిర్వహణ ఖర్చుతో కూడిన వ్యవహారం. భూమి అందుబాటులోకి రాకపోవడంతో నర్సరీలు నిర్వహిస్తున్న కంపెనీలు తమకు నష్టం వస్తుందంటూ గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పటివరకు 45 వేల ఎకరాల్లోనే సాగు 2022–23 సంవత్సరంలో 27 జిల్లాల్లో 1.78 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగును లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 1.08 లక్షల ఎకరాల వరకు మాత్రమే రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో 45,172 ఎకరాల్లో మాత్రమే డ్రిప్ సౌకర్యం కల్పించి ఆయిల్‌పామ్ మొలక విత్తనాలు వేశారు. అంటే ఇంకా 1.33 లక్షల ఎకరాల్లో మొలక విత్తనాలు వేయాల్సి ఉంది. జగిత్యాల జిల్లాలోనైతే 9 వేల ఎకరాలు లక్ష్యం కాగా, ఒక్క ఎకరాలో కూడా ఆయిల్‌పామ్ సాగు కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కరీంనగర్ జిల్లాలో 10 వేల ఎకరాలు లక్ష్యం కాగా, 43 ఎకరాల్లోనే విత్తనాలు వేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 16,862 ఎకరాలు లక్ష్యం కాగా, 9,062 ఎకరాల్లో విత్తనాలు వేశారు. ప్రస్తుతం ఆయిల్‌ఫెడ్ సహా వివిధ కంపెనీల వద్ద లక్ష ఎకరాలకు సరిపడా ఆయిల్‌పామ్ మొలక విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. ఎకరానికి 57 మొలక విత్తనాల చొప్పున 57 లక్షల విత్తనాలు ఆయా నర్సరీల్లో వృథాగా ఉన్నాయి. భూమిని గుర్తించడంలో వైఫల్యం ఉద్యానశాఖ సాగు కోసం ఇంకా 70 వేల ఎకరాలను గుర్తించాల్సి ఉంది. అదీగాక గుర్తించిన 1.08 లక్షల ఎకరాలకుగాను 50వేల ఎకరాలకుపైగా భూములకు డ్రిప్ సౌకర్యం కల్పించలేదు. డ్రిప్ సౌకర్యం కల్పించాలంటే రైతులకు ఉద్యానశాఖ సబ్సిడీ ఇస్తుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు నూటికి నూరు శాతం, బీసీ రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందజేస్తుంది. కాబట్టి జీఎస్టీతో కలుపుకొని ఒక్కో రైతు ఐదారు వేల రూపాయలు చెల్లించాలి. ఆ మేరకు రైతుల నుంచి డ్రిప్ వాటాను రాబట్టడంలో ఉద్యానశాఖ వైఫల్యం కనిపిస్తోంది. మరో 70 వేల ఎకరాలను గుర్తించడంలోనూ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. జిల్లాకు ముగ్గురు నలుగురు చొప్పున మాత్రమే ఉద్యానశాఖ అధికారులుంటారు. వారు భూమిని గుర్తించడంలో విఫలమవుతున్నారన్న విమర్శలున్నాయి. ఈ బాధ్యత వ్యవసాయశాఖలోని ఏఈవోలకు పూర్తిస్థాయిలో అప్పగిస్తే వేగంగా లక్ష్యం నెరవేరేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ఆయిల్‌పామ్ సాగులో ఏపీ నంబర్–1
సాక్షి, అమరావతి: ఆయిల్‌పామ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే లీడర్ ఆఫ్ ది స్టేట్‌గా నిలిచిందని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హెచ్‌పీ సింగ్ పేర్కొన్నారు. విజయవాడ సమీపంలోని పోరంకిలో మూడు రోజులపాటు జరగనున్న 3వ జాతీయ ఆయిల్‌పామ్ సదస్సు బుధవారం ప్రారంభమైంది. ఆయిల్‌పామ్ రంగంలో అత్యుత్తమ పురోగతి సాధిస్తున్న రాష్ట్రంగా ఎంపికైన ఆంధ్రప్రదేశ్ తరఫున రాష్ట్ర ఉద్యాన కమిషనర్ ఎస్ఎస్ శ్రీధర్ ‘బెస్ట్ పెర్ఫార్మెన్స్ స్టేట్ ఇన్ ఇండియా’ అవార్డును అందుకున్నారు. సదస్సులో హెచ్‌పీ సింగ్ మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో 4 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగవుతుంటే.. 1.90 లక్షల హెక్టార్లు ఏపీలోనే ఉందన్నారు. ఏపీని స్ఫూర్తిగా తీసుకుని ఇతర రాష్ట్రాలు ఆయిల్‌పామ్ తోటల విస్తరణకు ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో 29 లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ఆయిల్‌పామ్‌ను విస్తరించేందుకు అనువైన ప్రాంతం ఉందన్నారు. విస్తరణ కోసం పరిశోధనా సంస్థలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ విభాగాలు సంఘటితంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయిల్‌పామ్ సాగులో భారత్ పురోగతి సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మలేషియా ఆయిల్‌పామ్ బోర్డు డైరెక్టర్ జనరల్ అహ్మద్ పర్వేజ్ ఖాదీర్ మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ సాగులో భారతదేశం మంచి పురోగతి సాధిస్తోందన్నారు. మలేషియాలో వర్షాధారంగా ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారని, అందువల్ల పెట్టుబడి చాలా తక్కువ అవుతోందని చెప్పారు. ఇక్కడి రైతులు ఉత్తమ యాజమాన్య పద్ధతుల్ని పాటిస్తూ సాంకేతికంగా దిగుబడులను పెంచుకునే మార్గాలను అన్వేషించాలన్నారు. అధిక దిగుబడులను ఇచ్చే కొత్త వంగడాలతోపాటు యాంత్రీకరణపై దృష్టి సారించాలన్నారు. ఏపీ ఉద్యాన శాఖ కమిషనర్ ఎస్ఎస్ శ్రీధర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆయిల్‌పామ్ సాగు విస్తరణలో మంచి పురోగతిని సాధిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 12 పారిశ్రామిక జోన్లలో గంటకు 460 టన్నుల ఆయిల్‌పామ్‌ను ప్రాసెసింగ్ చేసే యూనిట్లు ఉన్నాయన్నారు. తెలంగాణ ఉద్యాన వర్సిటీ వైస్ చాన్సలర్ నీరజా ప్రభాకర్, సొసైటీ చైర్మన్ పి.రత్నం, కేంద్ర వ్యవసాయ సమాచార కేంద్రం చైర్మన్ మోని మాధవ స్వామి, వెజిటబుల్ ఆయిల్స్ ఏషియా ప్రోగ్రామ్ హెడ్ సురేష్ మోత్వాని, వైస్ ప్రెసిడెంట్ ఆర్కే మాథూర్ మోత్వాని, ఆదర్శ ఆయిల్‌పామ్ రైతు టీటీ కృష్ణమూర్తి, ఉద్యాన శాఖ అదనపు డైరెక్టర్లు కె.బాలాజీ నాయక్, ఎం.వెంకటేశ్వర్లు ప్రసంగించారు. -
ఐదేళ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు
సాక్షి, హైదరాబాద్/హఫీజ్‌పేట్: రాబోయే ఐదేళ్లలో తెలంగా ణలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ఐటీ, పరి శ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. ఆయిల్ పామ్‌తో పాటు వేరుశనగ, పొద్దు తిరుగుడు, సోయాబీన్ తదితర నూనె గింజల సాగును ప్రోత్సహించడం ద్వారా వంట నూనెల తయారీకి అవసరమైన ముడి సరుకు రాష్ట్రంలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. వంట నూనెల దిగు మతిని తగ్గించడంతో పాటు దేశీయంగా వంట నూనెల త యారీని పెంచడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రణాళిక లు రూపొందిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ లో శుక్రవారం ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడక్షన్ అసోసియేషన్ (ఐవీపీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సు లో ఆయన పాల్గొన్నారు. రెండు రోజులపాటు జరిగే సదస్సు లో తొలి రోజు సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పది వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ఫుడ్ ప్రాసె సింగ్ జోన్లలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు. పెట్టుబడులతో వచ్చే వారికి ఇతర రాష్ట్రాల తో పోలిస్తే మెరుగైన ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం వివి ధ రంగాల్లో సాధించిన విజయాలను వివరించడంతో పాటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా 40 లక్షల ఎకరాల ఆయకట్టు పెరిగిందని చెప్పారు. ఆయిల్ పామ్ సాగుతో అటవీ విస్తీర్ణం తగ్గుతుందనే వార్తలు వస్తున్నాయని, కానీ రాష్ట్రంలో ఈ ఎనిమిదేళ్లలో పచ్చదనం విస్తీర్ణం 24 శాతం నుంచి 31.77 శాతానికి పెరిగిందని కేటీఆర్ వెల్లడించారు. ఆయిల్ పామ్ సాగును పెంచుతాం: మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రపంచంలోని 800 కోట్ల జనాభాలో భారత్, చైనాది సింహభాగం కాగా, ఏటా ప్రపంచ జనాభాకు 220 మిలియన్ టన్నుల నూనె గింజలు అవసరమవుతున్నాయని వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. భారత్‌లో నూనె గింజల వినియోగం ఏటా 20 నుంచి 22 మిలియన్ టన్నులు కాగా, వనరులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా నూనె గింజల ఉత్పత్తి 50 శాతం కూడా లేదన్నారు. రూ.99 వేల కోట్లకు పైగా వెచ్చించి విదేశాల నుంచి వంట నూనె గింజలు దిగుమతి చేసుకుంటుండగా ఇందులో పామాయిల్ 65 శాతం ఉందని తెలిపారు. దేశంలో వేరు శన గ, పొద్దు తిరుగుడు, నువ్వులు, ఆవాలు, కుసుమలు, ఆయి ల్ పామ్ సాగుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సూచన మేరకు రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని, ప్రస్తుతం రాష్ట్రంలో 50 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోందని వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 1.78 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును పెంచడం లక్ష్యంగా పనిచేస్తున్నామని నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్ దేశాయ్, ప్రతినిధులు బన్సల్, గుప్తాతో పాటు మలేసియా, థాయ్‌లాండ్, యూరోప్, యూకే ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. -
తగ్గిన ఆయిల్ పామ్ ధరలు
సాక్షి, హైదరాబాద్: ఆయిల్ పామ్ ధరలు గణనీ యంగా తగ్గాయి. దీంతో ఈ పంటను సాగు చేస్తున్న అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, కరోనా నేపథ్యంలో ఆగస్టు వరకు ఆయిల్ పామ్‌కు అధిక ధరలు పలికాయి. అయితే గత నెల నుంచి ఈ పంట ధరలు గణనీయంగా తగ్గాయి. మరో పక్క ఇతర వంట నూనెల ధరల్లో కూడా తగ్గుముఖం కనిపించింది. ఈ ఏడాది జూన్‌లో టన్నుకు రూ. 22,765 పలికిన ఆయిల్ పామ్ ధర సెప్టెంబర్ ఒకటి నుంచి రూ. 12,995కు పడిపోయింది. వాస్తవానికి ఆయిల్ పామ్ ధర టన్నుకు రూ.10 వేలు లభిస్తే అదే మహాభాగ్యం అనే పరిస్థితి మూడేళ్ల క్రితం వరకు ఉండేది. 2015లో టన్ను ధర గరిష్టంగా రూ.6,811 పలికింది. 2018లో తొలిసారిగా రూ. 10 వేలు దాటింది. 2020లో గరిష్ట ధర రూ.12,800 పలుకగా 2021లో అమాంతం టన్నుకు రూ.19,114కు చేరింది. తర్వాత అది రూ.22,765 వరకు చేరుకుంది. ఏడేళ్లలో టన్ను ధర ఏకంగా మూడు రెట్లకుపైగా పెరగడం విశేషం. దీంతో ఎక్కువ సంఖ్యలో రైతులు ఆయిల్ పామ్ సాగువైపు దృష్టి సారించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 52 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోంది. 2022–23లో రెండున్నర లక్షల ఎకరాల్లో సాగు చేపట్టాలనేది సర్కారు లక్ష్యం. ఈ నేపథ్యంలో ఆయిల్ పామ్ ధరలు పతనం కావడం వల్ల తమకు నష్టం జరుగుతుందని రైతులు వాపోతున్నారు. అంతర్జాతీయంగా వచ్చిన మార్పుల వల్లే ఆయిల్ పామ్ గెలల ధర పడిపోయిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మూడు నెలల వ్యవధిలో టన్నుకు దాదాపు రూ.10 వేలకు పైగా ధర పడిపోయి రూ.12,995 వద్ద ఆగిపోయింది. మున్ముందు ఇంకా తగ్గే పరిస్థితి కనిపిస్తోందని ఆయిల్‌ఫెడ్ వర్గాలు అంటున్నాయి. ఆయిల్‌ఫెడ్ వర్గాల లెక్కల ప్రకారం పామాయిల్ ధర కిలోకు గతంలో రూ.160 నుంచి రూ.170 వరకు పలకగా ఇప్పుడది రూ.90కు పడిపోయింది. -
భారీగా తగ్గిన ఆయిల్‌ఫాం ధర
అశ్వరావుపేట: ఆయిల్‌పాం గెలల ధర భారీగా పడిపోయింది. ఈ ఏడాది కాలంలో ఇంత మేర తగ్గడం ఇదే తొలిసారి. దసరా పండుగ సమయాన ధర పడిపోవడం రైతులను తీవ్రనిరాశకు గురిచేసింది. ఆయిల్‌పాం గెలలు టన్ను ధర సెప్టెంబర్‌లో రూ.16,295 ఉండగా, తాజాగా రూ.3,300 మేర తగ్గింది. దీంతో అక్టోబర్‌లో ధర టన్నుకు రూ.12,995గా ఉందని ఆయిల్‌ఫెడ్ ఉన్నతాధికారులు ప్రకటించారు. మూడు నెలలుగా ధర పడిపోతూనే ఉంది. దీంతో ఆయిల్‌పాం సాగు చేస్తున్న రైతుల్లో ఆందోళన మొదలైంది. చదవండి: పాస్‌పోర్టు కావాలా.. ఇప్పుడంతా ఈజీగా రాదండోయ్! -
పామ్‌పై 3ఎఫ్ ఆయిల్ రూ.250 కోట్ల పెట్టుబడి
ముంబై: హైదరాబాద్ కంపెనీ 3ఎఫ్ ఆయిల్ పామ్ అరుణాచల్ ప్రదేశ్‌లో రూ. 250 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తాజాగా వెల్లడించింది. తద్వారా సమీకృత ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు ఇప్పటికే 120 ఎకరాల భూమిని సేకరించినట్లు తెలియజేసింది. పిబ్రవరిలో సొంతం చేసుకున్న భూమికి సంబంధించి నియంత్రణ సంస్థల ఆమోదంసహా అవసరమైన అన్ని రకాల అనుమతులను పొందినట్లు వెల్లడించింది. రెండు దశలలో ప్లాంటును నెలకొల్పనున్నట్లు తెలియజేసింది. స్థానికంగా 300 మందికి ఉపాధి కల్పించగల తొలి దశను 2023 సెప్టెంబర్‌కల్లా పూర్తిచేయగలమని భావిస్తున్నట్లు అభిప్రాయపడింది. పామాయిల్ ప్రాసెసింగ్ రిఫైనరీ, వ్యర్ధరహిత యూనిట్(జీరో డిశ్చార్జ్), పామ్ వ్యర్ధాలతో విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. ప్రస్తుత కంపెనీ నర్సరీ, పంటల నిర్వహణ, ఎఫ్‌ఎఫ్‌బీ హార్వెస్టింగ్, కలెక్షన్ తదితర రైతు అనుబంధ సర్వీసులకు మద్దతిస్తుందని తెలియజేసింది. -
Telangana: నాలుగేళ్లు.. 10,000 కోట్లు
రాష్ట్రంలో వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పాం సాగు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సమీప భవిష్యత్తులోనే దీని ఫలితాలు రాష్ట్రానికి, రైతులకు లబ్ధి చేకూరుస్తాయని ఆయిల్‌ఫెడ్ వర్గాలు చెబుతున్నాయి. నాలుగేళ్ల తర్వాత రాష్ట్ర జీడీపీలో ఆయిల్‌పాం వాటా ఏకంగా రూ. 10 వేల కోట్లుగా ఉంటుందని తెలిపాయి. – సాక్షి, హైదరాబాద్ లక్షల టన్నుల పామాయిల్ రాష్ట్రంలో వచ్చే వ్యవసాయ సీజన్ నుంచి ఏకంగా 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగును పెంచేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మొత్తం 26 జిల్లాల్లో సాగు చేపట్టేలా చర్యలు చేపట్టింది. రైతులకు అవసరమైన సహకారం, పంట కొనుగోలుకు ఆయిల్‌ఫెడ్ సహా 11 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. నాలుగేళ్లలో పామాయిల్ గెలలు అందుబాటులోకి వస్తాయి కాబట్టి మొత్తం 10 లక్షల ఎకరాల్లో పంట సాగైతే దాని ద్వారా రూ. 13,680 కోట్ల విలువైన 15.20 లక్షల పామాయిల్ ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందులో రాష్ట్ర అవసరాలకుపోను ఇతర రాష్ట్రాలకు ఎగుమతులతో నాలుగేళ్ల తర్వాత జీడీపీలో పామాయిల్ వాటా రూ. 10 వేల కోట్లుగా ఉంటుందంటున్నారు. రైతులకు ఎకరానికి రూ. 80 వేల చొప్పున ఏడాదికి ఆదాయం సమకూరుతుందని... మున్ముందు ఇతర దేశాలకు కూడా ఎగుమతులు జరుగుతాయని చెబుతున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. ఆయిల్‌పామ్ రంగంలో వచ్చే నాలుగైదేళ్లలో రూ. 3,750 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. మొదటగా ఆయా కంపెనీలు 25 క్రషింగ్ ఫ్యాక్టరీలను నెలకొల్పాల్సి ఉండగా ఒక్కో ఫ్యాక్టరీకి రూ. 150 కోట్ల చొప్పున రూ. 3,750 కోట్ల మేర పెట్టుబడులు తరలిరానున్నాయి. ఆయా ఫ్యాక్టరీల్లో ప్రత్యక్షంగా 2,500 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. అలాగే ఆయిల్‌పామ్ పంట భూముల్లో ఏకంగా 50 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరో 2,500 మందికి పామాయిల్ రవాణా రంగంలో ఉపాధి లభిస్తుందని ఆయిల్‌ఫెడ్ వర్గాలు వెల్లడించాయి. ఆయిల్‌పామ్ రంగంలో ఆయిల్‌ఫెడ్ ద్వారానే ఏకంగా రూ. 750 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ ఎండీ సురేందర్ చెప్పారు. దీనివల్ల ఆయిల్‌ఫెడ్‌లోనూ ప్రభుత్వ ఉద్యోగాలు భారీగా భర్తీ అవుతాయన్నారు. రాబోయే రోజుల్లో ఆయిల్‌పాం సాగు రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని, రూ. లక్షల్లో ఆదాయం సమకూరనుందని పేర్కొన్నారు. మరోవైపు పామాయిల్ క్రషింగ్ ఫ్యాక్టరీల్లో ముడినూనెను బయటకు తీస్తారు. దాన్ని శుద్ధి చేసి పామాయిల్ వంటనూనె తయారు చేయాల్సి ఉంటుంది. అందుకోసం ప్రతి క్రషింగ్ ఫ్యాక్టరీ వద్ద ఒక్కో రిఫైనరీ ఫ్యాక్టరీని నెలకొల్పాల్సి ఉంటుంది. ఒక్కో రిఫైనరీ ఫ్యాక్టరీ కోసం రూ. 30 కోట్ల చొప్పున రూ. 750 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వాటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. -
ఆయిల్ ఫామ్ సాగుతో డబ్బులే డబ్బులు.. పెట్టుబడులు పోగా ఎకరానికి లాభం ఎంతంటే?
సాక్షి అమలాపురం: కోనసీమ అంటేనే వరి.. మొక్కజొన్న.. అపరాలు వంటి వ్యవసాయ పంటలు... కొబ్బరి.. అరటి... కందా వంటి ఉద్యాన పంటలు గుర్తుకు వస్తాయి. ఆయిల్ పామ్ అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతమే గుర్తుకు వస్తుంది. ఈ పంటకు మెట్టలోని ఎర్ర నేలలు అనుకూలమని. నల్లరేగడి నేలల్లో పండదని ఒక నమ్మకం. కానీ జిల్లా ఉద్యాన శాఖ మాత్రం గోదావరి డెల్టా భూముల్లో ఆయిల్ పామ్ సాగుతో అధిక దిగుబడులు సాధించవచ్చని, లాభాలు పొందే అవకాశముందని ధీమాగా చెబుతోంది. చదవండి: పల్నాడు రైతుల వినూత్న పంథా.. ‘ఫల’ప్రదం చెప్పడమే కాదు... జిల్లా రైతులతో పెద్ద ఎత్తున సాగు చేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా సర్వేసాయి ఎడిబుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీతో ఉద్యాన శాఖ ఎంవోయూ చేసుకుంది. ఈ సంస్థ కోనసీమ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు పనిచేయనుంది. నర్శరీలు ఏర్పాటు చేయడం, సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి రాయితీలు, సాంకేతిక పరిజ్ఞానం అందజేయడంతోపాటు పరిశ్రమ ఏర్పాటు చేయడం ద్వారా వారే ఆయిల్‌పామ్ గెలలను రైతుల వద్ద నుంచి సేకరించనున్నారు. అంతర్జాతీయంగా డిమాండ్ ఆయిల్ పామ్ సాగు అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రంగంపేట, రాజానగరం, గోకవరం, తుని, ప్రత్తిపాడు, ఏలేశ్వరం వంటి మెట్ట ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. ఒకానొక సమయంలో ఈ సాగు సైతం తీవ్ర సంక్షోభానికి గురయింది. గెల టన్ను ధర రూ.7 వేల కన్నా తగ్గడం వల్ల రైతులు నష్టాలు పాలవడంతోపాటు తోటలు తొలగించారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో పామాయిల్‌కు డిమాండ్ పెరిగింది. దీనికితోడు అంతర్జాతీయంగా మారిన సమీకరణల వల్ల మలేషియా వంటి దేశాల నుంచి పామాయిల్ దిగుమతులపై ఆంక్షలు విధించడంతో స్థానికంగా పండే ఆయిల్ పామ్ గెలలకు డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది ఒకానొక సమయంలో టన్ను ధర ఏకంగా రూ.23 వేల వరకు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో టన్నుకు రూ.15,912 వరకు ధర ఉంది. దీనితో పలువురు రైతులు దీని సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడప్పుడే వంట నూనెల ధరలు తగ్గే అవకాశం లేదని తెలిసి ఈ సాగు మీద ఆసక్తి చూపుతున్నారు. సాగు విస్తరణకు ఉద్యానశాఖ యత్నం కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లాలో రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాలతోపాటు కొత్తపేట నియోజకవర్గంలో ఆలమూరు మండలంలో మినహా మిగిలిన ప్రాంతంలో దీర్ఘకాలిక ఉద్యాన పంట అంటే కొబ్బరికే రైతులు పరిమితమయ్యారు. దీంతోపాటు కోకో, పోక వంటి పంటలు సాగు చేస్తారు. ఈ జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు చాలా తక్కువ. కేవలం 988 ఎకరాలు మాత్రమే ఉందని అంచనా. అది కూడా మండపేట నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. దీనిని జిల్లాలో సాగుకు అనుకూలమైన ప్రాంతాలకు విస్తరించాలని ఉద్యానశాఖ తలపోస్తోంది. గతంలో విఫలమైనా.. గతంలో కోనసీమలో ఆయిల్‌పామ్ సాగు పెంచడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అంబాజీపేటకు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టింది. అయినవిల్లి మండలం సిరిపల్లి వద్ద ఆయిల్ తయారు చేసే ఫ్యాక్టరీని ఏర్పాటు చేసినా స్థానికుల నుంచి అభ్యంతరాలు రావడంతో నిలిచిపోయింది. పామాయిల్‌కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఈ సాగును అన్ని ప్రాంతాల్లోనూ ప్రోత్సహించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా సర్వేసాయి కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. తొలి దశలో కపిలేశ్వరపురం, రాయవరం, రామచంద్రపురం, కె.గంగవరం, కొత్తపేట, ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెంతో పాటు రెండవ దశలో అమలాపురం డివిజన్ పరిధిలో ఈ సాగును ప్రోత్సహించాలని ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ మెరక భూములు, మెరక ప్రాంతాల్లో రబీ నీరు అందని శివారు వరి చేలు, భారీ వరదలు వస్తే కాని ముంపుబారిన పడని లంక గ్రామాల్లోని మెరక ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగుకు అన్ని విధాలా మేలు అని గుర్తించారు. ‘జిల్లాలోని డెల్టా భూములు కూడా సాగుకు అనుకూలమే. అయినవిల్లిలో ఒక రైతు ఎకరాకు 10 టన్నుల సగటు దిగుబడి తెచ్చారు. ఇప్పటి ధరను పరిగణలోకి తీసుకుంటే రూ.1.59 లక్షల ఆదాయం వస్తున్నట్టు. పెట్టుబడులు ఎకరాకు రూ.40 వేలు తీసివేస్తే రైతుకు రూ.1.19 లక్షల వరకు ఆదాయం వస్తోంది’ అని సర్వేసాయి సంస్థ ప్రతినిధి ప్రభాకర్ ‘సాక్షి’కి తెలిపారు. వరి, కొబ్బరి లాభసాటి కాకపోవడం వల్ల అనుకూలమైన ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగు చేసే అవకాశముందని రైతులు చెబుతున్నారు. ఖాళీ మెరక ప్రాంతాలు అనుకూలం గోదావరి డెల్టా ప్రాంతాలు సైతం ఆయిల్‌పామ్ సాగుకు అనుకూలం. ఖాళీగా ఉన్న మెరక ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగు అన్ని విధాలా మేలు. నీటి ఎద్దడి ఉన్న భూములలో డ్రిప్ ద్వారా సాగు చేయవచ్చు. సాగుకు ఆసక్తి చూపే రైతులకు ప్రభుత్వం అన్నిరకాలుగానూ సహకరిస్తోంది. – ఎన్.మల్లికార్జునరావు, ఉద్యానశాఖ జిల్లా అధికారి -
రుణంతో సాగు చేసినా సబ్సిడీ: నిరంజన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతులు రుణం తీసుకుని ఆయిల్‌పామ్ సాగు చేసినా వారికి చెందాల్సిన సబ్సిడీని అందజేస్తామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రుణం అనేది ఆప్షన్ మాత్రమేనని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయిల్‌పామ్ సాగులో సబ్సిడీలు ఎత్తేయడంలేదని స్పష్టం చేశారు. ఆయిల్‌పామ్ డిమాండ్‌ను గమనించే ప్రోత్సాహిస్తున్నామని పేర్కొన్నారు. మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేసి జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని తెలిపారు. ఇప్పటి వరకు 30 వేలమంది రైతులను క్షేత్రస్థాయి సందర్శనలకు తీసుకెళ్లి అవగాహన కల్పించామని వెల్లడించారు. -
ఆయిల్ పామ్ టన్ను రూ.22,770
సాక్షి, అమరావతి: ఆయిల్ పామ్ రైతులకు కాసుల వర్షం కురుస్తోంది. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ధర పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్ టన్ను రూ.17 వేలతో ప్రారంభం కాగా, ప్రస్తుతం తాజా గెలల (ఎఫ్‌ఎఫ్‌బీ)ను టన్ను రూ.22,770 చొప్పున కొనాలని ఉద్యాన శాఖ పామాయిల్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. కేవలం ఏడు నెలల్లోనే టన్నుకు రూ.5,770 పెరగడం గతంలో ఎప్పుడూ లేదని రైతులు చెబుతున్నారు. రాష్ట్రంలో 4.80 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోంది. ప్రభుత్వ చర్యల ఫలితంగా 2019–20లో 6,642 హెక్టార్లు, 2020–21లో 8,801 హెక్టార్లు, 2021–22లో 11,257 హెక్టార్లు కొత్తగా సాగులోకి వచ్చాయి. 2020–21లో 14.94 లక్షల టన్నులు, 2021–22లో 17.22 లక్షల టన్నులు దిగుబడి వచ్చింది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో దిగుబడులొస్తాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో గంటకు 461 టన్నుల సామర్థ్యంతో 13 పామాయిల్ కంపెనీలు పని చేస్తున్నాయి. ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో (ఓఈర్)ను బట్టి ధర చెల్లించాలి. అయితే, నాణ్యత సాకుతో గతంలో తెలంగాణ ఓఈఆర్ కంటే ఇక్కడ తక్కువగా చెల్లించేవారు. దీంతో రైతులు టన్నుకు రూ.4 వేలకు పైగా నష్టపోయేవారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో రైతులు ఆయన్ని కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. వారి ఆవేదనను అర్ధం చేసుకున్న వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఆయిల్ పామ్‌కు గిట్టుబాటు ధర కల్పించారు. అప్పటివరకు 16.08 శాతం ఉన్న ఓఈఆర్ను 18.68 శాతానికి పెంచారు. 2018–19లో సగటున రూ.7 వేలు పలికిన టన్ను ఆయిల్‌పామ్ ధర ఇప్పుడు రూ.15వేలకు పైగా పెరిగింది. 2020–21లో టన్ను రూ.13,127 తో సీజన్ ప్రారంభం కాగా గరిష్టంగా మే–జూన్ నెలల్లో రూ.18,942 పలికింది. కాగా ఈ ఏడాది ఓఈఆర్ నిర్ధారణ కాకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్ ధరలు, డిమాండ్‌ను బట్టి అడ్హాక్ కమిటీ నెలవారీ ధరలను ప్రకటిస్తోంది. సీజన్ ప్రారంభమైన నవంబర్‌లో టన్ను రూ.17 వేలుగా అడ్హాక్ కమిటీ నిర్ణయించగా ఇదే ధరతో జనవరి వరకు కొన్నారు. ఫిబ్రవరిలో టన్ను రూ.19,300గా నిర్ణయించారు. మార్చిలో రూ.21,890, ఏప్రిల్‌లో రూ.21,940గా నిర్ణయించారు. ప్రస్తుతం ఇదే ధరతో కొంటున్నారు. మే నెల నుంచి టన్ను రూ.22,770 చొప్పున ధర చెల్లించాలన్న అడహాక్ కమిటీ నిర్ణయం మేరకు ఆయిల్ కంపెనీలకు ఉద్యాన శాఖ కమిషనర్ ఎస్ఎస్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎకరాకు 10 టన్నులకు పైగా దిగుబడి వస్తోంది. పెరిగిన ధరల నేపథ్యంలో పెట్టుబడి పోను ఎకరాకు రూ.2 లక్షల వరకు నికర ఆదాయం వస్తోందని రైతులు చెబుతున్నారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మంచి ధర వస్తోంది ఆయిల్‌పామ్‌కు ఇప్పుడు మంచి ధర వస్తోంది. ఓఈఆర్ ఎంత ఇవ్వాలనే అంశంపై ఇంకా నిర్ణయం జరగలేదు. అంతర్జాతీయ మార్కెట్‌ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అడ్హాక్ కమిటీ నెలవారీ ధరలను నిర్ణయిస్తోంది. పూర్తిగా పక్వానికి వచ్చిన తాజా గెలలకు టన్ను రూ.22,770 చొప్పున చెల్లించాలని కంపెనీలకు ఆదేశాలిచ్చిందిది. – పి.హనుమంతరావు, జేడీ, ఉద్యాన శాఖ (ఆయిల్‌పామ్ విభాగం) -
ఒక్కసారి వేస్తే 30 ఏళ్ల పాటు పంట: ఎకరాకు ఏడాదికి రూ.3 లక్షల ఆదాయం
తగరపువలస/విశాఖపట్నం: సేద్యంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు భీమిలి నియోజకవర్గ రైతులు. ఒక్క సారి పెట్టుబడి పెడితే.. 30 ఏళ్లు వరసగా ఆదాయం పొందే ఆయిల్‌పామ్ తోటల వైపు మళ్లుతున్నారు. భీమిలి డివిజన్లో నారాయణరాజుపేట, దాకమర్రి, సంగివలస, రావాడ, గెద్దపేట, కురపల్లి, రెడ్డిపల్లి, కుసులవాడ, మజ్జిపేట తదితర పంచాయితీల్లో 200 ఎకరాలకు పైగా ఆయిల్‌పామ్ సాగు చేస్తుండగా.. ప్రస్తుతం దిగుబడి ఇస్తున్నాయి. ఏడాదిలో 8 నెలల పాటు 15 రోజులకొకసారి ఎకరానికి 10–12 టన్నుల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం టన్ను ఆయిల్‌పామ్ గెలల ధర రూ.21 వేలకు కంపెనీల యజమానులు కొనుగోలు చేస్తున్నారు. నర్సీపట్నం వద్ద బంగారుమెట్ట, విజయనగరం జిల్లా పార్వతీపురంలో కంపెనీలకు ఆయిల్‌పామ్ గెలలను తరలిస్తున్నారు. మొదటి నాలుగేళ్లే.. నిరీక్షణ సాధారణంగా ఎక్కువ ఎకరాలు భూమి కలిగిన రైతులు ఆయిల్‌పామ్ తోటలను సాగు చేస్తుంటారు. ఒకసారి పంటకు ఉపక్రమించిన తర్వాత నాలుగేళ్లు వరసగా పెట్టుబడి పెట్టాలి. గోదావరి జిల్లాల్లో అయితే చిన్న కమతాలు కలిగిన రైతులు కూడా ఆయిల్‌పామ్‌కే మొగ్గు చూపుతారు. గత ప్రభుత్వాల హయాంలో రూ.60 ఉండే ఆయిల్‌పామ్ మొక్కను రాయితీ పోను మూడు ఎకరాల్లోపు రైతులకు రూ.5, మూడు నుంచి ఐదు ఎకరాల్లోపు రైతులకు రూ.10, ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన రైతులకు రూ.30 వంతున ప్రభుత్వం సరఫరా చేసేది. ప్రస్తుతం రూ.300 ఉన్న మొక్కను.. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రైతులకు ఎన్ని కావాలంటే అన్ని అందిస్తోంది. గత ప్రభుత్వాలు దిగుబడి వచ్చే నాలుగేళ్ల వరకు హెక్టారుకు ఏడాదికి రూ.4 వేల విలువైన ఎరువులు ఇచ్చేవారు. ప్రస్తుత ప్రభుత్వం రూ.4 వేల నగదును నేరుగా రైతుల ఖాతాకు జమ చేస్తోంది. పెట్టుబడి గోరంత.. ఆదాయం కొండంత ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు మొక్కలు ఉచితంగా లభిస్తుండగా ఎకరాకు గాను పెట్టుబడి నిమిత్తం రూ.30 వేల నుంచి 40 వేలు అవుతుంది. మొక్కకు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో రోజుకు 250 లీటర్ల నీరు, మూడు నెలలకు ఒకసారి మొక్కకు 3–4 కిలోల ఎరువులు, అవసరమైన చోట మట్టలు నరకడం చేస్తే సరిపోతుంది. నాలుగేళ్ల తర్వాత ఏడాదిలో ఎనిమిది మాసాలకు కలిపి 16సార్లు దిగుబడి వస్తుంది. దీంతో ఖర్చులు పోను ఎకరాకు ఏడాదికి రూ.3 లక్షల ఆదాయం లభిస్తుంది. అంతర పంటగా వేస్తే అదనపు ఆదాయం 2013లో నాకున్న 9 ఎకరాల్లో మొదట ఆయిల్‌పామ్ వేశాను. తర్వాత 18 ఎకరాలకు విస్తరించాను. మొత్తంగా 27 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌తో పాటు అరటి, బొప్పాయి అంతర పంటలుగా వేశాను. మధ్యలో కోళ్ల ఫారాలు ఏర్పాటు చేశాను. సోలార్ ద్వారా బిందుసేద్యం మొదలుపెట్టాను. ఆయిల్‌పామ్ నాలుగేళ్లు తర్వాత దిగుబడి ప్రారంభయి జీవితకాలం 30 ఏళ్ల వరకు ఆదాయం ఇస్తుంది. అరటి, బొప్పాయి వలన ఏడాదికి రూ.లక్ష అదనపు ఆదాయం లభిస్తుంది. మార్కెటింగ్ సమస్య లేదు. – కాద సూర్యనారాయణ, సర్పంచ్, నారాయణరాజుపేట, భీమిలి మండలం పక్షుల బెడద ఉంటుంది ఆయిల్‌పామ్‌కు తెగుళ్ల బాధ తక్కువ. ఒకవేళ తెగుళ్లు సోకినా ఇబ్బంది లేదు. పంట దిగుబడి సమయంలో ఆయిల్‌పామ్ పండ్లను గోరపిట్టలు, కాకులు, ఉడతలు తినేస్తుంటాయి. సాధారణంగా ఆయిల్‌పామ్ గెల 30 కిలోలు ఉండగా.. గెలకు అరకిలో వరకు నష్టం ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా రక్షణ చర్యలు తీసుకోవాలి. వచ్చే ఆదాయం ముందు నష్టం ఏమంత కాదు. – మజ్జి చినపైడితల్లి, రైతు, మజ్జిపేట, భీమిలి మండలం -
గెల.. గలగల!
దేవరపల్లి, రంగంపేట (తూర్పు గోదావరి): మెట్ట ప్రాంతంలో ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేస్తున్న పామాయిల్ రైతన్నలకు కాసులు కురిపిస్తోంది. రెండేళ్లలో పామాయిల్ గెలల ధర గరిష్ట స్థాయికి చేరడంతో సాగుదారులు మంచి ఆదాయం పొందుతున్నారు. ప్రస్తుతం టన్ను గెలల ధర రూ.21890 చొప్పున పలికి సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. జనవరిలో రూ.17,500 ఉన్న ధర మార్చిలో రూ.19,300కి చేరుకోగా తాజాగా మరింత పెరిగింది. యుద్ధం.. దిగుమతులు ఆగడంతో ఉక్రెయిన్ – రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా పామాయిల్ దిగుమతులకు ఆటంకం తలెత్తడంతో మార్కెట్లో వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. 2019లో టన్ను గెలల ధర రూ.ఆరు వేలు మాత్రమే ఉండగా 2020లో రూ.8,000 పలికింది. 2021లో రూ.10,000కి చేరుకుంది. ఈనెల 4వ తేదీన ఉద్యాన శాఖ కమిషనర్ డాక్టర్ ఎస్.ఎస్ శ్రీధర్ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రైతులకు ఏప్రిల్ నుంచి టన్ను పామాయిల్ గెలలకు రూ.21,890 చొప్పున చెల్లించాలి. ఈ మేరకు కాకినాడ జిల్లా పెద్దాపురంలోని రుచి సోయా పామాయిల్ కంపెనీతో పాటు మిగిలిన 12 కంపెనీలు కూడా ఇదే ధర చెల్లించాల్సి ఉంది. ఉభయ గోదావరిలో భారీగా సాగు కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజక వర్గాల పరిధిలో 55 వేల ఎకరాల్లో పామాయిల్ పంట సాగులో ఉంది. అనపర్తి, పెద్దాపురం, గండేపల్లిలోనూ సాగు చేపట్టారు. గత మూడు నెలల వ్యవధిలో ఆరు వేల ఎకరాల్లో కొత్తగా నాట్లు వేయడంతో ఉభయ గోదావరిలో సాగు విస్తీర్ణం 81 వేలకు పెరిగిపోయింది. జూన్, జూలైలో మరో ఐదు వేల ఎకరాల్లో నాట్లు వేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. పొగాకుకు ప్రత్యామ్నాయంగా పొగాకు పంట గిట్టుబాటు కాకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయంగా పామాయిల్ సాగు చేసి లాభాలు పొందుతున్నారు. పొగాకు భూముల్లో రెండేళ్లుగా రైతులు పామాయిల్ తోటలు వేస్తున్నారు. దాదాపు 8,000 ఎకరాల్లో ఈ తోటలు వేసినట్లు సమాచారం. పెట్టుబడి తక్కువ, ఆదాయం బాగుండటంతో వీటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఎకరాకు రూ.2.20 లక్షల ఆదాయం పామాయిల్ ఎకరాకు 10 టన్నుల గెలలు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం టన్ను గెలల ధర రూ.21,890 ఉండడంతో రూ.2.20 లక్షలు వరకు ఆదాయం వస్తుందని రైతులు తెలిపారు. అన్ని పంటల కంటే ఆయిల్ పామ్‌కు మంచి ధర లభిస్తోందని, మెట్ట రైతులను పామాయిల్ ఆదుకుందని ఆనందంగా చెబుతున్నారు. రైతులను ఆదుకుంది.. ఈ ఏడాది పొగాకు మినహా అన్ని పంటలకు మార్కెట్లో డిమాండ్ ఉంది. పామాయిల్ పంట రైతులను ఆదుకుంది. ఎకరాకు 10 టన్నుల దిగుబడి వస్తుంది. పెట్టుబడి ఎకరాకు రూ.30 వేలు అవుతుంది. సగటున ఎకరాకు రూ.1.70 లక్షల నికర ఆదాయం వస్తుంది. – నరహరిశెట్టి రాజేంద్రబాబు, డైరెక్టర్, రాష్ట్ర ఆయిల్‌పామ్ బోర్డు, యర్నగూడెం ఊహించని ధర ఇంత ధర ఊహించలేదు. పామాయిల్ తోటలు రైతులను ఆదుకుంటున్నాయి. 30 ఎకరాల్లో సాగు చేస్తున్నా. 300 టన్నుల దిగుబడి వచ్చింది. ఎకరాకు సగటున రూ.1.50 లక్షలు మిగులుతుంది. మార్కెట్లో ధర మరింత పెరిగే అవకాశ«ం ఉంది. – యాగంటి వెంకటేశ్వరరావు, రైతు, దేవరపల్లి లాభాల పంట ఆయిల్ పామ్ లాభాల పంట. రెండేళ్ల నుంచి మంచి ఆదాయం వస్తోంది. ఎకరాకు రూ.2 లక్షల ఆదాయం లభిస్తోంది. డ్రిప్ ద్వారా నీటితడులు, పశువుల ఎరువు వాడడం వల్ల దిగుబడులు పెరిగాయి. ఎకరాకు 10 నుంచి 11 టన్నుల దిగుబడి వస్తోంది. గత రెండు సంవత్సరాలు దిగుబడులు, రేటు ఆశాజనకంగా లేక లాభాలు తగ్గాయి. 11 ఎకరాల్లో తోట ఉంది. 112 టన్నులు దిగుబడి వచ్చింది. – పల్లి వెంకటరత్నారెడ్డి, రైతు, త్యాజంపూడి -
పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నాం: నిరంజన్‌రెడ్డి
-
కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో తెల్లదోమ సమస్యకు ఇలా చెక్!!
దక్షిణాది రాష్ట్రాల్లో కొబ్బరి, ఆయిల్ పామ్ తోటలకు రూగోస్ వైట్ ఫ్లై (సల్ఫిలాకార తెల్లదోమ) గత కొన్నేళ్లుగా పెనుముప్పుగా మారింది. తోటల్లో ముందుగానే బదనికల (రెక్కల పురుగుల)ను వదలటం, తదితర పద్ధతుల్లో నియంత్రణకు ప్రభుత్వ పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నప్పటికీ.. తెల్లదోమ ఉధృతి ఏటా పెరుగుతూనే ఉంది. అయితే, రూగోస్ కన్నా ప్రమాదకరమైన తెల్లదోమ సంతతికి చెందిన బొండార్స్ నెస్ట్ ఫ్లై కూడా కొబ్బరి తోటలను ఆశిస్తోంది. తెల్లదోమ కన్నా ఇదే∙ఎక్కువ ప్రమాదకరమని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దీని ఉధృతి పైకి కనిపించదు కానీ నష్టం ఎక్కువే. 30% వరకు పంట నష్టం తొలుత కొబ్బరి, ఆయిల్ పామ్‌కు పరిమితమైన తెల్లదోమ.. తరువాత అరటి, పనస, జామ వంటి చెట్లను మాత్రమే కాకుండా నర్సరీలలోని అలంకరణ మొక్కలను సైతం ఆశిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. వర్షాకాలం కొంత తగ్గుతున్నా అక్టోబరు నుంచి దీని ఉధృతి పెరుగుతుంది. జూన్ నెలాకరు వరకు తోటలకు నష్టం ఎక్కుగా ఉంటుంది. తెల్లదోమ వల్ల గడచిన మూడేళ్లలో కొబ్బరిలో సుమారు 30 శాతం దిగుబడి కోల్పోయినట్టు అంచనా. కాయ సైజు కూడా తగ్గింది. తెల్లదోమ ఆశించిన ఆయిల్ పామ్, అరటి, పనస తదితర చెట్లు బలహీనపడుతున్నాయి. దిగుబడిలో తగ్గుదల కనిపిస్తున్నది. వర్షాకాలంలో తెల్లదోమ ఉధృతి తగ్గుతుంది. అందుకని, దీని వల్ల పెద్దగా నష్టం లేదని కొందరు రైతులు ఉదాసీనంగా ఉంటున్నారు. కానీ వాస్తవంగా రూగోస్ తెల్లదోమ సోకితే పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. చదవండి: మార్నింగ్ వాక్‌కి వెళ్లింది... కోటీశ్వరాలైంది!! బదనికలతో సమవర్థవంతంగా కట్టడి అంబాజీపేటలోని డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉద్యాన పరిశోధనా స్థానంలో తెల్లదోమపై పరిశోధనలు సత్ఫలితాలనిస్తున్నాయి. తెల్లదోమ నివారణకు వేపనూనె, గంజి ద్రావణం పిచికారీ చేయడం, పసుపురంగు జిగురు అట్టలు ఏర్పాటు చేయాలని ఉద్యాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటికన్నా సూడోమల్లాడ ఆస్టార్ (డ్రై కోక్రై సా) అనే రకం బదనికలు సమర్ధవంతంగా తెల్లదోమను నివారిస్తున్నట్లు శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఈ బదనికలకు తెల్లదోమ ఒక్కటే మంచి ఆహారమని గుర్తించారు. ఈ బదనికల గుడ్లను తీసుకువెళ్లి తోటల్లో చెట్లపై అక్కడక్కడా పిన్ చేస్తే తెల్లదోమ అదుపులో ఉంటున్నదని శాస్త్రవేత్తలు నిర్థారణకు వచ్చారు. అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం బయోల్యాబ్‌లో బదనికలను ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ ఏటా 45 లక్షల వరకు బదనికలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని రైతులకు తక్కువ ధరకు అమ్ముతున్నారు. వీటిని ఆంధ్రప్రదేశ్ రైతులే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళలకు చెందిన యూనివర్శిటీలు, ఉద్యాన, వ్యవసాయ శాఖలు, రైతులు తీసుకెళ్తున్నారు. కావాలని అడిగిన వారందరికీ బదనికలను ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. డిమాండ్ అధికంగా ఉండడాన్ని గుర్తించి తాడేపల్లిగూడెం వద్ద వెంకట్రామన్నగూడెంలోని డా. వైఎస్సార్ విశ్వవిద్యాలయం ఆవరణలో, శ్రీకాకుళం జిల్లా సోంపేట లోనూ ఈ ఏడాది నుంచి బదనికల ఉత్పత్తిని ప్రారంభించటం విశేషం. చదవండి: టీవీ చూస్తూ.. హాయిగా నిద్రపోతే చాలు.. నెల జీతం రూ.25 లక్షలు!! బదనికల ఉత్పత్తిపై పలు సంస్థలతో ఎంవోయూలు తెల్లదోమ నియంత్రణకు ప్రభుత్వం, డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నాయి. బదనికలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి. వీటిని ఇప్పటి వరకు ఉద్యాన విశ్వవిద్యాలయమే ఉత్పత్తి చేస్తున్నది. బదనికలను మరింత విస్తృతంగా రైతులందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా కొన్ని ప్రైవేట్ సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాల ద్వారా కూడా ఉత్పత్తి చేయించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ఆయా సంస్థలతో ఉద్యాన విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందాలు (ఎంవోయు)లు సైతం చేసుకుంది. బదనికలు విస్తృతంగా రైతులకు అందించాలని వర్సిటీ భావించింది. బదనికలను ఉత్పత్తి చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు, సహకార సంఘాలకు, పదవీ విరమణ చేసిన శాస్త్రవేత్తలకు, ప్రైవేటు సంస్థలకూ అందిస్తోంది. ఇప్పటికే కొన్ని సంస్థలతో వర్శిటీ ఒప్పందం చేసుకుంది. ఆయా సంస్థల నుంచి కూడా రైతులు బదనికలను పొంది, సకాలంలో తోటల్లో వదిలితే తెల్లదోమ నియంత్రణ సాధ్యమవుతుంది. ప.గో. జిల్లాకు చెందిన గోద్రేజ్ కంపెనీ, గోపాలపురానికి చెందిన ఎస్ఎస్డీ ఎంటర్ప్రైౖజెస్, తాడేపల్లిగూడెం సమీపంలోని త్రిబుల్ ఎక్స్ కంపెనీ, తమిళనాడుకు చెందిన బాలాజీ నిమ్మ, క్రిష్టా బయాక్స్, ఎకో కేర్ ఎంవోయు చేసుకున్నారు. అలాగే, తూ. గో. జిల్లా అంబాజీపేటలోని గోదావరి ఇంటిగ్రేటెడ్ ఫార్మర్స్ ట్రేడింగ్ అండ్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (గిఫ్ట్), దేవగుప్తం ప్రాధమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం కూడా ఎంవోయులు చేసుకొని, లాబ్‌లు ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నాయి. ఈ కేంద్రాల్లో ఉత్పత్తి ప్రారంభమైతే రైతులకు బదనికలు మరింత విస్తృతంగా అందుబాటులోకి వస్తాయి. బదనికల ఉత్పత్తికి బయోల్యాబ్ నెలకొల్పిన దేశంలోనే తొలి రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ‘గిఫ్ట్’ అరుదైన ఘనత సాధించనుంది. ఉద్యాన శాఖ సహకారంతో డిసెంబరు మొదటి వారం నుంచి బదనికలను ఉత్పత్తి చేయబోతున్నందుకు సంతోషంగా ఉందని ‘గిఫ్ట్’ చైర్మన్ కొవ్వూరి త్రినాద్రెడ్డి (94402 04323) అన్నారు. తెల్లదోమ నివారణకు కోనసీమ రైతులకు నాణ్యమైన వేప నూనె, జీవన ఎరువులు, బదనికలతోపాటు హిస్సారియా కల్చర్‌నూ అందిస్తామన్నారు. ఆధృతిని బట్టి బదనికలు వదలాలి సూడోమల్లాడ ఆస్టార్ (డ్రై కోక్రై సా) అనే రకం బదనికల (రెక్కల పురుగుల) గుడ్లను రూగోస్ తెల్లదోమ సోకిన కొబ్బరి, పామాయిల్ చెట్ల ఆకులపై రైతులు పిన్ చేసుకోవాలి. ఆ గుడ్ల లో నుంచి వెలువడే బదనికలు తెల్లదోమ గుడ్లను తింటూ ఉధృతిని అరికడతాయి. తోటల్లో తెల్లదోమ ఉధృతిని బట్టి చెట్ల ఆకులపై బదనికల గుడ్లను పెట్టుకోవాలి. ఆకుకు ఐదు నుంచి పది రూగోస్ తెల్లదోమ వలయాలు ఉంటే రెండు గ్లుడ్లు చాలు. పది హేను రోజుల వ్యవధిలో రెండుసార్లు పెడితే మంచి ఫలితం ఉంటుంది. ఈ రకం బదనికలు బొప్పాయి, మందార చెట్టు మీద ఆశించే రసం పీల్చే పురుగులు పేనుబంక, పిండినల్లిని కూడా తింటున్నాయి. పాలీహౌస్‌లలో కూడా ఇవి సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి. వెయ్యి గుడ్లను రూ.150కు పరిశోధనా స్థానం రైతులకు అందజేస్తుంది. – డాక్టర్ ఎన్.బి.వి.చలపతిరావు, ప్రధాన శాస్త్రవేత్త, కీటక శాస్త్ర నిపుణులు, డా. వై.ఎస్.ఆర్. ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట 08856244436/243711 -
ఆయిల్ పామ్ సాగుపై అపోహలు వద్దు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవిం చిన తరువాత, దశలవారీగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి, వ్యవసాయం అంటే దండగ అనే భయంతో ఉన్న రైతాంగాన్ని ధైర్యంగా వ్యవసాయం చేసే దిశగా ఆత్మవిశ్వాసం పెంపొందించారు ముఖ్యమంత్రి కేసీఆర్. దీంతో 2014కు ముందు ఆకలిబాధలతో తండ్లాడిన తెలంగాణ ఇప్పుడు దేశానికి అన్నపూర్ణగా నిలిచింది. గత ఏడాది వానాకాలం, యాసంగి కలిపి ఏకంగా 3 కోట్ల టన్నుల పైచిలుకు వరి ధాన్యం పండించడం గమనార్హం. సంప్రదాయ పంటల సాగు నుండి ప్రత్యామ్నాయ పంట లవైపు నడిపించే ప్రయత్నంలో భాగంగా– ప్రధానంగా ఆయిల్ పామ్ సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని, తెలంగాణలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నది. ఈ నేప థ్యంలో కొందరు వ్యవసాయ నిపుణులు, మేధావులు ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహాన్ని తప్పుపడుతూ అనేక వాదనలు వివిధ మాధ్యమాల ద్వారా వినిపిస్తున్నారు. దేశంలో ప్రతి ఏటా 22 మిలియన్ టన్నుల వంట నూనెలను వినియోగిస్తుండగా కేవలం ఏడు టన్నుల వంటనూనెలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. మిగిలిన 15 టన్నుల వంట నూనెలను దిగుమతి చేసుకోవడం జరుగుతున్నది. ఈ మొత్తం దిగుమతులలో దాదాపు 60 శాతం పామాయిల్‌ను సుమారు రూ. 60 వేల కోట్ల నుండి రూ.70 వేల కోట్లు వెచ్చించి దిగుమతి చేసుకోవడం జరుగుతున్నది. దేశంలో ప్రస్తుతం 8.25 లక్షల ఎకరాలలో మాత్రమే ఆయిల్ పామ్ సాగవుతుండగా, ఏడాదికి 16.85 లక్షల మెట్రిక్ టన్నుల గెలల నుండి 2.81 లక్షల మెట్రిక్ టన్నుల ముడి పామ్ ఆయిల్ ఉత్పత్తి అవుతున్నది. తెలంగాణలో 49 వేల ఎకరాలలో సాగవుతుండగా ఏడాదికి 39 వేల మెట్రిక్ టన్నుల ముడి పామాయిల్ ఉత్పత్తి అవుతున్నది. తెలంగాణ రాష్ట్ర జనాభాకు ఏడాదికి 3.66 లక్షల టన్నుల పామ్ ఆయిల్ అవసరం. ఈ దేశ అవసరాల మేరకు పామాయిల్ ఉత్పత్తి జరగాలంటే దేశం మొత్తంలో కనీసం 70 లక్షల ఎకరాలలో దీన్ని సాగు చేయాల్సి ఉంటుంది. అప్పుడు కూడా అది దేశ అవసరాలకు మాత్రమే సరిపోతుంది. స్థానిక, జాతీయ అవసరాలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కన్నా ముందే రైతులను ఈ వైపు ప్రోత్సహించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు అనువైన జిల్లాలను గుర్తిం చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్రం డాక్టర్ బీఎంసీ రెడ్డి అధ్యక్షతన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ సైంటిస్టులు సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2019 నవంబర్‌లో తెలంగాణలో పర్యటించి తెలంగాణలోని 25 జిల్లాలు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమని నివేదిక ఇచ్చింది. ప్రధానంగా వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగును రైతుకు 50 శాతం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించాలని కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో నిర్ణయించారు. ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్‌ను ఎంచుకోవడానికి కూడా కారణం ఉంది. ఈ దేశంలో రైతుకు బై బ్యాక్ గ్యారంటీ పాలసీ ఉన్న ఏకైక పంట ఆయిల్ పామ్ మాత్రమే. పైగా పెట్టుబడి తక్కువ. చీడ పీడలు, కోతులు, అడవి పందుల బెడద ఉండదు. మొక్క నాటిన నాటి నుండి నాలుగేళ్ల వరకు ఆరుతడి అంతర పంటలను వేసుకోవచ్చు. పంట జీవితకాలం 30 ఏళ్ల వరకు అందులో అదనంగా కోకోవ పంటను సాగు చేసుకోవచ్చు. తెలంగాణ ఆయిల్ పామ్ సాగువైపు దృష్టి సారించిన తర్వాతే కేంద్రం ఈ దిశగా దేశ రైతాంగాన్ని ప్రోత్సహించేందుకు రూ.11,040 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాల క్రమంలో పలువురు వ్యవసాయ నిపు ణులు, రైతు సంఘాల నేతలు–ఈ సాగులోని పర్యావరణ కార ణాలను, వంట నూనెల కల్తీని, భూగర్భ జలాల వాడకాన్ని ఎత్తి చూపుతూ, తెలంగాణ వాతావరణ పరిస్థితులు అనుకూలం కావని, దేశంలోని కొద్ది మంది భూస్వాములకే ఈ పంట సాగు ప్రయోజనం చేకూరుస్తుందని పలు రకాల అభ్యంతరాలను లేవనెత్తుతున్నారు. దీన్ని ప్రజలు ఆదరించడం లేదని, కేవలం సౌందర్య ఉత్పత్తులు, జంక్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, షాంపూ, డిటర్జెంట్, టూత్ పేస్టులు, కొవ్వొత్తుల తయారీలోనే వినియోగిస్తున్నారని చెబుతున్నారు. అయితే దేశంలో, ప్రపంచంలో వ్యాపారం జరుగుతున్న అనేక ఉత్పత్తులు ఆయిల్ పామ్ ఉప ఉత్పత్తుల ద్వారానే తయా రవుతున్నాయి. దీని ద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు దీని సాగు వద్దనడంలో సహేతుకత ఎక్కడుంది? తెలంగాణ ప్రభుత్వం నువ్వులు, వేరుశనగ, కుసుమ, సోయా వంటి నూనెగింజల సాగు వైపు సన్న, చిన్నకారు రైతులను ప్రోత్సహిస్తూనే ఆయిల్ పామ్ సాగును కూడా ప్రోత్సహిస్తున్నది. తెలంగాణలో యాసంగి పంట అయిన వేరు శనగను దాదాపు 5 లక్షల ఎకరాలలో సాగు చేస్తున్నారు. దీనిని దాదాపు 20 లక్షల ఎకరాలకు పెంచినా మార్కెట్ డిమాండ్ తగ్గదనే లక్ష్యంతో తెలంగాణ వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. దేశంలో అత్యధికంగా 50 లక్షల ఎకరాలలో వానాకాలం పంటగా వేరుశనగను గుజరాత్లో సాగు చేస్తారు. అయితే ఆఫ్లాటాక్సిన్ (శిలీంధ్రం) ఉన్నందున అక్కడి పంటకు అంతర్జాతీయ డిమాండ్ అంతగా లేదు. తెలంగాణ వేరుశనగ పంట ఆప్లాటాక్సిన్ రహి తంగా ఉన్నట్లు ఇక్రిశాట్ పరిశోధనలలో వెల్లడైంది. దీనికి అంత ర్జాతీయంగా ఆదరణ ఉంది. అందుకే దీనిని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయించారు. విదేశాల నుండి తెచ్చుకుంటున్న వంటనూనెల దిగుమతిని తగ్గించుకునే క్రమంలో దేశంలో 70 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేసినప్పుడు మాత్రమే మన దేశం పామాయిల్ దిగుమతి విషయంలో స్వయంసమృద్ధి సాధించినట్లు అవుతుంది. 70 లక్షల ఎకరాలలో ఇది సాగయినప్పటికీ ఇతర వంటనూనెల సాగును ప్రోత్సహించాల్సిందే. ఇది వంటనూనెలలో ఒక భాగం మాత్రమే. ఇన్నేళ్లూ ఈ దిశగా ప్రోత్సహించకపోవడం తప్పిదం. ఇప్పుడు ప్రోత్సహిస్తుంటే అభినందించకుండా వ్యతిరేకించడం శోచనీయం. ఆయిల్ పామ్ సాగు మూలంగా భూస్వాములకే లాభం అనే వాదన అసంబద్ధమైనది. దేశంలో సీలింగ్ వ్యవస్థ వచ్చిన తర్వాత భూస్వాములు లేరు. 54 ఎకరాల వరకే ఒక రైతు మీద భూమి ఉంటుంది. అంతకుమించి ఉండేది కంపెనీల పేరు మీదనే. తెలంగాణలో వ్యవసాయభూమి కోటి 50 లక్షల ఎకరాలు. ఇందులో చిన్న, సన్నకారు రైతులే 91.48 శాతం. ఈ విషయాలు తెలిసి కూడా ఆరోపణలు చేస్తుండటం గర్హనీయం. తెలంగాణలో అత్యధిక శాతం ఊష్ణోగ్రతలు కలిగి ఉండే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఆయిల్ పామ్ సాగు అధికంగా ఉంది. అంతకన్నా తక్కువ ఊష్ణోగ్రతలు ఉండే ప్రాంతంలో ఇది పండదు అనే వాదన అర్థరహితం. ఒక ఎకరా వరి సాగుకు అవసరమైన నీటితో 4 ఎకరాల ఆయిల్ పామ్ సాగుచేయవచ్చు. దీని మూలంగా మొదటి ఏడాది రూ. 23 వేలు, రెండో ఏడాది రూ. 22 వేలు, మూడో ఏడాది రూ. 20 వేలు, నాలుగో ఏడాది రూ. 16,800 విద్యుత్ ఖర్చు ఆదా చేయవచ్చని నిపుణుల అంచనా. పైగా ఇతర పంటలకు లేనివిధంగా ఆయిల్ పామ్‌కు ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం గెలలు కొని, పదిహేనురోజులకు ఒకసారి డబ్బు రైతుల ఖాతాలలో జమయ్యే అవకాశం ఒక్క ఈ పంటకే ఉంది. ఇది పాత తెలంగాణ కాదు. ఈ దేశానికి కొత్త దారిని చూపే శక్తిని సంతరించుకున్న తెలంగాణ. తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమపార్టీ ప్రభుత్వానికి తెలంగాణను ఎలా ముందుకు తీసుకెళ్లాలో అవగాహన ఉంది. దురభిప్రాయాల వ్యాప్తిని ఆపితే మంచిది. -సందీప్‌రెడ్డి కొత్తపల్లి వ్యాసకర్త తెలంగాణ వ్యవసాయ మంత్రివద్ద ప్రజా సంబంధాల అధికారి -
ఆయిల్ పామ్ గెలలకు ధర హామీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ శాఖ నూతనంగా ప్రతిపాదించిన జాతీయ వంట నూనెలు–ఆయిల్ పామ్ మిషన్ (నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్– ఆయిల్ పామ్) పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ కేంద్ర ప్రాయోజిత పథకం ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తుంది. దేశం వంట నూనెల దిగుమతులపై ఆధారపడి ఉన్నందున ఆయా పంటల విస్తీర్ణం పెంచడం, ఉత్పాదకత పెంచడం లక్ష్యంగా ఈ పథకం పనిచేస్తుంది. రూ. 11,040 కోట్ల మేర ఖర్చయ్యే ఈ పథకంలో కేంద్రం రూ. 8,844 కోట్లు, రాష్ట్రాలు రూ. 2,196 కోట్ల మేర వెచ్చించాల్సి ఉంటుంది. 2025–26 సంవత్సరం నాటికి అదనంగా 6.5 లక్షల హెక్టార్ల మేర పామాయిల్ సాగయ్యేలా లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా మొత్తం పామాయిల్ సాగు 10 లక్షల హెక్టార్లకు చేరుతుంది. పామాయిల్ పంటకు ధర హామీ సాధారణంగా పామాయిల్ గెలల దరలు అంతర్జాతీయ క్రూడ్ పామ్ ఆయిల్ ధరల అనిశ్చితి వల్ల ప్రభావితమవుతాయి. అందువల్ల తొలిసారిగా కేంద్రం పామాయిల్ రైతులకు తాజా గెలలకు గాను ధర హామీ అందించనున్నట్టు ప్రకటించింది. దీనిని వయబులిటీ ప్రైస్ (వీపీ)గా పేర్కొంది. దీని ద్వారా ధరల అనిశ్చితి నుంచి రైతులకు భరోసా అందుతుందని తెలిపింది. రాష్ట్రాలు ఈ పథకం వర్తింపునకు కేంద్రంతో ఎంవోయూ కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఇన్‌పుట్స్‌కు సాయం పెంపు.. ప్లాంటింగ్ మెటిరియల్ తదితర అవసరాల కోసం హెక్టారుకు కేంద్రం ప్రస్తుతం ఇస్తున్న రూ. 12 వేల సాయాన్ని రూ. 29 వేలకు పెంచింది. పామాయిల్ తోటల్లో పాత చెట్ల స్థానంలో కొత్త చెట్లను నాటేందుకు వీలుగా మొక్కకు రూ. 250 చొప్పున ఆర్థికసాయాన్ని కూడా కేంద్రం ఈ పథకం ద్వారా ప్రకటించింది. ప్లాంటింగ్ మెటిరియల్ కొరతను తీర్చేందుకు వీలుగా సంబంధిత నర్సరీలకు 15 హెక్టార్లకు రూ. 80 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. ఈశాన్య ప్రాంతాల వ్యవసాయ మార్కెటింగ్ సంస్థ పునరుద్ధరణకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. దీనికి రూ. 77 కోట్ల మేర పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటించింది. -
ఆయిల్‌పామ్ సాగు లక్ష్యం 20 లక్షల ఎకరాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగువిస్తీర్ణాన్ని భారీగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 45 వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతుండగా, రాబోయే మూడేళ్లలో 20 లక్షల ఎకరాలకు పెంచేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆయిల్‌పామ్ రైతులకు ఎకరాకు గరిష్టంగా రూ.36 వేల ఆర్థికసాయాన్ని అందించనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు కేటాయించనున్నాయి. పొరుగుదేశాల నుంచి నూనె దిగుమతులతోపాటు వరిసాగు విస్తీర్ణం, ధాన్యం సేకరణ భారం తగ్గించుకోవచ్చనే ఉద్దేశంతో కేంద్రం ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 25 జిల్లాల్లో 8.24 లక్షల ఎకరాలు ఆయిల్‌పామ్ సాగుకు అనుకూలంగా ఉన్నాయని గుర్తించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిర్దేశించిన లక్ష్యం కంటే మూడు రెట్లు అధికవిస్తీర్ణంలో పంటసాగు చేపట్టేవిధంగా చర్యలు చేపడుతోంది. ఈ మేరకు ఆయిల్‌ఫెడ్ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మూడేళ్లు... మూడుదశలు రాబోయే మూడేళ్లలో మూడు దశలుగా ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచనుంది. 2022–23 సంవత్సరంలో 3 లక్షల ఎకరాలు, 2023–24లో 7 లక్షల ఎకరాలు, 2024–25లో మరో 10 లక్షల ఎకరాల పంటను సాగు చేసే విధంగా కార్యాచరణ రూపొందించింది. ఈ పంట సాగు కోసం 11 కంపెనీలకు 25 జిల్లాలను కేటాయించింది. ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంచితే ప్రత్యక్షంగా 30 వేలమంది, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆయిల్‌పామ్ రైతులకు ఒక్కో ఎకరాకు రూ.36 వేల చొప్పున సాయాన్ని మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్ పంట సాగు కోసం రూ.7,200 కోట్లు ఖర్చు చేయనుంది. ఆయిల్‌పామ్ పంట సాగుకు నీటి వినియోగం తక్కువ. టీఎస్ ఆయిల్‌ఫెడ్ సరికొత్త యాప్ ఆయిల్‌పామ్ రైతులకు సూచనలు, సలహాలతోపాటు నిరంతరం ఫీడ్ బ్యాక్ తెలుసుకునేవిధంగా టీఎస్ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ సరికొత్త యాప్, ప్రత్యేక వెబ్‌పేజీని అందుబాటులోకి తీసుకొచి్చంది. వీటిని ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎండీ ఎం.సురేందర్ లాంఛనంగా ప్రారంభించారు. నేడు టీ–సాట్ ప్రత్యేక లైవ్ కార్యక్రమం ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణంపై రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో శనివారం మధ్యాహ్నం 12 నుండి 2–గంటల వరకు టీ–సాట్ స్టూడియోలో ప్రత్యేక లైవ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల్లో అవగాహన కలి్పంచేందుకు మంత్రి ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. -
తెలంగాణ కేబినేట్ భేటీ: ‘స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ’ కి ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైన కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి పెరుగుతోంది కనుక.. నిల్వ, మార్కెటింగ్‌పై దృష్టిపెట్టాలని ఆదేశించారు. ధాన్యం నిల్వ, మిల్లింగ్, మార్కెటింగ్, నూతన పరిశ్రమల ఏర్పాటుకు.. తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్‌కమిటీని నియమించారు. మంత్రులు గంగుల, హరీష్‌రావు, కేటీఆర్, పువ్వాడ, ఇంద్రకరణ్, సబిత, ప్రశాంత్‌రెడ్డి, జగదీష్రెడ్డిలని సబ్‌కమిటీ సభ్యులుగా నియమించారు. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు పంట పెట్టుబడి ప్రోత్సాహకం కింద సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మొదటి ఏడాది 26వేలు రూపాయలు, రెండు, మూడో ఏడాదికి గాను 5వేల రూపాయల చొప్పున సబ్సిడీ ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ’ కి ఆమోదం అలానే ‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ’కి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున స్థాపించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో కనీసం 10 జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 500 ఎకరాలకు తగ్గకుండా 1000 ఎకరాల వరకు తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటు చేసి 2024 -25 సంవత్సరం వరకు రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఎకరాలల్లో ఏర్పాటు లక్ష్యంగా చర్యలు చేపట్టాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ మార్గదర్శకాల ద్వారా ప్రోత్సాహకాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వం భూమిని సేకరించి ఏర్పాటు చేసిన జోన్లలో అన్ని మౌలిక వసతులను ప్రభుత్వమే అభివృద్ది చేసి దరఖాస్తు చేసుకున్నవారికి అర్హత మేరకు అందులో భూమిని కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. తద్వారా సుమారు 25 వేల కోట్ల పెట్టుబడిని ఆకర్షించి, 70 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి 3 లక్షల మందికి పరోక్ష ఉపాధిని కల్పించాలని నిర్ణయించింది. విదేశాలకు ఎగుమతి చేసే నాణ్యతతో కూడిన స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సహకాలు అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ప్రత్యేకంగా ‘ప్లగ్ అండ్ ప్లే’ పద్దతిలో షెడ్లను ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ రంగంలో సాంకేతికతను మరియు నైపుణ్యాన్ని పెంచే దిశగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ విధానాన్ని అమలు పరచాలని అధికారులను ఆదేశించింది. రైతులకు సమగ్ర శిక్షణకు సౌకర్యాలను వ్యవసాయశాఖ కల్పించాలి అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఉద్యానశాఖను పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా మార్చాలని.. పౌరసరఫరాలు, వ్యవసాయశాఖలో ఖాళీలు భర్తీ చేయాలని తెలిపారు. పండిన ధాన్యం వెంటనే మిల్లింగ్ చేసి డిమాండ్ ఉన్నచోటకు పంపాలన్నారు. అన్ని రకాల పంట ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. రైస్ మిల్లుల మిల్లింగ్ సామర్థ్యం పెంచుకోవాలని సూచించారు. కొత్త పారాబాయిల్డ్ మిల్లులు ఎక్కువగా స్థాపించాలని కేసీఆర్ ఆదేశించారు. -
ధర పెరిగింది.. సాగు బాగైంది
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఆయిల్‌పామ్ గెలల ధర టన్ను రూ.18 వేలకు పెరిగింది. రెండేళ్ల క్రితం టన్ను గెలలకు రూ.7,827 మాత్రమే లభించగా.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రెండేళ్లలోనే రూ.10 వేలకు పైగా పెరిగింది. ఆయిల్‌పామ్ తోటలను తొలగిస్తూ వచ్చిన రైతులు ధర ఆశాజనకంగా ఉండటం.. ప్రభుత్వ ప్రోత్సాహం పెరగడంతో తిరిగి పెద్దఎత్తున సాగు ప్రారంభిస్తున్నారు. ఫలితంగా రెండేళ్లలోనే రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగు పెరిగింది. రైతుల్లో నూతనోత్సాహం వైఎస్ జగన్ సర్కారు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడంతో రైతుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. 2018లో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు వచ్చినప్పుడు ఆయిల్‌పామ్ రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆ సమయంలో తెలంగాణలో ఆయిల్‌పామ్ గెలల ధరకు, మన రాష్ట్రంలో పలికిన ధరకు మధ్య గల వ్యత్యాస సొమ్మును వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం 29,365 మంది రైతుల ఖాతాల్లో రూ.80.32 కోట్లను జమ చేశారు. పెరిగిన సాగు విస్తీర్ణం వ్యత్యాస ధర చెల్లించడంతో పాటు ప్రభుత్వం ఆయిల్‌పామ్ గెలల ధరను అనూహ్యంగా పెంచింది. అడహక్ పేమెంట్‌గా టన్నుకు రూ.18 వేలు అందిస్తోంది. అదనంగా రవాణా నిమిత్తం మరో రూ.200 నుంచి రూ.400 వరకు రైతుకు లభిస్తోంది. మరోవైపు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం ఆయిల్‌పామ్ రైతులకు మరింత ప్రయోజనాన్ని చేకూరుస్తోంది. దీంతో రెండేళ్ల క్రితం రాష్ట్రం 1.60 లక్షల హెక్టార్లకే పరిమితమైన సాగు విస్తీర్ణం 20 వేల హెక్టార్లు పెరిగి ప్రస్తుతం 1.80 లక్షల హెక్టార్లకు చేరుకుంది. రైతు ప్రభుత్వమంటే ఇదీ ఆయిల్‌పామ్ గెలలకు గిట్టుబాటు ధర కల్పించాలని గత ప్రభుత్వ హయాంలో ఎన్నోసార్లు ఆందోళనలు చేపట్టాం. కాలం వెళ్లబుచ్చారే గానీ ధర మాత్రం పెంచలేదు. ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ జగన్ ప్రభుత్వం టన్ను ధరను రూ.18 వేలకు పెంచింది. రైతు ప్రభుత్వమంటే ఇదీ. – సాయన కృష్ణారావు, రైతు, కామవరపుకోట, పశ్చిమ గోదావరి ఆయిల్‌పామ్‌కు స్వర్ణయుగం ఆయిల్‌పామ్‌కు ఇది స్వర్ణయుగం. ఎన్నడూ లేనంతగా ఆయిల్‌పామ్ రైతులకు మంచి ధర వస్తోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చూపిస్తున్న చొరవ అమోఘం. ప్రభుత్వ రంగంలో ఉన్న అయిల్ ఫెడ్‌కు సహకరిస్తే రైతులకు ప్రయోజనం ఉంటుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక టన్ను ధర రెట్టింపు కన్నా ఎక్కువ అయ్యింది. – కొఠారు రామచంద్రరావు, చైర్మన్, ఏపీ ఆయిల్ ఫెడ్ ఆయిల్‌పామ్ ధరపై నిర్ణయాధికారం ప్రభుత్వానిదే ఆయిల్‌పామ్ గెలల ధరపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో పామాయిల్ కంపెనీలపై రైతులు విజయం సాధించినట్టయింది. ప్రస్తుత చట్టాల ప్రకారం ఆయిల్‌పామ్ అంశం పూర్తిగా లెజిస్లేటివ్ పరిధికి లోబడినదేనని, ధర నిర్ణయానికి ముందు వ్యక్తిగత విచారణలు చేయాల్సిన పని లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత జనవరిలో విడుదల చేసిన జీవో 22 ప్రకారమే పామాయిల్ కంపెనీలు గెలలకు ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలావుంటే.. ప్రభుత్వ జీవో ప్రకారం గత 4 నెలల్లో కొనుగోలు చేసిన ఆయిల్‌పామ్ గెలలకు బకాయిల ధరలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదీ నేపథ్యం ఆయిల్‌పామ్ గెలలకు ధర నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 19న జీవో నంబర్ 22ను జారీ చేసింది. గత నవంబర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు పామాయిల్ గెలల్లో వచ్చే నూనె శాతాన్ని (ఓఈఆర్) 18.682గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని ప్రముఖ కంపెనీలు ఈ జీవోపై దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. రైతులకు రూ.200 కోట్ల లాభం ఓఈఆర్ ఒక శాతం పెరిగితే టన్ను గెలలకు సుమారు రూ.1,190 వరకు అదనంగా ధర వస్తుంది. గత ఏడాది 15 లక్షల టన్నుల ఆయిల్‌పామ్ గెలల దిగుబడి రాగా.. ఈ ఏడాది 16 లక్షల టన్నులు రావొచ్చని అంచనా. ప్రస్తుత జీవో ప్రకారం ధర నిర్ణయిస్తే రైతులకు ఈ ఏడాది రూ.200 కోట్ల మేర అదనంగా ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం ఓఈఆర్ 17.6 శాతాన్ని బట్టి కంపెనీలు ధర నిర్ణయిస్తుండగా.. ఇకపై 18.682 శాతం ప్రకారం ఇవ్వాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి, పట్టుదల వల్లే తమ సమస్యలు పరిష్కారమయ్యాయని నేషనల్ ఆయిల్‌పామ్ ఫార్మర్స్ అసోసియేషన్ నేతలు క్రాంతి కుమార్‌రెడ్డి, బొబ్బా రాఘవరావు ధన్యవాదాలు తెలిపారు. -
ఏపీలో ఆయిల్‌పామ్ రైతులకు ప్రభుత్వం శుభవార్త
సాక్షి, అమరావతి : ఆయిల్ పామ్ రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆయిల్‌పామ్ గెలలను టన్ను రూ.18 వేలకు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పెంచిన ధరను ఏప్రిల్ 20 నుంచి అమలు చేయాలని ఆయిల్ ఫెడ్‌కు నిర్దేశించింది.పెరిగిన రవాణా ఛార్జీలకు అనుగుణంగా.. 15 కి.మీ లోపు దూరానికి మెట్రిక్ టన్నుకు రూ.462.. 16 -30 కి.మీ లోపు దూరానికి మెట్రిక్ టన్నుకు రూ.659.30... 30 కి.మీ పైన ఉంటే మెట్రిక్ టన్నుకు రూ.741 అదనంగా ఇవ్వాలని నిర్ణయించింది. -
ఆయిల్ పామ్ కంపెనీలపై కన్నబాబు అసంతృప్తి
సాక్షి, అమరావతి : ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధుల తీరుపై వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. గత సమావేశంలో ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో జరిపిన చర్చలు కొలిక్కి రాకపోవటంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మరోసారి సమావేశమయ్యారు. గురువారం జరిగిన సమావేశంలో మంత్రి కన్నబాబు, ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి, వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, ఆయిల్ ఫెడ్ ఎండి శ్రీకాంతనాథ రెడ్డి పాల్గొన్నారు. సమీప రాష్ట్రాల్లో మాదిరిగానే ఓ.ఈ.ఆర్ రేటు నిర్ణయం జరగాలని, ఆయిల్ కంపెనీలు రైతుల సమస్యల పరిష్కారం కోసం సానుకూల ధరను నిర్ణయించాలని మంత్రి కన్నబాబు కోరారు. ( 'క్లియరెన్స్ రాగానే భక్తులను అనుమతిస్తాం' ) ఓ.ఈ.ఆర్ ధర పెంచుతూ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయటంపై ఆయన మండిపడ్డారు. ఆయిల్ పామ్ రైతుల ఉత్పాదక ఖర్చులు, కంపెనీల కొనుగోలు, తదుపరి ఖర్చులను మంత్రి క్షుణ్నంగా పరిశీలించారు. చివరిగా 17.5 ఓ.ఈ.ఆర్ రేటును ఇచ్చేందుకు ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులు కష్టంగా ఒప్పుకున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటిస్తామని మంత్రి కన్నబాబు చెప్పారు. ( ‘రైతు భరోసా కేంద్రాలను పటిష్టం చేస్తాం’ ) -
తెల్లదోమ విజృంభణ
సర్పిలాకార తెల్లదోమ దెబ్బకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉద్యానతోటలు అతలాకుతలమవుతున్నాయి. మరీ ముఖ్యంగా కొబ్బరి, ఆయిల్ పామ్ తోటలను ఇది పీల్చి పిప్పి చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం పూల ð ¬క్కలకు ప్రసిద్ధిగాంచిన కడియం నర్సరీలనూ తెల్లదోమ చుట్టుముట్టింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల రైతాంగంతోపాటు తెలంగాణలోని సత్తుపల్లి ప్రాంత కొబ్బరి, ఆయిల్ పామ్ రైతులను సైతం కలవరపెడుతోంది. దీనిని ఎదుర్కొనేందుకు అధికారులు, శాస్త్రవేత్తలు సంయుక్తంగా కృషి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఉద్యాన శాఖ సమీక్షలో ఆదేశాలిచ్చారు. ఇప్పటికే ఈ పనిలో నిమగ్నమైన అధికార యంత్రాంగం సీఎం ఆదేశాలతో నివారణ చర్యలను ఉధృతం చేసింది. రూగోస్ తెల్లదోమ ఇలా వ్యాపిస్తుంది ► వలయాకారపు తెల్లదోమ (రూగోస్) ప్రధానంగా గాలి ద్వారా తొలుత కొబ్బరి, ఆయిల్ పామ్ చెట్లను ఆశిస్తుంది. వీటిలో చక్కెర ఎక్కువ ఉండటమే దీనికి ప్రధాన కారణం. ► అక్కడి నుంచి జామ, మామిడి, పూలు, అలంకరణ మొక్కలను ఆశిస్తుంది. ► ఆకులో ఉండే పత్ర హరితాన్ని హరిస్తుంది. ► ఆకుల నుంచి రసాన్ని పీల్చి వేసి మైనం లాంటి తెల్లటి పదార్థాన్ని విసర్జిస్తుంది. దానిపై ’కాప్నోడియం’ అనే బూజు పెరిగి.. ఆకుపై నల్లటి పొర ఏర్పడుతుంది. దీని వల్ల సూర్యరశ్మి అందక కిరణజన్య సంయోగ ► క్రియ స్తంభించి చెట్టు పూర్తిగా నీరసించిపోతుంది. ► కొబ్బరిలో 40 శాతం, ఆయిల్ పామ్‌లో 35 శాతం దిగుబడి తగ్గిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ► తెల్లదోమను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదని, నివారణే మార్గమంటున్నారు. ఎక్కడెక్కడ ఉందంటే..? ► తూర్పు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని కొబ్బరి తోటల్ని, ఉభయ గోదావరి, కృష్ణాజిల్లాల్లోని వేలాది ఎకరాల ఆయిల్ పామ్ తోటల్ని ఇది ఆశించింది. ► తెలంగాణలోని సత్తుపల్లి ప్రాంతంలో కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్ని కూడా తెల్లదోమ ఆశించింది. ► కడియం నర్సరీలలో కొబ్బరి, ఆయిల్ పామ్, జామ, అలంకరణ మొక్కలను సైతం తెల్లదోమ కమ్మేసింది. ► 1.60 లక్షల ఎకరాల కొబ్బరిని, అదే స్థాయిలో ఆయిల్ పామ్ తోటల్ని ఇది ఆశించినట్టు అనధికారిక అంచనా. సమగ్ర యాజమాన్యంతోనే తెల్లదోమకు చెక్ ► సర్పలాకార తెల్లదోమ సోకితే రసాయనిక పురుగుమందులు చల్లటం తగదు. వీటిని చల్లితే మిత్రపురుగులు నశించి తెల్లదోమ రెండు–మూడు రెట్లు విజృంభిస్తుంది. అందువలన అవాంఛిత పురుగుమందుల వాడకం నివారించి మిత్రపురుగులను పెంచుకోవాలి. ► జీవ నియంత్రణతో తెల్లదోమను అదుపు చేయొచ్చు. ► కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్లో పసుపు రంగు టార్పలిన్ అట్టలను ఎకరానికి 10 నుంచి 15 చొప్పున (1 మీ.“ 1 మీ. విస్తీర్ణం) అతికించి, వాటికి ఆముదం పూసి, తెల్లదోమ తల్లి పురుగులను ఆకర్షించి, చంపాలి. ► వీటి ద్వారా దోమను పూర్తిగా అదుపు చేయకున్నా.. ఒక తల్లి దోమను చంపడం ద్వారా 100 పిల్ల దోమలను నిరోధించవచ్చు. ► తెల్లదోమ సోకిన మొక్కలను ఒక చోట నుంచి మరొక చోటకు తరలించకూడదు. ► డైకోక్రైసా ఆస్టర్ పురుగు తెల్లదోమ గుడ్లను తినేస్తుంది. డైకోక్రైసా ఆస్టర్ సంతతి వృద్ధికి దాని గుడ్లను తెల్లదోమ ఆశించిన తొలి దశలోనే చెట్ల ఆకులకు పిన్ చేసుకోవాలి. వీటిని అంబాజీపేటలోని కొబ్బరి పరిశోధనా స్థానంలోనే దేశంలోకెల్లా మొట్టమొదటి సారిగా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఏడాది 15 లక్షల గుడ్లను ఉత్పత్తి చేసి రైతులకు అందించారు. దేశవ్యాప్తంగా రోజుకు 3–4 లక్షల గుడ్లకు డిమాండ్ ఉంది. వచ్చే ఏడాది నుంచి రోజుకు లక్ష గుడ్ల ఉత్పత్తికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ► మిత్రపురుగైన ఎన్‌కర్సియా గ్వడెలోపే అనే బదనికలు ఈ తెల్లదోమలను అదుపులో ఉంచుతాయి. ఈ పురుగును ప్రయోగశాలలో ఉత్పత్తి చేసే అవకాశం లేదు. సహజ సిద్ధంగా కొబ్బరి తోటల్లో ఈ మిత్ర పురుగులు అభివృద్ధి చెందుతుంటాయి. అక్కడి నుంచి సేకరించి తెల్లదోమ ఆశించిన ప్రాంతాల్లో విడుదల చేయాలి. ► రిజర్వాయర్ మొక్కలు / బ్యాంకర్ మొక్కలను పెంచడం వలన ఎన్కార్సియా గ్వడెలోపే సంతతి పెరుగుతుంది. ► పురుగు స్థాయి ఎక్కువగా ఉండి మిత్రపురుగులు లేకపోతే, 1 శాతం వేపనూనెకు 10 గ్రా. డిటర్జెంట్ పౌడర్ కలిపి ఆకు అడుగు భాగాలు పూర్తిగా తడిచేలా 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. ► ఐసోరియ ఫ్యూమోసోరోసే అనే రకం కీటకాలను అరికట్టే శిలీంధ్రాన్ని లీటరు నీటికి 5 గ్రాముల స్పోర్స్ సాంద్రత 1“108గా ఉండాలి చొప్పున కలిపి తయారు చేసుకున్న శిలీంద్ర ద్రావణాన్ని 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయడం ద్వారా తెల్లదోమను అదుపులోకి తేవచ్చు. శిలీంద్రం సాంద్రత తగినంత లేకపోతే ఫలితాలు పాక్షికంగానే వస్తాయి. ఒక ప్రాంతంలో రైతులందరూ కలిసికట్టుగా చేయాల్సి ఉంటుంది. శిలీంద్ర ద్రావణాన్ని తయారు చేసుకునే పద్ధతిని అంబాజీపేటలోని కొబ్బరి పరిశోధనా కేంద్రంలో రైతులకు శిక్షణ ఇవ్వడంతోపాటు మదర్ కల్చర్‌ను కూడా పంపిణీ చేస్తున్నారు. ► నీటికి కొరత లేకపోతే.. నీటిలో డిటర్జెంట్ పౌడర్ కలిపి తెల్లదోమ ఆశించిన మొక్కలపై 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. ► పగటి ఉష్ణోగ్రత పెరగేకొద్దీ తెల్లదోమ ఉధృతి తగ్గుతుంది. 40 డిగ్రీల సెల్షియస్‌కు పెరిగేటప్పటికి తగ్గుతుంది. ► రైతులు సామూహికంగా నివారణ చర్యలు చేపడితే సర్పలాకార తెల్లదోమను సమర్థవంతంగా అరికట్టవచ్చు. – డా. ఎన్‌బీవీ చలపతిరావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఉద్యాన పరిశోధన స్థానం, డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, అంబాజీపేట, తూ.గో. జిల్లా – ఎ. అమరయ్య, సాక్షి బ్యూరో, అమరావతి -
‘మేము బిజీగా ఉన్నాం.. వాళ్లకు పనిలేక’..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పనుల్లో తాము బిజీగా ఉన్నామని, బీజేపీ నేతలు పనిలేక విమర్శలు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలపై ఆధారాలు చూపెట్టి మాట్లాడాలని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కంది పంటను మొత్తం తామే కొనుగోలు చేస్తామని, సీఎం కార్యాలయం నుంచి అనుమతి రావాల్సి ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్‌పై దృష్టి పెట్టిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కోరిక మేరకు రాబోయే రెండేళ్ల కాలంలో 18వేలకుపైగా హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగుకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. తెలంగాణలో ఆయిల్ పామ్ విస్తరణకు కేంద్రం అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో అవగాహన లేక తెలంగాణలో ఎవ్వరూ ఆయిల్ పామ్‌పై దృష్టి పెట్టలేదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ దూర దృష్టితో.. ఆయిల్ పామ్‌పై దృష్టి పెట్టి అధ్యయనం చేశామన్నారు. ‘‘కేంద్రం నుంచి వచ్చిన అధ్యయన కమిటీ రాష్ట్రంలో రెండు సార్లు పర్యటించి అనుమతి ఇచ్చింది. 45వేల ఎకరాలకు ఆయిల్ పామ్ సాగుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయిల్ పామ్ సాగులో ఎకరానికి ఏడాదికి 1లక్ష 20వేల నుంచి 1లక్ష 50వేల వరకు ఆదాయం వస్తుంది. ఆయిల్ పామ్ సాగులో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆయిల్ పామ్ పంటను ప్రభుత్వం కొంటుందనే గ్యారంటీ ఉంది. మన దేశానికి 21 మిలియన్ టన్నుల వంట నూనెల అవసరం ఉంది. ప్రతిఏటా 75 వేల కోట్లు ఖర్చు చేసి దిగుమతి చేసుకుంటున్నాము. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఖమ్మం,నల్గొండ,కొత్తగూడెం జిల్లాల్లో 50వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ పథకం ద్వారా రాయితీ అందిస్తున్నాము. రాష్ట్రంలో ప్రస్తుతం పామ్ ఆయిల్ ధర టన్నుకు 12వేలు ఉంది. నేను స్వయంగా 8 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు పెట్టాను. షెడ్యూల్ కులాలు, తెగలకు 100శాతం, బీసీ, చిన్న.. సన్నకారు రైతులకు 90శాతం, ఇతరులకు 80శాతం రాయితీ ఇస్తున్నాము. ఆయిల్ పామ్ సాగును తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామ’ని తెలిపారు. -
కోకో.. అంటే కాసులే!
సాక్షి, అమరావతి: తీయదనం.. అందులోనూ చాక్లెట్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి! అందువల్లనే ఏమో 2011లో భారత్‌లో 1.14 లక్షల టన్నులుగా ఉన్న చాక్లెట్ల వినియోగం 2018 నాటికి 3 లక్షల 23 వేల టన్నులకు చేరింది. యూరప్ దేశాల్లో అయితే మరీ ఎక్కువ. ఇటీవలి సర్వే ప్రకారం.. స్విట్జర్లాండ్‌లో ఒక్కొక్కరు ఏటా సగటున 8 నుంచి 9 కిలోల వరకు చాక్లెట్లు తింటున్నారట. ఈ చాక్లెట్ల తయారీకి ఉపయోగపడేదే.. కోకో. ఒక్క చాక్లెట్లే కాదు.. కాఫీ, కేకుల తయారీలోనూ దీన్ని వాడతారు. ఫలితంగా మంచి గిరాకీ కలిగిన ఎగుమతి పంటగా కోకో గుర్తింపు పొందింది. దీంతో రాష్ట్రంలో ఈ పంటకు ఆదరణ పెరుగుతోంది. గతేడాది 10 వేల టన్నుల కోకో గింజలు ఉత్పత్తి కోకో సాగుకు ఎర్ర నేలలు, గరప నేలలు అనువైనవి. తొలకరి నుంచి డిసెంబర్ వరకు ఈ మొక్కల్ని నాటవచ్చు. రాష్ట్రంలో అంతర పంటగా మూడు రకాల కోకో.. క్రయల్లో, ఫొరాస్టెరో, ట్రినిటారియోను సాగు చేస్తున్నారు. తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతంలోనూ, ఉష్ణ మండల తడి వాతావరణంలోనూ పెరుగుతోంది. కోకో చెట్లకు చిత్తడి అడవుల నీడ అవసరం. ఉద్యాన శాఖ లెక్క ప్రకారం.. మన రాష్ట్రంలో సుమారు 57 వేల ఎకరాల్లో కోకో పంట సాగవుతోంది. గతేడాది 10 వేల టన్నుల కోకో గింజలు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యాయి. కోకో రైతులకు ఉద్యాన శాఖ హెక్టారుకు రూ.11 వేల సబ్సిడీ అందిస్తోంది. కోకో కాయలు సేకరించేందుకు ప్లాస్టిక్ ట్రేలను సరఫరా చేస్తోంది. పాలిషెడ్స్ ప్లాట్‌ఫారాలూ ఏర్పాటు చేస్తోంది. కమీషన్ ఏజెంట్లు కోకో గింజలను కొనుగోలు చేసి చాక్లెట్ కంపెనీలకు సరఫరా చేస్తుంటారు. ప్రధానంగా మాండెలెజ్ కంపెనీ (క్యాడ్బరీస్).. రైతుల నుంచి కోకో గింజలను కొనుగోలు చేస్తోంది. ఈ కంపెనీ.. రైతులకు ఒక్కో కోకో మొక్కను రూ.4.80కు సరఫరా చేస్తోంది. సేద్యంలో మెళకువలనూ నేర్పుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి ప్రాంతంలో ఉన్న నర్సరీ నుంచి ఈ మొక్కలు సరఫరా అవుతున్నాయి. ఎకరాకు 200 మొక్కలు ఎకరా కోకో పంటకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు పెట్టుబడి అవసరం. ఎకరాకు 200 మొక్కల వరకు నాటుతుంటారు. నాటిన మూడో ఏడాది నుంచి కాపుకు వస్తుంది. పిందె వచ్చినప్పటి నుంచి కాయలు కోతకు రావడానికి ఐదు నెలల సమయం పడుతుంది. అప్పటి నుంచి ఏడాది పొడవునా పంట చేతికి వస్తుంది. ప్రతి కాయలో 25 నుంచి 45 వరకు విత్తనాలు ఉంటాయి. కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటగా వేయడం వల్ల అవసరమైన నీడ ఉంటుంది. కోకో చెట్లు రాల్చే ఆకులే ఆ పంటకు సేంద్రీయ ఎరువుగా దోహదపడతాయి. కొబ్బరి తోటల్లో ఎకరాకు 4 నుంచి 6 క్వింటాళ్లు, ఆయిల్‌పామ్ తోటల్లో 4 క్వింటాళ్ల పైబడి దిగుబడి వస్తుంది. అయితే.. ఎలుకలు, ఉడతల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి పట్ల రైతులు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కోకో లాభదాయకమైన పంట కోకో పంటకు అంతర్జాతీయంగా మంచి గిరాకీ ఉంది. ఆఫ్రికా దేశమైన ఘనా తర్వాత అంతటి నాణ్యమైన విత్తనాలు మన రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. లాభదాయకమైన పంట కావడంతో రైతులకు అవగాహన కల్పించేందుకు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. విస్తరణ అధికారులను కూడా నియమించాం. రైతులకు సబ్సిడీలు ఇవ్వడంతోపాటు మార్కెటింగ్ సౌకర్యాన్నీ కల్పిస్తున్నాం. రైతులు అదనపు సమాచారం కోసం సమీపంలోని ఉద్యాన అధికారిని లేదా యూనివర్సిటీ ఉద్యాన విభాగాన్ని సంప్రదించవచ్చు. సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. – చిరంజీవి చౌధురీ, కమిషనర్, ఉద్యాన విభాగం -
ఎన్నెన్నో ఆశలు..!
♦ పన్ను ప్రయోజనాలు... ఆయిల్‌పామ్ వృద్ధి... ♦ రియల్టీ పురోగతి లక్ష్యం కావాలన్న ఆకాంక్షలు సాధారణ ప్రజానీకం నుంచి అత్యున్నత స్థాయి వ్యక్తి వరకూ ప్రతి ఒక్కరూ కేంద్ర బడ్జెట్‌పై తమ ఆకాంక్షలను వ్యక్తం చేయడం సహజం. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటుల్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సమయం- ఫిబ్రవరి 29 సమీపిస్తుండడంతో వివిధ వర్గాలు తమ కోరికలను ప్రభుత్వానికి తెలియడానికి తగిన ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని ముఖ్య రంగాల ప్రముఖులు ఈ మేరకు వ్యక్తం చేస్తున్న కీలక సూచనలను ఒక్కసారి పరిశీలిస్తే... ఆయిల్ పామ్‌కు ప్రత్యేక బోర్డ్... ఒక పరిశ్రమగా పామాయిల్ రంగం ఎదిగేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రత్యేకించి ఇందుకు ఒక ప్రత్యేక బోర్డ్‌ను ఏర్పాటు చేయాలి. దేశీయ పరిశ్రమకు ప్రయోజనం ఒనగూర్చడంలో భాగంగా క్రూడ్ పామాయిల్ దిగుమతి సుంకాలను ప్రస్తుత 17.5 శాతం నుంచి 45 శాతానికి పెంచాలని ఆయిల్ పామ్ డెవలపర్స్ అండ్ ప్రాసెసర్స్ అసోసియేషన్ కోరుతోంది. ఇందుకు సంబంధించి పామాయిల్ రంగానికి ప్రత్యేక దిగుమతి విధానాన్ని అవలంభించాలి. దేశీయంగా పామాయిల్ ఉత్పత్తి పెరగడం-- ద్రవ్యోల్బణం కట్టడికి దోహదపడుతుంది. ఈ రంగం పురోగతికి ప్రత్కేకంగా రూ.10,000 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరపాలి. అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ సవరణ ద్వారా భారీ ఎత్తున పంట ఉత్పత్తి పెరగడానికి దోహదపడాలి. - సంజయ్ గోయంకా, ప్రెసిడెంట్, ఓపీడీపీఏ పన్ను ప్రయోజనాలు కల్పించాలి సాధారణ ప్రజానీకానికి పన్ను సంబంధ ప్రయోజనాలను నెరవేర్చాలి. ప్రత్యేకించి బ్యాంకింగ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీపై పన్ను ప్రయోజనాలు కల్పించాలి. ప్రస్తుతం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 పైన వడ్డీవస్తే.. దానిపై మూలం వద్ద పన్ను (టీడీఎస్) కోత ఉంది. ఈ పరిమితిని మరింత పెంచాలి. బ్యాంకింగ్ డిపాజిట్ల ఆకర్షణకు, వినియోగ వృద్ధి కూడా ఊతం ఇచ్చే చర్య ఇది. వస్తు సేవల పన్ను అమలు దిశలో... ఇందుకు అనుగుణంగా పరోక్ష పన్నుల వ్యవస్థలో కొన్ని మార్పులు ఉంటాయని కూడా భావిస్తున్నాం. - ముకేశ్ బుటానీ, మేనేజింగ్ పార్ట్నర్, బీఎంఆర్ రియల్టీకి మౌలిక హోదా... రియల్టీకి తగిన ఊపునివ్వడానికి మౌలిక పరిశ్రమ హోదా కల్పించడం ఇందులో ఒకటి. దీనివల్ల ఆర్థిక సంస్థల నుంచి కొంత తక్కువ వడ్డీ రేటుకు పరిశ్రమకు రుణ సౌలభ్యం కలుగుతుంది. ఇక రియల్టీ ప్రాజెక్టులకు సంబంధించి పన్ను సంబంధ సరళీకరణలు, రాయితీలు అవసరం. ఈ దిశలో జీఎస్టీ అమలును కూడా పరిశ్రమ కోరుకుంటోంది. దీనితోపాటు బ్యాంకింగ్‌లో వడ్డీరేటు తగ్గింపుద్వారా అటు బిల్డర్ ఇటు వినియోగదారుకు రుణ భారాన్ని తగ్గించాలని రియల్టీ కోరకుంటోంది. సింగిల్ విండో అనుమతులకు బడ్జెట్ తగిన చర్యలు తీసుకోవాలి. - వేణు వినోద్, ఎండీ, సైబర్‌సిటీ బిల్డర్స్ -
పామాయిల్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మికుల నిరసన
అశ్వారావుపేట రూరల్, న్యూస్‌లైన్: అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో మరో వివాదానికి తెర లేచింది. ఇప్పుడిప్పుడే వివాదాలు సద్దుమణుగుతున్నాయనుకుంటున్న సమయంలో కొత్తగా కార్మికుల వేతనాల అంశం వివాదాస్పదంగా మారింది. ఇటీవల టెండర్ దక్కించుకున్న కొత్త కాంట్రాక్టర్ కార్మికులకు వేతనాలు తగ్గించి ఇస్తానని చెప్పడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాంట్రాక్ట్‌తో తనకు నష్టం వాటిల్లుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. తక్కువ జీతం తీసుకోవడం ఇష్టం లేనివారు శుక్రవారం నుంచి పనికి రావద్దని పేర్కొనడంతో కార్మికులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురై వాగ్వాదానికి దిగారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచి 12గంటల వరకు పామాయిల్ గెలల దిగుమతి నిలిచిపోయింది. అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో 30 మంది కాంట్రాక్ట కార్మికులు కొంతకాలంగా పనిచేస్తున్నారు. వీరంతా ఔట్సోర్సింగ్ విధానంలో కొనసాగుతున్నారు. ప్రతి ఏడాది ఆయిల్‌ఫెడ్ నిర్ణయించే ధరలకు టెండర్ దక్కించుకునే కాంట్రాక్టర్ వీరికి వేతనాలు ఇస్తుం డాలి. నెలక్రితం ఇద్దరు వ్యక్తులు టెక్నో సంస్థ పేరిట టెండర్‌ను దక్కించుకున్నారు. టెండర్ నిబంధనల ప్రకారం ఒక్కొక్క కార్మికుడు రోజులో 8గంటలు పని చేయాలి. అయితే గతంలో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ మాదిరిగానే ఒక్కొక్కొ కార్మికుడికి గంటకు రూ.43.75 చెల్లించాల్సి ఉండగా ప్రస్తుత కాంట్రాక్టర్ రూ 30 మాత్రమే ఇస్తానని చెప్పడంతో ఈ వివాదం చోటుచేసుకుంది. ఆగ్రహించిన కార్మికులు లోడి ంగ్ పాయింట్ వద్ద పనులు బహిష్కరించి నిరసన తెలిపారు. అనంతరం పామాయిల్ మేనేజర్ కార్యాలయం వద్ద రెండు గంటలపాటు ధార్నా చేశారు. గంటకు రూ. 50 చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ డివిజన్ నాయకుడు పిట్టల అర్జున్‌తో డిప్యూటీ మేనేజర్ హరినాథ్‌బాబు, ఏఈఈ నాగేశ్వరరావు చర్చించారు. మేనేజర్ వచ్చాక ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తామని, అప్పటి వరకు కార్మికులకు పాత పద్దతినే కాంట్రాక్టర్ వేతనాలు చెల్లిస్తారని చెప్పడంతో కార్మికులు శాంతించారు.