గతేడాదితో పోల్చితే సగానికి పడిపోయిన టన్ను ధర 2022లో రూ.26 వేలు పలికిన ధర
ప్రస్తుతం టన్ను ధర రూ.13,180
దేశంలోనే ఏలూరు జిల్లా సాగులో మొదటి స్థానం
ఏటా జిల్లాలో పెరుగుతున్న ఆయిల్‌పామ్ సాగు
రాష్ట్రవ్యాప్తంగా సాగులో 80 శాతం ఒక్క ఏలూరు జిల్లాలో
ధరలు తిరోగమనంలో ఉన్నా పెరుగుతున్న సాగు
ఆయిల్‌పామ్ ధరలు తిరోగమనం బాట పట్టాయి. క్రూడ్ ఆయిల్‌పై కేంద్రం దిగుమతి సుంకం రద్దు చేయడం, ఇతర కారణాలతో ఆయిల్‌పామ్ ధరలు భారీగా పడిపోతున్నాయి. గతేడాదితో పోల్చితే 40 శాతం మేర ధర తగ్గింది. అంతర్జాతీయంగా వచ్చే 30 ఏళ్ల వరకు ఆయిల్‌పామ్‌కు విపరీతంగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతుండగా దానికి విరుద్ధంగా ధరలు పతనమవుతున్నాయి. ఐదేళ్ల నుంచి వరుసగా ధరలు పెరుగుతూ వచ్చి మళ్లీ ఈ ఏడాది రివర్స్‌లో పయనిస్తున్నాయి. ఆయిల్‌పామ్ సాగులో దేశంలోనే ఏలూరు జిల్లా మొదటి స్థానంలో నిలుస్తుంది.
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వాణిజ్య పంటల్లో అగ్రగామిగా ఉన్న ఆయిల్‌పామ్ సాగు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అధికంగా ఉంది. దేశంలోనే సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 1.62 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగు జరుగుతుండగా ఒక్క ఏలూరు జిల్లాలోనే 48,968.8 హెక్టార్లలో, పశ్చిమగోదావరి జిల్లాలో 3 వేల హెక్టార్లు సాగులో ఉంది. సుమారుగా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు కలిపి 1.30 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్, కోకో, కొబ్బరి, మిరియాలు, ఇతర సుగంధ ద్రవ్యాలు అంతర పంటగా వేసుకునే వీలు ఆయిల్‌పామ్‌కు ఉండటంతో లక్షా 30 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌తో పాటు అత్యధిక శాతం కోకో అంతర పంటగా ఉంది.
ప్రధానంగా గోదావరి పరీవాహక ప్రాంతం కావడంతో గాలిలో 85 శాతం తేమ ఉండటంతో ఆయిల్‌పామ్ సాగుకు జిల్లా పూర్తి అనుకూలంగా ఉంటుంది. ఇసుకతో కూడిన ఎర్రని నేలలు కావడం, కృష్ణా, గోదావరి డెల్టా మధ్య ప్రాంతం కావడంతో గాలిలో తేమ శాతం ఉండటం వాతావరణం పూర్తి అనుకూలంగా ఉండటంతో ఆయిల్‌పామ్ సాగు అత్యధికంగా సాగుతుంది. మార్కెట్ ధరలతో నిమిత్తం లేకుండా దీర్ఘకాలిక పంటగా దీన్ని అత్యధిక శాతం సాగు చేస్తున్నారు.
తిరోగమనంలో ధరలు
ఆయిల్‌పామ్ ధరలు తిరోగమనంలో కొనసాగుతున్నాయి. 2017లో సగటున రూ.8 వేలు ఉన్న ధర అంతర్జాతీయ పరిణామాలు డిమాండ్ కారణంగా 2022 నాటికి టన్ను ధర అత్యధికంగా రూ.26 వేలకు చేరింది. ఆ తరువాత క్రూడ్ ఆయిల్‌పై దిగుమతి సుంకం రద్దు చేయడంతో ఆయిల్‌పామ్ ధర తిరోగమన బాట పట్టి గతేడాది రూ.23 వేలు సగటున ఉండగా ప్రస్తుతం రూ.13,180కు పరిమితమైంది. రెండేళ్ల క్రితం వరకు కేంద్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్ ఇంపోర్ట్‌పై డ్యూటీ (దిగుమతి సుంకం) విధించింది. ఐదేళ్ల క్రితం వరకు ఇంపోర్ట్ డ్యూటీ 30 శాతం ఉండగా తర్వాత 20 శాతానికి తగ్గించారు.
గతేడాది పూర్తిగా రద్దు చేయడంతో దేశంలోని ప్రధాన కంపెనీలు దిగుమతులపై ఆధారపడుతున్నాయి. వాస్తవానికి 10 లక్షల టన్నులు ఏటా డిమాండ్ ఉంటే 2 లక్షల టన్నులు కూడా ఉత్పత్తి లేని పరిస్థితి. ఈ క్రమంలో డిమాండ్ అధికంగా ఉండాలి. అయితే ఇంపోర్ట్ డ్యూటీ పూర్తిగా రద్దు చేయడంతో దిగుమతుల పైనే అత్యధికంగా ఆధారపడటంతో స్థానిక మార్కెట్‌లో ధరలు పూర్తిగా పతనమయ్యాయి. ఈ ఏడాది మళ్లీ ఇంపోర్టు డ్యూటీ విధించే అవకాశం ఉంది. ఇంపోర్ట్ డ్యూటీ అమలులోకి వస్తే ఆయిల్‌పామ్ ధరలు కొంతైనా పెరిగే అవకాశం ఉంది.
ఏలూరు జిల్లాలో భారీగా సాగు
ఏలూరు జిల్లాలో 14 మండలాల్లో అత్యధికంగా ఆయిల్‌పామ్ సాగు జరుగుతుంది. 2019–20లో 72,860 హెక్టార్లు, 2020–21లో 70,963 హెక్టార్లు, 2022023లో 48,836 హెక్టార్లు, 2023–24లో 48,968.8 హెక్టార్లలో సాగు విస్తీర్ణంలో ఉంది. ప్రధానంగా టి.నర్సాపురం మండలంలో 16190 ఎకరాలు, కామవరపుకోట మండలంలో 16,078 ఎకరాలు, ద్వారకాతిరుమల మండలంలో 17,504 ఎకరాలు, చింతలపూడి మండలంలో 18,304 ఎకరాలు, జంగారెడ్డిగూడెం మండలంలో 8,422 ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. హెక్టారుకు నాలుగేళ్లు కలిపి రూ.71 వేలు సబ్సిడీ రూపంలో ఇవ్వడం, 30 ఏళ్ల పాటు దిగుబడి వచ్చే పంట కావడంతో ఆయిల్‌పామ్ సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఆయిల్‌పామ్‌ను పామాయిల్ పరిశ్రమలు తక్కువ గాను, కాస్మొటిక్స్ ఇతర అనుబంధ పరిశ్రమలకు ఎక్కువగా వినియోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment