సాక్షి అమలాపురం: కోనసీమ అంటేనే వరి.. మొక్కజొన్న.. అపరాలు వంటి వ్యవసాయ పంటలు... కొబ్బరి.. అరటి... కందా వంటి ఉద్యాన పంటలు గుర్తుకు వస్తాయి. ఆయిల్ పామ్ అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతమే గుర్తుకు వస్తుంది. ఈ పంటకు మెట్టలోని ఎర్ర నేలలు అనుకూలమని. నల్లరేగడి నేలల్లో పండదని ఒక నమ్మకం. కానీ జిల్లా ఉద్యాన శాఖ మాత్రం గోదావరి డెల్టా భూముల్లో ఆయిల్ పామ్ సాగుతో అధిక దిగుబడులు సాధించవచ్చని, లాభాలు పొందే అవకాశముందని ధీమాగా చెబుతోంది.
చదవండి: పల్నాడు రైతుల వినూత్న పంథా.. ‘ఫల’ప్రదం
చెప్పడమే కాదు... జిల్లా రైతులతో పెద్ద ఎత్తున సాగు చేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా సర్వేసాయి ఎడిబుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీతో ఉద్యాన శాఖ ఎంవోయూ చేసుకుంది. ఈ సంస్థ కోనసీమ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు పనిచేయనుంది. నర్శరీలు ఏర్పాటు చేయడం, సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి రాయితీలు, సాంకేతిక పరిజ్ఞానం అందజేయడంతోపాటు పరిశ్రమ ఏర్పాటు చేయడం ద్వారా వారే ఆయిల్‌పామ్ గెలలను రైతుల వద్ద నుంచి సేకరించనున్నారు.
అంతర్జాతీయంగా డిమాండ్
ఆయిల్ పామ్ సాగు అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రంగంపేట, రాజానగరం, గోకవరం, తుని, ప్రత్తిపాడు, ఏలేశ్వరం వంటి మెట్ట ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. ఒకానొక సమయంలో ఈ సాగు సైతం తీవ్ర సంక్షోభానికి గురయింది. గెల టన్ను ధర రూ.7 వేల కన్నా తగ్గడం వల్ల రైతులు నష్టాలు పాలవడంతోపాటు తోటలు తొలగించారు. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో పామాయిల్‌కు డిమాండ్ పెరిగింది.
దీనికితోడు అంతర్జాతీయంగా మారిన సమీకరణల వల్ల మలేషియా వంటి దేశాల నుంచి పామాయిల్ దిగుమతులపై ఆంక్షలు విధించడంతో స్థానికంగా పండే ఆయిల్ పామ్ గెలలకు డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది ఒకానొక సమయంలో టన్ను ధర ఏకంగా రూ.23 వేల వరకు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో టన్నుకు రూ.15,912 వరకు ధర ఉంది. దీనితో పలువురు రైతులు దీని సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడప్పుడే వంట నూనెల ధరలు తగ్గే అవకాశం లేదని తెలిసి ఈ సాగు మీద ఆసక్తి చూపుతున్నారు.
సాగు విస్తరణకు ఉద్యానశాఖ యత్నం
కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లాలో రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాలతోపాటు కొత్తపేట నియోజకవర్గంలో ఆలమూరు మండలంలో మినహా మిగిలిన ప్రాంతంలో దీర్ఘకాలిక ఉద్యాన పంట అంటే కొబ్బరికే రైతులు పరిమితమయ్యారు. దీంతోపాటు కోకో, పోక వంటి పంటలు సాగు చేస్తారు. ఈ జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు చాలా తక్కువ. కేవలం 988 ఎకరాలు మాత్రమే ఉందని అంచనా. అది కూడా మండపేట నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. దీనిని జిల్లాలో సాగుకు అనుకూలమైన ప్రాంతాలకు విస్తరించాలని ఉద్యానశాఖ తలపోస్తోంది.
గతంలో విఫలమైనా..
గతంలో కోనసీమలో ఆయిల్‌పామ్ సాగు పెంచడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అంబాజీపేటకు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టింది. అయినవిల్లి మండలం సిరిపల్లి వద్ద ఆయిల్ తయారు చేసే ఫ్యాక్టరీని ఏర్పాటు చేసినా స్థానికుల నుంచి అభ్యంతరాలు రావడంతో నిలిచిపోయింది. పామాయిల్‌కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఈ సాగును అన్ని ప్రాంతాల్లోనూ ప్రోత్సహించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా సర్వేసాయి కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. తొలి దశలో కపిలేశ్వరపురం, రాయవరం, రామచంద్రపురం, కె.గంగవరం, కొత్తపేట, ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెంతో పాటు రెండవ దశలో అమలాపురం డివిజన్ పరిధిలో ఈ సాగును ప్రోత్సహించాలని ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
ఇక్కడ మెరక భూములు, మెరక ప్రాంతాల్లో రబీ నీరు అందని శివారు వరి చేలు, భారీ వరదలు వస్తే కాని ముంపుబారిన పడని లంక గ్రామాల్లోని మెరక ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగుకు అన్ని విధాలా మేలు అని గుర్తించారు. ‘జిల్లాలోని డెల్టా భూములు కూడా సాగుకు అనుకూలమే. అయినవిల్లిలో ఒక రైతు ఎకరాకు 10 టన్నుల సగటు దిగుబడి తెచ్చారు. ఇప్పటి ధరను పరిగణలోకి తీసుకుంటే రూ.1.59 లక్షల ఆదాయం వస్తున్నట్టు. పెట్టుబడులు ఎకరాకు రూ.40 వేలు తీసివేస్తే రైతుకు రూ.1.19 లక్షల వరకు ఆదాయం వస్తోంది’ అని సర్వేసాయి సంస్థ ప్రతినిధి ప్రభాకర్ ‘సాక్షి’కి తెలిపారు. వరి, కొబ్బరి లాభసాటి కాకపోవడం వల్ల అనుకూలమైన ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగు చేసే అవకాశముందని రైతులు చెబుతున్నారు.
ఖాళీ మెరక ప్రాంతాలు అనుకూలం
గోదావరి డెల్టా ప్రాంతాలు సైతం ఆయిల్‌పామ్ సాగుకు అనుకూలం. ఖాళీగా ఉన్న మెరక ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగు అన్ని విధాలా మేలు. నీటి ఎద్దడి ఉన్న భూములలో డ్రిప్ ద్వారా సాగు చేయవచ్చు. సాగుకు ఆసక్తి చూపే రైతులకు ప్రభుత్వం అన్నిరకాలుగానూ సహకరిస్తోంది.
– ఎన్.మల్లికార్జునరావు, ఉద్యానశాఖ జిల్లా అధికారి
Comments
Please login to add a commentAdd a comment