Telangana: నాలుగేళ్లు.. 10,000 కోట్లు | Oil Palm Cultivation Will Bring Benefits To Farmers | Sakshi
Sakshi News home page

Telangana: నాలుగేళ్లు.. 10,000 కోట్లు

Published Sat, Aug 27 2022 1:23 AM | Last Updated on Sat, Aug 27 2022 10:52 AM

Oil Palm Cultivation Will Bring Benefits To Farmers - Sakshi

రాష్ట్రంలో వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పాం సాగు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సమీప భవిష్యత్తులోనే దీని ఫలితాలు రాష్ట్రానికి, రైతులకు లబ్ధి చేకూరుస్తాయని ఆయిల్‌ఫెడ్‌ వర్గాలు చెబుతున్నాయి. నాలుగేళ్ల తర్వాత రాష్ట్ర జీడీపీలో ఆయిల్‌పాం వాటా ఏకంగా రూ. 10 వేల కోట్లుగా ఉంటుందని తెలిపాయి.     
– సాక్షి, హైదరాబాద్‌

లక్షల టన్నుల పామాయిల్‌
రాష్ట్రంలో వచ్చే వ్యవసాయ సీజన్‌ నుంచి ఏకంగా 10 లక్షల ఎకరాల్లో పామాయిల్‌ సాగును పెంచేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.  మొత్తం 26 జిల్లాల్లో సాగు చేపట్టేలా చర్యలు చేపట్టింది. రైతులకు అవసరమైన సహకారం, పంట కొనుగోలుకు ఆయిల్‌ఫెడ్‌ సహా 11 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. నాలుగేళ్లలో పామాయిల్‌ గెలలు అందుబాటులోకి వస్తాయి కాబట్టి మొత్తం 10 లక్షల ఎకరాల్లో పంట సాగైతే దాని ద్వారా రూ. 13,680 కోట్ల విలువైన 15.20 లక్షల పామాయిల్‌ ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

అందులో రాష్ట్ర అవసరాలకుపోను ఇతర రాష్ట్రాలకు ఎగుమతులతో నాలుగేళ్ల తర్వాత జీడీపీలో పామాయిల్‌ వాటా రూ. 10 వేల కోట్లుగా ఉంటుందంటున్నారు. రైతులకు ఎకరానికి రూ. 80 వేల చొప్పున ఏడాదికి ఆదాయం సమకూరుతుందని... మున్ముందు ఇతర దేశాలకు కూడా ఎగుమతులు జరుగుతాయని చెబుతున్నారు. 

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. 
ఆయిల్‌పామ్‌ రంగంలో వచ్చే నాలుగైదేళ్లలో రూ. 3,750 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. మొదటగా ఆయా కంపెనీలు 25 క్రషింగ్‌ ఫ్యాక్టరీలను నెలకొల్పాల్సి ఉండగా ఒక్కో ఫ్యాక్టరీకి రూ. 150 కోట్ల చొప్పున రూ. 3,750 కోట్ల మేర పెట్టుబడులు తరలిరానున్నాయి. ఆయా ఫ్యాక్టరీల్లో ప్రత్యక్షంగా 2,500 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. అలాగే ఆయిల్‌పామ్‌ పంట భూముల్లో ఏకంగా 50 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరో 2,500 మందికి పామాయిల్‌ రవాణా రంగంలో ఉపాధి లభిస్తుందని ఆయిల్‌ఫెడ్‌ వర్గాలు వెల్లడించాయి.

ఆయిల్‌పామ్‌ రంగంలో ఆయి­ల్‌ఫెడ్‌ ద్వారానే ఏకంగా రూ. 750 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ ఎండీ సురేందర్‌ చె­ప్పారు. దీనివల్ల ఆయిల్‌ఫెడ్‌లోనూ ప్రభుత్వ ఉద్యోగాలు భారీగా భర్తీ అవుతాయన్నారు. రాబోయే రోజుల్లో ఆయి­ల్‌పాం సాగు రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని, రూ. లక్షల్లో ఆదాయం సమకూరనుందని పేర్కొన్నారు. మరోవైపు పామాయిల్‌ క్రషింగ్‌ ఫ్యాక్టరీల్లో ముడినూనెను బయటకు తీస్తారు. దాన్ని శుద్ధి చేసి పామా­యిల్‌ వంటనూనె తయారు చేయాల్సి ఉంటుంది. అందుకోసం ప్రతి క్రషింగ్‌ ఫ్యాక్టరీ వద్ద ఒక్కో రిఫైనరీ ఫ్యాక్టరీని నెలకొల్పాల్సి ఉంటుంది. ఒక్కో రిఫైనరీ ఫ్యాక్టరీ కోసం రూ. 30 కోట్ల చొప్పున రూ. 750 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వాటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement