సాక్షి, హైదరాబాద్: వచ్చే సీజన్‌లో (2023–24) రూ. వెయ్యి కోట్లతో 2 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగుకు రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించిన ఉద్యానశాఖ... ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు అతీగతి లేదు. ఈ విషయంలో కేంద్రం నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని ఉద్యాన శాఖ వర్గాలు వెల్లడించాయి.
అయితే కేంద్రం 2 లక్షల ఎకరాలకు ఆమోదం తెలుపుతుందా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 1.78 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం చేయాలని లక్ష్యం నిర్దేశించుకోగా ఇప్పటివరకు అందులో 82 వేల ఎకరాలలోపే సాగైంది. అంటే లక్ష్యంలో సగం కూడా చేరుకోలేని పరిస్థితి నెలకొంది.
రైతులకు భరోసా కల్పించడంలో విఫలం...
ఆయిల్‌పాం సాగు విస్తీర్ణాన్ని రానున్న కాలంలో ఏకంగా 20 లక్షల ఎకరాలకు తీసుకెళ్లాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ సంస్థ ఆయిల్‌ఫెడ్ పరిధిలోనే ఉన్న ఆయిల్‌పాం సాగును కొత్తగా 10 ప్రైవేటు కంపెనీలకు సైతం అప్పగించింది. 2022–23 వ్యవసాయ సీజన్‌లో 27 జిల్లాల్లో 1.78 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగును లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 1.40 లక్షల ఎకరాల వరకు మాత్రమే రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
అందులో లక్ష ఎకరాలకు చెందిన రైతులు మాత్రమే డ్రిప్ పరికరాలను ఏర్పాటు కోసం వారి వాటా సొమ్ము చెల్లించినట్లు తెలిసింది. డ్రిప్ సౌకర్యం కల్పించకపోవడం వల్ల కొన్నిచోట్ల వేయలేదు. డ్రిప్ సౌకర్యం కల్పించాలంటే రైతులకు ఉద్యానశాఖ సబ్సిడీ కల్పిస్తుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు నూటికి నూరు శాతం, బీసీ రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందజేస్తుంది.
కాబట్టి జీఎస్టీతో కలుపుకొని ఒక్కో రైతు దాదాపు రూ. 5–6 వేలు చెల్లించాలి. ఆ మేరకు రైతుల నుంచి డ్రిప్ వాటాను రాబట్టలేకపోతున్నారు. అనేకచోట్ల రైతులు ఆయిల్‌పాం సాగుపై అవగాహన లేకపోవడంతో ముందుకు రావడంలేదని తెలిసింది. ఆ మేరకు భరోసా కల్పించడంలో ఉద్యానశాఖ అధికారులతోపాటు కంపెనీలు కూడా విఫలమవుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment