రూ.13,950 నుంచి రూ.19,040కు పెరిగిన ధర
సీజన్ ప్రారంభంలోనే ఓఈఆర్‌ను ప్రకటించిన తెలంగాణ
ఐదు నెలలుగా ఓఈఆర్ ప్రకటన కోసం ఏపీ రైతుల ఎదురుచూపులు
పట్టించుకోని కూటమి ప్రభుత్వం
సాక్షి, అమరావతి: క్రూడ్ పామాయిల్(సీపీవో)పై కేంద్రం దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించడం, అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ధరల ప్రభావంతో దేశీయంగా ఆయిల్‌పామ్ ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో రూ.13,950 ఉన్న తాజా ఆయిల్ పామ్ గెలల (ఎఫ్‌ఎఫ్‌బీ) టన్ను ధర రూ.19,040కి పెరిగింది. సీజన్‌కు ముందుగానే ఓఈఆర్ (ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేషియో)ను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో ఏపీ కంటే మంచి ధరను తెలంగాణ రైతులు పొందగలుగుతున్నారు.
దిగుమతి సుంకం పునరుద్ధరణతో..
ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో దేశీయంగా పెరిగిన వంటనూనె ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా సీపీవోపై 49 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 2022లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. అదే సమయంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్స్ ధరలు టన్ను రూ.77వేల దిగువకు పడిపోయాయి. ఫలితంగా టన్ను రూ.23,635 నుంచి గతేడాది అక్టోబర్‌లో రూ.12,100కు పడిపోయింది.
వయబిలిటీ ధరను సవరించడంతో పాటు క్రూడ్ పామ్ ఆయిల్(సీపీఓ)పై దిగుమతి సుంకాలను పునరుద్ధరించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. ఫలితంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో క్రూడ్ ఆయిల్స్‌పై 20 శాతం చొప్పున దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించడంతో పాటు సోయాపై 5.5 శాతం నుంచి 27.50 శాతం, రిఫైన్డ్ ఆయిల్స్‌పై 13.75 శాతం నుంచి 35.75 శాతానికి దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
అంతర్జాతీయ ధరల ప్రభావం
దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు టన్ను రూ.1.25 లక్షలకు పెరిగింది. ఫలితంగా దేశీయంగా పామాయిల్ సేకరణ ధరలు పెరుగుతూ వచ్చాయి. అడ్‌హక్ కమిటీ నిర్ణయించిన ధర ప్రకారం నవంబర్ నెలకు సంబంధించి రాష్ట్రంలోని రైతులకు టన్ను రూ.19,040 చొప్పున ధర లభిస్తోంది. కాగా తెలంగాణాæ రాష్ట్ర ప్రభుత్వం సీజన్ ప్రారంభంలోనే ఓఈఆర్‌ను ప్రకటించడంతో టన్ను రూ.19,150 చొప్పున ధర లభిస్తోంది.
గడిచిన ఐదేళ్లు మాదిరిగానే 2024–25 సంవత్సరానికి కూడా ఓఈఆర్ ప్రకటించాలని ఆయిల్‌పామ్ రైతులు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఓఈఆర్ ప్రకటనలో జరుగుతున్న జాప్యం రానున్న ఆర్థిక సంవత్సరంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయిల్‌పామ్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఓఈఆర్ ప్రకటిస్తే రైతులకు మరింత మేలు
దిగుమతి సుంకం పునరుద్ధరణ, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుదల ప్రభావంతో దేశీయంగా పామాయిల్ సేకరణ ధరలు పెరుగుతున్నాయి. రెండు నెలల క్రితం రూ.13,950 ఉన్న టన్ను గెలల ధర ప్రస్తుతం రూ.19 వేలకు పైగా పలుకుతోంది. మరింత పెరిగే అవకాశం కూడా కన్పిస్తోంది. గతంలో మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం ఓఈఆర్ ప్రకటిస్తే ఆయిల్‌పామ్ రైతులకు మేలు కలుగుతుంది. – కె.క్రాంతికుమార్, ప్రధాన కార్యదర్శి, జాతీయ ఆయిల్‌పామ్ రైతుల సంఘం
Comments
Please login to add a commentAdd a comment