క్రూడ్ పామాయిల్‌పై 20 శాతం దిగుమతి సుంకం విధించిన కేంద్రం
కేంద్రం నిర్ణయంతో ఆయిల్‌పామ్ గెలల టన్ను ధర రూ.13,950 నుంచి రూ.16 వేలకు పెరిగే అవకాశం
వైఎస్ జగన్ హయాంలో గెలల ధర రూ.24 వేలు
ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో2022లో దిగుమతి సుంకం ఎత్తేసిన కేంద్రం
ఫలితంగా భారీగా ధర పడిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులు
రైతులకు బాసటగా కేంద్రానికి లేఖలు రాసిన వైఎస్ జగన్ ప్రభుత్వం
దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించడంతో రైతుల్లో ఆనందం
సాక్షి, అమరావతి: ఆయిల్‌పామ్ ధరలు పతనమవుతున్న దశలో కేంద్రం తీసుకున్న నిర్ణయం రైతులకు ఊరటనిస్తోంది. మూడేళ్ల తర్వాత క్రూడ్ పామాయిల్ (సీపీవో)పై ఇకనుంచి 20 శాతం దిగుమతి సుంకం వసూలు చేస్తామని కేంద్రం ప్రకటించడంతో ఆయిల్‌పామ్ రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
దేశవ్యాప్తంగా సుమారు 45 శాతం మంది పామాయిల్‌నే వంటనూనెగా వినియోగిస్తుండగా.. మన దేశంలో ఉత్పత్తి అయ్యేది స్వల్పమే. దేశీయ అవసరాలు తీర్చేందుకు నెలకు సుమారు 6,84,000 టన్నుల పామాయిల్‌ను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
2022కు ముందు క్రూడ్ పామాయిల్‌పై 49 శాతం దిగుమతి సుంకం ఉండేది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని పూర్తిగా ఎత్తివేయడంతో ధరలు పడిపోయాయి. దీంతో ఆయిల్‌పామ్ తోటలను సాగు చేసే రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చి0ది.
సాగు, దిగుబడుల్లో నంబర్ వన్‌గా ఎదిగిన ఏపీ
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా గడచిన ఐదేళ్లలో ఆయిల్‌పామ్ సాగు, దిగుబడుల్లో ఆంధ్రప్రదేశ్‌లో అగ్రస్థానం సాధించి దేశంలోనే నంబర్ వన్‌గా ఎదిగింది. క్రమం తప్పకుండా ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేషియో(ఓఈఆర్)ను ప్రకటించడంతో ఓ దశలో ఫ్రెష్ ఫ్రూట్ బెంచ్ (ఎఫ్‌ఎఫ్‌బీ)కు టన్ను రూ.24 వేల వరకు పొందిన ఆయిల్‌పామ్ రైతులు.. 2022లో దిగుమతి సుంకాన్ని ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సాగుదారులు ఒక్కసారిగా కుదేలయ్యారు.
ఈ నేపథ్యంలో పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా ఉప ఉత్పత్తుల (గింజల) విలువను చేరుస్తూ వయబిలిటీ ధరను సవరిస్తూ రైతుకు లాభదాయకమైన ధరను ప్రకటించాలని, దిగుమతి సుంకాన్ని తక్షణమే పునరుద్ధరించాలంటూ ఆయిల్‌పామ్ రైతులు ఉద్యమబాట పట్టారు. వీరికి బాసటగా నిలిచిన వైఎస్ జగన్ పలుమార్లు లేఖలు రాయడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
ఇటీవల రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను జాతీయ ఆయిల్‌పామ్ రైతుల సంఘ ప్రతినిధులు కలిసి కేంద్రం ఆదుకోకపోతే ఆయిల్‌పామ్ సాగుదారులు సంక్షోభంలో కూరుకుపోతారనే విషయాన్ని వివరించారు. గతంలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన కృషి, ఆయిల్‌పామ్ రైతులు ఆందోళన ఫలించడంతో ఎట్టకేలకు సీపీవోపై దిగుమతి సుంకాన్ని పునరుద్ధరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
టన్ను రూ.13,950 పలుకుతున్న ఆయిల్‌పామ్ గెలల ధర కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో టన్ను రూ.16 వేలకు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
కనీసం రూ.20 వేలు ఉండాల్సిందే
పెరిగిన ఎరువుల ధరలు, పెట్టుబడి ఖర్చుల నేపథ్యంలో టన్నుకు రూ.20 వేలు వస్తే కానీ ఆయిల్‌పామ్ రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితి. దిగుమతి సుంకం పునరుద్ధరించిన కేంద్రం వయబిలిటీ ధరను కూడా సవరించి, డైనమిక్ డ్యూటీ మెకానిజం ఏర్పాటు చేయాలి. దిగుమతి సుంకాన్ని పునరుద్దరించిన కేంద్రానికి రుణపడి ఉంటాం. – బొబ్బ వీరరాఘవరావు, అధ్యక్షుడు, ఏపీ ఆయిల్‌పామ్ రైతుల సంక్షేమ సంఘం
ఆయిల్‌పామ్ రైతులకు ఊరట
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సంక్షోభంలో ఉన్న ఆయిల్‌పామ్ రైతులకు ఎంతో ఊరటనిస్తుంది. రైతు అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించి దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించేందుకు సహకరించిన కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఆయిల్‌పామ్ రైతుల తరఫున కృతజ్ఞతలు. క్రూడ్ పామాయిల్‌పై దిగుమతి సుంకం విధించడం వల్ల దేశీయంగా ఆయిల్‌పామ్ సాగు మరింత విస్తరించేందుకు దోహద పడుతుంది. – కె.క్రాంతికుమార్, ప్రధాన కార్యదర్శి, జాతీయ ఆయిల్‌పామ్ రైతుల సంఘం
Comments
Please login to add a commentAdd a comment