OILPALM
-
ఆయిల్‌పామ్ రైతుల ఖుషీ
సాక్షి, అమరావతి: ఆయిల్‌పామ్ ధరలు పతనమవుతున్న దశలో కేంద్రం తీసుకున్న నిర్ణయం రైతులకు ఊరటనిస్తోంది. మూడేళ్ల తర్వాత క్రూడ్ పామాయిల్ (సీపీవో)పై ఇకనుంచి 20 శాతం దిగుమతి సుంకం వసూలు చేస్తామని కేంద్రం ప్రకటించడంతో ఆయిల్‌పామ్ రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 45 శాతం మంది పామాయిల్‌నే వంటనూనెగా వినియోగిస్తుండగా.. మన దేశంలో ఉత్పత్తి అయ్యేది స్వల్పమే. దేశీయ అవసరాలు తీర్చేందుకు నెలకు సుమారు 6,84,000 టన్నుల పామాయిల్‌ను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. 2022కు ముందు క్రూడ్ పామాయిల్‌పై 49 శాతం దిగుమతి సుంకం ఉండేది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని పూర్తిగా ఎత్తివేయడంతో ధరలు పడిపోయాయి. దీంతో ఆయిల్‌పామ్ తోటలను సాగు చేసే రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చి0ది. సాగు, దిగుబడుల్లో నంబర్ వన్‌గా ఎదిగిన ఏపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా గడచిన ఐదేళ్లలో ఆయిల్‌పామ్ సాగు, దిగుబడుల్లో ఆంధ్రప్రదేశ్‌లో అగ్రస్థానం సాధించి దేశంలోనే నంబర్ వన్‌గా ఎదిగింది. క్రమం తప్పకుండా ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో(ఓఈఆర్)ను ప్రకటించడంతో ఓ దశలో ఫ్రెష్ ఫ్రూట్ బెంచ్ (ఎఫ్‌ఎఫ్‌బీ)కు టన్ను రూ.24 వేల వరకు పొందిన ఆయిల్‌పామ్ రైతులు.. 2022లో దిగుమతి సుంకాన్ని ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సాగుదారులు ఒక్కసారిగా కుదేలయ్యారు. ఈ నేపథ్యంలో పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా ఉప ఉత్పత్తుల (గింజల) విలువను చేరుస్తూ వయబిలిటీ ధరను సవరిస్తూ రైతుకు లాభదాయకమైన ధరను ప్రకటించాలని, దిగుమతి సుంకాన్ని తక్షణమే పునరుద్ధరించాలంటూ ఆయిల్‌పామ్ రైతులు ఉద్యమబాట పట్టారు. వీరికి బాసటగా నిలిచిన వైఎస్ జగన్ పలుమార్లు లేఖలు రాయడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటీవల రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను జాతీయ ఆయిల్‌పామ్ రైతుల సంఘ ప్రతినిధులు కలిసి కేంద్రం ఆదుకోకపోతే ఆయిల్‌పామ్ సాగుదారులు సంక్షోభంలో కూరుకుపోతారనే విషయాన్ని వివరించారు. గతంలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన కృషి, ఆయిల్‌పామ్ రైతులు ఆందోళన ఫలించడంతో ఎట్టకేలకు సీపీవోపై దిగుమతి సుంకాన్ని పునరుద్ధరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టన్ను రూ.13,950 పలుకుతున్న ఆయిల్‌పామ్ గెలల ధర కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో టన్ను రూ.16 వేలకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కనీసం రూ.20 వేలు ఉండాల్సిందే పెరిగిన ఎరువుల ధరలు, పెట్టుబడి ఖర్చుల నేపథ్యంలో టన్నుకు రూ.20 వేలు వస్తే కానీ ఆయిల్‌పామ్ రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితి. దిగుమతి సుంకం పునరుద్ధరించిన కేంద్రం వయబిలిటీ ధరను కూడా సవరించి, డైనమిక్ డ్యూటీ మెకానిజం ఏర్పాటు చేయాలి. దిగుమతి సుంకాన్ని పునరుద్దరించిన కేంద్రానికి రుణపడి ఉంటాం. – బొబ్బ వీరరాఘవరావు, అధ్యక్షుడు, ఏపీ ఆయిల్‌పామ్ రైతుల సంక్షేమ సంఘంఆయిల్పామ్ రైతులకు ఊరట కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సంక్షోభంలో ఉన్న ఆయిల్‌పామ్ రైతులకు ఎంతో ఊరటనిస్తుంది. రైతు అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించి దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించేందుకు సహకరించిన కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఆయిల్‌పామ్ రైతుల తరఫున కృతజ్ఞతలు. క్రూడ్ పామాయిల్‌పై దిగుమతి సుంకం విధించడం వల్ల దేశీయంగా ఆయిల్‌పామ్ సాగు మరింత విస్తరించేందుకు దోహద పడుతుంది. – కె.క్రాంతికుమార్, ప్రధాన కార్యదర్శి, జాతీయ ఆయిల్‌పామ్ రైతుల సంఘం -
ఆయిల్‌పామ్ ధరలు స్థిరీకరించండి
సాక్షి, హైదరాబాద్: ఆయిల్‌పామ్ రైతాంగాన్ని ప్రోత్సహించేందుకు ధరలను స్థిరీకరించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు శనివారం కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల ప్రత్యేకంగా లేఖ రాశారు. ఆయిల్‌పామ్ గెలలకు టన్ను ధర రూ.15 వేలుగా నిర్ణయించాలని, అదేవిధంగా పామాయిల్ ధర కనీసం టన్నుకు రూ.లక్ష వరకు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం 1992 నుంచి వివిధ కార్యక్రమాల ద్వారా ఆయిల్ పామ్ అభివృద్ధిని ప్రోత్సహిస్తోందని, ప్రస్తుతం రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమైన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్– ఆయిల్ పామ్ ద్వారా అమలు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టేందుకు 14 కంపెనీలకు అనుమతులిచ్చామని, ఆయిల్ పామ్ మొక్కలు పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 44 నర్సరీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు రూ.13,438గా ఉందని, అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతున్న ముడి పామాయిల్ ధరలు, వంట నూనెల దిగుమతి సుంకంపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు రైతులను నిరాశపరచడమే కాకుండా కొత్తగా ఆయిల్ పామ్ వైపు మొగ్గు చూపుతున్న రైతులపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందన్నారు.ముడి పామాయిల్ దిగుమతులపై ఉన్న సుంకాన్ని కేంద్రం పూర్తిగా ఎత్తివేయడంతో ఆయిల్ పామ్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ కారణంగా ఖమ్మం జిల్లాలో చాలామంది ఆయిల్ పామ్ రైతులు తమ తోటలను తొలగించి వాటి స్థానంలో వేరే పంటల సాగుకు మారారని మంత్రి లేఖలో పేర్కొన్నారు. -
గిట్టుబాటు కాని ఆయిల్‌పామ్
దేవరపల్లి: రెండేళ్లుగా గిట్టుబాటు ధర రాక.. పెట్టిన పెట్టుబడులు, కౌలు డబ్బులు సైతం గిట్టుబాటు కాకపోవడంతో ఆయిల్‌పామ్ సాగు పట్ల రైతుల ఆసక్తి సన్నగిల్లుతున్నది. మెట్ట ప్రాంతంల్లోని రైతులు 25 ఏళ్లుగా ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. మొక్క వేసిన ఏడాది నుంచి నాలుగేళ్లలో దిగుబడి మొదలై సుమారు 25 ఏళ్ల వరకు కొనసాగుతుంది. రైతులు పండించిన గెలలను పామాయిల్ తయారీ ఫ్యాక్టరీలు కొనుగోలు చేస్తున్నాయి. కొంత కాలం పంటకు గిట్టుబాటు ధర లభించింది. దీనికి తోడు ప్రభుత్వం కూడా రాయితీపై మొక్కలు సరఫరా చేయడంతో పాటు నాలుగేళ్ల వరకు ఎరువులు, పురుగు మందులపై రాయితీలు ఇచ్చి ప్రోత్సహించింది. దీంతో ఎక్కువ మంది రైతులు పొగాకు పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ వైపు మొగ్గు చూపి వేలాది ఎకరాల్లో సాగుకు శ్రీకారం చుట్టారు. 37,654 ఎకరాల్లో.. తూర్పు గోదావరి జిల్లాలోని 18 మండలాల్లో 37,654 ఎకరాల్లో రైతులు ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. నల్లజర్ల, దేవరపల్లి, రంగంపేట మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో పంట ఉంది. ఎకరాకు 10 నుంచి 13 టన్నుల గెలల దిగుబడి సాధిస్తున్నారు. ఎకరాకు సగటున 8 టన్నుల దిగుబడి వస్తున్నదని రైతులు చెబుతున్నారు. ఆయిల్‌పామ్ గెలల దిగుబడి జూన్ నుంచి ప్రారంభమవుతుంది. వర్షాకాలంలో వచ్చే పంట దిగుబడి బాగుంటుందని రైతులు తెలిపారు. సారవంతమైన భూములు, యాజమాన్య పద్ధతులు చేపడుతున్న తోటల్లో ఎకరాకు 12 టన్నుల వరకు కూడా దిగుబడి వస్తోంది. ఈసారి రైతులు 12 వేల ఎకరాల్లో మొక్క తోటలు వేశారు. మొక్క రూ.250 చొప్పున కొనుగోలు చేశారు. 2022లో టన్ను ఆయిల్‌పామ్ గెలల ధర రూ.24 వేలు పలకడంతో రైతులకు ఊహించని లాభాలు వచ్చాయి. దీంతో రైతులు పొగాకు, జీడిమామిడి తోటలను తొలగించి, ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగు చేపట్టారు. అయితే, రెండేళ్లుగా పొగాకుకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుండడంతో తిరిగి ఆయిల్‌పామ్, జీడిమామిడి తోటలను తొలగించి పొగాకు వైపు మొగ్గు చూపుతున్నారు. ఆయిల్ రికవరీపై గెలల ధర నిర్ణయం ఫ్యాక్టరీలో గెలలను క్రషింగ్ చేసిన అనంతరం వచ్చే పామాయిల్ రికవరీ శాతంపై ప్రభుత్వం గెలల ధర నిర్ణయిస్తుంది. ఈ నెలలో ఫ్యాక్టరీకి పంపిన గెలలకు వచ్చే నెలలో ధర ప్రకటిస్తారు. ఏప్రిల్ నెలలో ఉత్పత్తి చేసిన గెలలకు మే నెలలో టన్నుకు రూ.14,095 ధర లభించింది. మే నెలలో ఉత్పత్తి అయిన గెలలకు టన్నుకు రూ.13,280 మాత్రమే లభించింది. ఒక్క నెలలోనే టన్నుకు రూ.815 ధర పడిపోయింది. పండించిన గెలలను 3ఎఫ్ ఆయిల్ ఫ్యాక్టరీ, నవభారత్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు కొనుగోలు చేస్తున్నాయి. గిట్టుబాటు కావడం లేదు ఆయిల్‌పామ్ సాగు గిట్టుబాటు కావడం లేదు. ఖర్చులు పెరిగాయి. దీనికి తగినట్టు మార్కెట్లో గిట్టుబాటు ధర రావడం లేదు. గత నెలలో టన్ను గెలల ధర రూ.14,095 ఉండగా, ఈ నెలలో రూ.13,280కి తగ్గింది. పంట గిట్టుబాటు కాక చాలా మంది రైతులు తోటలు తీసేస్తున్నారు. – యాగంటి వెంకటేశ్వరరావు, రైతు, దేవరపల్లి, తూర్పు గోదావరి జిల్లా టన్ను గెలల ధర రూ.16 వేలు తగ్గకూడదు ఆయిల్‌పామ్ గెలల టన్ను ధర రూ.16 వేలకు తగ్గకూడదు. ప్రస్తుతం ఇస్తున్న ధర పెట్టుబడులకు సరిపోదు. ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.60 వేల పెట్టుబడి అవుతున్నది. దిగుబడులు 12 టన్నుల నుంచి 8 టన్నులకు తగ్గడంతో గిట్టుబాటు కావడం లేదు. పామాయిల్ దిగుమతుల ప్రభావం కూడా ఇక్కడి పంటపై పడింది. – నరహరిశెట్టి రాజేంద్రబాబు, డైరెక్టర్, పామాయిల్ బోర్డు వర్షాభావంతో తగ్గిన దిగుబడులు వర్షాభావ పరిస్థితుల వల్ల ఆయిల్‌పామ్ గెలల దిగుబడులు తగ్గాయి. ఎకరాకు సగటున 8 టన్నుల గెలల దిగుబడి వస్తున్నది. తోటలపై శ్రద్ధ చూపిన రైతులు 10 టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారు. ఈ ఏడాది తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంది. దీనివల్ల తోటలు దెబ్బ తిన్నాయి. – సుజాత, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, రాజమహేంద్రవరం -
‘ఆయిల్‌పామ్’పైనా అబద్ధాలేనా? రోతరాతల రామోజీ వాస్తవాలివిగో..
సాక్షి, అమరావతి: వాస్తవాలు అవసరం లేదు. నిజాలతో పనిలేదు. కావాల్సిందల్లా ‘చంద్రబాబు’కు భజన చేయడం. జగన్ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా రామోజీరావు తన పచ్చపత్రికలో వాస్తవాలకు ముసుగేసి నిత్యం అబద్ధాలను అచ్చేస్తూనే ఉన్నారు. అదే కోవలో ‘ఆయిల్ పామ్‌కు సర్కారు గ్రహణం’ అంటూ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా మరో తప్పుడు కథనాన్ని వండివార్చారు. ఈ కథనంలో వాస్తవాలు ఏ మేరకు ఉన్నాయో ఒక్కసారి చూస్తే.. 5.15 లక్షల ఎకరాల్లో సాగు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో 1.32 లక్షల మంది 3.93లక్షల ఎకరాల్లో ఉన్న ఆయిల్‌పామ్ సాగు చేస్తుండగా, ప్రస్తుతం 1.52 లక్షల మంది 5.15 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. హెక్టార్‌కు సగటు ఉత్పాదకతలో దేశంలోనే నంబర్‌వన్‌గా రాష్ట్రం నిలిచింది. ఆయిల్‌పామ్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డును కేంద్రం నుంచి అందుకుంది. 2023–24లో 60 వేల ఎకరాలు కొత్తగా సాగులోకి తెచ్చేందుకు 34.20 లక్షల మొక్కలను సిద్ధం చేశారు. ఈ నిజాలు దాచిన ఈనాడు అసలు విస్తరణనే పట్టించుకోనట్లుగా కథనాన్ని వండివార్చింది. 2022–23లో 12,617 మంది రైతులకు ఒక్కొక్కటి రూ.193 విలువైన 19.67 లక్షల మొక్కలను పూర్తి ఉచితంగా సరఫరా చేశారు. 2018–19లో 1.72 అదనపు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియోలో వ్యత్యాసమైన రూ.80.32 కోట్లు చెల్లించకుండా టీడీపీ సర్కార్ ఎగ్గొట్టింది. ఈ మొత్తాన్ని జగన్ ప్రభుత్వం అణాపైసలతో సహా చెల్లించింది. పెద్ద ఎత్తున నర్సరీలను ఏర్పాటు చేసి ఆయిల్‌పామ్ మొక్కలను అందుబాటులో ఉంచింది. మొక్కల ఖర్చు, తోటల నిర్వహణ, అంతర పంటల సాగు కోసం రైతులకు ఎకరానికి రూ.64,300 చొప్పున సాయం అందిస్తోంది. 50% సబ్సిడీపై బిందు సేద్యం, యాంత్రీకరణకు చేయూతనిస్తోంది. బాబు హయాంలో గరిష్టంగా 2018–19లో 90,475 టన్నులు ప్రాసెస్ చేస్తే.. ప్రస్తుతం 1.20 లక్షల టన్నులు ప్రాసెస్ చేసే స్థాయికి రాష్ట్రం చేరింది. అప్పట్లో సగటున టన్నుకు రూ.7,492 ధర లభిస్తే, ఈ నాలుగేళ్లలో గరిష్టంగా టన్నుకు (2022 మే) రూ.23,365 ధర దక్కింది. ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే క్రూడ్ పామ్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని పూర్తిగా కేంద్రం ఎత్తివేసింది. ఫలితంగా దిగుమతులు పెరగడంతో దేశీయంగా ఆయిల్ పామ్ ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా ఆయిల్‌పామ్ రైతులకు గిట్టుబాటు ధర లభించే స్థాయిలో దిగుమతి సుంకాన్ని విధించాలని కోరుతూ సీఎం జగన్ వాణిజ్యం, పరిశ్రమల శాఖమంత్రికి లేఖ కూడా రాశారు. ఇక పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలో గంటకు టన్ను గెలల క్రషింగ్ సామర్థ్యంతో 1992లో ఏర్పాటైన ప్లాంట్‌ను ఈ ప్రభుత్వం వచ్చాక రూ.10 కోట్లు ఖర్చు చేసి గంటకు 24 టన్నుల సామర్థ్యానికి పెంచింది. ఏలూరు జిల్లాలో రూ. 230 కోట్లతో అత్యాధునిక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ అండ్ రిఫైనరీ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. -
నరికేస్తున్నారు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పతనమవుతున్న ఆయిల్‌పామ్ గెలల ధరలు రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించక.. మరోవైపు సబ్సిడీ అందక ఆయిల్‌పామ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. దీంతో ఆయిల్‌పామ్ తోటలను నరికివేయడానికి సైతం రైతులు వెనకాడటం లేదు. ఈ ఏడాది జిల్లాలో ఇప్పటికే సుమారు 600 ఎకరాల్లో తోటలను తొలగించారు. దేశంలోనే ప్రథమం.. ధర అథమం దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలోనే ఆయిల్‌పామ్ పంట సాగవుతోంది. దేశవ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో దీనిని సాగు చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మూడు లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలు ఉన్నాయి. అందులోనూ మన జిల్లాలో అత్యధికంగా 1.30 లక్షల ఎకరాల్లో దీనిని సాగు చేస్తున్నారు. ఏటా రాష్ట్రంలో 10 లక్షల టన్నుల ఆయిల్‌పామ్ గెలల దిగుబడి వస్తున్నట్టు అంచనా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌పామ్ రీసెర్చి సెంటర్ అంచనా ప్రకారం టన్ను అయిల్‌పామ్ గెలల ఉత్పత్తికి రూ.8,145 ఖర్చవుతోంది. ఇది నాలుగేళ్ల క్రితం నాటి అంచనా. ప్రస్తుతం చెల్లిస్తున్న ధర మాత్రం చెల్లిస్తున్న ధర మాత్రం రూ.7,400 లోపే ఉంటోంది. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ముడి పామాయిల్‌పై కేంద్ర ప్రభుత్వం సుంకాన్ని 12.5 శాతానికి తగ్గించడంతో దిగుమతులు పెరిగాయి. ఈ పోటీని తట్టుకోలేక దేశీయంగా ధర తగ్గించారు. గతేడాది మార్చిలో టన్ను గెలల ధర రూ.8,400 వరకు ఉంటే.. ప్రస్తుతం రూ.7,376కు పడిపోయింది. దీంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. గెలల దిగుబడి జూన్ నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ వరకూ ఉంటుంది. ఈ సమయంలో ధరలు పడిపోతున్నాయి. దీంతో నష్టాలను తట్టుకోలేక రైతులు తోటలను నరికేస్తున్నారు. ఎకరానికి ఏటా రూ.40 వేలకు పైగా పెట్టుబడి అవుతోంది. కోత, రవాణా ఖర్చులు కలుపుకుంటే ఈ మొత్తం మరింత పెరుగుతోంది. అయితే, ఎకరానికి 7 టన్నుల దిగుబడి కూడా రావడం లేదు. పెట్టుబడులు సైతం దక్కకపోవడంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. అంతర పంటగా వేసిన కోకోకు కూడా గిట్టుబాటు ధర దక్కడం లేదు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా.. ఆయిల్‌పామ్ రైతులు తమ ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామ¯ŒS ఈ రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయితే, ఆ దిశగా అడుగులు పడటం లేదు. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ముడి పామాయిల్‌పై సుంకం విధించడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సబ్సిడీ ప్రకటించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ మంత్రిగా పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావు సైతం ఆయిల్‌పామ్‌కు గిట్టుబాటు ధర పెంచుతామని ప్రకటించినా వాస్తవ రూపం దాల్చలేదు. ఒకవైపు గిట్టుబాటు ధరరాక, మరోవైపు ప్రభుత్వ ప్రోత్సాహం లేక రైతులు నష్టాలతో ఈ పంటను పండించడానికి అంతగా ఇష్టపడటం లేదు. తోటలను తొలగించాలన్నా లక్షలాది రూపాయల ఖర్చవుతుండటంతో భరించలేక ఎటూ పాలుపోలేని స్థితిలో ఉన్నారు. టన్ను గెలలకు మద్దతు ధర రూ.10 వేలు ఇస్తేనే గట్టెక్కుతామని, ప్రభుత్వం ఇస్తామని చెప్పిన రూ.8,900 కూడా తమకు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాజిల్లా బిళ్లనపల్లి గ్రామానికి చెందిన ఈ రైతు పేరు కాకుమాను శ్రీనివాసరావు. కొన్నేళ్లుగా ద్వారకాతిరుమల మండలం సీహెచ్.పోతేపల్లిలో 20 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. ఏటా ఎకరానికి రూ.40 వేలకు పైగా పెట్టుబడి అవుతోంది. కోత, కూలి ఖర్చులు దీనికి అదనం. ఎకరానికి గెలల దిగుబడి 7 టన్నులు కూడా రావడం లేదు. గెలలను కోయించి అమ్మితే ఖర్చులు కూడా దక్కడం లేదు. దీంతో ఏంచేయాలో దిక్కుతోచక చివరకు తోటల్లోని చెట్లను పొక్లెయిన్ సాయంతో ఇలా తొలగిస్తున్నారు. ఆయన స్వగ్రామమైన బిళ్లనపల్లిలో 15 ఎకరాల్లో వేసిన ఆయిల్‌పామ్ తోటను ఇప్పటికే తొలగించిన శ్రీనివాసరావు.. ఇప్పుడు సీహెచ్.పోతేపలి్లలోని తోటలను సైతం నరికిస్తున్నారు. ఎకరం తోట తొలగించడానికి రూ.4 వేల వరకు ఖర్చవుతోంది. ఈ పరిస్థితి శ్రీనివాసరావు ఒక్కరికే పరిమితం కాలేదు. జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులందరి దుస్థితి ఇలాగే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపట్లేదు ఆయిల్‌పామ్ రైతులపై రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. దీనివల్లే తోటలను తొలగిస్తున్నాం. నాకున్న 6 ఎకరాల తోటను తొలగించేందుకు నిర్ణయించుకున్నాను. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చించి పరిష్కారాన్ని చూపకుంటే రాబోయే రోజుల్లో ఆయిల్‌పామ్ సాగు ప్రశ్నార్థకమవుతుంది. – బసివిరెడ్డి వెంకటరామయ్య, సాయన్నపాలెం, ద్వారకాతిరుమల మండలం ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఆయిల్‌పామ్ సాగు చేసే రైతుల్లో ఎక్కువ మంది టీడీపీ వాళ్లే ఉన్నారు. ప్రభుత్వ తీరుతో కక్కలేక మింగలేక సతమతమవు తున్నారు. మద్దతు ధర కల్పించకుంటే నష్టాలు భరిస్తూ ఎన్నాళ్లు సాగు చేస్తాం. చంద్రబాబు ఈ జిల్లాపై కపటప్రేమ నటిస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారు. – నెక్కంటి రమేష్, రైతు, సీహెచ్.పోతేపల్లి, ద్వారకాతిరుమల మండలం