నరికేస్తున్నారు
నరికేస్తున్నారు
Published Wed, May 24 2017 1:07 AM | Last Updated on Tue, Sep 5 2017 11:49 AM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పతనమవుతున్న ఆయిల్‌పామ్ గెలల ధరలు రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించక.. మరోవైపు సబ్సిడీ అందక ఆయిల్‌పామ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. దీంతో ఆయిల్‌పామ్ తోటలను నరికివేయడానికి సైతం రైతులు వెనకాడటం లేదు. ఈ ఏడాది జిల్లాలో ఇప్పటికే సుమారు 600 ఎకరాల్లో తోటలను తొలగించారు.
దేశంలోనే ప్రథమం.. ధర అథమం
దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలోనే ఆయిల్‌పామ్ పంట సాగవుతోంది. దేశవ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో దీనిని సాగు చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మూడు లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలు ఉన్నాయి. అందులోనూ మన జిల్లాలో అత్యధికంగా 1.30 లక్షల ఎకరాల్లో దీనిని సాగు చేస్తున్నారు. ఏటా రాష్ట్రంలో 10 లక్షల టన్నుల ఆయిల్‌పామ్ గెలల దిగుబడి వస్తున్నట్టు అంచనా. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌పామ్ రీసెర్చి సెంటర్ అంచనా ప్రకారం టన్ను అయిల్‌పామ్ గెలల ఉత్పత్తికి రూ.8,145 ఖర్చవుతోంది. ఇది నాలుగేళ్ల క్రితం నాటి అంచనా. ప్రస్తుతం చెల్లిస్తున్న ధర మాత్రం చెల్లిస్తున్న ధర మాత్రం రూ.7,400 లోపే ఉంటోంది. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ముడి పామాయిల్‌పై కేంద్ర ప్రభుత్వం సుంకాన్ని 12.5 శాతానికి తగ్గించడంతో దిగుమతులు పెరిగాయి. ఈ పోటీని తట్టుకోలేక దేశీయంగా ధర తగ్గించారు. గతేడాది మార్చిలో టన్ను గెలల ధర రూ.8,400 వరకు ఉంటే.. ప్రస్తుతం రూ.7,376కు పడిపోయింది. దీంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. గెలల దిగుబడి జూన్ నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ వరకూ ఉంటుంది. ఈ సమయంలో ధరలు పడిపోతున్నాయి. దీంతో నష్టాలను తట్టుకోలేక రైతులు తోటలను నరికేస్తున్నారు. ఎకరానికి ఏటా రూ.40 వేలకు పైగా పెట్టుబడి అవుతోంది. కోత, రవాణా ఖర్చులు కలుపుకుంటే ఈ మొత్తం మరింత పెరుగుతోంది. అయితే, ఎకరానికి 7 టన్నుల దిగుబడి కూడా రావడం లేదు. పెట్టుబడులు సైతం దక్కకపోవడంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. అంతర పంటగా వేసిన కోకోకు కూడా గిట్టుబాటు ధర దక్కడం లేదు.
కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా..
ఆయిల్‌పామ్ రైతులు తమ ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామ¯ŒS ఈ రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయితే, ఆ దిశగా అడుగులు పడటం లేదు. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ముడి పామాయిల్‌పై సుంకం విధించడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సబ్సిడీ ప్రకటించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ మంత్రిగా పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావు సైతం ఆయిల్‌పామ్‌కు గిట్టుబాటు ధర పెంచుతామని ప్రకటించినా వాస్తవ రూపం దాల్చలేదు. ఒకవైపు గిట్టుబాటు ధరరాక, మరోవైపు ప్రభుత్వ ప్రోత్సాహం లేక రైతులు నష్టాలతో ఈ పంటను పండించడానికి అంతగా ఇష్టపడటం లేదు. తోటలను తొలగించాలన్నా లక్షలాది రూపాయల ఖర్చవుతుండటంతో భరించలేక ఎటూ పాలుపోలేని స్థితిలో ఉన్నారు. టన్ను గెలలకు మద్దతు ధర రూ.10 వేలు ఇస్తేనే గట్టెక్కుతామని, ప్రభుత్వం ఇస్తామని చెప్పిన రూ.8,900 కూడా తమకు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణాజిల్లా బిళ్లనపల్లి గ్రామానికి చెందిన ఈ రైతు పేరు కాకుమాను శ్రీనివాసరావు. కొన్నేళ్లుగా ద్వారకాతిరుమల మండలం సీహెచ్.పోతేపల్లిలో 20 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. ఏటా ఎకరానికి రూ.40 వేలకు పైగా పెట్టుబడి అవుతోంది. కోత, కూలి ఖర్చులు దీనికి అదనం. ఎకరానికి గెలల దిగుబడి 7 టన్నులు కూడా రావడం లేదు. గెలలను కోయించి అమ్మితే ఖర్చులు కూడా దక్కడం లేదు. దీంతో ఏంచేయాలో దిక్కుతోచక చివరకు తోటల్లోని చెట్లను పొక్లెయిన్ సాయంతో ఇలా తొలగిస్తున్నారు. ఆయన స్వగ్రామమైన బిళ్లనపల్లిలో 15 ఎకరాల్లో వేసిన ఆయిల్‌పామ్ తోటను ఇప్పటికే తొలగించిన శ్రీనివాసరావు.. ఇప్పుడు సీహెచ్.పోతేపలి్లలోని తోటలను సైతం నరికిస్తున్నారు. ఎకరం తోట తొలగించడానికి రూ.4 వేల వరకు ఖర్చవుతోంది. ఈ పరిస్థితి శ్రీనివాసరావు ఒక్కరికే పరిమితం కాలేదు. జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులందరి
దుస్థితి ఇలాగే ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపట్లేదు
ఆయిల్‌పామ్ రైతులపై రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. దీనివల్లే తోటలను తొలగిస్తున్నాం. నాకున్న 6 ఎకరాల తోటను తొలగించేందుకు నిర్ణయించుకున్నాను. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చించి పరిష్కారాన్ని చూపకుంటే రాబోయే రోజుల్లో ఆయిల్‌పామ్ సాగు ప్రశ్నార్థకమవుతుంది.
– బసివిరెడ్డి వెంకటరామయ్య, సాయన్నపాలెం, ద్వారకాతిరుమల మండలం
ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం
రైతులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఆయిల్‌పామ్ సాగు చేసే రైతుల్లో ఎక్కువ మంది టీడీపీ వాళ్లే ఉన్నారు. ప్రభుత్వ తీరుతో కక్కలేక మింగలేక సతమతమవు తున్నారు. మద్దతు ధర కల్పించకుంటే నష్టాలు భరిస్తూ ఎన్నాళ్లు సాగు చేస్తాం. చంద్రబాబు ఈ జిల్లాపై కపటప్రేమ నటిస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారు.
– నెక్కంటి రమేష్, రైతు, సీహెచ్.పోతేపల్లి, ద్వారకాతిరుమల మండలం
Advertisement
Advertisement