విశ్లేషణ
అండమాన్, నికోబార్ దీవులలో ‘అండమాన్, నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ కార్పొ రేషన్’ (ఏఎన్‌ఐఐడీసీఓ) అనే పాక్షిక–ప్రభుత్వ ఏజెన్సీ ఉంది. ‘ఈ ప్రాంత సమతుల్య పర్యావరణ అనుకూల అభివృద్ధి కోసం సహజ వనరులను వాణిజ్యపరంగా ఉప యోగించుకోవడానికీ, అభివృద్ధి చేయడానికీ’ దీనిని కంపెనీల చట్టం కింద 1988లో స్థాపించారు. దాని ప్రధాన కార్యకలాపాలలో పెట్రోలియం ఉత్పత్తుల వర్తకంతో సహా, భారతదేశంలో తయారయ్యే విదేశీ మద్యం, పాలు, పర్యాటక రిసార్ట్‌ల నిర్వహణ; పర్యాటకం కోసం, మత్స్య సంపద కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటివీ ఉన్నాయి.
అంతవరకు పెద్దగా తెలియని ఈ సంస్థకు 2020 ఆగస్టులో రాత్రికి రాత్రే గ్రేట్ నికోబార్ ద్వీపంలో 72 వేల కోట్ల భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టును అమలు చేసే బాధ్యతను అప్పగించారు. ఇందులో భారీ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్, పవర్ ప్లాంట్, విమానాశ్రయం, టౌన్‌షిప్ నిర్మాణంతో పాటు, 130 చదరపు కిలోమీటర్లకు పైగా అటవీ భూమిలో విస్తరించే టూరిజం ప్రాజెక్ట్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమై ఉన్నాయి. రెండు సంవత్సరాల తరువాత, ఏఎన్‌ఐఐడీసీఓ సంస్థ ఈ ప్రాజెక్ట్ కోసం పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్‌సీసీ) నుండి రెండు కీలకమైన అనుమతులను పొందింది. మొదటిది, అక్టోబర్ 2022లో చోటు చేసుకుంది. మంత్రిత్వ శాఖకు చెందిన ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ (ఎఫ్‌ఏసీ) అటవీ భూమిని ఇతర అవసరాలకోసం మళ్లించేందుకు అనుమతించింది. అత్యంత సహజమైన, జీవవైవిధ్యం కలిగిన ఉష్ణమండల అడవులలో 130 చదరపు కి.మీ. (ముంబైలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ కంటే పెద్దది) విస్తీర్ణం కల భూమి మళ్లింపుపై ఈ కమిటీ సంతకం చేసింది. దాదాపు ఒక నెల తర్వాత, నిపుణుల అంచనాల కమిటీ (ఈఏసీ) కీలకమైన పర్యావరణ అనుమతిని మంజూరు చేసింది.
ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం దాదాపు పది లక్షల చెట్లను నరికివేయనున్నారన్న విషయంపై తీవ్రమైన ఆందోళనలు తలెత్తాయి. ప్రభుత్వం పార్లమెంటులో చేసిన ప్రకటనలో ప్రాజెక్ట్ డాక్యుమెంట్‌లలో దాదాపు 8.5 లక్షల నుండి 9.64 లక్షల వరకు చెట్లు నరికివేయడంపై ప్రాథమిక అంచనాలు మారాయి. వాతావరణ సంక్షోభం వేగవంతమైన ఈ యుగంలో బలి ఇవ్వాల్సిన చెట్ల సంఖ్యను చూసి చాలా మంది నివ్వెరపోయారు. ఒక జాతీయ పత్రికలో నివేదించి నట్లుగా, నిజానికి మనం కనీసం 30 లక్షల చెట్లను కోల్పో వలసి ఉంటుంది. ఇది చాలా చాలా ఎక్కువ అనే చెప్పాలి.
ఇది వాస్తవమైతే అందుబాటులో ఉన్న డేటాను బట్టి కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రాజెక్ట్, అటవీ భూమి మళ్లింపు కోసం అనుమతి కోరినప్పుడు, ఈ ప్రాజెక్ట్ ప్రతి పాదకుడు మంత్రిత్వ శాఖకు ఏ సమాచారాన్ని అందించారు? ద్వీపంలో రూ. 72 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని ఈ ఏజెన్సీని కోరినప్పుడు, నరికివేయాల్సిన చెట్ల సంఖ్య ఎవరికీ తెలియదా? పాలు, ఆల్కహాల్, పెట్రోలియం అమ్మకంలో ప్రధాన వ్యాపార అనుభవం ఉన్న సంస్థను ఈ వ్యవహారంలో ఎవరైనా క్షమించవచ్చు. కానీ మంత్రిత్వ శాఖలోని శాస్త్రీయ, పర్యావరణ సంస్థల మాట ఏమిటి? పైగా పర్యావరణం, అటవీ అనుమతుల మాట ఏంటి?
అన్ని వనరులూ, అధికారం తమ వద్దే ఉన్నందున, ఈఏసీ, ఎఫ్‌సీఏ సరైన ప్రశ్నలను ఎందుకు అడగలేదు? ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతిని మంజూరు చేసేటప్పుడు ఈఏసీ స్థానం కేసి అంతర్ దృష్టితో చూస్తే శాస్త్రీయ సామర్థ్యం, భాషలో నైపుణ్యం అనేవి ఈఏసీ నిర్దేశించిన ప్రమాణాల్లోనే కనిపిస్తాయి. ఇక్కడ రెండు ఉదాహరణలు ఉన్నాయి: ‘ఏ చెట్లూ ఒకేసారి నరికివేయబడవు. వార్షిక ప్రాతిపదికన పని పురోగతిని బట్టి దశలవారీగా ఈ పని జరుగుతుంది. అసాధారణంగా పొడవుగానూ, వయ స్సులో పెద్దగా ఉన్న అన్ని చెట్లను వీలైనంత వరకు రక్షించాలి.’ ‘అసాధారణంగా పొడవైన చెట్టు’ అంటే ఏమిటి అని ఎవరైనా అడిగితే? చెట్టు పాతదిగా పరిగణించ బడటానికి సరైన వయస్సును ఎలా నిర్ణయిస్తారు? ప్రారంభించడానికి, మీరు చెట్టు వయస్సును ఎలా అంచనా వేస్తారు? అలాగే ‘సాధ్యమైనంత వరకు’ వాటిని రక్షించడం అంటే అర్థం ఏమిటి? రెండవ ఉదాహరణ మరింత మెరుగైనది– ‘స్థానిక గుడ్లగూబల గూడు రంధ్రాలు ఉన్న చెట్లను ఎస్‌ఏసీఓఎన్ (సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచర్) సహాయంతో గుర్తించి జియో–ట్యాగ్ చేయాలి. అటువంటి చెట్లను వీలైనంత వరకు రక్షించాలి.’ పక్షి ప్రవర్తన, రాత్రిపూట దాని అలవాట్లను పరిగణ నలోకి తీసుకుని, గుడ్లగూబను (ఏదైనా గుడ్లగూబ) చూడటం ఎంత కష్టమో తెలియనిది కాదు. నిజానికి, నికోబార్ వర్షాటవిలోని చెట్లు ఆకాశంలోకి 100 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతాయి. ఒక్కో చెట్టుకు కేవలం ఐదు నిమిషాలు కేటాయించినట్లయితే, ఒక మిలియన్ చెట్లకు గూడు రంధ్రాలు వెతకడానికి మొత్తం 83,000 గంటల సమయం పడుతుంది. మన ఉత్తమ పక్షి వీక్షకు లలో 10 మంది ఏకకాలంలో రోజుకు 8 గంటలు సర్వే చేసినా, అది పూర్తి కావడానికి దాదాపు ఆరేళ్లు పడుతుంది.
ఇప్పుడు ఈ ఆమోదిత షరతును మళ్లీ చదవండి. మీరు దీని గురించి ఏ భావాన్ని పొందగలరో చూడండి. ఈ చెట్లను లెక్కించడానికి, కత్తిరించడానికి రవాణా చేయ డానికి ఇప్పటికే ఏఎన్‌ఐఐడీసీఓ కాంట్రాక్టర్‌లను ఆహ్వానించింది. గొడ్డళ్లు చెట్లను నేలకూల్చుతుంటే వాటిని రక్షించడం మాని... భూమికి వంద అడుగుల ఎత్తులో ఉన్న గుడ్లగూబల గూడు రంధ్రాల కోసం మన ఎస్‌ఏసీఓఎన్ మిత్రులు వెతుకుతూ ఉండరని ఆశిద్దాం.
-పంకజ్ సేఖసరియా
వ్యాసకర్త ఐఐటీ బాంబే అసోసియేట్ ప్రొఫెసర్
(‘ది హిందుస్థాన్ టైవ్స్ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment