ఇస్లామాబాద్: ఇదేందిది... ఎన్నికలకోసం చెట్లు నరకడం ఏమిటా అనుకుంటున్నారా? అవును ఇది ఇది నిజం.. పాక్ ఎన్నికల నిర్వహణకు 56 వేల చెట్లు నరికి వేయాల్సి వచ్చింది. పాక్‌లో ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల కోసం మొత్తంగా 26 కోట్ల బ్యాలెట్ పేపర్లు ముద్రించారు. ఇందుకోసం 2,179 టన్నుల కాగితం అవసరమయ్యింది. కాగితాన్ని చెట్ల నుంచే తయారు చేస్తారనే విషయం మనకు తెలిసిందే.
ఒక అంచనా ప్రకారం ఒక చెట్టు నుండి దాదాపు 16 రీమ్‌ల కాగితాన్ని తయారు చేయవచ్చు. అటువంటి స్థితిలో ఒక టన్ను కాగితం తయారు చేయడానికి 25 చెట్లు అవసరం. దాని ప్రకారం మనం లెక్కలు వేస్తే ఎన్నికల కోసం పాకిస్తాన్‌లో దాదాపు 54 వేల చెట్లను నరికివేశారు. 2018 ఎన్నికల్లో 22 కోట్ల బ్యాలెట్ పేపర్లు ముద్రించారు. ఇందుకోసం 800 టన్నుల ప్రత్యేక సెక్యూరిటీ పేపర్‌ను ఉపయోగించారు.
నియోజక వర్గాల్లో అభ్యర్థుల సంఖ్య పెరిగిన కారణంగానే బ్యాలెట్ పేపర్ల సంఖ్య పెరిగిందని పాకిస్తాన్ ఎన్నికల సంఘం పేర్కొంది. 2018 కంటే ఈసారి అభ్యర్థుల సంఖ్య ఒకటిన్నర రెట్లు పెరిగింది. ఎన్నికల సంఘం పేపర్ల ముద్రణను సకాలంలో పూర్తి చేసింది. సోమవారం నాటికి బ్యాలెట్ పత్రాల పంపిణీ పూర్తి కానుంది. ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాక్ టెస్ట్ నిర్వహించింది. ఈ మాక్ టెస్ట్ లో 859 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
పాకిస్తాన్ చాలా కాలంగా ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అవినీతి కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్‌ను బలమైన అభ్యర్థిగా భావిస్తున్నారు. నవాజ్ మరోమారు ప్రధాని కాబోతున్నారని ఆయన పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment