యూజ్డ్‌ కారు.. యమా జోరు | Telangana used car market sees 50percent surge | Sakshi
Sakshi News home page

యూజ్డ్‌ కారు.. యమా జోరు

Feb 25 2025 5:27 AM | Updated on Feb 25 2025 7:51 AM

Telangana used car market sees 50percent surge

హైదరాబాద్‌లో హోమ్‌ డెలివరీలు 35 శాతం అప్‌ 

లగ్జరీ కార్లకు డిమాండ్‌

17 శాతానికి పెరిగిన మహిళల వాటా 

సాక్షి, బిజినెస్‌ డెస్క్‌:  ఆన్‌లైన్‌ కొనుగోళ్లపై నమ్మకం పెరుగుతుండటం, వినియోగదారుల అభిరుచులు మారుతుండటం తదితర పరిణామాలతో పాత కార్ల వైపు మొగ్గు చూపే వారి సంఖ్య పెరుగుతోంది. కొత్త వాటితో పోలిస్తే పాత కార్లు చాలా తక్కువ ధరకే లభిస్తుండటం కూడా ఇందుకు కారణం. తెలంగాణలో ఇటీవలి కాలంలో ఇలా యూజ్డ్‌ కార్ల వైపు మళ్ళే ధోరణి గణనీయంగా కనిపిస్తోందని యూజ్డ్‌ కార్ల ప్లాట్‌ఫాం స్పినీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

 దీని ప్రకారం, వాళ్ల ప్లాట్‌ఫాంకి సంబంధించి హైదరాబాద్‌ మార్కెట్‌ వార్షికంగా 30 శాతం వృద్ధి చెందింది. కొనుగోలుదారుల్లో మహిళలు వాటా 2022లో కేవలం 9 శాతంగా ఉండగా గతేడాది 17 శాతానికి పెరిగింది. ఇందులో 20 శాతం కొనుగోళ్లు హైదరాబాద్‌కి దూరంగా అంటే దాదాపు 300 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాల నుంచి కూడా ఉంటున్నాయి. గతంలో ఫేవరెట్లుగా ఉన్న ఎలీట్‌ ఐ20 లాంటి కార్ల స్థానంలో ఈసారి కొత్తవి వచ్చి చేరాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా కార్లకు ఆదరణ ఉన్నప్పటికీ క్విడ్‌లాంటి కొత్త మోడల్స్‌ను కూడా ఎంచుకుంటున్నారు.  

ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌కి ఓటు.. 
ఇక సౌకర్యవంతమైన డ్రైవింగ్‌ విధానాన్ని ఇష్టపడుతుండటంతో ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్లకు డిమాండ్‌ 19 శాతం (2022) నుంచి గతేడాది 25 శాతానికి పెరిగింది. 2023లో కాస్త తగ్గిన హోమ్‌ డెలివరీలు 2024లో 35 శాతం పెరిగాయి. అంతే కాదు.. 2022–23లో అంతగా లేని విలాసవంతమైన కార్ల సెగ్మెంట్‌ కూడా ఊపందుకుంటోంది. లగ్జరీని కోరుకునే ధోరణులు పెరుగుతుండటాన్ని సూచిస్తూ కంపాస్, జీఎల్‌ఏ, ఎక్స్‌1 వంటి మోడల్స్‌కి డిమాండ్‌ ఏర­‡్పడింది. హైదరాబాద్‌ యూజ్డ్‌ కార్ల మార్కెట్‌కు విజయవాడ, వరంగల్‌ వంటి నగరాలకు వాహనాలను సరఫరా చేసే ఫీడర్‌ సిటీలుగా ఉంటున్నాయి. 

పాపులర్‌ కార్లు ఇవీ.. 
→ మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా 
→ క్విడ్‌ లాంటి కొత్త మోడల్స్‌కి ఆదరణ 
→ లగ్జరీ సెగ్మెంట్లో కంపాస్, జీఎల్‌ఏకి డిమాండ్‌  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement