కేంద్రానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల లేఖ
గెలలు టన్నుకు రూ.15వేలుగా నిర్ధారించాలని సూచన
సాక్షి, హైదరాబాద్: ఆయిల్‌పామ్ రైతాంగాన్ని ప్రోత్సహించేందుకు ధరలను స్థిరీకరించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు శనివారం కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల ప్రత్యేకంగా లేఖ రాశారు. ఆయిల్‌పామ్ గెలలకు టన్ను ధర రూ.15 వేలుగా నిర్ణయించాలని, అదేవిధంగా పామాయిల్ ధర కనీసం టన్నుకు రూ.లక్ష వరకు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం 1992 నుంచి వివిధ కార్యక్రమాల ద్వారా ఆయిల్ పామ్ అభివృద్ధిని ప్రోత్సహిస్తోందని, ప్రస్తుతం రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమైన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్– ఆయిల్ పామ్ ద్వారా అమలు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టేందుకు 14 కంపెనీలకు అనుమతులిచ్చామని, ఆయిల్ పామ్ మొక్కలు పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 44 నర్సరీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ప్రస్తుతం ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు రూ.13,438గా ఉందని, అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గుతున్న ముడి పామాయిల్ ధరలు, వంట నూనెల దిగుమతి సుంకంపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు రైతులను నిరాశపరచడమే కాకుండా కొత్తగా ఆయిల్ పామ్ వైపు మొగ్గు చూపుతున్న రైతులపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందన్నారు.
ముడి పామాయిల్ దిగుమతులపై ఉన్న సుంకాన్ని కేంద్రం పూర్తిగా ఎత్తివేయడంతో ఆయిల్ పామ్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ కారణంగా ఖమ్మం జిల్లాలో చాలామంది ఆయిల్ పామ్ రైతులు తమ తోటలను తొలగించి వాటి స్థానంలో వేరే పంటల సాగుకు మారారని మంత్రి లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment