టన్ను గెలల ధర రూ.13,280
ఎకరాకు సగటున 8 టన్నుల దిగుబడి
ఆయిల్ రికవరీపై ధర నిర్ణయం
తోటలను తొలగిస్తున్న రైతులు
దేవరపల్లి: రెండేళ్లుగా గిట్టుబాటు ధర రాక.. పెట్టిన పెట్టుబడులు, కౌలు డబ్బులు సైతం గిట్టుబాటు కాకపోవడంతో ఆయిల్‌పామ్ సాగు పట్ల రైతుల ఆసక్తి సన్నగిల్లుతున్నది. మెట్ట ప్రాంతంల్లోని రైతులు 25 ఏళ్లుగా ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. మొక్క వేసిన ఏడాది నుంచి నాలుగేళ్లలో దిగుబడి మొదలై సుమారు 25 ఏళ్ల వరకు కొనసాగుతుంది. రైతులు పండించిన గెలలను పామాయిల్ తయారీ ఫ్యాక్టరీలు కొనుగోలు చేస్తున్నాయి.
కొంత కాలం పంటకు గిట్టుబాటు ధర లభించింది. దీనికి తోడు ప్రభుత్వం కూడా రాయితీపై మొక్కలు సరఫరా చేయడంతో పాటు నాలుగేళ్ల వరకు ఎరువులు, పురుగు మందులపై రాయితీలు ఇచ్చి ప్రోత్సహించింది. దీంతో ఎక్కువ మంది రైతులు పొగాకు పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ వైపు మొగ్గు చూపి వేలాది ఎకరాల్లో సాగుకు శ్రీకారం చుట్టారు.
37,654 ఎకరాల్లో..
తూర్పు గోదావరి జిల్లాలోని 18 మండలాల్లో 37,654 ఎకరాల్లో రైతులు ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. నల్లజర్ల, దేవరపల్లి, రంగంపేట మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో పంట ఉంది. ఎకరాకు 10 నుంచి 13 టన్నుల గెలల దిగుబడి సాధిస్తున్నారు. ఎకరాకు సగటున 8 టన్నుల దిగుబడి వస్తున్నదని రైతులు చెబుతున్నారు. ఆయిల్‌పామ్ గెలల దిగుబడి జూన్ నుంచి ప్రారంభమవుతుంది. వర్షాకాలంలో వచ్చే పంట దిగుబడి బాగుంటుందని రైతులు తెలిపారు.
సారవంతమైన భూములు, యాజమాన్య పద్ధతులు చేపడుతున్న తోటల్లో ఎకరాకు 12 టన్నుల వరకు కూడా దిగుబడి వస్తోంది. ఈసారి రైతులు 12 వేల ఎకరాల్లో మొక్క తోటలు వేశారు. మొక్క రూ.250 చొప్పున కొనుగోలు చేశారు. 2022లో టన్ను ఆయిల్‌పామ్ గెలల ధర రూ.24 వేలు పలకడంతో రైతులకు ఊహించని లాభాలు వచ్చాయి.
దీంతో రైతులు పొగాకు, జీడిమామిడి తోటలను తొలగించి, ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగు చేపట్టారు. అయితే, రెండేళ్లుగా పొగాకుకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుండడంతో తిరిగి ఆయిల్‌పామ్, జీడిమామిడి తోటలను తొలగించి పొగాకు వైపు మొగ్గు చూపుతున్నారు.
ఆయిల్ రికవరీపై గెలల ధర నిర్ణయం
ఫ్యాక్టరీలో గెలలను క్రషింగ్ చేసిన అనంతరం వచ్చే పామాయిల్ రికవరీ శాతంపై ప్రభుత్వం గెలల ధర నిర్ణయిస్తుంది. ఈ నెలలో ఫ్యాక్టరీకి పంపిన గెలలకు వచ్చే నెలలో ధర ప్రకటిస్తారు. ఏప్రిల్ నెలలో ఉత్పత్తి చేసిన గెలలకు మే నెలలో టన్నుకు రూ.14,095 ధర లభించింది. మే నెలలో ఉత్పత్తి అయిన గెలలకు టన్నుకు రూ.13,280 మాత్రమే లభించింది. ఒక్క నెలలోనే టన్నుకు రూ.815 ధర పడిపోయింది. పండించిన గెలలను 3ఎఫ్ ఆయిల్ ఫ్యాక్టరీ, నవభారత్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు కొనుగోలు చేస్తున్నాయి.
గిట్టుబాటు కావడం లేదు
ఆయిల్‌పామ్ సాగు గిట్టుబాటు కావడం లేదు. ఖర్చులు పెరిగాయి. దీనికి తగినట్టు మార్కెట్లో గిట్టుబాటు ధర రావడం లేదు. గత నెలలో టన్ను గెలల ధర రూ.14,095 ఉండగా, ఈ నెలలో రూ.13,280కి తగ్గింది. పంట గిట్టుబాటు కాక చాలా మంది రైతులు తోటలు తీసేస్తున్నారు. – యాగంటి వెంకటేశ్వరరావు, రైతు, దేవరపల్లి, తూర్పు గోదావరి జిల్లా
టన్ను గెలల ధర రూ.16 వేలు తగ్గకూడదు
ఆయిల్‌పామ్ గెలల టన్ను ధర రూ.16 వేలకు తగ్గకూడదు. ప్రస్తుతం ఇస్తున్న ధర పెట్టుబడులకు సరిపోదు. ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.60 వేల పెట్టుబడి అవుతున్నది. దిగుబడులు 12 టన్నుల నుంచి 8 టన్నులకు తగ్గడంతో గిట్టుబాటు కావడం లేదు. పామాయిల్ దిగుమతుల ప్రభావం కూడా ఇక్కడి పంటపై పడింది. – నరహరిశెట్టి రాజేంద్రబాబు, డైరెక్టర్, పామాయిల్ బోర్డు
వర్షాభావంతో తగ్గిన దిగుబడులు
వర్షాభావ పరిస్థితుల వల్ల ఆయిల్‌పామ్ గెలల దిగుబడులు తగ్గాయి. ఎకరాకు సగటున 8 టన్నుల గెలల దిగుబడి వస్తున్నది. తోటలపై శ్రద్ధ చూపిన రైతులు 10 టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారు. ఈ ఏడాది తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంది. దీనివల్ల తోటలు దెబ్బ తిన్నాయి. – సుజాత, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, రాజమహేంద్రవరం
Comments
Please login to add a commentAdd a comment