సాక్షి, అమరావతి: వాస్తవాలు అవసరం లేదు. నిజాలతో పనిలేదు. కావాల్సిందల్లా ‘చంద్రబాబు’కు భజన చేయడం. జగన్ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా రామోజీరావు తన పచ్చపత్రికలో వాస్తవాలకు ముసుగేసి నిత్యం అబద్ధాలను అచ్చేస్తూనే ఉన్నారు. అదే కోవలో ‘ఆయిల్ పామ్‌కు సర్కారు గ్రహణం’ అంటూ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా మరో తప్పుడు కథనాన్ని వండివార్చారు. ఈ కథనంలో వాస్తవాలు ఏ మేరకు ఉన్నాయో ఒక్కసారి చూస్తే..
5.15 లక్షల ఎకరాల్లో సాగు..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో 1.32 లక్షల మంది 3.93లక్షల ఎకరాల్లో ఉన్న ఆయిల్‌పామ్ సాగు చేస్తుండగా, ప్రస్తుతం 1.52 లక్షల మంది 5.15 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. హెక్టార్‌కు సగటు ఉత్పాదకతలో దేశంలోనే నంబర్‌వన్‌గా రాష్ట్రం నిలిచింది. ఆయిల్‌పామ్‌లో బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ అవార్డును కేంద్రం నుంచి అందుకుంది. 2023–24లో 60 వేల ఎకరాలు కొత్తగా సాగులోకి తెచ్చేందుకు 34.20 లక్షల మొక్కలను సిద్ధం చేశారు. ఈ నిజాలు దాచిన ఈనాడు అసలు విస్తరణనే పట్టించుకోనట్లుగా కథనాన్ని వండివార్చింది.
2022–23లో 12,617 మంది రైతులకు ఒక్కొక్కటి రూ.193 విలువైన 19.67 లక్షల మొక్కలను పూర్తి ఉచితంగా సరఫరా చేశారు. 2018–19లో 1.72 అదనపు ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేషియోలో వ్యత్యాసమైన రూ.80.32 కోట్లు చెల్లించకుండా టీడీపీ సర్కార్ ఎగ్గొట్టింది. ఈ మొత్తాన్ని జగన్ ప్రభుత్వం అణాపైసలతో సహా చెల్లించింది. పెద్ద ఎత్తున నర్సరీలను ఏర్పాటు చేసి ఆయిల్‌పామ్ మొక్కలను అందుబాటులో ఉంచింది. మొక్కల ఖర్చు, తోటల నిర్వహణ, అంతర పంటల సాగు కోసం రైతులకు ఎకరానికి రూ.64,300 చొప్పున సాయం అందిస్తోంది.
50% సబ్సిడీపై బిందు సేద్యం, యాంత్రీకరణకు చేయూతనిస్తోంది. బాబు హయాంలో గరిష్టంగా 2018–19లో 90,475 టన్నులు ప్రాసెస్ చేస్తే.. ప్రస్తుతం 1.20 లక్షల టన్నులు ప్రాసెస్ చేసే స్థాయికి రాష్ట్రం చేరింది. అప్పట్లో సగటున టన్నుకు రూ.7,492 ధర లభిస్తే, ఈ నాలుగేళ్లలో గరిష్టంగా టన్నుకు (2022 మే) రూ.23,365 ధర దక్కింది. ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే క్రూడ్ పామ్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని పూర్తిగా కేంద్రం ఎత్తివేసింది. ఫలితంగా దిగుమతులు పెరగడంతో దేశీయంగా ఆయిల్ పామ్ ధరలు తగ్గుముఖం పట్టాయి.
దేశీయంగా ఆయిల్‌పామ్ రైతులకు గిట్టుబాటు ధర లభించే స్థాయిలో దిగుమతి సుంకాన్ని విధించాలని కోరుతూ సీఎం జగన్ వాణిజ్యం, పరిశ్రమల శాఖమంత్రికి లేఖ కూడా రాశారు. ఇక పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలో గంటకు టన్ను గెలల క్రషింగ్ సామర్థ్యంతో 1992లో ఏర్పాటైన ప్లాంట్‌ను ఈ ప్రభుత్వం వచ్చాక రూ.10 కోట్లు ఖర్చు చేసి గంటకు 24 టన్నుల సామర్థ్యానికి పెంచింది. ఏలూరు జిల్లాలో రూ. 230 కోట్లతో అత్యాధునిక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ అండ్ రిఫైనరీ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment