జర్నీ ఆఫ్ ఆయిల్ ఫామ్ ఇన్ ఇండియా పుస్తకం ఆవిష్కరిస్తున్న మలేషియా ఎంపీఓవీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హమీద్ పర్వేజ్ ఖదీర్, డాక్టర్ హెచ్.పి.సింగ్ తదితరులు
సాక్షి, అమరావతి: ఆయిల్‌పామ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే లీడర్ ఆఫ్ ది స్టేట్‌గా నిలిచిందని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హెచ్‌పీ సింగ్ పేర్కొన్నారు. విజయవాడ సమీపంలోని పోరంకిలో మూడు రోజులపాటు జరగనున్న 3వ జాతీయ ఆయిల్‌పామ్ సదస్సు బుధవారం ప్రారంభమైంది.
ఆయిల్‌పామ్ రంగంలో అత్యుత్తమ పురోగతి సాధిస్తున్న రాష్ట్రంగా ఎంపికైన ఆంధ్రప్రదేశ్ తరఫున రాష్ట్ర ఉద్యాన కమిషనర్ ఎస్‌ఎస్ శ్రీధర్ ‘బెస్ట్ పెర్ఫార్మెన్స్ స్టేట్ ఇన్ ఇండియా’ అవార్డును అందుకున్నారు. సదస్సులో హెచ్‌పీ సింగ్ మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో 4 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగవుతుంటే.. 1.90 లక్షల హెక్టార్లు ఏపీలోనే ఉందన్నారు.
ఏపీని స్ఫూర్తిగా తీసుకుని ఇతర రాష్ట్రాలు ఆయిల్‌పామ్ తోటల విస్తరణకు ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో 29 లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ఆయిల్‌పామ్‌ను విస్తరించేందుకు అనువైన ప్రాంతం ఉందన్నారు. విస్తరణ కోసం పరిశోధనా సంస్థలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ విభాగాలు సంఘటితంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఆయిల్‌పామ్ సాగులో భారత్ పురోగతి
సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మలేషియా ఆయిల్‌పామ్ బోర్డు డైరెక్టర్ జనరల్ అహ్మద్ పర్వేజ్ ఖాదీర్ మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ సాగులో భారతదేశం మంచి పురోగతి సాధిస్తోందన్నారు. మలేషియాలో వర్షాధారంగా ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారని, అందువల్ల పెట్టుబడి చాలా తక్కువ అవుతోందని చెప్పారు.
ఇక్కడి రైతులు ఉత్తమ యాజమాన్య పద్ధతుల్ని పాటిస్తూ సాంకేతికంగా దిగుబడులను పెంచుకునే మార్గాలను అన్వేషించాలన్నారు. అధిక దిగుబడులను ఇచ్చే కొత్త వంగడాలతోపాటు యాంత్రీకరణపై దృష్టి సారించాలన్నారు. ఏపీ ఉద్యాన శాఖ కమిషనర్ ఎస్‌ఎస్ శ్రీధర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆయిల్‌పామ్ సాగు విస్తరణలో మంచి పురోగతిని సాధిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో 12 పారిశ్రామిక జోన్లలో గంటకు 460 టన్నుల ఆయిల్‌పామ్‌ను ప్రాసెసింగ్ చేసే యూనిట్లు ఉన్నాయన్నారు. తెలంగాణ ఉద్యాన వర్సిటీ వైస్ చాన్సలర్ నీరజా ప్రభాకర్, సొసైటీ చైర్మన్ పి.రత్నం, కేంద్ర వ్యవసాయ సమాచార కేంద్రం చైర్మన్ మోని మాధవ స్వామి, వెజిటబుల్ ఆయిల్స్ ఏషియా ప్రోగ్రామ్ హెడ్ సురేష్ మోత్వాని, వైస్ ప్రెసిడెంట్ ఆర్‌కే మాథూర్ మోత్వాని, ఆదర్శ ఆయిల్‌పామ్ రైతు టీటీ కృష్ణమూర్తి, ఉద్యాన శాఖ అదనపు డైరెక్టర్లు కె.బాలాజీ నాయక్, ఎం.వెంకటేశ్వర్లు ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment