Horticulture Department
-
వర్షం తక్కువున్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉన్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు కంటింజెన్సీ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వ్యవసాయం, పశువుల గ్రాసం తదితర అంశాలపై ఆయన శనివారం వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖల అధికారులతో సమీక్షించారు. ఆరు జిల్లాల్లోని 130 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని, ఈ జిల్లాల్లో ఆగస్టులో కూడా వర్షాలు తక్కువ ఉంటే ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. అధిక వర్షాల కారణంగా వరి నారు దెబ్బతిన్న రైతులకు స్వల్పకాలంలో దిగుబడినిచ్చే విత్తనాలు సరఫరా చేయాలని చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు, వ్యవసాయంపై వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో ఖరీఫ్ లో మొత్తం 34.39 లక్షల హెక్టార్లు సాధారణ విస్తీర్ణం కాగా ఇప్పటివరకు 9.22 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు వేశారని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సాధారణంకంటే 20 నుండి 50 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. కృష్ణా జిల్లాలో 60 శాతం పైగా అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. అంబేడ్కర్ కోనసీమ,పశ్చిమ గోదావరి, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 20 నుండి 59 మిల్లీ మీటర్ల తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. వర్షపాతం తక్కువున్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటల కోసం సుమారు 10 వేల క్వింటాళ్ల మినుము, పెసర, కంది, ఉలవ, జొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ తదితర విత్తనాలను ఏపీ సీడ్స్ వద్ద సిద్ధంగా ఉంచామని చెప్పారు. అధిక వర్షాలతో వరి నారు మడులు దెబ్బతిన్న రైతులకు స్వల్ప కాలంలో పంట దిగుబడినిచ్చే ఎంటీయూ 1010, 1121,1153, బీపీటీ 5204, ఎన్‌ఎల్‌ఆర్ 34449 వరి విత్తనాలను సుమారు 30 వేల క్వింటాళ్లు సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్ హరికిరణ్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా. బి.ఆర్.అంబేద్కర్, పశు సంవర్థక శాఖ సంచాలకులు అమరేంద్ర కుమార్, ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్ బాబు, మత్స్య శాఖ అదనపు సంచాలకులు డా. అంజలి, ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు బాలాజీ నాయక్, వెంకటేశ్వర్లు తదితర అధికారులుపాల్గొన్నారు. -
ఆయిల్‌పాం సాగుకు అనుమతి ఎప్పుడో?
సాక్షి, హైదరాబాద్: వచ్చే సీజన్లో (2023–24) రూ. వెయ్యి కోట్లతో 2 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగుకు రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించిన ఉద్యానశాఖ... ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు అతీగతి లేదు. ఈ విషయంలో కేంద్రం నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని ఉద్యాన శాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే కేంద్రం 2 లక్షల ఎకరాలకు ఆమోదం తెలుపుతుందా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 1.78 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం చేయాలని లక్ష్యం నిర్దేశించుకోగా ఇప్పటివరకు అందులో 82 వేల ఎకరాలలోపే సాగైంది. అంటే లక్ష్యంలో సగం కూడా చేరుకోలేని పరిస్థితి నెలకొంది. రైతులకు భరోసా కల్పించడంలో విఫలం... ఆయిల్‌పాం సాగు విస్తీర్ణాన్ని రానున్న కాలంలో ఏకంగా 20 లక్షల ఎకరాలకు తీసుకెళ్లాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ సంస్థ ఆయిల్‌ఫెడ్ పరిధిలోనే ఉన్న ఆయిల్‌పాం సాగును కొత్తగా 10 ప్రైవేటు కంపెనీలకు సైతం అప్పగించింది. 2022–23 వ్యవసాయ సీజన్లో 27 జిల్లాల్లో 1.78 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగును లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 1.40 లక్షల ఎకరాల వరకు మాత్రమే రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో లక్ష ఎకరాలకు చెందిన రైతులు మాత్రమే డ్రిప్ పరికరాలను ఏర్పాటు కోసం వారి వాటా సొమ్ము చెల్లించినట్లు తెలిసింది. డ్రిప్ సౌకర్యం కల్పించకపోవడం వల్ల కొన్నిచోట్ల వేయలేదు. డ్రిప్ సౌకర్యం కల్పించాలంటే రైతులకు ఉద్యానశాఖ సబ్సిడీ కల్పిస్తుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు నూటికి నూరు శాతం, బీసీ రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందజేస్తుంది. కాబట్టి జీఎస్టీతో కలుపుకొని ఒక్కో రైతు దాదాపు రూ. 5–6 వేలు చెల్లించాలి. ఆ మేరకు రైతుల నుంచి డ్రిప్ వాటాను రాబట్టలేకపోతున్నారు. అనేకచోట్ల రైతులు ఆయిల్‌పాం సాగుపై అవగాహన లేకపోవడంతో ముందుకు రావడంలేదని తెలిసింది. ఆ మేరకు భరోసా కల్పించడంలో ఉద్యానశాఖ అధికారులతోపాటు కంపెనీలు కూడా విఫలమవుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
వ్యవసాయంపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: వ్యవసాయ శాఖకు సంబంధించి వివిధ అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 15 నుంచి రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ చేయడానికి అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అకాల వర్షాలు వల్ల పంట నష్టంపై ఎన్యుమరేషన్ స్ధితి గతులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఎన్యుమరేషన్ జరుగుతోందని, ఏప్రిల్ మొదటి వారంలో నివేదిక ఖరారు చేస్తామని, ఏప్రిల్ రెండో వారానికి నష్టపోయిన రైతుల జాబితాలను విడుదలచేస్తామని సీఎంకు అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని సీఎం జగన్ పేర్కొన్నారు. రబీ సన్నాహకాలపైన సీఎం సమీక్ష. ఇప్పటికే 100 శాతం ఇ-క్రాపింగ్ పూర్తైందని అధికారులు వెల్లడించారు. నాణ్యతలేని ఎరువులు, పురుగుమందులు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులు లేకుండా చూడాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు అందించేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని సీఎం పేర్కొన్నారు. ఇక్కడ జరిగే పొరపాట్లు వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉన్నందున ఈ కార్యక్రమంపై మరింత శ్రద్ధపెట్టాలని సీఎం సూచించారు. సీఎం ఆదేశాల మేరకు ఆర్బీకేల ద్వారానే నాణ్యమైన ఎరువులను పంపిణీ చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ఆర్బీకేల ద్వారా 2023–24లో 10.5లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పిన అధికారులు. ఎరువులతో పాటు ఏపీ ఆగ్రోస్ ద్వారా రైతులకు అవసరమైన స్థాయిలో పురుగుమందుల పంపిణీకి కూడా చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. నకిలీ, నాణ్యతలేని పురుగుమందులు లేకుండా చేయడానికి ఇది దోహదపడుతుందన్నారు. పొలంబడి శిక్షణ ♦పొలంబడి శిక్షణ కార్యక్రమాల వల్ల సత్ఫలితాలు వస్తున్నాయన్న అధికారులు ♦ఆర్బీకేల ద్వారా ఆయా రైతులకు ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ ఇస్తున్నామన్న అధికారులు ♦ఈ శిక్షణ కార్యక్రమాల వల్ల వరి, వేరుశెనగలో 15శాతం, పత్తిలో 12 శాతం, మొక్కజొన్నలో 5శాతం పెట్టుబడి ఖర్చులు తగ్గాయన్న అధికారులు ♦పత్తిలో 16శాతం, మొక్కజొన్నలో 15 శాతం, వేరుశెనగ 12 శాతం, వరిలో 9శాతం దిగుబడులు పెరిగాయన్న అధికారులు ♦పూర్తి సేంద్రీయ వ్యవసాయ పద్దతుల దిశగా అడుగులు వేయడానికి ఇది తొలిమెట్టు అన్న అధికారులు ♦26 ఎఫ్‌పీవో(ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్)లకు జీఏపి (గుడ్‌అగ్రికల్చర్ ప్రాక్టీస్) సర్టిఫికెట్‌ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్న అధికారులు వ్యవసాయ పరికరాల పంపిణీ ♦రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ షెడ్యూల్‌కు సీఎం గ్రీన్‌సిగ్నల్ ♦ యాంత్రీకరణ పెరిగేందుకు దోహదపడుతుందన్న సీఎం ♦ ఏప్రిల్‌లో ఆర్బీకేల్లోని 4225 సీహెచ్‌సీలకు యంత్రాల పంపిణీ ♦జులైలో 500 డ్రోన్లు, డిసెంబర్ కల్లా మరో 1500 డ్రోన్లు పంపిణీ ♦జులై లో టార్పాలిన్లు, జులై నుంచి డిసెంబర్ మధ్య మూడు విడతలుగా స్ప్రేయర్లు పంపిణీ మిల్లెట్స్ సాగుపై చర్యలు ♦రాష్ట్రంలో మిల్లెట్స్ సాగును ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం ఆదేశాలమేరకు అనేక చర్యలు తీసుకున్నామన్న అధికారులు ♦19 జిల్లాల్లో 100 హెక్టార్ల చొప్పున మిల్లెట్ క్లస్టర్లు పెట్టామన్న అధికారులు ♦3 ఆర్గానిక్ క్లస్టర్లను కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడి ♦ఎగుమతికి ఆస్కారం ఉన్న వరి సాగును ప్రోత్సహిస్తున్నామన్న అధికారులు. ♦2022 ఖరీఫ్‌లో 2.74 లక్షల హెక్టార్లలో ఎగుమతిచేయదగ్గ వరి రకాలను సాగుచేస్తున్నామన్న అధికారులు ♦దాదాపు 6.29 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యిందని వెల్లడి ♦2022–23 రబీలో 1.06 లక్షల హెక్టార్లలో ఎగుమతి వెరైటీలను సాగుచేశారని, 3.79 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉందని వెల్లడించిన అధికారులు ♦ఆర్బీకేల్లో కియోస్క్‌ల సేవలు పూర్తిస్థాయిలో రైతులకు అందాలని, దీనిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలన్న సీఎం ♦ఉద్యానవన పంటల మార్కెటింగ్ పై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం ♦కొత్త తరహా ఉత్పత్తులు వస్తున్నకొద్దీ.. మార్కెటింగ్ ఉదృతంగా ఉండాలన్న సీఎం ♦దీనివల్ల రైతులు తమ పంటలను విక్రయించుకోవడానికి ఇబ్బందులు ఉండవని, మంచి ఆదాయాలు కూడావస్తాయన్న సీఎం ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ ♦ఫ్యామిలీ డాక్టర్ తరహాలోనే ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం ♦భూ పరీక్షకోసం నమూనాల సేకరణ, వాటిపై పరీక్షలు, వాటి ఫలితాలను రైతులకు అందించడం, ఫలితాలు ఆధారంగా పాటించాల్సిన సాగు విధానాలపై అవగాహన తదితర ♦అంశాలపై ఒక సమర్థవంతమైన ఎస్ఓపీ రూపొందించుకోవాలన్న సీఎం ♦ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ పరీక్షలు చేసేదిశగా చర్యలు తీసుకోవాలన్న సీఎం ♦జూన్‌లో ఖరీఫ్ నాటికి పరీక్షల ఫలితాలు ఆధారంగా రైతుకు సాగులో పాటించాల్సిన పద్ధతులపై పూర్తి వివరాలు, అవగాహన కల్పించాలన్న సీఎం ♦పంటలకు అవసరమైన స్థాయిలోనే ఎరువులు, పురుగుమందులు ఉండాలన్న సీఎం ♦ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్... ఆర్బీకేల కార్యక్రమాలను ఒక దశకు తీసుకెళ్తాయన్న సీఎం చదవండి: నలుగురిని లాక్కున్నారు.. వచ్చే ఎన్నికల్లో నాలుగు సీట్లే: కొడాలి నాని ఈ సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ సలహాదారు తిరుపాల్ రెడ్డి, ఉద్యానవన శాఖ సలహాదారు శివప్రసాద్ రెడ్డి, ఏపీ ఆగ్రోస్ ఛైర్మన్ బి.నవీన్ నిశ్చల్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ సి.హరికిరణ్, ఉద్యానవనశాఖ కమిషనర్ ఎస్ఎస్. శ్రీధర్, మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్‌పాండే, ఎపీఎస్‌ఎస్‌డీసీఎస్ వీసీ అండ్ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్ బాబు, ఏపీ ఆగ్రోస్ వీసీ అండ్ ఎండీ ఎస్.కృష్ణమూర్తి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు -
ఆయిల్ పామ్ టన్ను రూ.22,770
సాక్షి, అమరావతి: ఆయిల్ పామ్ రైతులకు కాసుల వర్షం కురుస్తోంది. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ధర పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్ టన్ను రూ.17 వేలతో ప్రారంభం కాగా, ప్రస్తుతం తాజా గెలల (ఎఫ్‌ఎఫ్‌బీ)ను టన్ను రూ.22,770 చొప్పున కొనాలని ఉద్యాన శాఖ పామాయిల్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. కేవలం ఏడు నెలల్లోనే టన్నుకు రూ.5,770 పెరగడం గతంలో ఎప్పుడూ లేదని రైతులు చెబుతున్నారు. రాష్ట్రంలో 4.80 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోంది. ప్రభుత్వ చర్యల ఫలితంగా 2019–20లో 6,642 హెక్టార్లు, 2020–21లో 8,801 హెక్టార్లు, 2021–22లో 11,257 హెక్టార్లు కొత్తగా సాగులోకి వచ్చాయి. 2020–21లో 14.94 లక్షల టన్నులు, 2021–22లో 17.22 లక్షల టన్నులు దిగుబడి వచ్చింది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో దిగుబడులొస్తాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో గంటకు 461 టన్నుల సామర్థ్యంతో 13 పామాయిల్ కంపెనీలు పని చేస్తున్నాయి. ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో (ఓఈర్)ను బట్టి ధర చెల్లించాలి. అయితే, నాణ్యత సాకుతో గతంలో తెలంగాణ ఓఈఆర్ కంటే ఇక్కడ తక్కువగా చెల్లించేవారు. దీంతో రైతులు టన్నుకు రూ.4 వేలకు పైగా నష్టపోయేవారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో రైతులు ఆయన్ని కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. వారి ఆవేదనను అర్ధం చేసుకున్న వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఆయిల్ పామ్‌కు గిట్టుబాటు ధర కల్పించారు. అప్పటివరకు 16.08 శాతం ఉన్న ఓఈఆర్ను 18.68 శాతానికి పెంచారు. 2018–19లో సగటున రూ.7 వేలు పలికిన టన్ను ఆయిల్‌పామ్ ధర ఇప్పుడు రూ.15వేలకు పైగా పెరిగింది. 2020–21లో టన్ను రూ.13,127 తో సీజన్ ప్రారంభం కాగా గరిష్టంగా మే–జూన్ నెలల్లో రూ.18,942 పలికింది. కాగా ఈ ఏడాది ఓఈఆర్ నిర్ధారణ కాకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్ ధరలు, డిమాండ్‌ను బట్టి అడ్హాక్ కమిటీ నెలవారీ ధరలను ప్రకటిస్తోంది. సీజన్ ప్రారంభమైన నవంబర్‌లో టన్ను రూ.17 వేలుగా అడ్హాక్ కమిటీ నిర్ణయించగా ఇదే ధరతో జనవరి వరకు కొన్నారు. ఫిబ్రవరిలో టన్ను రూ.19,300గా నిర్ణయించారు. మార్చిలో రూ.21,890, ఏప్రిల్‌లో రూ.21,940గా నిర్ణయించారు. ప్రస్తుతం ఇదే ధరతో కొంటున్నారు. మే నెల నుంచి టన్ను రూ.22,770 చొప్పున ధర చెల్లించాలన్న అడహాక్ కమిటీ నిర్ణయం మేరకు ఆయిల్ కంపెనీలకు ఉద్యాన శాఖ కమిషనర్ ఎస్ఎస్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎకరాకు 10 టన్నులకు పైగా దిగుబడి వస్తోంది. పెరిగిన ధరల నేపథ్యంలో పెట్టుబడి పోను ఎకరాకు రూ.2 లక్షల వరకు నికర ఆదాయం వస్తోందని రైతులు చెబుతున్నారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మంచి ధర వస్తోంది ఆయిల్‌పామ్‌కు ఇప్పుడు మంచి ధర వస్తోంది. ఓఈఆర్ ఎంత ఇవ్వాలనే అంశంపై ఇంకా నిర్ణయం జరగలేదు. అంతర్జాతీయ మార్కెట్‌ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అడ్హాక్ కమిటీ నెలవారీ ధరలను నిర్ణయిస్తోంది. పూర్తిగా పక్వానికి వచ్చిన తాజా గెలలకు టన్ను రూ.22,770 చొప్పున చెల్లించాలని కంపెనీలకు ఆదేశాలిచ్చిందిది. – పి.హనుమంతరావు, జేడీ, ఉద్యాన శాఖ (ఆయిల్‌పామ్ విభాగం) -
గుబాళిస్తున్న జాజికాయ, జాపత్రి!
పిఠాపురం: కేరళలో మాత్రమే పండే జాజికాయ, జాపత్రి పంటలను తన పొలంలో ప్రయోగాత్మకంగా పండించి మంచి ఫలితాలు సాధిస్తున్నారు కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం యండపల్లికి చెందిన రైతు గుండ్ర అంబయ్య. ఉద్యానశాఖ అధికారుల సూచన మేరకు తనకున్న పామాయిల్ తోటల్లో అంతర పంటగా మసాల దినుసులు, వనమూలికల పెంపకం చేపట్టారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో ఈ పంటలను సాగు చేస్తున్నారు. కేరళలో ఉన్న తన బంధువుల సహకారంతో జాజికాయల మొక్కలను తెప్పించుకుని.. ఎలాంటి అదనపు పెట్టుబడి లేకుండా అంతరపంటల సాగును విజయవంతంగా సాగు చేస్తున్నారు. దేశవాలీ ఆవులను పెంచుతూ ఒక పక్క పాడితో ఆదాయాన్ని పొందుతూ.. మరో పక్క సేంద్రియ ఎరువులను తయారు చేసి మొక్కలను పెంచుతున్నారు. పామాయిల్ తోటలో జాజికాయ, జాపత్రితోపాటు మిరియాలు, యర్రవాగులి (ఆయుర్వేద మొక్క), ఎర్ర చక్కెరకేళి, కంద తదితర మొక్కలు పెంచుతున్నారు. సేంద్రియ ఎరువుల ద్వారా మొక్కలు ఏపుగా పెరిగి కాయలు కాస్తున్నాయి. మంచి దిగుబడి వస్తున్నది. దీనికి మార్కెట్ అవసరం లేకుండా ఆయనే స్వయంగా పండిన పంటను స్థానికంగా ఉన్న దుకాణాలకు సరఫరా చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. అంబయ్య తన పొలంలో పండించే జాజికాయలలో రెండు రకాలు ఉంటాయి. కేరళశ్రీ, విశ్వశ్రీ వాటిలో కేరళశ్రీ ఇక్కడ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో జాపత్రి కేజీ రూ.2,100 ఉండగా జాజికాయ కేజీ రూ. 900 ఉన్నాయి. ప్రభుత్వ సహకారం ఉంటే .. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ముళ్ళపూడి కృష్ణారావు అనే రైతు పొలంలో జాజికాయలను సాగు చేయడంతో దానిని చూసి.. నా పొలంలో సాగు చేయడం ప్రారంభించా. కొద్ది పొలంలో జాజికాయ, జాపత్రి మొక్కలను నాటగా అన్నీ కాపు కాసి ప్రస్తుతం దిగుబడినిస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కోచెట్టు ఐదు నుంచి 10 కేజీల దిగుబడినిస్తుంది. ప్రభుత్వ సహకారం ఉంటే మొత్తం ఆరు ఎకరాల్లోనూ జాజికాయ, జాపత్రి సాగు చేస్తా. – గుండ్ర అంబయ్య, రైతు , యండపల్లి, కొత్తపల్లి జాజికాయ,జాపత్రి సాగు లాభదాయకం.. జాజికాయ, జాపత్రి సాగు అంతరపంటగా మంచి లాభాలను ఇస్తుంది. చాలా మంది రైతులకు ఈ పంట సాగు చేయమని సూచనలు ఇస్తున్నాం. కొంత మంది రైతులు సాగుకు ముందుకు వస్తున్నారు. రైతులు తమ పొలాల్లో అంతర పంటల సాగుకు ముందుకొస్తే అసలు పంటల కంటే అంతర పంటల ద్వారా ఎక్కువ లాభాలు పొందవచ్చు. ఉద్యానశాఖ ద్వారా తగిన సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నాం. – శైలజ, ఉద్యానశాఖాధికారి, పిఠాపురం -
మామిడిపై నల్లతామర
సాక్షి, అమరావతి: మిరపను కబళించిన ‘త్రిప్స్ పార్విస్ పైనస్’ (నల్లతామర) తాజాగా మామిడిపై సోకింది. ఇప్పుడిప్పుడే పూతకొస్తున్న మామిడిపై ఈ నల్లతామర జాడను గుర్తించారు. మిరపను నాశనం చేసిన నల్లతామర మామిడిపై సోకే అవకాశం ఉందని జాతీయ శాస్త్రవేత్తల బృందాలు పేర్కొన్న నేపథ్యంలో పూతకొస్తున్న మామిడిపై వాటి ప్రభావం ఏమేరకు ఉంటుందో అంచనా వేసేందుకు మామిడి సాగవుతున్న జిల్లాల్లో శాస్త్రవేత్తల బృందాలు పర్యటిస్తున్నాయి. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా కృష్ణాజిల్లాలో మామిడిపై ఈ నల్లతామర జాడను కనుగొన్నారు. నూజివీడు ఉద్యాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు మంగళవారం మైలవరం, రెడ్డిగూడెం, రెడ్డికుంట, అన్నారం ప్రాంతాల్లో 10 వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. మామిడిపై సోకే సాధారణ త్రిప్స్తో పాటు నల్లతామర పురుగు కూడా సోకినట్లు గుర్తించారు. మామిడి చుట్టుపక్కల కూరగాయల పాదులతో పాటు కలుపు మొక్కలపైనా దీన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు నమూనాలను సేకరించారు. నల్లతామర ఉధృతి ఏ స్థాయిలో ఉంది? పూత, పిందెలపై వాటి ప్రభావం ఏ మేరకు ఉండబోతోంది అనేవి అంచనా వేస్తున్నారు. మామిడితో పాటు ఇతర పంటలపైనా వీటి ప్రభావం కనిపిస్తున్నందున రైతులను అప్రమత్తం చేయడంతోపాటు ఆర్బీకే స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో సామూహిక నివారణ చర్యలు చేపట్టేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. మామిడిపై ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సారం (లూపర్), మరికొన్ని ప్రాంతాల్లో తేనెమంచు (హోపర్) పురుగులు, ఇంకొన్నిచోట్ల ఆకుమచ్చ (ఆంత్రాక్నోజ్), కొమ్మఎండు తెగులు సోకగా ఇప్పుడు సాధారణ త్రిప్స్తో పాటు తామరపురుగు కూడా ఆశించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆర్బీకే స్థాయిలో రైతులకు అవగాహన కృష్ణా జిల్లాలో మామిడితో పాటు కూరగాయలు, కలుపుమొక్కలపై గుర్తించిన నల్లతామర నివారణకు శాస్త్రవేత్తలు సూచించిన చర్యలపై ఆర్బీకే స్థాయిలో రైతులకు అవగాహన కల్పించి, కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళతామని వ్యవసాయశాఖ కమిషనర్ డాక్టర్ ఎస్.ఎస్.శ్రీధర్ చెప్పారు. తామరపురుగు నివారణకు మందులు సూచిస్తామని వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ జానకీరామ్ చెప్పారు. ఏ మందులు పడితే ఆ మందులను మోతాదుకు మించి వాడవద్దని రైతులకు సూచించారు. -
చిన్న, సన్నకారు రైతులందరికీ డ్రిప్, స్ప్రింక్లర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులందరికీ బిందు, తుంపర (డ్రిప్, స్ప్రింక్లర్లు) సేద్యం సదుపాయాలను నిర్ణీత సమయంలోగా కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. చిన్న, సన్నకారు రైతులకు వైఎస్సార్ జలకళ పథకం ద్వారా బోర్లు తవ్విస్తున్నందున వారికి సూక్ష్మ సేద్యం సదుపాయాలను కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని సీఎం పేర్కొన్నారు. ఏం చేసినా సంతృప్త స్థాయి (శాచ్యురేషన్)పద్ధతిలో ఉండాలని, కొందరికి మాత్రమే పథకాలు ఉండకూడదని, అందరికీ ఫలాలు అందాలని సీఎం స్పష్టం చేశారు. వ్యవçస్థలో అవినీతి ఉండకూడదని, చిన్న, సన్నకారు రైతులకు ఎలా మేలు చేయాలన్న అంశంపై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఉద్యాన, మైక్రో ఇరిగేషన్, వ్యవసాయ మౌలిక వసతుల కల్పనపై సీఎం మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రివర్స్ టెండర్లతో ధరలు తగ్గి ఎక్కువ మందికి మేలు.. రాయలసీమ, ప్రకాశం లాంటి ప్రాంతాల్లో 10 ఎకరాల్లోపు, మిగిలిన చోట్ల 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ల సదుపాయాలను కల్పించడంలో ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు జరిపి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. సూక్ష్మ సేద్యం పరికరాలను రివర్స్ టెండరింగ్ ద్వారా కొనుగోలు చేయడం ద్వారా ధర తగ్గి ఎక్కువ మంది రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కల్పించే రాయితీలను పరిగణలోకి తీసుకుని లెక్కిస్తే ఎంత ధరకు డ్రిప్, స్ప్రింక్లర్ వ్యవస్థలు అందుబాటులోకి వస్తాయన్న దానిపై ఒక అవగాహన వస్తుందన్నారు. సెరి కల్చర్‌పై ప్రత్యేక దృష్టి మల్బరీ సాగు రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మల్బరీ సాగు చేసే రైతుల పరిస్థితులను పూర్తి స్థాయిలో మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మల్టీ పర్పస్ కేంద్రాల్లో 14 రకాల సదుపాయాలు అగ్రి ఇన్ఫ్రాలో భాగంగా ఏర్పాటు చేయనున్న మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ప్రతి ఆర్బీకే పరిధిలో సేంద్రీయ, సహజ వ్యవసాయ విధానాలను ప్రోత్సహించాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన పరికరాలను ప్రతి కస్టమ్ హైరింగ్ సెంటర్ (సీహెచ్‌సీ)లో ఉంచాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్టీపర్పస్ కేంద్రాల్లో 14 రకాల సదుపాయాలు ఉంటాయని, ఇందుకు దాదాపు రూ.14,562 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు అధికారులు వివరించారు. డ్రై స్టోరేజీ, డ్రైయింగ్ ఫ్లాట్‌ఫాం, గోడౌన్లు, హార్టికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, యంత్ర పరికరాలు, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, ఈ – మార్కెటింగ్, జనతాబజార్లు, ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు తదితరాలు ఉంటాయని అధికారులు తెలిపారు. – సమీక్షలో ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఆర్ధిక శాఖ కార్యదర్శి గుల్జార్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, మత్స్యశాఖ కమిషనర్ కె. కన్నబాబు, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూదనరెడ్డి, హార్టికల్చర్ కమిషనర్ ఎస్ఎస్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
మామిడి రైతుకు 'తీపి' ధర
సాక్షి, అమరావతి బ్యూరో: మామిడి రైతుకు ఈ ఏడాది మంచి రోజులొచ్చాయి. గత సంవత్సరంకంటే అధిక దిగుబడులు రావడంతోపాటు ధర కూడా ఎక్కువగా లభిస్తోంది. ఇన్నాళ్లూ రైతులు మామిడిని స్థానిక మార్కెట్లోనే విక్రయించడం సంప్రదాయంగా వస్తోంది. దీంతో మార్కెట్లో వ్యాపారులు నిర్ణయించిన తక్కువ ధరకే అమ్ముకోవలసిన పరిస్థితి ఉండేది. ఫలితంగా రైతుకు నష్టం వాటిల్లేది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉద్యానశాఖ ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా మామిడికి మంచి ధర లభించేలా చూస్తోంది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో భూమిలో తేమ శాతం పెరిగి మామిడి దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. గత ఏడాది ఎకరానికి నాలుగు టన్నుల దిగుబడి రాగా ఈ సంవత్సరం ఐదు టన్నులకుపైగా (25 నుంచి 30 శాతం అధికంగా) వస్తోంది. ఈ ఏడాది 56 లక్షల టన్నుల మామిడి దిగుబడి రావచ్చని ఉద్యానశాఖ అంచనా వేస్తోంది. పైగా ఈ ఏడాది మామిడి నాణ్యత కూడా మెరుగ్గా ఉంది. ఇప్పటికి మామిడి కోత 20 శాతం వరకు జరగ్గా ఏప్రిల్ రెండోవారం నుంచి పూర్తిస్థాయిలో మామిడి మార్కెట్‌కు వస్తుందని ఉద్యానశాఖ అంచనా వేస్తోంది. తోటలోనే రైతులకు సొమ్ము.. బంగినపల్లి రకం టన్ను ఎ–గ్రేడు రూ.60 వేల నుంచి 65 వేలు, బి–గ్రేడు రూ.50 వేలు, సి–గ్రేడు రూ.40 వేలు పలుకుతోంది. తోతాపురి టన్ను ధర రూ.35 వేలు ఉంది. ఉద్యానశాఖ ఈనెల 16న విజయవాడలో నిర్వహించిన మ్యాంగో సెల్లర్స్, బయ్యర్స్ సమావేశం రైతులకు ఎంతో ఉపయోగపడింది. ఆ సమావేశంలో రైతులు.. కొనుగోలుదార్లు/ఎగుమతిదార్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇలా ఈ ఏడాది ఐదువేల టన్నుల మామిడి ఎగుమతులకు ఒప్పందాలు జరిగాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, ఇండోర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తదితర నగరాల నుంచి ఒప్పందాలు చేసుకున్న కొనుగోలుదార్లు వస్తున్నారు. వీరు మామిడితోటల్లోకి నేరుగా వెళ్లి కాయలను కోయించుకుని స్పాట్లోనే రైతులకు సొమ్ము చెల్లించి కాయల్ని తీసుకెళుతున్నారు. రైతులు స్థానిక మార్కెట్లో అమ్ముకుంటే సొమ్ము కోసం నాలుగైదుసార్లు తిరగాల్సి వచ్చేది. పైగా ఎగుమతిదార్లు ఇచ్చే ధరకంటే స్థానిక మార్కెట్లో టన్నుకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు తక్కువే లభించేది. గత సంవత్సరం నాణ్యమైన బంగినపల్లి టన్ను గరిష్టంగా రూ.30 వేలకు, తోతాపురి రూ.10 వేలకు మించలేదు. గతంలో రైతులే మార్కెట్‌కు తరలించే సమయంలో కాయ కోత, లోడింగ్, అన్లోడింగ్, రవాణా ఖర్చుల కింద టన్నుకి రూ.10 వేల నుంచి రూ.12 వేలు ఖర్చయ్యేది. మార్కెట్లలో 10 శాతం కమీషన్ కింద ఇవ్వాల్సి వచ్చేది. కొనుగోలుదారులే నేరుగా తోటల్లోకి వచ్చి తీసుకెళుతుండటంతో రైతులకు ఈ ఖర్చులు, కమిషన్ సొమ్ము ఆదా అవుతున్నాయి. మంచి ధర దక్కుతోంది స్థానిక మార్కెట్లో మామిడిని విక్రయిస్తే తక్కువ ధరతో పాటు కమీషన్, హమాలీల ఖర్చుల కింద 10 శాతం సొమ్ము తీసుకుంటున్నారు. ఇలా గత ఏడాది రైతుకు టన్నుకు రూ.30 వేలు రావడం కష్టమైంది. సెల్లర్స్, బయ్యర్స్ మీట్లో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఫలితంగా ఎ–గ్రేడు బంగినపల్లి రకం టన్ను రూ.52 వేల నుంచి రూ.70 వేల వరకు కొనుగోలు చేశారు. వెంటనే సొమ్ము చెల్లించారు. ఇలా నాకున్న 20 ఎకరాల్లో ఇప్పటివరకు నాలుగున్నర టన్నులు విక్రయించాను. మా గ్రామం నుంచి వంద టన్నులు ఎగుమతిదార్లకు విక్రయించాలని ఒప్పందం చేసుకున్నాం. – బాలరాఘవరావు, మామిడి రైతు, హనుమంతునిగూడెం, కృష్ణా జిల్లా ఒప్పందాలతో సత్ఫలితాలు గత ఏడాదికంటే మామిడి అధిక దిగుబడి రావడంతో పాటు మంచి ధర కూడా లభిస్తోంది. రైతులు నాణ్యమైన మామిడిని ఎగుమతిదార్లకు విక్రయించేలా ప్రోత్సహిస్తున్నాం. ఇటీవల విజయవాడలో నిర్వహించిన మ్యాంగో మీట్లో ఒప్పందాల మేరకు ఎగుమతిదారులు నేరుగా కొనుగోళ్లు మొదలు పెట్టారు. – సీహెచ్. శ్రీనివాసులు, ఏడీ, ఉద్యానశాఖ -
ఆయిల్‌ఫెడ్‌కు 1.3 లక్షల ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: ఆయిల్‌పాం సాగుకు నోటిఫై చేసిన ఏరియాలో 1.3 లక్షల ఎకరాలు ఆయిల్ ఫెడ్‌కు ఇవ్వాలని ప్రభు త్వం నిర్ణయించింది. మహబూబాబాద్ జిల్లాలో 50 వేల ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 30 వేల ఎకరాలు, జనగామ జిల్లాలో 20 వేల ఎకరాలు, గద్వాల జిల్లాలో 20 వేలు, నారాయణపేట్ జిల్లాలో 10 వేల ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించారు. అందుకు సంబంధించి త్వరలో ఒప్పందం చేసుకుంటామని ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎండీ నిర్మల తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 25 జిల్లాల్లో 8,24,162 ఎకరాలు ఆయిల్‌పాం సాగుకు అనువైన ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. అందులో దాదాపు 8 లక్షల ఎకరాలను 13 కంపెనీల పరిధిలోకి తీసుకురావడం, ఆయిల్‌ఫెడ్‌కు 24,500 ఎకరాలు (2.97 శాతం) మాత్రమే కేటాయిస్తూ వ్యవసాయశాఖ ఇటీవల ఉత్తర్వులు ఇవ్వడం విదితమే. దీంతో ఆయిల్‌ఫెడ్ అధికారులు తమకు మరికొంత కేటాయించాలని వ్యవసాయశాఖకు విన్నవించారు. ఇదిలావుంటే ప్రైవేట్ కంపెనీలకు కేటాయించిన దాంట్లో కొన్ని ప్రముఖ సంస్థలే ముందుకు రాకపోవడం గమనార్హం. దీంతో ఆయిల్‌ఫెడ్ కోరినట్లుగా నోటిఫై చేసిన ప్రాంతాల్లో కొంతమేరకు ఇచ్చారు. కొన్ని కంపెనీలు రాని ఏరియాలను ఇప్పటికే టెండర్లలో పాల్గొన్న సంస్థలకు ఇస్తామని ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. -
అంతర పంటలతో ఆదాయం పొందండి
సాక్షి, అమరావతి: ఒకే పంటను పండించి నష్టపోతున్న రైతులు అంతర పంటల సాగుపై దృష్టి సారించేలా ఉద్యాన శాఖ వారికి అవగాహన కల్పిస్తోంది. నాలుగైదు ఏళ్ల తర్వాత దిగుబడి వచ్చే ప్రధాన పంటల మధ్యలో అంతర పంటల్ని సాగు చేయడం వల్ల అధిక ఆదాయాన్ని పొందొచ్చు. తోటల్లో మొక్కల మధ్య దూరం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రధాన పంట కాపునకు వచ్చేంత వరకు అంతర పంటలు సాగు చేయవచ్చు. ఏక పంటగా ఏదో ఒక ఉద్యాన పంటను పండించడం కన్నా అంతర/బహుళ పంటల వంటి సమగ్ర పద్ధతుల్ని అవలంభించడం వల్ల ఒక పంట పోయినా మరో పంటతో ఆదాయాన్ని పొందవచ్చు. వెలుతురు, నీరు, పోషకాల కోసం ప్రధాన పంటతో పోటీ పడని పంటను ఎంచుకోవాలి. పామాయిల్ తోటల్లో అంతర పంటలుగా కోకో, కూరగాయలు, పూల మొక్కలు, జొన్న, మొక్కజొన్న, మిర్చి, పసుపు, అల్లం, అనాస వంటి వాటిని సాగు చేసుకోవచ్చు. కొబ్బరి, పామాయిల్, మామిడి వంటి తోటల్లో మొక్కకు సరిపడే స్థలం వదలాలి. ప్రధానంగా పామాయిల్లో మొక్కల్ని త్రిభుజాకృతి పద్ధతిలో కన్నా చతురస్రాకృతి పద్ధతిన సాగు చేస్తే మంచిది. పామాయిల్లో అంతర పంటల వల్ల సగటున హెక్టార్‌కు ఏడాదికి రూ.30 నుంచి రూ.50 వేల వరకు అదనపు ఆదాయం పొందవచ్చునని ఉద్యాన శాఖ ఉన్నతాధికారి పి.హనుమంతరావు వివరించారు. -
మన్యం.. మసాలా
సాక్షి, విశాఖపట్నం: నాణ్యమైన కాఫీ గింజలకు, సహజసిద్ధమైన తేనెకు దేశ ప్రసిద్ధిగాంచిన విశాఖ మన్యం ఇప్పుడు సుగంధ ద్రవ్యాల సాగులోనూ పేరుగడిస్తోంది. సుగంధ ద్రవ్యాలు.. అల్లం, పసుపు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు వంటల్లోనే కాకుండా కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి కషాయాలుగానూ ఉపయోగపడుతున్నాయి. దీంతో వీటికి మరింత డిమాండ్ పెరిగింది. సుగంధ ద్రవ్యాలకు పేరొందిన కేరళలో కంటే మన్యంలో సేంద్రీయ పద్ధతిలో పండించిన నాణ్యమైన సరుకు లభ్యమవుతోంది. ఇక్కడ 11 మండలాల్లో ఉన్న ఎర్రగరప నేలలు సాగుకు ఎంతో అనుకూలం. అల్లం ► మన్యంలో 300 ఎకరాల్లో అల్లం సాగవుతోంది. ► దేశవాళీ నర్సీపట్నం రకం అల్లం దిగుబడి ఎకరాకు రెండు టన్నులే ఉంటోంది. దీంతో మహిమ, నడియా రకాలను ఉద్యాన శాఖ ప్రవేశపెట్టింది. ఎకరాకు ఆరు టన్నుల దిగుబడి, రూ.5 లక్షల వరకు ఆదాయం లభిస్తున్నాయి. పసుపు ► మన్యం పసుపు ధర ఈ ఏడాది టన్ను రూ.9 వేలు పలికింది. ► కస్తూరి రకం పసుపును కుంకుమ తయారీకి ఉపయోగిస్తున్నారు. ► పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ‘పసుపు ప్రాజెక్టు’ను ఇటీవలే ప్రారంభించింది. ► 20,552 ఎకరాల్లో ఉన్న పసుపు సాగును ఐదేళ్లలో మరో పది వేల ఎకరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.100 కోట్లు కేటాయించాయి. దాల్చిన చెక్క వంద ఎకరాల్లో మొక్కలు సాగవుతున్నాయి. లవంగాలు ఈ ఏడాదే 80 ఎకరాల్లో లవంగాల మొక్కలను నాటారు. మిరియాలు ► 27,182 ఎకరాల్లో సాగు ఉంది. కాఫీ తోటల నీడ కోసం పెంచే సిల్వర్ ఓక్ చెట్లపైకి మిరియాల పాదులను పెంచుతారు. ఇలా అంతర పంటగా పన్నియూరు–1 రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ► ఎకరాకు వంద కిలోల వరకు దిగుబడి, రూ.15 వేల వరకు అదనపు ఆదాయం లభిస్తున్నాయి. జాజికాయ ► మన్యంలో ఈ ఏడాదే 80 ఎకరాల్లో రైతులు జాజికాయ మొక్కలు నాటారు. పదేళ్ల చెట్లు అయితే ఎకరాకు రూ.50 వేలకుపైగా ఆదాయం వస్తుంది. రైతులకు లాభం సుగంధ ద్రవ్యాల సాగులో సస్యరక్షణ చర్యలు చేపడితే ఎకరానికి ఏటా రూ.5 లక్షల వరకు పొందొచ్చు. మండల వ్యవసాయాధికారులు, గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులు రైతులకు సలహాలు ఇస్తున్నారు. ప్రభుత్వం పసుపు, అల్లం రైతులకు హెక్టారుకు రూ.12 వేలు చొప్పున, మిరియాలకు రూ.8 వేలు, దాల్చిన చెక్క, జాజికాయ, లవంగాల రైతులకు రూ.20 వేల చొప్పున రాయితీ ఇస్తోంది. – కె.గోపీకుమార్, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు, విశాఖ జిల్లా ప్రభుత్వమే ఉచితంగా ఇస్తోంది సుగంధ ద్రవ్యాల మొక్కలను వివిధ రాష్ట్రాల నుంచి వ్యయప్రయాసలకోర్చి తెచ్చేవాడిని. ఇప్పుడు ప్రభుత్వమే ఉచితంగా అందిస్తోంది. – కుశలవుడు, గిరిజన రైతు, లంబసింగి -
పోస్ట్మ్యాన్లతో కూరగాయల సరఫరా
చెన్నై : సాధారణంగా పోస్టుమ్యాన్లు ఉత్తరాలు అందివ్వడం ఆనవాయితీ. ఇప్పటి వరకు మనం అదేం చూశాం .అయితే ఇకపై వారు పండ్లు, కూరగాయలు సరఫరా చేయనున్నారు. ఇండియా పోస్ట్‌తో ఉద్యానవన శాఖ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి పండ్లు, కూరగాయలు ఇళ్లకు సరఫరా చేయనున్నారు. ఇటీవల చెన్నైలోని చిట్లపాక్కంలో పోస్ట్మ్యాన్లతో విజయవంతంగా పంపిణీ చేశారు. దీంతో ఈ వ్యవస్థను మరో వారంలో అమల్లోకి తీసుకురావాలని ఉద్యానవన శాఖాధికారులు భావిస్తున్నారు. ప్రతి పోస్టాఫీసు పరిధిలోని ఆపరేటివ్ ఏరియా సామర్థ్యాన్ని బట్టి కూరగాయల పొట్లాలు మాత్రమే పంపిణీ చేస్తారు. ప్రతి పార్సిల్లో గరిష్టంగా ఏడు కిలోల కూరగాయలు, పండ్లను సరఫరా చేసేలా యోచిస్తోందని తెలిపారు. పార్సిళ్లు ఇబ్బంది లేకుండా పంపిణీ చేయడానికి వాహనాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. లాక్డౌన్ ఉన్నందున కొత్తగా కూరగాయలు, పండ్లు సరఫరా వల్ల ఇండియా పోస్ట్‌కు ఆదాయం కూడా లభిస్తుందని తపాలాశాఖ అధికారులు భావిస్తున్నారు. ‘లాక్’ తీస్తే కరోనాతో కష్టమే.. -
ఫోన్ కొడితే మామిడి పండ్లు..
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ద్వారా ఆర్డర్‌పై వినియోగదారులకు మామిడి పండ్ల సరఫరా చేస్తామని ఉద్యానశాఖ పేర్కొంది. పరిశుభ్రమైన పరిస్థితు ల్లో భౌతిక దూరం పాటిస్తూ సేకరించిన కాయలను సహజ పద్ధతిలో మాగబెట్టి కార్టన్ బాక్స్‌ల లో 5 కిలోల చొప్పున (సుమారు 12–15 కాయలు) ప్యాక్‌చేసి నాణ్యమైన మామిడి పండ్లను నేరుగా విని యోగదారుల ఇంటి వద్దకే తపాలా శాఖ పార్సిల్ సర్వీస్ ద్వారా సరఫరా చేస్తామని తెలిపింది. 5 కేజీల బంగినపల్లి మామిడి పండ్ల బాక్స్ ధర రూ.350 (డెలివరీ చార్జీలతో కలిపి). ఎన్ని బాక్స్‌లు కావాలన్న బుక్ చేసుకోవచ్చు. ఆర్డర్ ఇచ్చిన 4 నుంచి 5 రోజుల సమయంలో డెలివరీ చేస్తారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5లోపు ఆర్డర్ ఇవ్వాలి. వివరాలకు 79977 24925/79977 24944 సంప్రదించాలి. ఫోన్ ద్వారా ఆర్డర్ల బుకింగ్ మే 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. -
ఉద్యానశాఖలో ఉద్యోగాలు ఉఫ్..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కరోనా వైరస్ వ్యాప్తి.. లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలకు కోత పడుతోంది. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖలో పనిచేస్తున్న పలువురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విధులకు రావద్దంటూ ఆ శాఖ డైరెక్టరేట్ రెండు రోజుల కిందల ఆదేశాలు జారీచేసింది. ఈ నిర్ణయంతో 17 మంది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. వాస్తవంగా ఉద్యానశాఖలో అమలయ్యే పథకాలకు సర్కారు ఇచ్చే వార్షిక బడ్జెట్లో ఐదు శాతం నిధులను ఉద్యోగుల జీతభత్యాలకు ఖర్చుచేస్తారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం.. ఏడాదిగా కొత్త పథకాలు లేకపోవడంతో.. వీరి సేవలు అవసరం లేదని ప్రభుత్వం భావించింది. పైగా లాక్డౌన్ తోడవడంతో ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చేనెల ఒకటి నుంచి విధులకు హాజరుకానక్కర్లేదని సదరు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి జిల్లా అధికారులు సమాచారమిచ్చారు. జిల్లాలో 12 మంది హార్టికల్చర్ విస్తరణాధికారులు, ఒక అకౌంటెంట్, ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు, ఒక అటెండరు ఉద్యోగాలు పోయినట్లే. 15 ఏళ్లుగా సేవలందించి.. ఉద్యాన పంటల సాగులో జిల్లాది ప్రత్యేక స్థానం. సాధారణ పంటలకు సమానంగా ఈ పంటలను రైతులను పండిస్తున్నారు. ఏటా దాదాపు 80వేల ఎకరాల్లో కూరగాయలు, పండ్లు, పూలతోటలను సుమారు 45 వేల మంది రైతులు సాగుచేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనంత ఎక్కువ మొత్తంలో రంగారెడ్డి జిల్లాలోనే కూరగాయల దిగుబడి ఉంది. జంట నగరాల ప్రజల అవసరాలు తీర్చడంలో ఈ జిల్లాదే కీలకపాత్ర. ఇంతటి కీలకమైన విభాగంలో ఉద్యోగులను తొలగించడంతో ఉద్యాన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వాస్తవంగా అవుట్సోర్సింగ్ హార్టికల్చర్ విస్తరణాధికారులతోనే ఉద్యాన రైతులకు విస్తృతంగా సేవలు అందుతున్నాయి. ఈ శాఖలో జిల్లా అధికారితోపాటు ముగ్గురు హార్టికల్చర్ అధికారులు మాత్రమే ఉన్నారు. హార్టికల్చర్ అధికారులు ఒక్కొక్కరు ఆరేడు మండలాల వ్యవహారాలు చూ డాల్సి ఉంది.ఈ నేపథ్యంలో దాదాపు 15ఏళ్ల కిందట 12 మంది హార్టికల్చర్ విస్తరణాధికారులను అవుట్ సోర్సింగ్ విధానంలో విధుల్లోకి తీసుకున్నారు. వీరు ప్రస్తుతం ఒక్కొక్కరు మూడు మండలాల పరిధిలో ని రైతులకు సేవలందిస్తున్నారు. ఉన్నపళంగా వీరిని తొలగించడంతో రైతులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. తమను విధుల్లో కొనసాగించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒకరు చొప్పున అకౌంటెంట్, కంప్యూటర్ ఆపరేటర్, ఇంజినీర్, అటెండర్ మినహా మిగిలిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ తొలగించాలని బుధవారం ఆదేశాలు వచ్చినట్లు జిల్లా ఉద్యానశాఖాధికారి సునంద ధ్రువీకరించారు. ఈ మేరకు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి సమాచార మిచ్చామని పేర్కొన్నారు. కుటుంబం రోడ్డున పడుతుంది ‘నేను 2005లో హెచ్ఈఓ ఉద్యోగంలో చేరాను. అప్పట్లో రూ.4 వేలు వచ్చేవి. పదిహేనేళ్లుగా ఇదే ఉద్యోగం చేస్తున్నా. ప్రస్తుతం అన్ని కటింగ్‌లు పోను నెలకు రూ.20 వేల వరకు వేతనం వస్తోంది. భార్య, ఇద్దరు పిల్లలకు జీవనాధారం ఈ ఉద్యోగమే. ఇప్పడు ప్రస్తుతం నా వయస్సు 40 ఏళ్లు. ఉన్నట్టుండి ఉద్యోగం నుంచి తొలగిస్తే నా కుటుంబం రోడ్డున పడుతుంది. వేరే ఉద్యోగం చేయడానికి వయస్సు పెరిగిపోయింది. ఇప్పుడేమి చేయాలో అర్థం కావడం లేదు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కుటుంబాన్ని ఎలా పోషించాలని’ అని పేరు చెప్పడానికి ఇష్టడని ఓ ఉద్యానవన విస్తరణాధికారి తన ఆవేదన వ్యక్తం చేశారు. -
మిర్చిని మింగేస్తోంది
సాక్షి, అమరావతి: వాణిజ్య పంటల్లో ప్రధానమైన మిర్చికి కాయ కుళ్లు సోకి రైతులను అపార నష్టాలకు గురి చేస్తోంది. ప్రస్తుత వాతావరణం, అకాల వర్షాలు, మంచు, భూమిలో తేమ వంటి వాటి వల్ల ఈ తెగులు సోకుతోంది. దీనివల్ల మార్కెట్లో ధర పడిపోతోంది. ఈ నేపథ్యంలో ఉద్యాన శాఖాధికారులు రైతుల్ని అప్రమత్తం చేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. శాస్త్రవేత్తల బృందంతో కలిసి రైతులకు నేరుగా సూచనలు, సలహాలు ఇప్పించేలా ఏర్పాట్లు చేశారు. తెగులు పరిస్థితి ఇలా.. ప్రస్తుతం మిరప కాయ పండే దశలో కొంత, కోత దశలో మరికొంత ఉంది. కోత తర్వాత రవాణా, నిల్వ చేసే దశలో కూడా ఈ తెగులు రావొచ్చు. ఇప్పటికే పలుచోట్ల కాయ కుళ్లు సోకి తాలు కాయలుగా మారి రైతులు నష్టపోతున్నారు. కొల్లిటోట్రైకమ్ అనే శిలీంధ్రం వల్ల ఈ తెగులు సోకుతుంది. దీనివల్ల 10నుంచి 54 శాతం వరకు దిగుబడి తగ్గిపోతుంది. కాయ నాణ్యత లోపిస్తుంది. పూత సమయంలో మొదలై ఈ నెలాఖరు (మార్చి) వరకు ఈ తెగులు కనిపిస్తూనే ఉంది. అకాల వర్షాలు పడితే తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. నీటి పారుదల కింద సాగయ్యే తోటల్లో ఈ బెడద ఎక్కువగా ఉంది. ప్రత్యేకించి నేలకు దగ్గరగా ఉన్న వాటి కాయలు లేదా ఆకులపై కాయ కుళ్లు లక్షణాలను గమనించవచ్చు. పండు కాయలపై తొలుత చిన్న నీటి మచ్చలు ఏర్పడి క్రమేపీ పెరుగుతాయి. మచ్చలు నలుపు రంగులోకి మారతాయి. తెగులు ఉధృతి ఎక్కువయ్యే కొద్దీ మచ్చల మధ్య భాగంలో వలయాలు ఏర్పడతాయి. పచ్చి కాయలకు కూడా శిలీంధ్రం సోకుతుంది. కానీ.. కాయ పండిన తరువాతే లక్షణాలు బయట పడతాయి. కుళ్లిన కాయలు రాలిపోతాయి. తెగులు ఆశించిన కాయలు ఎండిన తరువాత తాలు కాయలుగా మారతాయి. తాలు కాయలకు మార్కెట్లో ధర వుండదు. నివారణ ఎలాగంటే.. పంట మారుస్తుండాలి. విత్తనం నుంచి తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున మేలైన కాయ నుంచి విత్తనాన్ని సేకరించి శుద్ధి చేయాలి. ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల కాప్టా్టన్తో లేదా 3 గ్రాముల మాంకోజెబ్ పట్టించి శుద్ధి చేయాలి. కాయలు పండటం మొదలైన వెంటనే ముందుజాగ్రత్త చర్యగా మాంకోజెబ్, కార్బండిజమ్ 2.5 గ్రాములు లేదా క్లోరోదలోనిల్ 2 గ్రాములు, ప్రోపినెబ్ 2 గ్రాముల్ని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగులు ఆశిస్తే అజాక్స్ స్త్రోబిన్, ప్రోపికొనజోల్, డైఫిన్ కొనజోల్, కాపర్ హైడ్రాక్సైడ్, పైరా క్లోస్ట్రోబిన్, మేటిరమ్, టేబుకోనజోల్, ట్రైప్లొక్స్ స్త్రోబిన్ మందులలో ఏదో ఒక దానిని 10 రోజుల వ్యవధిలో 2, 3 సార్లు పిచికారీ చేయాలని గుంటూరు లాంఫామ్‌లోని ఉద్యాన పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.హరిప్రసాదరావు సూచించారు. నేటినుంచి శాస్త్రవేత్తల బృందాల పర్యటన కాయ కుళ్లు తెగులుపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ పావులూరి హనుమంతరావు ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది. కాయ కోసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా చేలల్లో ఉన్న కాయలు నాణ్యత కోల్పోకుండా కాపాడుకునేందుకు సూచనలు, సలహాలను ఈ బృందం ఇస్తుంది. ప్రకాశం జిల్లా నుంచి ఈ పర్యటన ప్రారంభమవుతుంది. ప్రస్తుతం అకాల వర్షాలు పడుతున్న తరుణంలో రైతులకు అవగాహన కల్పిస్తే ఇప్పుడే కాకుండా భవిష్యత్‌లోనూ మేలు జరుగుతుందని భావిస్తున్నట్టు హనుమంతరావు చెప్పారు. తెగులు ఉధృతికి కారణాలివీ - తెగులును తట్టుకోలేని రకాల సాగు - ఏకరూప పంట వేయడం - కాయ పండే దశలో వర్షాలు కురవడం - నీటి తడులు ఎక్కువగా పెట్టడం, తేమ ఎక్కువగా ఉండటం - ఆకులు, కాయలపై తేమ ఎక్కువ సేపు ఉండటం - 20–24 డిగ్రీల ఉష్ణోగ్రత, 80 శాతం కంటే ఎక్కువ తేమ ఉండి మంచు ఎక్కువగా కురవడం -
ప్రకృతి బాటలో కృషీవలుడి సాగు
నేల తల్లిని నమ్ముకున్నవారు పట్టుదలగా శ్రమిస్తే నష్టపోరని రెండోసారి జాతీయ పురస్కారానికి ఎంపికైన ఆదర్శ రైతు ఆకేపాటి వరప్రసాద్‌రెడ్డి రుజువు చేశారు. పాలిటెక్నిక్ డిప్లొమా చేసినా పుడమి తల్లిని నమ్ముకొని నాగలి పట్టారు. ఆటుపోట్లను తట్టుకుని స్వశక్తిపై భరోసాతో డ్రిప్ సాగు విధానాన్ని అనుసరించారు. రసాయనాలకు దూరంగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి ఫలితాలు సాధించారు. కొత్త ఆలోచనలతో బొప్పాయి, అరటి లాంటి తోటలతోపాటు 25 రకాల కూరగాయలను సాగు చేస్తున్నారు. దాదాపు 30 ఏళ్లకుపైగా వ్యవసాయ రంగంలో రాణిస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పలు అవార్డులను పొందారు. ‘సృజనాత్మక రైతు’ జాతీయ పురస్కారానికి ఎంపికైన వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం హస్తవరంకు చెందిన ఆకేపాటి వరప్రసాద్‌రెడ్డితో ‘సాక్షి’ ముచ్చటించింది. – రాజంపేట టౌన్ మీరు వ్యవసాయ రంగాన్ని ఎంచుకోవడానికి కారణం.. నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే బాగా ఇష్టం. ఎంత పెద్ద చదువు చదివినా పొలం పనే చేయాలని డిప్లొమా చదివే సమయంలో నిర్ణయించుకున్నా. డిప్లొమా కాగానే పై చదువులకు వెళ్లకుండా వ్యవసాయం బాట పట్టా. చాలా ఇబ్బందులు పడ్డారని విన్నాం.. చాలా ఆటుపోట్లు ఎదురయ్యాయి. పలుమార్లు ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రంగా నష్టపోయినా మనోధైర్యంతో ముందుకు సాగి విజయాలు సాధించా. ఈ 30 ఏళ్లలో అత్యధిక దిగుబడి ఇచ్చిన పంట ఏది? 2005–06లో ఆరు ఎకరాల్లో అరటి, బొప్పాయి వేశా. రెండు పంటల సాగుకు రూ.2 లక్షలు ఖర్చు చేస్తే రూ.6 లక్షలు ఆదాయం వచ్చింది. అంతరపంటగా చెండుమల్లె వేయటంతో ఖర్చులు పోను రూ.లక్ష వరకు ఆదాయం వచ్చింది. బాగా నష్టపోయిన సందర్భం ఉందా? 2015–2016లో అమృతపాణి అరటి పంట మూడు ఎకరాల్లో వేశా. పంట చేతికి వచ్చే సమయంలో గాలులు వీచి తోట మొత్తం నేలకొరిగింది. రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టగా రూపాయి కూడా చేతికి రాలేదు. నేను వ్యవసాయంలో బాగా నష్టపోయిన సందర్భం ఇదే. తొలిసారిగా డ్రిప్ మీరే అమర్చుకున్నారు. అది విజయవంతమవుతుందని భావించారా? బెల్గాంలోని డ్రిప్ కంపెనీకి వెళ్లి 11 రోజుల పాటు సాగు విధానం, పంటలను పరిశీలించా. అక్కడవారికి వ్యవసాయంపై బాగా పట్టు ఉన్నట్లు నాకు నమ్మకం కలిగింది. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటను సులువుగా సాగు చేయవచ్చని విశ్వాసం కలిగింది. ధైర్యం చేసి డ్రిప్ కోసం రూ.50 వేలు పెట్టుబడి పెట్టా. మంచి ఫలితం వచ్చింది. డ్రిప్ విధానంలో తొలిసారి వేసిన పంట ఏది.. కాలువలతో పొలాలకు నీళ్లు పారిస్తుంటేనే పంటలు ఎండిపోతున్నాయి, ఇక నీటి చుక్కలతో సాగు ఎలా సాధ్యమని నన్ను నిరుత్సాహ పరిచారు. మరికొంత మంది ఎగతాళి చేసినా నేను పట్టించుకోలేదు. తొలిసారిగా బొప్పాయి పంటకు డ్రిప్ అమర్చా. ఒక్కో కాయ మూడు కేజీల బరువుతో అత్యధిక దిగుబడి వచ్చింది. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాలకు చెందిన వారు వచ్చి నా పంటను పరిశీలించారు. అప్పటి నుంచి రాజంపేట డివిజన్లో అంతా డ్రిప్ విధానాన్ని అనుసరించారు. ఇది మీ మొదటి జాతీయ అవార్డా.. గతంలోనూ ఓ అవార్డు వచ్చింది. ఇది రెండో జాతీయ అవార్డు. ఇది నాపై బాధ్యత మరింత పెంచింది. మీ విజయంలో కుటుంబం పాత్ర.. నేను వ్యవసాయ రంగంలో రాణిస్తున్నానంటే నా భార్య ఆకేపాటి చంద్రవేణి అందుకు ప్రధాన కారణం. పొలం పనుల్లో నాకు చేదోడుగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి పిల్లలను ప్రయోజకులను చేసింది. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు కూడా నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం ఆలోచన ఎలా వచ్చింది? 2000లో కడుపులో మంట సమస్యతో తిరుపతిలో డాక్టర్ వద్దకు వెళ్లా. పంటలకు వినియోగించే రసాయనిక ఎరువులే పొట్టలో మంటకు కారణమని డాక్టర్ చెప్పారు. పంటలకు రసాయనిక ఎరువులు వాడకూడదని అప్పుడే నిర్ణయించుకున్నా. మాకు ఆవులు ఉండటంతో ప్రకృతి వ్యవసాయం చేయాలన్న ఆలోచన వచ్చింది. దీన్ని అమలు చేసి మంచి దిగుబడులు సాధిస్తున్నా. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నందు వల్ల గుర్తింపు రావటంతోపాటు అవార్డులు, రివార్డులు అందుకుంటున్నా. జాతీయ అవార్డుకు ఎలా ఎంపికఅయ్యారు? ఐసీఐసీఐ ఫౌండేషన్ నా గురించి తెలుసుకొని ప్రకృతి సాగు విధానాలపై ఫొటోలు, వీడియోలు, గతంలో వచ్చిన అవార్డులు, ప్రశంసా పత్రాల వివరాలను ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీకి పంపింది. దీంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. -
అరబ్ దేశాలకు ‘అనంత’ అరటి
అనంతపురం అగ్రికల్చర్: కరువుసీమ అనంతపురం జిల్లాలో పండిన నాణ్యమైన అరటి పంట తొలిసారిగా గల్ఫ్ దేశాలకు ఎగుమతి కాబోతోంది. ఇందుకు ఈనెల 30న ముహూర్తం ఖరారైంది. ఉద్యాన శాఖ, గుజరాత్‌కు చెందిన దేశాయ్ కంపెనీ అవసరమైన ఏర్పాట్లుచేశాయి. జిల్లాలోని తాడిపత్రి నుంచి ఈ ఎగుమతిని ప్రారంభించడానికి 43 బోగీలు కలిగిన ప్రత్యేక రైలు వ్యాగన్‌ను ఏర్పాటుచేస్తున్నారు. తొలివిడతగా 890 మెట్రిక్ టన్నుల అరటిని నిబంధనల మేరకు ప్యాకింగ్ చేసి కంటైనర్లలో సిద్ధంగా ఉంచారు. ‘హ్యాపీ బనానా’ పేరుతో ఇక్కడి అరటి సౌదీ అరేబియా, ఖతార్, ఇరాన్, దుబాయ్ ప్రాంతాలకు వెళ్లనుంది. అరటి హబ్‌గా ‘అనంత’ ఇప్పటివరకు వివిధ కంపెనీలు ఇక్కడ అరటిని కొనుగోలు చేసి తర్వాత ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేసినట్లు చెబుతున్నా.. తొలిసారిగా అరబ్ దేశాలకు నేరుగా ఇక్కడ నుంచే ఎగుమతి చేస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అరటి సాగుకు ప్రసిద్ధి చెందిన ‘అనంత’.. మున్ముందు అరటి హబ్‌గా మారే అవకాశముందని అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 30–35 మండలాల్లో అరటి తోటల సాగవుతున్నా.. ఇందులో 70–80 శాతం సాగు విస్తీర్ణం పుట్లూరు, యల్లనూరు, పెద్దపప్పూరు, యాడికి, నార్పల, తాడిమర్రి, బత్తలపల్లి, ఆత్మకూరు మండలాల్లో ఉంది. జిల్లా వ్యాప్తంగా 16,402 హెక్టార్లలో అరటి సాగవుతుండగా.. 11.65 లక్షల మెట్రిక్ టన్నుల మేర పంట రావచ్చని అంచనా. అలాగే.. ఇక్కడి నేలలు, నీరు, వాతావరణం కారణంగా నాణ్యమైన అరటి వస్తుందని చెబుతున్నారు. అందువల్లే ఈ ప్రాంత అరటికి బెంగళూరు, చెన్నై, కోల్‌కత లాంటి దేశీయ మార్కెట్లతో పాటు యూరప్, మధ్య ఆసియా దేశాల్లో మంచి డిమాండ్ ఉంటుందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. 100 % టిష్యూ కల్చర్ రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా జిల్లాలో గ్రానైన్ (జీ–9) అనే అరటి రకం 100 శాతం టిష్యూ కల్చర్ పద్ధతిలో సాగుచేస్తున్నారు. అలాగే, రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 100 శాతం డ్రిప్ పద్ధతి, 100 శాతం ఫర్టిగేషన్ పద్ధతి (నేరుగా ఎరువులు అందించే విధానం) అవలంబిస్తున్నారు. ఎకరాకు మొదటి పంటకు రూ.70 నుంచి రూ.80 వేలు ఖర్చుచేస్తున్నారు. రెండో పంటకు రూ.40 నుంచి రూ.50 వేలు, మూడో పంటకు అంతే పెట్టుబడి అవుతోందని రైతులు చెబుతున్నారు. రెండున్నర సంవత్సరాల్లో మూడు పంటలు తీస్తారు. అలాగే, ఎకరాకు 25–30 టన్నుల వరకు అరటిని పండిస్తున్నారు. దేశంలోనే అత్యధిక ఉత్పాదక శక్తిలో ‘అనంత’ రెండో స్థానంలో ఉంది. కాగా, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో టన్ను అరటికి రూ.8 వేల కనీస మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై అరటి రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు.. గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతున్న అరటి ప్రస్తుతం టన్ను రూ.12,500 ధర పలుకుతోంది. ‘అనంత’కు గర్వకారణం తొలిసారిగా జిల్లా నుంచి ఈనెల 30న నేరుగా అరబ్ దేశాలకు 890 మెట్రిక్ టన్నులు అరటిని ఎగుమతి చేస్తుండటం ‘అనంత’కు గర్వకారణం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం, దేశాయ్ కంపెనీ సహకారంతో ప్రత్యేక రైలు వ్యాగన్‌ను ఏర్పాటుచేశాం. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు, జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ, ఉద్యానశాఖ కమిషనర్లు ఇక్కడకు విచ్చేస్తున్నారు. ఉద్యాన శాఖ ఏడీలు, ఏపీడీలు, హెచ్‌వోలు దీనిపై అవసరమైన ఏర్పాట్లుచేశారు. -
ఉద్యోగులమా.. కూలీలమా!
నిర్మల్/దిలావర్పూర్: నిర్మల్ జిల్లాలో ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖల ఉద్యోగులు, సిబ్బంది మధ్య జరిగిన గొడవ చర్చనీయాంశమైంది. తాము ఉద్యోగులమా? కూలీలమా? అనుకునే స్థాయికి పరిస్థితి చేరడంతో అందరి దృష్టి సదరు శాఖలపై పడింది. జిల్లాలోని దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల మధ్య ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ రాష్ట్ర కమిషనర్ లోక వెంకట్రాంరెడ్డికి చెందిన వ్యవసాయక్షేత్రం ఉంది. ఇందులో గురువారం హార్టికల్చర్, సెరికల్చర్ ఉద్యోగులు, సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అసలు ఆ రెండు శాఖల ఉద్యోగులకు కమిషనర్ వ్యవసాయక్షేత్రంలో ఏం పని?..కమిషనర్ మెప్పు కోసమే సదరు ఉద్యోగులతో చాకిరీ చేయిస్తున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నా యి. సదరు శాఖల జిల్లా అధికారులు మాత్రం విధి నిర్వహణలో భాగంగానే ఈ పనులు చేయిస్తున్నట్లు చెబుతున్నారు. అక్కడే విధులా..? కమిషనర్‌కు చెందిన 50 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో వివిధ పండ్ల చెట్లు, ఇతర పంటలు సాగు చేయిస్తున్నారు. ఇక్కడ చాలాకాలంగా హార్టికల్చర్ శాఖ ఉద్యోగులు, సిబ్బందితోనే పనులు చేయిస్తున్నట్లు తెలిసింది. ఇక కాంట్రాక్ట్ పద్ధతిన నియమితులైన ఇద్దరు హెచ్‌ఈవోలు ఇక్కడి పనులు చూసుకుంటున్నారు. తమ శాఖల కార్యాలయాల సిబ్బందితోనే తోట పని చేయిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. మల్బరీ సాగుతో వివాదం.. వ్యవసాయ క్షేత్రంలో మల్బరీ మొక్కలు నాటేందుకు పట్టుపరిశ్రమ శాఖ పరిధిలో పనిచేసే నలుగురు రెగ్యులర్ ఉద్యోగు లు, నలుగురు కాంట్రాక్ట్ సిబ్బందిని క్షేత్రానికి రప్పించారు. గురువారం సెరికల్చర్ ఉద్యోగులకు, అక్కడే ఉండి క్షేత్రాన్ని చూసుకుంటున్న హార్టీకల్చర్ హెచ్‌ఈఓలకు మధ్య మాటామాటా పెరిగింది. హెచ్‌ఈఓలు ప్రణీత్, దేవన్న, సెరికల్చర్ ఎస్వోలు షోయబ్‌ఖాన్, భరత్, బిక్యానాయక్, డి.రాములు మధ్య వాగ్వాదం జరిగింది. ఉన్నతాధికారుల మెప్పు పొం దేందుకు తమతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారంటూ సెరికల్చర్ ఉద్యోగులు వాపోతూ తోట నుంచి బయటకు వచ్చారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని సెరికల్చర్ ఉ ద్యోగులు తెలిపారు. మల్బరీ సాగుపై అవగాహన కల్పిం చేందుకే తమ ఉద్యోగులకు పంపినట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సెరికల్చర్ అధికారి మెహర్‌బాషా తెలిపారు. కాగా, మామిడితోటలను పరిశీలించేందుకు హార్టికల్చర్ హెచ్‌ఈవో లు వెళ్లినట్టు ఆ శాఖ అధికారి శరత్‌బాబు చెప్పారు. -
ఉద్యాన ఉత్పత్తుల్లో నాణ్యతే లక్ష్యం: పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉద్యాన నర్సరీల క్రమబద్ధీకరణ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార ముఖ్య కార్యదర్శి, ఉద్యాన ఉత్పత్తుల కమిషనర్ సి.పార్థసారథి అన్నారు. ఉద్యాన పంటల్లో కల్తీ విత్తనాలు, నాణ్యతలేని నారు, మొక్కల సరఫరాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఉద్యాన నర్సరీల క్రమబద్ధీకరణ నిబంధనలు–2017ను రూపొందించిందన్నా రు. నాంపల్లిలోని తెలంగాణ ఉద్యాన శిక్షణ సంస్థ (టీహెచ్టీసీ)లో బుధవారం రాష్ట్రంలోని మిరప, కూరగాయల నర్సరీల యజమానులకు క్రమబద్ధీకరణ నిబంధనలపై అవగాహనకోసం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఉద్యాన నర్సరీల్లో కల్తీ విత్తనాలు, కల్తీ నారును నిరోధించేందుకు ఇప్పటికే కఠిన చర్యలు చేపట్టామన్నారు. కల్తీ నిరోధించ డం లక్ష్యంగా రాష్ట్ర స్థాయిలో పోలీసు, వ్యవసాయ అధికారులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలి పారు. నర్సరీల్లో విస్తృత తనిఖీలు నిర్వహించి, కల్తీ ఉత్పత్తి, అమ్మకందారులపై దాడులు నిర్వహించాలని ఆదేశించామన్నారు. కల్తీ నారు, విత్తనాలతో ఎకరాకు రూ.80 వేల నుంచి లక్ష రూపాయల వరకు రైతులు నష్టపోవడంతో పాటు, విలువైన సమయా న్ని కూడా కోల్పోయే అవకాశం ఉందన్నారు. నర్సరీల్లో అవకతవకలు, పొరపాట్లు జరగకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నర్సరీల్లో మెరుగైన మౌళిక సౌకర్యాలతో ఆరోగ్యవంతమైన మొక్కలను ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ ఎల్.వెంకట్రాంరెడ్డి అవగాహన సదస్సులో సూచించారు. ఉద్యానవన శాఖలో నర్సరీ యజమానులు తమ వివరాలు నమోదు చేసుకోవడంతో పాటు, రికార్డుల నిర్వహణ సక్రమం గా ఉండేలా చూసుకోవాలన్నారు. మొక్కల ఉత్పత్తి, అమ్మకంలో అవతవకలకు పాల్పడితే విత్తన, నర్సరీ చట్ట నిబంధనల మేరకు కేసులు నమోదు చేసి, చర్య లు తీసుకుంటామని తెలిపారు. నర్సరీల్లో రికార్డుల నిర్వహణ, విత్తన చట్టం, పీడీ యాక్టు నియమ నిబంధనలు తదితరాలపై ఉద్యాన శాస్త్రవేత్తలు అవగాహ న కల్పించారు. ఈ కార్యక్రమంలో విత్తన ధృవీకరణ సంస్థ ఎండీ కె.కేశవులు, వ్యవసాయశాఖ డిప్యూటీ డైరక్టర్ శివప్రసాద్, రాచకొండ కమిషనరేట్ సీఐ విజయ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
లోటుకు జవాబు.. పెంపే
సాక్షి, హైదరాబాద్ : కూరగాయల ఉత్పత్తిలో రాష్ట్రం అత్యంత వెనుకబడి ఉంది. దీంతో ఇతర రాష్ట్రాలపై ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో ఈ సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెంచడమే సరైన పరిష్కారమని ఉద్యానశాఖ భావించి తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రాష్ట్ర ప్రజలు రోజువారీ ప్రధానంగా 20 రకాల కూరగాయలను వినియోగిస్తుంటారు. ఇలా ఏడాదికి 22.28 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం కాగా, కేవలం 15.94 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే లభిస్తున్నాయి. అంటే 6.34 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఉంది. ఈ 20 రకాల్లో టమాటా, వంకాయ, బెండ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ముల్లంగి వంటి ఆరు రకాలు అవసరానికి మించి ఉత్పత్తి అవుతుండగా, పచ్చిమిర్చి, కాకర , బీర, సొరకాయ, దోసకాయ, బీన్స్, క్యాప్సికం, బంగాళదుంప, చేమగడ్డ, క్యారట్, కందగడ్డ, ఆకుకూరలు, ఉల్లిగడ్డలు సహా 14 రకాలకు తీవ్ర కొరత నెలకొని ఉంది. ఇక ఆరు రకాల్లో వినియోగం 7.99 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఉత్పత్తి 8.66 లక్షల మెట్రిక్ టన్నులుంది. అంటే 66,760 మెట్రిక్ టన్నులు అదనంగా ఉత్పత్తి అవుతున్నాయి. మిగిలిన 14 రకాలు 14.29 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం కాగా, ఉత్పత్తి 7.28 లక్షల మెట్రిక్ టన్ను లు మాత్రమే . ఈ 14 రకాల వరకు చూస్తే దాదాపు సగం అంటే 7.01 లక్షల మెట్రిక్ టన్నుల కొరత ఉంది. దీంతో ఈ సాగును అదనంగా 2.13 లక్షల ఎకరాల్లో చేయాలని ఉద్యానశాఖ ప్రతిపాదించింది. ఎనిమిది రకాల పండ్లకూ కొరతే... రాష్ట్రంలో వినియోగించే ఎనిమిది రకాల పండ్ల ఉత్పత్తి తక్కువగా ఉంది. జామ, ద్రాక్ష, యాపి ల్, కర్బూజ, నేరేడు, అరటి, పైన్ ఆపిల్, దాని మ్మ అవసరానికంటే 4.46 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఉంది. యాపిల్ ఇక్కడ పండే పంట కాదు కాబట్టి ఆ చర్చ లేదు. జామ 23 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా, రాష్ట్రంలో కేవలం 13 వేల మెట్రిక్ టన్నులే పండుతోంది. ద్రాక్ష 27 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా, కేవలం 3 వేల మెట్రిక్ టన్నులే ఉత్పత్తి అవుతోంది. అరటి పండ్లు 3.39 లక్షల మెట్రిక్ టన్నులు గాను, 73 వేల మెట్రిక్ టన్నులే . దానిమ్మ 49 వేల మెట్రిక్ టన్నులకు గాను, కేవలం 11 వేల మెట్రిక్ టన్నులే ఉత్పత్తి అవుతోంది. ఆయా పండ్ల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలంటే అదనంగా 38 వేల ఎకరాల్లో పండ్ల సాగు చేయా లని ఉద్యానశాఖ ప్రభుత్వానికి నివేదించింది. మామిడి, బొప్పాయి, పుచ్చకాయ, సపోటా, కమలా, బత్తాయి పండ్ల ఉత్పత్తి అవసరానికి మించి 9.43 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ఉత్పత్తి అవుతుండటం గమనార్హం. అందులో మన జనాభాకు మామిడి 60 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా, 4.82 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతోంది. బొప్పాయి 3 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా, రాష్ట్రంలో 51 వేల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతోంది. అదనంగా ఉత్పత్తి అవు తున్న పండ్లను ఎగుమతి చేయాలని ఉద్యానశాఖ భావిస్తోంది.అందుకోసం ఆహారశుద్ధి పరిశ్రమలు స్థాపించాల్సిన అవసరం నెలకొని ఉంది. కొరత నెలకొన్న పండ్ల కోసం అదనంగా 38 వేల ఎకరాల్లో సాగు చేయాలని ప్రతిపాదించింది. -
అన్నమోరామ‘చంద్రా’!
ఉద్దానం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తిత్లీ తుపానుతో అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ఇప్పుడు సహాయక చర్యలు అందక విలవిల్లాడుతోంది. తాగేందుకు చుక్కనీరు లేదు. రెండ్రోజులుగా ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగలేదు. వయో వృద్ధులు, చిన్న పిల్లలు, బాలింతల పరిస్థితి మరీ దయనీయం. పాలు దొరక్క పసిపిల్లలు గుక్కపెడుతున్నారు. వైద్యం అందే దిక్కేలేదు. బాలింతలు పసికందులతో నాలుగైదు కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి. చెట్లు విరిగిపడి అనేకచోట్ల ఇళ్లు ధ్వంసమైనా పునరావాస ఏర్పాట్లు లేనేలేవు. దీంతో తట్టాబుట్టా సర్దుకుని మైళ్లకొద్దీ బంధువుల ఇళ్లకు నడిచి వెళ్తున్నారు. దారిపొడవునా కూలిన చెట్లే. కరెంట్ లేదు.. సమాచార వ్యవస్థ కుప్పకూలింది. ఇంత జరిగినా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదని బాధితులు మండిపడుతున్నారు. చావుబతుకుల్లో ఉన్నా పట్టించుకోరా అంటూ నిప్పులు చెరుగుతున్నారు. తుపాను తీరాన్ని దాటిన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని ప్రతి గ్రామంలోనూ ఇప్పుడు అడుగడుగునా ఇలాంటి దయనీయ పరిస్థితులే. నాలుగురోజులుగా నరకయాతన పెద్దముహరిపురంలో పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. నాలుగు రోజుల నుంచి నరకం అనుభవిస్తున్నామని బత్తిని కమలమ్మ వాపోయింది. ఆకలితో చచ్చిపోతామనే ఆందోళన వ్యక్తంచేసింది. తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకడంలేదని రుద్రమ్మ, గన్నెమ్మ, గౌరమ్మ కన్నీరుమున్నీరయ్యారు. తాను సుగర్ పేషంట్‌నని, టాబ్లెట్ వేసుకోవడానికి నీళ్లు కూడా లేవని గౌరమ్మ దీనంగా తెలిపింది. ఇక్కడ ఇన్ని అవస్థలు పడుతుంటే ఇప్పటివరకూ ఏ ఒక్క అధికారీ రాలేదని వారు తెలిపారు. ‘తుపాను ప్రభావం తగ్గి 48 గంటలైంది. ఆహారం అందించడానికేం.. నీళ్లు కూడా లేకుండా ఎలా బతుకుతాం?’.. అని రేగిపాడుకు చెందిన లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తంచేశాడు. కొబ్బరి బొండాల నీళ్లతో గొంతు తడుపుకుంటున్నామని బత్తుల లక్ష్మీకాంతమ్మ చెప్పింది. ‘ఫోన్లు పనిచేయడంలేదు. ఎవరికి ఫిర్యాదు చెయ్యాలో అర్థంకావడంలేదు. ఏ నాయకుడు కానీ, అధికారి కానీ ఇప్పటివరకు రాలేదు’.. అని రెయ్యిపాడు మాజీ సర్పంచ్ భాస్కర్ తెలిపాడు. దారిలేదు.. చెట్లు తొలగించే దిక్కేలేదు ఇదిలా ఉంటే.. ఇక్కడ నుంచి పలాస దాటి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మధ్యలో వాగు పొంగిపొర్లుతోంది. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. పూడి గ్రామం దగ్గర్నుంచి అడుగడుగునా రోడ్లపై విరిగిపడిన చెట్లే. వాటిని తొలగించేందుకు ఇప్పటివరకు ప్రభుత్వం దృష్టిపెట్టలేదు. ముఖ్యమంత్రి పర్యటన కోసం పలాస, కాశీబుగ్గ వరకు మాత్రమే రహదారులను పునరుద్ధరించారు. ప్రభుత్వ యంత్రాంగం, సహాయక బృందాలన్నీ రెండు రోజులుగా ఇదే పనిలో ఉన్నాయి. దీంతో వజ్రపుకొత్తూరులోని అనేక గ్రామాల్లో చెట్లు తొలగించే నాథుడే లేడు. కరెంట్ స్తంభాలు, తీగలను పునరుద్ధరించే పనులు ఇంకా మొదలుకాలేదు. విద్యుత్ అధికారులు సైతం సీఎం పర్యటన ప్రాంతాలకే పరిమితమయ్యారు. రెయ్యిపాడు దగ్గర 300 ఏళ్లనాటి రావి చెట్టు నేలకొరిగింది. దీన్ని తొలగించకపోవడంతో పూడి జగన్నాథపురం, దన్నువానిపేట, చిన్న పల్లివూరు, పెద్ద పల్లివూరు, శెగడిపేట, సుకుంపేట, పూడిలంక తదితర గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. దీంతో ఈ ప్రాంతంలోని ప్రజలు దాదాపు ఏడు కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాల్సిన దుస్థితి. ఇప్పటివరకూ ఏ అధికారి రాకపోవడంతో గ్రామాల్లో యువకులే స్వచ్ఛందంగా చెట్లు తొలగిస్తున్నారు. బిందె నీళ్లు రూ.50.. పెట్రోల్ రూ.200లు మరోవైపు.. నాలుగు రోజులుగా గ్రామాల్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో మంచినీటి కొరతను ఆసరాగా చేసుకుని కొందరు జనాలను దోచేస్తున్నారు. బిందె రూ.50, డీజిల్ లీటర్ రూ.150.. పెట్రోల్ అయితే రూ.200కు పైనే అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. మరో వారం రోజుల వరకు విద్యుత్‌ను పునరుద్ధరించే అవకాశమే లేదని తెలుస్తోంది. సీఎం పర్యటనలోనే అధికారులు తిత్లీ తుపానుకు ముందే వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. అయినా ప్రభుత్వ యంత్రాంగం తమ ప్రాంతానికి రాలేదని పెద్ద మురహరిపురం ప్రాంత ప్రజలు చెప్పారు. తీరం దాటే ప్రాంతంలో నష్టం ఎక్కువగా ఉంటుందని తెలిసీ అప్రమత్తం కాలేదని తెలిపారు. కేవలం రెండు జాతీయ విపత్తుల సహాయక బృందాలను మాత్రమే పంపినప్పటికీ వారికి సూచనలు, సలహాలు ఇచ్చే రెవెన్యూ, ఇతర అధికారులు ఎవరూ అందుబాటులో లేరు. వీరంతా ముఖ్యమంత్రి టెలీ కాన్ఫరెన్స్‌ల కోసం జిల్లా కేంద్రాలకే పరిమితమయ్యారని స్థానికులు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందానికి హెలికాప్టర్ అందించాలన్న కనీస బాధ్యత విస్మరించారని ప్రజలు ఆగ్రహిస్తున్నారు. నెట్వర్క్ పూర్తిగా స్తంభించడంతో సహాయ బృందాలు కూడా అధికారులను సంప్రదించలేకపోయాయి. దీంతో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఫలితంగా తాగునీరు, భోజనం అందించలేదని అధికారులు చెబుతున్నారు. టాబ్లాట్ వేసుకుందామన్నా నీళ్లులేవు నేను సుగర్ పేషంట్‌ను. కళ్లు తిరుగుతున్నాయి. టాబ్లెట్ వేసుకుందామన్నా నీళ్లులేవు. ఏదైనా తినాలి. కానీ పెట్టేదెవరు? ఏ అధికారి రాలేదు. మమ్మల్ని పలకరించలేదు. ఇదెక్కడి పాపం? మేం చచ్చిపోతామేమో? – గౌరమ్మ, పీఎం పురం పరిస్థితి చూస్తే భయంగా ఉంది ఇళ్లపైనే చెట్లు పడ్డాయి. ఇంట్లో వాళ్లంతా బిక్కుబిక్కుమంటున్నారు. అన్నం లేక గుండె దడొస్తోంది. ఎక్కడికో వెళ్లి అర బిందెడు నీళ్లు తెచ్చా. రెండు రోజులుగా కొద్దికొద్దిగా గొంతు తడుపుకుంటున్నాం. అయిపోతే కొబ్బరినీళ్లు తాగుతున్నాం. పిల్లలు నీరసించారు. పరిస్థితి చూస్తే భయమేస్తోంది. – కె పద్మ, పెద్ద మురహరిపురం రెండ్రోజులుగా అన్నం, నీళ్లూ లేవు చెట్లుపడి మా మూడు కుటుంబాల ఇళ్లు నేలకొరిగాయి. అందరూ చిన్న గదిలోనే ఉంటున్నాం. రెండు రోజులుగా నీళ్లు లేవు.. అన్నంలేదు. ఇదిగో.. నీరసంగా ఉన్నా ప్రాణమైనా నిలబెట్టుకునేందుకు మా అమ్మా వాళ్లింటికి నడుచుకుంటూ వెళ్తున్నా. నేనే కాదు.. మా ఊళ్లో చాలామంది ఇలాగే వెళ్తున్నారు. – నెయిల సంతోషి, కొండూరు పాల కోసం పిల్లలు విలవిల రెండు రోజులుగా పిల్లాడు పాలకోసం గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. ఆవులన్నీ తుపానుకు చచ్చిపోయాయి. ఏం చెయ్యాలో తెలీడంలేదు. కొబ్బరి నీళ్లతో ఆకలి తీరుస్తున్నాం. పాలకోసం ఎక్కడికెళ్లినా దొరకడం లేదు. ఎవరూ రావడంలేదు. మమ్మల్ని అసలే పట్టించుకోవడం లేదు. మమ్మల్ని బతికించండి.. – మాధవి, రేగిపాడు -
సూక్ష్మసేద్యం అనుమతులకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూక్ష్మసేద్యానికి బ్రేక్ పడింది. రైతులు చుక్కచుక్కనూ సద్వినియోగం చేసుకునేందుకు చేపట్టిన ఈ కార్యక్రమానికి నిధులలేమి సమస్యగా మారింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క దరఖాస్తుకు కూడా ఉద్యానశాఖ అనుమతివ్వలేదు. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. రెండేళ్లుగా నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారింది. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 60 శాతం చెల్లించినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని విడుదల చేయకపోవడంతో సూక్ష్మసేద్యం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రెండేళ్ల నుంచి రూ.200 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. భారీ సబ్సిడీతో ప్రోత్సాహం ఇచ్చినా.. ప్రభుత్వం సూక్ష్మసేద్యాన్ని ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఇస్తుంది. బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం వరకు సబ్సిడీ ఇస్తుంది. ఎకరానికి సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకోవాలంటే దాదాపు రూ. 25–30 వేల వరకు ఖర్చు కానుంది. నాలుగు ఎకరాల్లో సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకోవాలంటే రూ. లక్షకు పైగానే ఖర్చుకానుంది. అయితే ఈ సూక్ష్మసేద్యం కోసం ఎస్సీ, ఎస్టీ రైతులకు ఒక్కపైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. దీంతో రైతులు సూక్ష్మసేద్యం ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. 2016–17లో కేవలం 10,550 మంది రైతులు 32,710 ఎకరాలకు దరఖాస్తు చేసుకోగా, 2017–18లో ఏకంగా 3.85 లక్షల ఎకరాలకు 1.16 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో కొందరికి సూక్ష్మసేద్యాన్ని మంజూరు చేసింది. సూక్ష్మసేద్యానికి ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం నాబార్డు నుంచి రూ. 800 కోట్లు రుణంగా తీసుకుంది. ఆ సొమ్ము అంతా కూడా గతేడాది నాటికి చెల్లింపులకు పూర్తయింది. ఇంకా రూ.200 కోట్లు కేంద్రం వాటా పెండింగ్‌లో ఉందని అధికారులు చెబుతున్నారు. పెండింగ్‌లో దరఖాస్తులు... ఇప్పటివరకు నిధులు పెండింగ్‌లో ఉండిపోవడం, ఈ ఏడాది బడ్జెట్లో సూక్ష్మసేద్యం పథకానికి కేటాయించిన రూ.127 కోట్లలో ఒక్క పైసా విడుదల చేయకపోవడంతో ఉద్యానశాఖ సందిగ్ధంలో పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 1.20 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. నిధులు లేకపోవడంతో వాటి అనుమతులకు బ్రేక్ పడింది. తమ వాటాగా ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయకపోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిపై తమకు కేంద్రం మెమో కూడా ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలావుంటే సూక్ష్మసేద్యంలో తెలంగాణ వెనుకబడిందని కేంద్ర వ్యవసాయశాఖ ఇటీవల విడుదల చేసిన జాతీయ వ్యవసాయ గణాంక నివేదికలోనూ స్పష్టంచేసింది. దేశవ్యాప్తంగా 2.30 కోట్ల ఎకరాల్లో సూక్ష్మసేద్యం అందుబాటులోకి వచ్చింది. కానీ తెలంగాణలో కేవలం 3.31 లక్షల ఎకరాల్లోనే సూక్ష్మసేద్యంతో రైతులు సాగు చేస్తున్నారని వెల్లడించింది. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పదో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. సూక్ష్మసేద్యం అమలుకోసం తెలంగాణ ప్రభుత్వం రూ.800 కోట్ల రుణం తీసుకొచ్చినా పెద్దగా మార్పురాలేదన్న ఆరోపణలున్నాయి. -
23–26 తేదీల్లో విజయవాడలో ఉద్యాన ప్రదర్శన
ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23–26 తేదీల మధ్య విజయవాడలోని వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో ఉద్యాన ప్రదర్శన–2018 జరగనుంది. 150 స్టాల్స్ ఏర్పాటవుతున్నాయి. రైతులకు వివిధ పంటల మేలైన సాగు పద్ధతులు, ఆధునిక సాంకేతికతలపై ఈ సందర్భంగా జరిగే సదస్సుల్లో అవగాహన కల్పిస్తామని అధికారులు తెలిపారు. -
గోదావరి తీరప్రాంతాల్లో ఆయిల్‌పామ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గోదావరి నదీ తీరప్రాంత జిల్లాల్లో ఆయిల్‌పామ్ సాగును చేపట్టేందుకు ఉద్యానశాఖ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. తద్వారా వంటనూనెల దిగుమతులను తగ్గించాలని అనుకుంటోంది. ఇందుకు రైతుల్లో అవగాహన, శిక్షణ కార్యక్రమాలు కల్పిస్తోంది. అలాగే నదీ తీర ప్రాంతాల్లో భూములు, వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, తేమ వంటి వాటిపై అధ్యయనం చేయనుంది. కేంద్రం నుంచి కూడా ఆయిల్‌పామ్ సాగుకు సహకారం అందుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో దాదాపు 24 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. అలాగే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కూడా వందల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. ఎకరాకు 10 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వస్తున్నట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. దాదాపు 3 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి వస్తోంది. దీనిని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో విదేశాల నుంచి ఏకంగా 1.51 కోట్ల టన్నుల వంటనూనెలు దిగుమతి చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఉత్సాహం చూపుతున్న రైతులు ఈసారి వంటనూనెలకు సంబంధించి కేంద్ర దిగుమతి సుంకం పెంచడం మన రైతులకు కాస్త లాభించింది. ప్రస్తుతం టన్ను ఆయిల్‌పామ్ గెల రూ.10 వేల వరకు పలుకుతోంది. దీంతో ఆయిల్‌పామ్ రైతులు మరింత ఉత్సాహంగా సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఆయిల్‌పామ్ సాగు చేయాలంటే ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు ఉండాలి. భద్రాద్రి కొత్తగూడెంలో నదీ తీరానికి దగ్గరగా ఉండటంతోపాటు నీటిలభ్యత ఉంది. వాస్తవానికి వరి పంటకు ఎంత నీరు అవసరమో అంతకంటే ఎక్కువగా ఆయిల్‌పామ్ సాగుకు అవసరం. అలాగే తేలికపాటి నేలలు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. ఆయిల్‌పామ్ సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 శాతంలో నిధులను కేటాయిస్తున్నాయి. ఈ ఏడాదికి దాదాపు రూ.6.60 కోట్లు కేటాయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆయిల్‌పామ్ వేసే రైతులకు నాలుగేళ్ల పాటు మొక్కలు, ఎరువులను సబ్సిడీపై అందజేస్తారు. మౌలిక సదుపాయాలన్నీ ఉంటే ఎకరా ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. -
తొలిసారిగా ఉద్యాన ‘మసాలాలు’
హైదరాబాద్: దేశంలోనే ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మొదటి మసాలా దినుసుల తయారీ కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు తెలంగాణ ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామ్రెడ్డి తెలిపారు. బుధవారం సెంటర్ ఫర్ ఎక్సలెన్సీలో ఈ ప్రాజెక్ట్‌పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలువురు నిపుణులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామ్రెడ్డి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నిపుణుల సూచనలు స్వీకరించారు. ఓల్డ్ జీడిమెట్ల పైపులైన్ రోడ్డులో ఉన్న 3.15 ఎకరాల్లో రూ.10.63 కోట్లతో ఈ యూనిట్‌ను నెలకొల్పనున్నారు. తెలంగాణలో 1.50 లక్షల ఎకరాల్లోని పంట కాలనీల్లో పండించిన పసుపు, మిరప, ధనియాలు, చింతపండు, అల్లం, వెల్లుల్లి దిగుబడులను తీసుకొచ్చి ఎనిమిది రకాల మసాలాలు తయారు చేయనున్నారు. పసుపు ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే మొదటి, మిరప సాగులో మూడో స్థానంలో ఉన్నదని, ఇలాంటి స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్ వల్ల రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని వెంకట్రామ్రెడ్డి పేర్కొన్నారు. పురుగుమందులు వాడని ఉత్పత్తులుంటాయని, ఇంతవరకు మార్కెట్లో లేని చింతపండు పౌడర్‌ను వినియోగదారులకు అందించనున్నామని తెలిపారు. ఈ యూనిట్‌ను ఈ ఏడాది దసరా నాటికి ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఉత్పత్తి చేస్తున్న ఈ ఉత్పత్తులను ‘కాకతీయ ఫుడ్స్’ పేరిట మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. రైతులకు లాభదాయంగా వినియోగదారులకు సరసమైన ధరలకు అత్యంత నాణ్యంగా అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కమిషనర్ తెలిపారు. ధరలిలా ఉంటాయి.. మసాలా తయారీ కేంద్రంలోని ఉత్పత్తులకు ధరలను అధికారులు ప్రతిపాదించారు. మిరపపొడి కేజీ ధర రూ.137, పసుపుపొడి కిలో ధర రూ. 118, కొత్తిమీర పొడి రూ.115, చింతపండు పొడి కిలో రూ.142, అల్లం, వెల్లుల్లి మిశ్రమం కిలో రూ.108, అల్లం కిలో రూ.101, వెల్లుల్లి కిలో రూ.115, చింతపండు కిలో రూ.161 గా ప్రతిపాదనలు రూపొందించారు.