నేల తల్లిని నమ్ముకున్నవారు పట్టుదలగా శ్రమిస్తే నష్టపోరని రెండోసారి జాతీయ పురస్కారానికి ఎంపికైన ఆదర్శ రైతు ఆకేపాటి వరప్రసాద్‌రెడ్డి రుజువు చేశారు. పాలిటెక్నిక్ డిప్లొమా చేసినా పుడమి తల్లిని నమ్ముకొని నాగలి పట్టారు. ఆటుపోట్లను తట్టుకుని స్వశక్తిపై భరోసాతో డ్రిప్ సాగు విధానాన్ని అనుసరించారు. రసాయనాలకు దూరంగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి ఫలితాలు సాధించారు. కొత్త ఆలోచనలతో బొప్పాయి, అరటి లాంటి తోటలతోపాటు 25 రకాల కూరగాయలను సాగు చేస్తున్నారు. దాదాపు 30 ఏళ్లకుపైగా వ్యవసాయ రంగంలో రాణిస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పలు అవార్డులను పొందారు. ‘సృజనాత్మక రైతు’ జాతీయ పురస్కారానికి ఎంపికైన వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం హస్తవరంకు చెందిన ఆకేపాటి వరప్రసాద్‌రెడ్డితో ‘సాక్షి’ ముచ్చటించింది.
– రాజంపేట టౌన్
మీరు వ్యవసాయ రంగాన్ని ఎంచుకోవడానికి కారణం..
నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే బాగా ఇష్టం. ఎంత పెద్ద చదువు చదివినా పొలం పనే చేయాలని డిప్లొమా చదివే సమయంలో నిర్ణయించుకున్నా. డిప్లొమా కాగానే పై చదువులకు వెళ్లకుండా వ్యవసాయం బాట పట్టా.
చాలా ఇబ్బందులు పడ్డారని విన్నాం..
చాలా ఆటుపోట్లు ఎదురయ్యాయి. పలుమార్లు ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రంగా నష్టపోయినా మనోధైర్యంతో ముందుకు సాగి విజయాలు సాధించా.
ఈ 30 ఏళ్లలో అత్యధిక దిగుబడి ఇచ్చిన పంట ఏది?
2005–06లో ఆరు ఎకరాల్లో అరటి, బొప్పాయి వేశా. రెండు పంటల సాగుకు రూ.2 లక్షలు ఖర్చు చేస్తే రూ.6 లక్షలు ఆదాయం వచ్చింది. అంతరపంటగా చెండుమల్లె వేయటంతో ఖర్చులు పోను రూ.లక్ష వరకు ఆదాయం వచ్చింది.
బాగా నష్టపోయిన సందర్భం ఉందా?
2015–2016లో అమృతపాణి అరటి పంట మూడు ఎకరాల్లో వేశా. పంట చేతికి వచ్చే సమయంలో గాలులు వీచి తోట మొత్తం నేలకొరిగింది. రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టగా రూపాయి కూడా చేతికి రాలేదు. నేను వ్యవసాయంలో బాగా నష్టపోయిన సందర్భం ఇదే.
తొలిసారిగా డ్రిప్ మీరే అమర్చుకున్నారు. అది విజయవంతమవుతుందని భావించారా?
బెల్గాంలోని డ్రిప్ కంపెనీకి వెళ్లి 11 రోజుల పాటు సాగు విధానం, పంటలను పరిశీలించా. అక్కడవారికి వ్యవసాయంపై బాగా పట్టు ఉన్నట్లు నాకు నమ్మకం కలిగింది. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటను సులువుగా సాగు చేయవచ్చని విశ్వాసం కలిగింది. ధైర్యం చేసి డ్రిప్ కోసం రూ.50 వేలు పెట్టుబడి పెట్టా. మంచి ఫలితం వచ్చింది.
డ్రిప్ విధానంలో తొలిసారి వేసిన పంట ఏది..
కాలువలతో పొలాలకు నీళ్లు పారిస్తుంటేనే పంటలు ఎండిపోతున్నాయి, ఇక నీటి చుక్కలతో సాగు ఎలా సాధ్యమని నన్ను నిరుత్సాహ పరిచారు. మరికొంత మంది ఎగతాళి చేసినా నేను పట్టించుకోలేదు. తొలిసారిగా బొప్పాయి పంటకు డ్రిప్ అమర్చా. ఒక్కో కాయ మూడు కేజీల బరువుతో అత్యధిక దిగుబడి వచ్చింది. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాలకు చెందిన వారు వచ్చి నా పంటను పరిశీలించారు. అప్పటి నుంచి రాజంపేట డివిజన్‌లో అంతా డ్రిప్ విధానాన్ని అనుసరించారు.
ఇది మీ మొదటి జాతీయ అవార్డా..
గతంలోనూ ఓ అవార్డు వచ్చింది. ఇది రెండో జాతీయ అవార్డు. ఇది నాపై బాధ్యత మరింత పెంచింది.
మీ విజయంలో కుటుంబం పాత్ర..
నేను వ్యవసాయ రంగంలో రాణిస్తున్నానంటే నా భార్య ఆకేపాటి చంద్రవేణి అందుకు ప్రధాన కారణం. పొలం పనుల్లో నాకు చేదోడుగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి పిల్లలను ప్రయోజకులను చేసింది. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు కూడా నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు.
ప్రకృతి వ్యవసాయం ఆలోచన ఎలా వచ్చింది?
2000లో కడుపులో మంట సమస్యతో తిరుపతిలో డాక్టర్ వద్దకు వెళ్లా. పంటలకు వినియోగించే రసాయనిక ఎరువులే పొట్టలో మంటకు కారణమని డాక్టర్ చెప్పారు. పంటలకు రసాయనిక ఎరువులు వాడకూడదని అప్పుడే నిర్ణయించుకున్నా. మాకు ఆవులు ఉండటంతో ప్రకృతి వ్యవసాయం చేయాలన్న ఆలోచన వచ్చింది. దీన్ని అమలు చేసి మంచి దిగుబడులు సాధిస్తున్నా. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నందు వల్ల గుర్తింపు రావటంతోపాటు అవార్డులు, రివార్డులు అందుకుంటున్నా.
జాతీయ అవార్డుకు ఎలా ఎంపికఅయ్యారు?
ఐసీఐసీఐ ఫౌండేషన్ నా గురించి తెలుసుకొని ప్రకృతి సాగు విధానాలపై ఫొటోలు, వీడియోలు, గతంలో వచ్చిన అవార్డులు, ప్రశంసా పత్రాల వివరాలను ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీకి పంపింది. దీంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది.
Comments
Please login to add a commentAdd a comment