
సాగు విస్తీర్ణం ప్రాతిపదికన హేతుబద్ధీకరణ
నాడు జనాభా ప్రాతిపదికన ఆర్బీకేల ఏర్పాటు
వీటిద్వారా సాగు ఉత్పాదకాల సరఫరాను నిలిపివేశాం
ఆర్‌ఎస్‌కే సిబ్బందిని ఖాళీగా ఉన్న పోస్టుల్లో సర్దుబాటు చేస్తాం
‘ఆర్బీకేల అదృశ్యం’ వార్తకు వ్యవసాయ శాఖ స్పందన
సాక్షి, అమరావతి: రైతు సేవా కేంద్రాలను (ఆర్‌ఎస్‌కే) సాగు విస్తీర్ణం ప్రాతిపదికన కుదించేందుకు కసరత్తు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ‘ఆర్బీకేలు అదృశ్యం..!’ శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్‌ఎస్‌కేల (పూర్వపు రైతుభరోసా కేంద్రాలు–ఆర్బీకే) హేతుబద్ధీకరణ ప్రక్రియను గ్రామ, వార్డు సచివాలయాల విభాగం పర్యవేక్షిస్తుందని ప్రకటించింది.
గతంలో జనాభా ప్రాతిపదికన ఏర్పాటు..
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జనాభా ప్రాతిపదికన ప్రతీ రెండువేల మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఏర్పాటుచేశారని, వీటికి అనుబంధంగా గ్రామస్థాయిలో మొత్తం 10,778 రైతు సేవా కేంద్రాలను ఏర్పాటుచేశారని వ్యవసాయ శాఖ పేర్కొంది.
ఆ సమయంలో సాగు విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకోలేదని, ఈ కారణంగా కొన్ని ఆర్‌ఎస్‌కేలు 100–2,500 ఎకరాల పరిధితో ఏర్పాటయ్యాయని తెలిపింది. వీటి ద్వారా రైతులకు కావాల్సిన సాగు ఉత్పాదకాలతో పాటు రైతుసేవలన్నీ అందించేవారని.. కానీ, ప్రస్తుతం సాగు విస్తీర్ణం ప్రాతిపదికన హేతుబద్ధీకరణ (కుదింపు) చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయ శాఖ పేర్కొంది.
సాగు ఉత్పాదకాల పంపిణీ నిలిపివేత నిజమే
2020 మే 30 నుంచి గత ప్రభుత్వ పాలనలో రైతులకు కావలసిన ఎరువులు, సబ్సిడీ నాన్ సబ్సిడీ విత్తనాలు, పురుగు మందులు, ఆక్వాఫీడ్, సీడ్, సంపూర్ణ దాణా వంటి సాగు ఉత్పాదకాలన్నీ ఆర్‌ఎస్‌కేల ద్వారానే పంపిణీ జరిగేవని వ్యవసాయ శాఖ ఆ ప్రకటనలో వివరించింది.
ప్రస్తుతం వాటిల్లో పనిచేస్తున్న సిబ్బందిని పూర్తిగా రైతులకు విస్తరణ సేవలు, సాంకేతిక సూచనలు, సలహాలందించేందుకు ఉపయోగిస్తున్నామని.. ఈ కారణంగానే ఆర్‌ఎస్‌కేల ద్వారా సాగు ఉత్పాదకాల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిందని పేర్కొంది. వీటిని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్) ద్వారా చేయాలని, తద్వారా వాటిని బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment