రైతులకు వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ రాజశేఖర్ స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: నిర్దేశించిన గడువులోగా ప్రీమియం చెల్లించకపోతే తాము సాగు చేసే పంటలకు బీమా పొందేందుకు రైతులు అర్హత కోల్పోతారని వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ స్పష్టం చేశారు. ఐదేళ్లుగా అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం స్థానంలో ఈ ఏడాది నుంచి రైతులను భాగస్వామ్యం చేస్తూ స్వచ్ఛంద నమోదు పద్ధతిన పంటల బీమా అమలు చేస్తున్నట్లు చెప్పారు. పంటల బీమా ప్రచార వారోత్సవాలను మంగళవారం ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆ శాఖ డైరెక్టర్ సేనాపతి ఢిల్లీరావుతో కలిసి ప్రారంభించారు.
ఇన్సూరెన్సు కంపెనీలు తయారు చేసిన వాల్‌పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. మీడియాతో రాజశేఖర్ మాట్లాడుతూ..పంట రుణం పొందిన సందర్భంలో సంబంధిత బ్యాంక్ వారే ప్రీమియం వసూలు చేసి సదరు బీమా కంపెనీకి నేరుగా చెల్లిస్తారని చెప్పారు. బీమా వద్దనుకుంటే ప్రీమియం తగ్గింపు నిలిపివేయాలని రాతపూర్వకంగా బ్యాంక్‌కు సమరి్పంచాలన్నారు. రుణం తీసుకోని రైతులు తమ వాటా ప్రీమియం మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించి సచివాలయాలు, పీఏసీఎస్‌లు, పోస్టాఫీస్‌లు, కామన్ సర్వీస్ సెంటర్స్ (సీఎస్‌సీ)ల్లో నమోదు చేసుకోవాలన్నారు.
దళారీలను నమ్మి మోసపోవద్దనన్నారు. రబీ సీజన్‌కు సంబంధించి ఇతర పంటలకు ఈ నెల 15గానూ, వరికి 31 లోగా ప్రీమియం చెల్లించాలని, లేకుంటే బీమా పొందేందుకు ఏమాత్రం అవకాశం ఉండదన్నారు. స్వచ్ఛంద నమోదు పద్ధతిపై గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలకు కేటాయించిన ఇన్సూ్యరెన్స్ కంపెనీలు, ఆయా జిల్లాలో నోటిఫై చేసిన పంటల వివరాలు, పంటల వారీగా కట్టాల్సిన ప్రీమియం శాతం, రైతులు చెల్లించాల్సిన వాటా, నమోదు చేయడానికి గడువు, తదితరాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
వ్యవసాయ శాఖ డైరక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఖరీఫ్ పంటలకు 2శాతం, రబీ పంటలకు 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం చొప్పున రైతులు తమ వాటా ప్రీమియం సొమ్ము చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ భూ రికార్డులు, సీసీఆర్సీలు పొందిన రైతుల డేటాను జాతీయ పంటల బీమా పోర్టల్‌తో అనుసంధానం చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment