తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువకు పంటలు అమ్ముకునే పరిస్థితి రాకూడదు. ఒక్క ధాన్యమే కాదు.. ఇతర వ్యవసాయ ఉత్పత్తులు, ఉద్యాన పంటలకూ కనీస మద్దతు ధర లభించేలా అధికారులు సవాల్‌గా తీసుకుని పనిచేయాలి. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర ఏమాత్రం ఉండకూడదు. ఈ – క్రాప్ వంద శాతం పూర్తి కావాల్సిందే. రైతుల ఈ–కేవైసీ 93 శాతం పూర్తి కాగా మిగిలిన 7 శాతం రైతులకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఈ–క్రాప్ వివరాలు పంపించాలి. ఈ – క్రాప్ డేటా ఆధారంగా గరిష్ట ప్రయోజనం చేకూర్చేలా ధాన్యం సేకరణ పారదర్శకంగా చేపట్టాలి. వ్యవసాయ, పౌరసరఫరా శాఖలు సమన్వయంతో పని చేయాలి.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రబీ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతన్నలకు ఏ లోటూ రానివ్వకుండా అన్ని విధాలా తోడుగా నిలవాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఇన్‌పుట్స్ సహా అన్నీ సకాలంలో అందించాలని స్పష్టం చేశారు. విత్తనాల నుంచి ఎరువుల వరకు సాగు ఉత్పాదకాలన్నీ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధంగా ఉంచి సాగు మెళకువలు, సూచనలు అందించాలన్నారు. ఈ దఫా రబీలో 22.92 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కానున్నట్లు అంచనా వేస్తున్నామని, బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటలు సాగును ప్రోత్సహించాలని సూచించారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ..
పొలంబడుల్లో విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్
అత్యుత్తమ వ్యవసాయ పద్ధతులు పాటించడం ద్వారా సాగు ఖర్చులు తగ్గించి అధిక దిగుబడులు సాధించే లక్ష్యంతో చేపట్టిన పొలంబడి కార్యక్రమాలను మరింత సమర్ధంగా నిర్వహించాలి. పొలంబడి నిర్వహణలో మనం ఆదర్శంగా నిలిచాం. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులను భాగస్వాములను చేసేలా అప్రెంటిస్‌షిప్ కోసం ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే శ్రీకారం చుట్టాలి. వీటి ద్వారా క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలి. వారి నుంచి సలహాలు తీసుకోవాలి.
రెండేళ్లలో ప్రతి ఆర్బీకేలో డ్రోన్
ప్రతి ఆర్బీకేలోనూ డ్రోన్ సేవలు అందుబాటులోకి రావాలి. వచ్చే రెండేళ్లలో అన్ని ఆర్బీకేల్లో డ్రోన్లు ఉండేలా కార్యాచరణ రూపొందించాలి. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంతో నానో ఫెర్టిలైజర్స్ వాడకంపై అవగాహన పెరుగుతుంది. ఎరువుల వృథాను నివారించడంతోపాటు మొక్కలకు మరింత మెరుగ్గా పోషకాలు అందుతాయి. కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల ద్వారా సమకూర్చిన వ్యవసాయ యంత్రసామగ్రి రైతులకు అందుబాటులో ఉంచాలి. వీటి సేవలు రైతులందరికీ అందుబాటులోకి తేవాలి.
మార్చికి ఆర్బీకేల్లో ప్లాంట్ డాక్టర్లు
వచ్చే మార్చి కల్లా ఆర్బీకేల స్థాయిలో ప్లాంట్ డాక్టర్ సేవలను అందుబాటులోకి తేవాలి. ఇందుకు సంబంధించిన ప్లాంట్ డాక్టర్ కిట్స్ ప్రతీ ఆర్బీకేలో అందుబాటులో ఉంచాలి. భూసార పరీక్షలు నిర్వహించే పరికరాలను ఆర్బీకేల్లో సిద్ధం చేయాలి. వచ్చే మార్చిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. భూసార పరీక్షలు నిర్వహించి ప్రతి రైతుకు సాయిల్ హెల్త్ కార్డులు జారీ చేయడం ద్వారా ఏ పంటలకు ఏ ఎరువులు ఎంత మోతాదులో వాడాలో స్పష్టత వస్తుంది. దీనివల్ల పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. నాణ్యమైన దిగుబడులు పెరుగుతాయి. భూసారాన్ని పరిరక్షించుకునే అవకాశం ఏర్పడుతుంది. సున్నా వడ్డీ పంట రుణాలతో పాటు ఇన్‌పుట్ సబ్సిడీని ఈ నెల 29న జమ చేసేలా ఏర్పాట్లు చేయాలి.
దిగుబడి అంచనా 186 లక్షల టన్నులు
రాష్ట్రంలో జూన్ నుంచి నవంబర్ వరకు సాధారణ వర్షపాతం 775 మి.మీ. కాగా ఇప్పటి వరకు 781.7 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఖరీఫ్ సీజన్‌లో 186 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి రానుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ‘ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఈ – క్రాప్ వంద శాతం నమోదైంది. వీఏఏ, వీఆర్వో బయోమెట్రిక్ ఆథరైజేషన్ కూడా వంద శాతం పూర్తైంది. రైతుల ఈ కేవైసీ 93 శాతం పూర్తైంది.
సోషల్ ఆడిట్‌లో భాగంగా జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించాం. రైతుల సమక్షంలోనే గ్రామసభల ద్వారా సోషల్ ఆడిట్ నిర్వహించాం’ అని అధికారులు వివరించారు. సమీక్షలో వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, సీఎస్ సమీర్‌శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకారశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖల కమిషనర్లు ప్రద్యుమ్న, హెచ్.అరుణ్‌కుమార్, పౌర సరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండ్యన్, ఏపీ సీడ్స్ ఎండీ జి.శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment