సన్నకారుకు నారూ నీరూ! | Sakshi Guest Column On Agriculture Sector In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సన్నకారుకు నారూ నీరూ!

Published Thu, Jan 4 2024 12:10 AM | Last Updated on Thu, Jan 4 2024 12:10 AM

Sakshi Guest Column On Agriculture Sector In Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ రంగంలో ప్రస్తుతం ఒక ఫలవంతమైన మార్పు నిశ్శబ్దంగా జరుగుతోంది. ఇది సరికొత్త సన్నకారు వ్యవసాయానికి పరివర్తనను రూపొందిస్తోంది. ఏపీలో ఎనిమిది లక్షల మంది రైతులు రసాయనాల నుంచి పూర్తిగా రసాయనేతర వ్యవసాయం వైపు మళ్లారు. లేదా పరివర్తన దశలో ఉన్నారు. 2031 నాటికి రాష్ట్రంలో మొత్తం 60 లక్షల వ్యవసాయ జనాభాను రసాయనాల నుండి సహజ వ్యవసాయానికి తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే రైతు సంక్షేమానికి నారు, నీరు నీరు పోయడమే! కార్పొరేట్‌ ప్రయోజనాలకు మాత్రమే సరిపోయే కాలం చెల్లిన ఆర్థిక విధానాలను నియంత్రించడం ద్వారా ఏపీ ప్రభుత్వం ఈ అద్భుతమైన మార్పును సాకారం చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా వీరపనేని గూడెం గ్రామానికి చెందిన సన్నకారు రైతు మహిళ రాధిక. ఆమెకు 1.1 ఎకరాల భూమి మాత్రమే ఉంది. దాంట్లో సహజ వ్యవసాయం సాగుతోంది. తన కొడుకు ఎంబీఏ చేశాడని, కూతురు అమెరికాలో చదువుతోందని ఆమె చెప్పినప్పుడు నేను నమ్మ లేకపోయాను. పిల్లలు బాగా చదువుతున్నందున ఆమె వ్యవసా యాన్ని ఎందుకు వదిలిపెట్టలేదని అడిగాను. అందుకు ఆమె ‘‘నేను నా పని వదులుకుని వారితో కలిసి జీవించాలని నా పిల్లలు కోరుకుంటారు. కానీ మీరు ఏం చేస్తున్నారో అది చేయండి. అలాగే నేను ఏం చేస్తూ ఆనందిస్తున్నానో ఆ పనిని చేయనివ్వండి అని వారికి చెబుతు న్నాను’’ అని పేర్కొంది. ఆమె సహజసాగు పంట పద్ధతిని అనుస రిస్తోంది, దీనినే ఏటీఎమ్‌ (ఎనీ టైమ్‌ మనీ) అని పిలుస్తారు. ఇది ఆమెకు క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందిస్తోంది.

ఏటీఎమ్‌ అనేది ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిటీ–నిర్వహణలోని సహజ వ్యవసాయ కార్యక్రమం కింద పొందుపరిచిన కార్యకలాపాల వర్గీకర ణలో ఒక రూపం, ఇది ప్రకృతికి అనుగుణంగా వ్యవసాయం చేయ డంలో భాగం. రెండు దశాబ్దాల క్రితం ఖమ్మం జిల్లాలోని పునుకల గ్రామం నుంచి ప్రారంభమైన ఈ వ్యవసాయ– పర్యావరణ సేద్య విధానం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 26 జిల్లాల్లోని 3,730 గ్రామాలకు విస్తరించింది. ఎనిమిది లక్షల మంది రైతులు రసాయనాల నుంచి పూర్తిగా రసాయనేతర వ్యవసాయం వైపు మళ్లారు లేదా పరివర్తన దశలో ఉన్నారు. 2031 నాటికి రాష్ట్రం మొత్తం 60 లక్షల వ్యవసాయ జనాభాను రసాయనాల నుండి సహజ వ్యవసాయానికి తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

మైసమ్మ ఎన్టీఆర్‌ జిల్లా బత్తినపాడు గ్రామానికి చెందిన మహిళ. ఆమె రెండు ఎకరాల్లో పత్తి సాగు చేసేది. 2018లో సహజ వ్యవసాయం వైపు మళ్లింది. తన కూతురు ఏరోనాటికల్‌ ఇంజనీర్‌ అని చెప్పినప్పుడు, ఒక్క క్షణం నేను ఒక మధ్యతరగతి గృహిణితో మాట్లా డుతున్నట్లు అనిపించింది. అయితే వీరు చిన్న, సన్నకారు రైతులు. ఎక్కువగా మహిళలు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వీరు వాతావరణాన్ని తట్టుకోగల, పర్యావరణానికి ఆరోగ్యకరమైన సహజ వ్యవసాయ విధానపు సద్గుణాలు, బలాలతో పాటు దాని అపారమైన సంభావ్యత గురించి తమ అనుభవాలను పంచుకున్నారు.

వారిలో కొందరికి, సగటున 1 ఎకరం కంటే తక్కువ భూమి ఉంది. కొంతమందికి 0.10 నుండి 0.50 సెంట్ల వరకు భూమి ఉంది. ఏపీసీఎన్‌ఎఫ్‌ (ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిటీ మేనేజ్డ్‌ నేచురల్‌ ఫార్మింగ్‌)కి చెందిన గుంటూరు ప్రధాన కార్యాలయంలో వీరు సమావేశ మయ్యారు. దీనిని ప్రభుత్వ యాజమాన్యంలోని రైతు సాధికార సంస్థ (ఆర్‌వైఎస్‌ఎస్‌) నిర్వహిస్తోంది. 

ప్రధాన స్రవంతి ఆలోచన ఆచరణీయమైన ప్రత్యామ్నాయాలను అమలు చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తుందో వెనువెంటనే స్పష్ట మైంది. చిన్న భూకమతాలు తరచుగా పనికిరానివిగా పరిగణించ బడతాయి కాబట్టి భూ సంస్కరణలు, కార్మిక సంస్కరణల పేరుతో ఆర్థికవేత్తలు, కార్పొరేట్‌ నాయకులు వ్యవసాయం నుండి వారిని మిన హాయించాలని వాదించారు, చిన్న కమతాల్లో పనిచేసేవారిని పట్టణ శ్రామికశక్తిలో ఏకీకృతం చేయాలని కోరుతారు. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక రూపకల్పన చిన్న, సన్నకారు రైతులను ఆర్థిక భారంగా మారుస్తుంది. కానీ కొద్దిగా చేయూత నివ్వడంతోపాటు తగిన మార్కె టింగ్‌ కార్యక్రమాలు ఈ పొలాలను ఆచరణీయంగా మార్చగలవు, ఇవి భూగ్రహాన్ని వేడి చేయవు. గాలి, నీరు, నేలను విషపూరితం చేయవు.

50 సంవత్సరాల కాలంలో 51 దేశాలలో నిర్వహించిన అధ్యయనాల నుండి సేకరించిన డేటాతో కొంతకాలం క్రితం ‘నేచర్‌’ పత్రికలో వచ్చిన ఒక వ్యాసం నాకు గుర్తొస్తోంది. సాధారణంగా భావించే అవగాహనకు విరుద్ధంగా, చిన్న పొలాలు మరింత ఉత్పాద కత కలిగి ఉండి పర్యావరణపరంగా స్థిరమైనవి అని ఆ వ్యాసంలో పేర్కొన్నారు. కానీ అలాంటి అధ్యయనాలు ప్రధాన స్రవంతి సైన్స్ విధానంలో భాగం కావు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, మీడియా, విధాన నిర్ణేతలు వ్యవసాయ వ్యాపార దిగ్గజాల వాణిజ్య ప్రయోజనాలను దశాబ్దాలుగా ఆమోదించారు. ఇవి సాంద్ర వ్యవసాయాన్ని మినహాయించి, పర్యావరణపరంగా ఆరోగ్యకరమైన, సమాన ఉత్పాదక, స్థిరమైన ఆహార వ్యవస్థ వైపు వెళ్లే ప్రయత్నాలను నిరోధించాయి.

అయినప్పటికీ ఒక నిశ్శబ్ద మార్పు జరుగుతోంది. ఇది కొత్త వ్యవసాయానికి పరివర్తనను రూపొందిస్తోంది. నేను దీనిని కొత్త వ్యవ సాయం అని పిలుస్తాను. ఎందుకంటే మిగులు ఉత్పత్తిపై ఎక్కువగా ఆధారపడే సాంప్రదాయిక ఏకరూప వ్యవసాయ పద్ధతులు వ్యవ సాయ భూములను ఎండిపోయేలా చేశాయి. భూములను  నిర్వీర్యంగా మార్చాయి, భూగర్భ జలాలను తోడేశాయి. ఆహార గొలుసును కలుషితం చేశాయి. పైగా వ్యవసాయ జనాభా వ్యవసాయాన్ని విడిచిపెట్టి వలస వెళ్లవలసి వచ్చింది. ఇంకా ఇది మానవ వ్యాధులు, వాతావరణ అత్యవసర పరిస్థితుల అధిక భారానికి చెందిన ద్వంద్వ సవాళ్లకు దోహదపడింది.

అయితే, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా, భవిష్యత్తులో ఈ రకమైన వ్యవసాయం పరిమిత పాత్రతో మిగిలిపోతుంది. అందుకే ఆహార వ్యవస్థను వ్యవసాయ – పర్యావరణ వ్యవస్థ వైపు మళ్లించడం అనేది ఆహార భద్రత, పోషణను మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరిస్తుంది. ఆర్థికంగా లాభదాయక మైన జీవనోపాధిని ప్రోత్సహిస్తుంది. తద్వారా ఉపాధి కల్పనకు దోహదం చేస్తుంది.

వ్యవసాయం గురించి పునరాలోచించడం ఈ కాలపు అవసరం. ఫిలిప్పీన్స్ నుండి వియత్నాం వరకు, కంబోడియా నుండి మెక్సికో వరకు; భారతదేశం నుండి అమెరికా వరకు, వ్యవసాయ–పర్యావరణ శాస్త్రం వైపు ఒక బలమైన, శక్తిమంతమైన ఉద్యమంగా నెమ్మదిగానే కావచ్చు కానీ స్థిరంగా విధానాలలో మార్పును తీసుకువస్తోంది. అయితే కార్పొరేట్‌ ప్రయోజనాలకు మాత్రమే సరిపోయే కాలం చెల్లిన ఆర్థిక విధానాలను విస్మరించాల్సిన అవసరం మాత్రం ఉంది. వ్యవ సాయ పరిశోధన, విద్య కోసం పర్యావరణ స్థిరత్వం వైపు పరివర్తనను ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యమైనది.

జన్యుపరంగా మార్పు చెందిన బీటీ పత్తి విఫలం కావడం వల్ల కలిగే విధ్వంసాన్ని తీసుకోండి. వెండి బుల్లెట్‌గా కీర్తించబడినది దుమ్ములో కలిసిపోయింది. మరోవైపు సేంద్రియ పద్ధతిలో పత్తి సాగు చేస్తున్న ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ వంటి రైతుల్లో నాకు ఆశ కనిపిస్తోంది. అతని పొలంలో 100 కంటే ఎక్కువ బంతులతో పెద్ద సంఖ్యలో మొక్కలు ఉన్నాయి. 50 కంటే ఎక్కువ ఆరోగ్యకరమైన బంతులు ఉన్న మొక్కను మంచి పంటగా పేర్కొనవచ్చు. ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందని, ఇది చాలా ప్రోత్సా హకరంగా ఉందన్నారు.

అదే విధంగా అదే జిల్లాకు చెందిన గోపాల రావు 3.5 ఎకరాల్లో సేంద్రియ వరి సాగు చేశాడు. రెండేళ్ల క్రితం సేంద్రియ వ్యవసాయానికి మారిన ఆయన ఎకరాకు దాదాపు 30 క్వింటాళ్ల పంట వస్తుందని చెప్పారు. రసాయనేతర వ్యవసాయం కాబట్టి ఇది సాంద్ర వ్యవసాయంతో సానుకూలంగా పోలిక అవుతుంది. దీనికి మరిన్ని పరిశోధనలు, ప్రభుత్వ రంగ పెట్టుబడులు అవసరం. ఏమైనా మనం వెనక్కి తగ్గకూడదు. చిన్న, సన్నకారు  రైతులను చేయి చేయి పట్టి సరైన దిశలో నడిపిద్దాం. అప్పుడే వ్యవసాయం మరింత ఆశాజనకం అవుతుంది. 
దేవిందర్‌ శర్మ 
వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement