న్యూఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండిలో కూరగాయలమ్మే వ్యక్తి తాలూకు ఒక వీడియో వైరల్ అయ్యింది. దిగమింగుకోవడం కష్టమైపోయిన ఆయన కన్నీళ్లలో తన ఆర్థిక బాధ స్పష్టంగా కనిపించింది. జీవనోపాధి కోసం ఎక్కువ మంది ఆధారపడి ఉన్నందున, వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చే సవాలును ఆర్థికవేత్తలు స్వీకరించాలి. ఇప్పుడున్న ఆర్థిక నమూనాను ధిక్కరించయినా రైతుల చేతులకు ఎక్కువ ఆదాయాన్ని అందించాలి. వచ్చే ఐదేళ్లను పూర్తిగా వ్యవసాయాన్ని పునర్నిర్మించడానికి కేటాయించాలి. సంస్కరణలు ప్రారంభించినప్పటి నుండి పరిశ్రమలకు ఇచ్చినన్ని వనరులు, ప్రోత్సాహకాలు, ఆర్థిక ఉద్దీపనలను ఇప్పుడు వ్యవసాయానికి అందించాలి. ప్రతి రైతు, కూలీ కన్నీళ్లు తుడవడానికి ఇది తప్ప వేరే మార్గం లేదు.
కొన్నిసార్లు మాటల కంటే నిశ్శబ్దం మరింత బిగ్గరగా మాట్లాడుతుంది. న్యూఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండిలో ఓ కూరగాయల అమ్మకందారుపై తీసిన,గుండెను పిండేసే వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. పెరిగిన ధరలకు టమోటాలు కొనలేకపోతే ఖాళీ బండితో తిరిగి వెళతావా అని అడిగినప్పుడు, ఆయన మూగబోయాడు. అదే సమయంలో తన కన్నీళ్లను అదుపులో పెట్టుకోలేకపోయాడు. ఆయన మౌనమే శక్తిమంతమైన సమాధానం అయింది.
మార్కెట్‌లోకి వచ్చే కొత్త కార్ మోడళ్లు, సూపర్‌స్టోర్‌లను ముంచెత్తుతున్న సరికొత్త ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల వెంటపడుతున్న దేశ ప్రజల సున్నిత హృదయాలకు ఆ చిన్న వీడియో షాక్ కలిగించింది. తాజా ఆటోమొబైల్స్ గురించి, సరికొత్త ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల గురించి టీవీ షోలు నిత్యం మోతమోగిస్తున్నప్పుడు, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ గురించి ఎప్పటికప్పుడు నివేదికలు వెలువడుతున్న ప్పుడు, ఒక వీడియో క్లిప్... మధ్యతరగతిని మైకం నుంచి బయటకు లాగడమే కాకుండా కఠినమైన వాస్తవాలను వారి ముఖాముఖి తీసు కొచ్చింది.
న్యూఢిల్లీకి చెందిన కూరగాయలమ్ముకునే రామేశ్వర్‌పై చిత్రించిన క్లిప్ సరిగ్గా అటువంటి ఉదాహరణే. దిగమింగుకోవడం కష్టమైపోయిన ఆయన కన్నీళ్లలో తన ఆర్థిక బాధ స్పష్టంగా కనిపించింది. ఎంత సంపాదించారని ప్రశ్నించగా, రోజుకు రూ.100–200కు మించి రావడం లేదన్నాడు. ఆయన సమాధానం భారతదేశ పేదరిక స్థాయిలనే కాకుండా, పెరుగుతున్న అసమానతల విస్ఫోటనాన్ని కూడా బయటపెట్టింది.
అయితే మహారాష్ట్రలోని ఠిక్‌పుర్లీకి చెందిన 45 ఏళ్ల చెరకు రైతు, కూలీ గురించి చాలామందికి తెలియదు. భారతి పాటిల్ అనే ఆ రైతు, ఒక పరిశోధనా వేదికతో మాట్లాడుతూ, ‘‘గత ఐదేళ్లుగా మా కూలీలు పెద్దగా మారలేదు. నోట్ల రద్దుకు ముందు రోజుకు 100 రూపాయలు వచ్చేది, ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకు పనిచేసినా మాకు రూ. 150 మాత్రమే చేతికి అందుతోంది’’ అని పేర్కొన్నారు.
మరో మాటలో చెప్పాలంటే, ఒక సన్నకారు చెరకు రైతుకు ఒక రోజుకు దక్కుతున్న మొత్తాన్ని ఇది బయటపెడుతుండగా, మహారాష్ట్రలోని చక్కెర బెల్ట్‌లో రోజువారీ కూలీ గత ఐదేళ్లలో రూ.50 మాత్రమే పెరిగిందని కూడా వెల్లడవుతోంది. నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నా సన్నకారు రైతులు, రైతు కూలీలు ఏటా అదే తక్కువ కూలీ మొత్తంతో ఎలా బతుకుతున్నారనేది జీర్ణించుకోవడం కష్టం.
ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసినప్పుడు నిజమైన కూలీల పెరుగుదల సున్నాకు దగ్గరగానే ఉంది. ఏరకమైన అర్థవంతమైన పెరుగుదలా కనబడలేదు. వాస్తవానికి, కొన్ని అధ్యయనాలు 2013 –17 మధ్య నిజమైన వేతనాలు తగ్గుముఖం పట్టడం లేదా స్తబ్ధుగా ఉండటాన్ని సూచించాయి. దేశంలోని 90 కోట్ల మంది కార్మికులలో చాలా మంది అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాల పట్ల భ్రమలు కోల్పోయారనీ, దీంతో వారు ఉద్యోగాల కోసం వెతకడం కూడా మానేశారనీ 2022 ఏప్రిల్‌లో సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎమ్‌ఐఈ) పేర్కొంది.
ఈ కారణం వల్లే 2021–22లో దేశ ఉపాధిలో 45.5 శాతంగా ఉన్న వ్యవసాయ రంగం వాటా, మహమ్మారి ముందు స్థాయికి చేరలేదని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే పేర్కొంది. అప్పుడు శ్రామిక శక్తిలో 42.5 శాతంతో వ్యవసాయరంగ జనాభా వాటా సాపేక్షంగా తక్కువగా ఉందని ఈ నివేదిక తెలిపింది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ విధించిన తర్వాత వారి గ్రామాలకు తిరిగి వచ్చిన 10 కోట్ల మంది కార్మికులలో గణనీయమైన భాగం మళ్లీ నగరాలకు తిరిగి రాలేదు.
అదేవిధంగా, బంగ్లాదేశ్‌లో కూడా ఈ సంవత్సరం వ్యవసాయంపై ఆధారపడటం పెరిగింది. బంగ్లాదేశ్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం, వ్యవసాయ రంగంలో సంవత్సర ప్రాతిపదికన చూసిన ప్పుడు 2023 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అత్యధిక ఉద్యోగాల కల్పన జరిగింది. అదే సమయంలో నగరాల్లో అధికారిక ఉపాధి అవకాశాలు లేకపోవడాన్ని సూచిస్తున్నందున ఇది మంచి సంకేతం కాదని కొందరు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.
అసమానత ఎంత నిరుత్సాహకరంగా మారుతున్నదో ముందుగా చూద్దాం. ప్రపంచ స్థాయిలో అధ్వాన్నంగా పెరుగుతున్న అసమానతలను ‘వరల్డ్ ఇన్–ఈక్వాలిటీ రిపోర్ట్’ వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం, ప్రపంచ జనాభాలో అత్యంత సంపన్నులైన 10 శాతం మంది మొత్తం సంపదలో 76 శాతాన్ని కలిగి ఉన్నారు. అయితే దిగువ సగం మంది కేవలం 3 శాతం సంపద కలిగి ఉన్నారు. భారతదేశంలో కూడా అగ్రశ్రేణి 1 శాతం మంది, దేశ సంపదలో 40.5 శాతాన్ని కలిగి ఉన్నారని ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ చెబుతోంది.
ధనికులు సంపదను కూడబెట్టుకోవడం కొనసాగిస్తుండగా, పేదలు పేదరికంలోకి మగ్గిపోయేలా ఆర్థిక రూపకల్ప నను మన విధాన నిర్ణేతలు అల్లుకుంటూ వచ్చారు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఎంత బలంగా పాతుకుపోయిందంటే, అసమానతలను అంతం చేయడంపై పెద్ద చర్చ జరుగుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి 500 మంది అత్యంత సంపన్నులు 2023 మొదటి ఆరు నెలల్లోనే తమ సంపదకు మరో 852 బిలియన్ డాలర్లను జోడించుకున్నారు.
ప్రపంచ బ్యాంక్ ప్రమాణాల ప్రకారం, రోజుకు నాలుగు డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో బతుకుతున్న ‘బ్రిక్స్’ దేశాల జనాభాలో ఇండియా మొదటిస్థానంలో ఉంది. 91 శాతం జనాభా నిర్దేశిత ప్రమాణానికి కిందికి ఉంది. 50.3 శాతంతో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా కంటే కూడా ఇది ఎంతో ఎక్కువ.
వ్యవసాయాన్ని అతి పెద్ద ఉపాధి కల్పనారంగంగా పరిగణనలోకి తీసుకుంటే, అసమానతలను తగ్గించడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, వనరులను అవసరం ఉన్న చోట ఉపయోగించడమే. పైనుంచి కిందికి ప్రవహించే విఫల ‘ట్రికిల్ డౌన్’ ఆర్థిక వ్యవస్థను కొనసాగించ డానికి బదులుగా– దిగువ, మధ్య స్థాయులను పైకి తేవడం మీద దృష్టి పెట్టడమే అసలైన కర్తవ్యం కావాలి.
భారతదేశం, బంగ్లాదేశ్‌లలో జీవనోపాధి కోసం ఎక్కువ భాగం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నందున, గ్రామీణ పరిశ్రమలను ప్రోత్స హించడం ద్వారా వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చే సవాలును ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు స్వీకరించాలి. దిగువ స్థాయి నుండి సంపదను పిండుకునే బదులు, ఇప్పుడున్న ఆర్థిక నమూనాను ధిక్క రించయినా రైతుల చేతులకు ఎక్కువ ఆదాయాన్ని అందించాలి. సజీవ వ్యవసాయం అనేది ఈ కాలపు అవసరం. ప్రతి రైతు, కూలీ కన్నీళ్లు తుడవడానికి ఇది తప్ప మరో మార్గం లేదు.
వచ్చే ఐదేళ్లను వ్యవసాయాన్ని పునర్నిర్మించడానికి కేటాయించాలని నా సూచన. సంస్కరణలు ప్రారంభించినప్పటి నుండి పరి శ్రమలకు మనం ఇచ్చినన్ని వనరులు, ప్రోత్సాహకాలు, ఆర్థిక ఉద్దీపన లను ఇప్పుడు వ్యవసాయానికి అందించాలి. ఆరోగ్యకరమైన, సంప న్నమైన, పునరుత్పత్తి చేసే తదుపరి దశ సంస్కరణలకు నాంది పలికేందుకు కేవలం ఐదేళ్ల పాటు, చిన్న తరహా వ్యవసాయాన్ని, పర్యా వరణపరంగా స్థిరమైన వ్యవసాయాన్ని పునర్నిర్మించాలి. కేవలం ఐదేళ్లు – ఇంతమాత్రమే నేను అడుగుతున్నది!
దేవీందర్ శర్మ
వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్: hunger55@gmail.com
Comments
Please login to add a commentAdd a comment