![Record 60 percent cultivation of thin varieties of rice in Telangana](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/crop.jpg.webp?itok=xhgDk5R9)
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 60 శాతం సన్న రకాల వరి సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సన్న రకాల వరి సాగు రికార్డు సృష్టిస్తోంది. యాసంగిలో సాగవుతున్న వరిలో 60శాతానికిపైగా సన్న రకాలే ఉన్నట్టు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అనుకూలమైన వాతావరణం, నీళ్లు అందుబాటులో ఉండటం, సన్నాలకు ప్రభుత్వం బోనస్ ఇస్తుండటంతో గతంలో ఎన్నడూ లేని విధంగా సన్నాల సేద్యం జోరందుకుందని వెల్లడించాయి.
ఫిబ్రవరి తొలివారానికల్లా రాష్ట్రంలో 49లక్షల ఎకరాలకుపైగా వరి సాగు మొదలైందని... ఇందులో 60శాతానికిపైగా అంటే 30 లక్షల ఎకరాల మేర సన్న రకాలే సాగవుతున్నట్టు అంచనా వేశాయి. రాష్ట్రంలో సాధారణంగా ఖరీఫ్‌లో సాగయ్యే వరిలో 50 శాతం వరకు, రబీలో 10–15 శాతం వరకు సన్న రకాలు ఉంటాయి. ఇప్పుడు రికార్డు స్థాయిలో, అదీ యాసంగిలో 60శాతం దాకా సన్నాలే సాగవడం గమనార్హం.
ఉత్తర తెలంగాణలో గణనీయంగా..: కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ ఉమ్మడి జిల్లాలతోపాటు మెదక్, నిజామాబాద్‌లలోని కొన్ని ప్రాంతాల్లో యాసంగిలో సన్నాల సాగు చాలా ఏళ్లుగా నిలిచిపోయింది. ఈసారి ప్రభుత్వం గుర్తించిన 33రకాల సన్న ధాన్యం వంగడాల్లో.. తమ ప్రాంతానికి అనుకూలంగా ఉన్న వాటిని ఈ జిల్లాల్లో సాగు చేస్తున్నారు.
ఉత్తర తెలంగాణలో బీపీటీ–5204, కెఎన్‌ఎం–1638, ఎంటీయూ–1224తోపాటు జగిత్యాలలోని పొలాస పరిశోధన కేంద్రం ఉత్పత్తి చేసిన వంగడాలను ఎక్కువగా వేసినట్టు వ్యవసాయ అధికారులు తెలిపారు.
నిజామాబాద్‌లో తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్ 15048)ను సాగు చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో యాసంగి సాధారణ సాగు విస్తీర్ణం కన్నా.. ఈసారి ఒక్క వరి పంటే అధికంగా సాగవుతోందని తెలిపారు. వరంగల్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో సాగు మందకొడిగా ఉందని పేర్కొన్నారు.
మొత్తం వరి సాగులోనూ రికార్డు!
వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం.. యాసంగిలో అన్ని రకాల పంటల సాధారణ సాగు విస్తీర్ణం 63.54 లక్షల ఎకరాలు. అందులో వరి విస్తీర్ణం 47.27 లక్షల వరకు ఉంటుంది. ఈసారి పరిస్థితులు అనుకూలించడంతో.. అన్ని పంటలు కలిపి మొత్తం సాగు 79.40 లక్షల ఎకరాలకు చేరుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో వరి ఒక్కటే 65 లక్షల ఎకరాల వరకు ఉంటుందని, యాసంగికి సంబంధించి ఇది రికార్డు అని అధికారులు చెబుతున్నారు.
వ్యవసాయ యోగ్యమైన భూములకే ‘రైతు భరోసా’ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో.. కొన్నేళ్లుగా పంటలు వేయని బీడు భూముల్లోనూ రైతులు సాగు చేపట్టినట్టు వివరిస్తున్నారు. గత యాసంగిలో 67.83 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుకాగా.. అందులో వరి 52 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈసారి అంతకన్నా 10– 13 లక్షల ఎకరాల్లో అధికంగా సాగవుతుందని భావిస్తున్నారు.
ఇక ఇక రాష్ట్రంలో ఖరీఫ్‌కు సంబంధించి 23 లక్షల టన్నుల సన్న ధాన్యానికి ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్‌గా చెల్లించింది. ఈ మేరకు రైతులకు రూ.1,154 కోట్లను రైతుల ఖాతాల్లో వేసింది. దీనితోపాటు సీఎం, మంత్రులు కూడా సన్నాల సాగు చేపట్టాలని విజ్ఞప్తి చేయడం ఫలితమిస్తోందని వ్యవసాయవర్గాలు చెబుతున్నాయి.
మొక్కజొన్న, వేరుశనగ పంటలు కూడా..
యాసంగిలో 7.18 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు కావొచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. ఇప్పటికే 6.94 లక్షల ఎకరాల్లో సాగు మొదలైంది. మరో రెండు లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిర్మల్, వరంగల్ రూరల్, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్ అర్బన్, మహబూబాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మొక్కజొన్న ఎక్కువగా వేశారు. వేరుశనగ కూడా 2.57 లక్షల ఎకరాల అంచనాకుగాను.. ఇప్పటికే 2.32 లక్షల ఎకరాల్లో సాగు మొదలైంది. జొన్న, కంది పంటల సాగు కూడా పెరిగింది.
నీళ్లు అందుబాటులో ఉండటంతో..
రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీళ్లు అందుబాటులో ఉండటంతోనూ యాసంగి సాగు విస్తీర్ణం పెరగడానికి కారణమని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర తెలంగాణలో ప్రధాన చెరువుల కింద పొలాలన్నింటికీ యాసంగి వరి సాగుకు సరిపడా నీళ్లు ఉన్నాయని.. భూగర్భ జలాలు కూడా ఆశాజనకంగానే ఉండటం వరిసాగు పెరగడానికి కారణమని పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment