Yasangi yield
-
యాసంగికి పంట గోస.. తగ్గనున్న ధాన్యం దిగుబడి
సాక్షి, హైదరాబాద్: యాసంగిలో వరి దిగుబడి గణనీయంగా తగ్గిపోనుంది. సాగు విస్తీర్ణం తగ్గడం.. కీలక సమయంలో సాగునీరు అందుబాటులో లేక ఎండిపోవడం, అకాల వర్షాలు, వడగళ్ల నష్టం వంటివి దీనికి కారణమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి.. రైతులు తీవ్రంగా నష్టపోయారు కూడా. ఈ నేపథ్యంలో యాసంగికి సంబంధించిన రెండో ముందస్తు అంచనాల నివేదికను వ్యవసాయశాఖ తాజాగా విడుదల చేసింది. గత యాసంగిలో వరి దిగుబడి 1.20 కోట్ల టన్నులుకాగా.. ఈసారి 1.06 కోట్ల టన్నులకు తగ్గుతుందని.. అంటే 14 లక్షల టన్నుల మేర తగ్గుదల ఉంటుందని అంచనా వేసింది. అలాగే మొక్కజొన్న గత యాసంగిలో 17.20 లక్షల టన్నుల దిగుబడి వస్తే.. ఈసారి 15.37 లక్షల టన్నులే వస్తుందని అంచనా. దీని దిగుబడి 1.83 లక్షల టన్నుల మేర తగ్గిపోనుంది. వేరుశనగ కూడా గత యాసంగిలోని 2.32 లక్షల టన్నుల కంటే 59వేల టన్నులు తగ్గి.. ఈసారి 1.73 లక్షల టన్నులకే పరిమితం కానుంది. ఇక గత యాసంగిలో మొత్తం నూనె గింజల ఉత్పత్తి 2.70 లక్షల టన్నులుకాగా.. ఇప్పుడు 61వేల టన్నులు తక్కువగా 2.09 లక్షల టన్నులకు పడిపోనుంది. మొత్తంగా యాసంగిలో కీలక పంటల దిగుబడులన్నీ తగ్గనున్నాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. గత ఏడాది సాగు రికార్డులు.. 2022–23 వానాకాలం, యాసంగి సీజన్ల పంటల సాగు విస్తీర్ణంలో తెలంగాణ చరిత్రలోనే ఆల్‌టైం రికార్డు నమోదైంది. ఆ రెండు సీజన్లలో కలిపి ఏకంగా 2.08 కోట్ల ఎకరాల్లో పంటల సాగు నమోదైంది. ఆ ఏడాది వానాకాలంలో 1.36 కోట్ల ఎకరాల్లో సాగుకాగా.. యాసంగిలో 72.59 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. రాష్ట్ర ఏర్పాటు నాటి సాగు విస్తీర్ణంతో పోలిస్తే.. అది రెండింతలకు దగ్గరగా రావడం గమనార్హం. 2014–15లో రాష్ట్రంలో రెండు సీజన్లు కలిపి 1.31 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవగా.. 2020–21 నాటికి 2.03 కోట్ల ఎకరాలకు, 2022–23 నాటికి 2.08 కోట్ల ఎకరాలకు చేరాయి. కానీ ఈసారి రెండు సీజన్లు కలిపి 1.93 కోట్ల ఎకరాలకే సాగు పరిమితమైంది. అలాగే 2022–23 వరకు వరి సాగులో రికార్డుల మోత మోగింది. 2014–15లో రెండు సీజన్లకు కలిపి 35 లక్షల ఎకరాల్లోనే వరి సాగవగా.. 2022–23 నాటికి ఏకంగా 1.22 కోట్ల ఎకరాలకు పెరగడం విశేషం. అదే ఇప్పుడు 2023–24లో వరి సాగు 1.14 కోట్ల ఎకరాలకే పరిమితమైందని వ్యవసాయశాఖ నివేదిక స్పష్టం చేసింది. సన్న బియ్యానికి డిమాండ్ యాసంగిలో ధాన్యం దిగుబడి తగ్గనున్న నేపథ్యంలో రోజువారీ ఆహారంగా తీసుకునే సన్న బియ్యానికి డిమాండ్ పెరగనుంది. దీన్ని గుర్తించిన మిల్లర్లు, వ్యాపారులు నేరుగా పొలాల వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. యాసంగి ధాన్యం సేకరణ కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా.. నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లోనే కొంత మేర ధాన్యం ఆ కేంద్రాలకు వస్తోంది. సన్నబియ్యం పండించే నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రావడం లేదు. పొలాల వద్దకే మిల్లర్లు, వ్యాపారులు రాష్ట్రవ్యాప్తంగా కోటి టన్నుల మేర ధాన్యం దిగుబడి వస్తే.. అందులో 7 లక్షల నుంచి 10 లక్షల టన్నుల మేర మాత్రమే సన్నధాన్యం ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా. దీంతో సన్నరకాలను మిల్లర్లు, వ్యాపారులు నేరుగా రైతుల కల్లాల నుంచే కొనుగోలు చేసుకొని పోతున్నారు. రాష్ట్ర మిల్లర్లు, వ్యాపారులతోపాటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఏపీలకు చెందిన వ్యాపారులు వచ్చి క్వింటాలుకు రూ.2,300 నుంచి రూ.3,000 వరకు చెల్లించి పచ్చి ధాన్యాన్ని కొంటున్నారు. కాస్త మెరుగైన ధరే కావడంతో.. రైతులు కూడా విక్రయిస్తున్నారు. – నిజామాబాద్ జిల్లాలో గంగ, కావేరి సన్న రకాలను 2.30 లక్షల ఎకరాల్లో, కామారెడ్డి జిల్లాలో 63 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఇక మహబూబ్‌నగర్‌లో కృష్ణా తీరం వెంట సన్నాలను పండించారు. ఇక్కడి రైతులు పండించిన సన్న ధాన్యాన్ని మిల్లర్లే కొనేస్తుండటంతో కొనుగోలు కేంద్రాలకు రావడం లేదు. దొడ్డు రకాల ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. ఈ సీజన్లో 70 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకున్నా.. దిగుబడి తగ్గిన నేపథ్యంలో 50 లక్షల టన్నులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని వ్యవసాయ వర్గాలు చెప్తున్నాయి. సన్న బియ్యం ధరలు పెరిగే చాన్స్ మేలు రకం సన్న బియ్యానికి ఖరీఫ్ సీజన్లోనే క్వింటాల్ రూ.6,000 వరకు ధర పలికింది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో జైశ్రీరాం, హెచ్ఎంటీ, బీపీటీ, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా రకాలకు.. నాణ్యతను బట్టి రూ.6,500 నుంచి రూ.8,500 వరకు ధర పలుకుతోంది. యాసంగిలో తగ్గిన దిగుబడి, బియ్యం కొరత కారణంగా ఈసారి బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించినా.. మార్కెట్లో ధరలు తగ్గడం లేదని, ఇప్పుడు తగ్గిన దిగుబడితో మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నాయి. పొట్టదశలో ఎండిన వరి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లిలో రైతు బంటు లక్ష్మయ్యకు చెందిన పొలంలో ఎండిపోయిన వరి ఇది. లక్ష్మయ్య తనకున్న మూడెకరాల భూమిలో వరి వేశాడు. బోరు వట్టిపోయి నీరు లేక వరి పంట మొత్తం ఎండిపోయింది. – మిర్యాలగూడ తొమ్మిదెకరాల్లో.. ఒక్క ఎకరమూ మిగల్లేదు.. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం జయరాంతండాలో ఎండిపోయిన వరి పొలం ఇది. ఈ తండాకు చెందిన రైతు రమావత్ కీమా తనకున్న ఆరు ఎకరాలతోపాటు మరో మూడెకరాలను కౌలుకు తీసుకుని యాసంగిలో వరి సాగుచేశాడు. మూడు బోర్లు ఉన్నా భూగర్భజలాలు అడుగంటి ఎండిపోయాయి. దాంతో మరో బోర్ వేయించినా లాభం లేకపోయింది. మొత్తం తొమ్మిదెకరాల్లో వరి ఎండిపోయింది. దీంతో ఆ వరి కోయించి.. పశువులకు గ్రాసంగా వేస్తున్నాడు. – పెద్దవూర పంటను పశువులకే వదిలేసి... వేలేరు: హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచరకు చెందిన రైతు కొయ్యడ బొందయ్య రెండున్నర ఎకరాల్లో వరి వేశాడు. ఇరవై రోజుల నుంచి నీళ్లు లేక వరి పంట అంతా ఎండిపోయింది. చేసేదేం లేక వరి పంటను ఇలా పశువులకు వదిలేశాడు. -
తడిసినా కొంటాం
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఒక్క గింజ కూడా పోకుండా వీలైనంత త్వరగా సేకరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. మామూలు ధాన్యం ధరనే తడిసిన ధాన్యానికీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. రైతన్నల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుంటోందని, ఆపత్కాలంలో వారి దుఃఖాన్ని, కష్టాన్ని పంచుకునేందుకు మరోసారి సిద్ధమైందని చెప్పారు. రైతుల కష్టాల్లో భాగస్వామ్యం కావడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, అన్నదాతలు ఏమాత్రం ఆందోళన చెందవద్దని కోరారు. యాసంగి ధాన్యంతో పాటు అకాల వర్షాల్లో తడిసిన ధాన్యం సేకరణపై మంగళవారం ఆయన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణ జరుగుతోందని, అయితే అకాల వర్షాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ధాన్యం సేకరణ త్వరలోనే పూర్తి చేస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ చెప్పారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. వరి కోతలు వాయిదా వేసుకోవాలి.. మరో మూడు, నాలుగురోజులు వానలు కొనసాగనున్నాయని, అప్పటిదాకా వరి కోతలను వాయిదా వేసుకోవాలని కేసీఆర్ రైతులకు సూచించారు. పంట కోతలకు వెళ్లకుండా సంయమనం పాటించాలని, ధాన్యం తడవకుండా జాగ్రత్త పడాలని కోరారు. ‘రైతుల కోసం చిత్తశుద్ధి, దృఢ సంకల్పంతో కార్యాచరణ అమలు చేస్తున్నది ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. ఊహించని అకాల వర్షాలు ఎడతెరిపి లేకుండా కొనసాగుతుండడం బాధాకరం. ప్రకృతి వైపరీత్యానికి ఎవరం ఏమీ చేయలేం. కానీ మనకేం సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండలేదు. పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలను అందిస్తూ ఇప్పటికే ఆదుకుంటోంది. రాష్ట్ర ఖజానాకు ఎంత భారమైనా వెనుకంజ వేయకుండా రైతన్నలను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది..’ అని సీఎం స్పష్టం చేశారు. ఇక మార్చిలోనే వరి కోతలు.. గతానికి భిన్నంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాలను గుణపాఠంగా తీసుకుని భవిష్యత్తులో యాసంగి వరి కోతలు మార్చిలోపే జరిపేందుకు ఎలాంటి విధానాలను అవలంభించాలో శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని వ్యవసాయ శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ దిశగా రాష్ట్ర రైతాంగాన్ని చైతన్యం చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఏటా మార్చిలోగా వరి కోతలు పూర్తయ్యేలా ముందస్తుగానే పంట నాటుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. మార్చి తర్వాత అకాల వర్షాలకు అవకాశాలున్నందున ఆ లోపే కోతలు పూర్తి చేసుకోవడం మంచిదన్నారు. ఏప్రిల్, మే వచ్చేదాకా పంట నూర్పకుంటే ఎండలు పెరిగి ధాన్యంలో నూక శాతం కూడా పెరిగిపోతుందని పేర్కొన్నారు. రైతులకు అవగాహన కల్పించాలి ఎరువుల వినియోగంపై కూడా రైతులకు అవగాహన కల్పించాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలు, మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో తలెత్తే మార్పులపై ఎప్పటికప్పుడు రైతాంగానికి అర్థమయ్యే రీతిలో కరపత్రాలు, పోస్టర్లు, వాణిజ్య ప్రకటనలు తదితర ప్రచార మార్గాల ద్వారా అవగాహన, చైతన్యం కల్పించాలని సూచించారు. ఏఈఓలు నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు తగు సూచనలందించాలని ఆదేశించారు. రైతు వేదికల్లో వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని స్పష్టం చేశారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలుంటాయన్నారు. ఈ దిశగా పనితీరును పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం ఆదేశించారు. -
నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: గత సీజన్లో రైస్‌మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద పౌరసరఫరాల శాఖకు అప్పగించని మిల్లర్లకు యాసంగి ధాన్యం కేటాయించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎంఆర్ కోసం 18 నెలల పాటు గడువు ఇచ్చినా, ధాన్యాన్ని మర పట్టించి ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న రైస్ మిల్లులను ఇక బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం మంగళవారం నుంచి రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తోంది. ఈ మేరకు మంత్రులు టి.హరీశ్‌రావు, గంగుల కమలాకర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్ సింగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతస్థాయి అధికారులు సోమవారం బీఆర్కే భవన్లో జిల్లాల అదనపు కలెక్లర్లు, డీఎంలు, డీఎస్ఓలు, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యాసంగి ధాన్యం సేకరణ, సీఎంఆర్ కేటాయింపు, రైతులకు ఉపయోగకర అంశాలు వంటి వాటిపై చర్చించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకొని కొనుగోళ్ళకు సిద్దం కావాలని, రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని మంత్రులు ఆదేశించారు. ఇందు కోసం యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా 7,100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆయా జిల్లాల్లో మొదలైన కోతలు, ధాన్యం దిగుబడికి అనుగుణంగా కేంద్రాలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే వారంలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ముగ్గురు మంత్రులు అధికారులకు దిశా నిర్శేశం చేశారు. ధాన్యం కొనుగోళ్ళకు కావాల్సిన ఏర్పాట్లను కలెక్టర్లు సిద్ధం చేసుకోవాలని, వచ్చే వారంలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. యాసంగికి సీజన్ సీఎంఆర్ అప్పగింతకు ఆఖరు తేదీగా ఈ నెల 30వ తేదిని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ఈలోగా మిల్లర్లు నుంచి సీఎంఆర్‌ను పూర్తి స్థాయిలో సేకరించాలని ఆదేశించారు. ఇక నుంచి సీఎంఆర్ అప్పగించే విషయంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న సీఎంఆర్‌ని అప్పగించిన తరువాతే ఈ సీజన్ కు సంబంధించి ధాన్యాన్ని తీసుకోవాలని రైస్ మిల్లర్లుకు సూచించారు. ఇప్పటి వరకు సీఎంఆర్‌లో పాల్గొనని మిల్లర్లను కూడా ఈ యాసంగి సీజన్ నుంచి భాగాస్వామ్యం చేస్తున్నట్లు మంత్రులు ప్రకటించారు. రెండు సీజన్లలో పూర్తి ధాన్యాన్ని సేకరిస్తున్న రాష్ట్రం తెలంగాణనే... దేశ వ్యాప్తంగా రెండు సీజన్లలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఒక్క తెలంగాణా మాత్రమేనని మంత్రులు హరీష్‌రావు, గంగుల, సింగిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నుంచి అదనపు కలెక్టర్లు ఆయా జిల్లా స్థాయిలలో కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసుకొని ధాన్యం కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ధాన్యం నిల్వలకు ఇంటర్మీడియట్ గోడౌన్లను గుర్తించి తగు ప్రతిపాధనలను ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. అలాగే ఆరబెట్టిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకోచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో భారీగా ధాన్యం దిగుబడి రాష్ట్రంలో రోజురోజుకూ ధాన్యం దిగుబడి, కొనుగోలు గణనీయంగా పెరుగుతున్నాయని మంత్రులు వెల్లడించారు. 2014–15 లో రూ.3392 కోట్లతో ధాన్యం సేకరిస్తే 2020–21 నాటికి రూ.26 వేల 600 కోట్లతో ధాన్యం సేకరించగలిగామని చెప్పారు. 9 సంవత్సరాలలో ఆరు రెట్ల ధాన్యం కొనుగోలు పెరగగా , ఈ రబీ(యాసంగి)లో దేశంలో సగం పంట తెలంగాణలో మాత్రమే ఉండడం మనకు గర్వకారణమన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న చెక్ పోస్టులను బలోపేతం చేయాలని మంత్రులు ఆదేశించారు. రైతులకు చెల్లింపులు ఆలస్యం జరగకుండా ధాన్యం కొనుగోలు వివరాలను కేంద్రాల నిర్వాహకులు ఎప్పటికప్పడు ఆన్ లైన్ లో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకష్ణ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌర సరఫరాల కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. -
తెలంగాణలో రికార్డు పంట.. గతంలో ఎన్నడూ లేనంతగా సాగు..!
రాష్ట్రంలో పంటల సాగు రికార్డులు బద్దలు కొడుతోంది. తెలంగాణ చరిత్రలోనే ప్రస్తుత వ్యవసాయ సీజన్లో పంటల సాగు కొత్త రికార్డులు నమోదు చేసింది. కొన్నేళ్లుగా సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం, విస్తారంగా కురిసిన వానలతో రిజర్వాయర్లు, చెరువులు, కుంటలన్నీ నిండిపోవడం, భూగర్భ జలమట్టాలు పెరగడంతో.. ప్రస్తుత యాసంగి మొత్తం పంటల సాగులో, వరి సాగులో ఆల్‌టైమ్ రికార్డులను నమోదు చేసింది. ఇంతకుముందు యాసంగి సీజన్‌కు సంబంధించి అత్యధికంగా 2020–21లో 68.17 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా.. ఈసారి యాసంగిలో 68.53 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని బుధవారం విడుదల చేసిన నివేదికలో వ్యవసాయశాఖ వెల్లడించింది. 2014–15 యాసంగిలో 28.18 లక్షల ఎకరాల్లోనే పంటలు పండించగా.. మరో 40.35 లక్షల ఎకరాల సాగు పెరగడం గమనార్హం. వరి కూడా ఆల్‌టైమ్ రికార్డే... మొత్తం పంటల సాగుతో మాత్రమేకాకుండా.. వరి సాగు విషయంలోనూ ఈ యాసంగి ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. ప్రస్తుత యా సంగిలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఏకంగా 53.08 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. నాట్లు వేయడానికి మరో పదిరోజుల పాటు సమయం ఉండటంతో.. వరి విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా వానాకాలం సీజన్‌తో పోటీపడే స్థాయిలో యాసంగిలో వరి సాగు నమోదవుతోందని అంటున్నారు. 2014–15 యాసంగిలో 12.23 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా.. ప్రస్తుతం ఏకంగా 53.08 లక్షల ఎకరాలకు పెరగడం గమనార్హం. అంటే గత తొమ్మిదేళ్లలో యాసంగిలో వరిసాగు 40.85 లక్షల ఎకరాలు పెరిగింది. 2015–16 యాసంగిలో కేవలం 7.35 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు జరిగింది. ఆ తర్వాతి నుంచి పెరుగుతూ వచ్చింది. వాస్తవానికి ప్రస్తుత వ్యవసాయ సీజన్ (2022–23)లోని వానాకాలంలో కూడా వరిసాగు ఆల్‌టైం రికార్డు నమోదైంది. ఇటీవలి వానాకాలంలో 64.54 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేయడం గమనార్హం. ఇంతకుముందు అత్యధికంగా 2021 వానాకాలంలో 61.94 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 2013 వానాకాలంలో ఇక్కడ 29.16 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా.. ఇప్పుడది రెండింతలు దాటిపోవడం గమనార్హం. మొత్తంగా ఈసారి వానాకాలం, యాసంగి సీజన్లలో వరిసాగు ఆల్‌టైం రికార్డులను నమోదు చేసుకుంది. ప్రభుత్వ నిర్ణయాలతోనే భారీగా సాగు వానాకాలంలో చెరువులు నిండి పంటలు పండుతాయి. అలాంటిది యాసంగిలో కూడా రికార్డు స్థాయిలో పంటలు, వరి నాట్లు పడటం విశేషం. ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు, మరోవైపు రాష్ట్రంలోని 30 లక్షల వ్యవసాయ బోర్లకు 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైంది. ఉచిత కరెంటు కోసం రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే భారీగా సాగు సాధ్యమైంది. రైతులకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. రికార్డు స్థాయిలో పంటలు పండించిన రైతులకు అభినందనలు తెలుపుతున్నాను. – పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు కొన్నేళ్లుగా మొత్తం యాసంగి సాగు తీరు (లక్షల ఎకరాల్లో) ఏడాది సాగు విస్తీర్ణం 2014–15 28.18 2015–16 19.92 2016–17 39.20 2017–18 38.09 2018–19 31.49 2019–20 53.82 2020–21 68.17 2021–22 54.42 2022–23 68.53 కొన్నేళ్లుగా యాసంగి వరిసాగు తీరు (లక్షల ఎకరాల్లో) ఏడాది సాగు విస్తీర్ణం 2014–15 12.23 2015–16 7.35 2016–17 23.20 2017–18 22.61 2018–19 18.34 2019–20 39.31 2020–21 52.80 2021–22 35.84 2022–23 53.08 -
వడ్లకు ర'వాన' భయం
సాక్షి, హైదరాబాద్: రోహిణి కార్తె ముగిసి రుతుపవనాలు రాష్ట్రంలోకి అడుగుపెట్టే సమయం సమీపించినా.. రాష్ట్రంలో ఇంకా యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి కాలేదు. సీజన్ మొదలైనప్పటి నుంచి తప్పుల తడక ప్రణాళికలతో సాగిన పౌరసరఫరాల శాఖ ధాన్యం సేకరణ ప్రక్రియ ముగింపు దశకు వచి్చనా గాడిన పడలేదు. దీంతో ఇప్పటికీ ఇంకా 12 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం వరి కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోనే మూలుగుతోంది. రెండు మూడుసార్లు కురిసిన అకాల వర్షాలకు నానిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు నానా తంటాలు పడ్డ రైతన్నలు.. రుతుపవనాల ప్రభావంతో కురిసే భారీ వర్షాలను తలచుకుని భయాందోళనలకు గురవుతున్నారు. కొత్త గన్నీ బ్యాగులు లేకపోయినా, పాత బ్యాగులతోనే యాసంగి కథ నడిపించిన పౌరసరఫరా శాఖ.. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు, మిల్లుల నుంచి గోడౌన్లకు రవాణా సౌకర్యాన్ని కలి్పంచేందుకు అపసోపాలు పడుతోంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోతున్నాయి. మరోవైపు మిల్లులూ ఫుల్లయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ రైతు తన వడ్లు కొనుగోలు చేయడం లేదని ఏకంగా ఐకేపీ సెంటర్ సీఈవోపైనే పెట్రోల్‌తో దాడి చేయగా, సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో రాస్తారోకోలు జరుగుతున్నాయి. పది రోజుల్లో కష్టమేనా? రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ ఇప్పటివరకు 43.70 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని 7.77 లక్షల రైతుల నుంచి సేకరించింది. రాష్ట్రంలో ఏర్పాటైన 6,584 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ పూర్తయిన 3,252 కేంద్రాలను ఇప్పటికే మూసేశారు. మరో పదిరోజుల్లో కొనుగోళ్లు పూర్తవుతాయని ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. కానీ ఇంకా 12 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం.. కొనుగోలు కేంద్రాలు, రైతుల కల్లాల్లోనే కుప్పలుగా పడి ఉంది. కిందటి యాసంగిలో ఇప్పటికే 79 ఎల్ఎంటీ ధాన్యాన్ని కొనుగోలు చేయగా... ఈసారి అందులో దాదాపుగా సగానికే పరిమితం కావడం, ఇంకా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశుల వద్ద రైతులు పడిగాపులు పడడం అధికారుల అలసత్వాన్ని చాటుతోంది. ఈ పరిస్థితిని బట్టి చూస్తే ఇప్పట్లో కొనుగోళ్లు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రవాణా లేక ఇబ్బందులు సిద్దిపేట జిల్లాలో 412 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు ధాన్యాన్ని సరఫరా చేసేందుకు ముగ్గురు కాంట్రాక్టర్లను నియమించారు. కాంట్రాక్టర్లు వాహనాలు సరిగా ఏర్పాటు చేయక పోవడంతో పాటు రైస్ మిల్లుల్లో స్థలం లేక పోవడంతో అన్ లోడ్ ఆలస్యం అవుతోంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు జోకుతున్నా, మిల్లర్ల వద్ద దించుకోవడం సమస్యగా మారింది. మిల్లులకు వెళ్లిన ట్రాక్టర్లు, లారీలు రోజుల తరబడి అన్లోడింగ్ కోసం వేచి చూసే పరిస్థితి ఇప్పటికీ సిద్దిపేట, మెదక్, ములుగు, నాగర్‌కర్నూల్, భూపాలపల్లి వంటి జిల్లాల్లో ఉంది. మరోవైపు కాంట్రాక్టు కుదుర్చుకున్న లారీలు కూడా సమయానికి రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. రైతులు సొంతంగా ట్రాక్టర్లు సమకూర్చుకొని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు పంపించినా తీసుకోవడం లేదనే ఆరోపణలు విని్పస్తున్నాయి. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు, రైతుల కల్లాల్లో 12 ఎల్ఎంటీ వరకు ధాన్యం ఉన్నట్లు అంచనా వేస్తున్న అధికారులు దాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించే విషయంలో ఎలాంటి చొరవ చూపడం లేదు. మిల్లుల్లోనే వానాకాలం ధాన్యం గత వానాకాలం సీజన్‌కు సంబంధించిన సుమారు 30 ఎల్ఎంటీల వరకు ధాన్యం కస్టమ్ మిల్లింగ్ (సీఎంఆర్) కోసం రైస్ మిల్లుల్లోనే ఉంది. దీనికి తోడు ఇప్పటివరకు 43 ఎల్ఎంటీ ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. మిల్లుల్లో జాగ లేక ప్రైవేటు గోడౌన్లలో కూడా ధాన్యాన్ని నిల్వ ఉంచారు. ఈ పరిస్థితుల్లోనే ఇంకా కొనుగోలు కేంద్రాల్లో మిగిలి ఉన్న ధాన్యాన్ని తీసుకునేందుకు మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు ధాన్యాన్ని పంపించినా, దించుకోకపోవడంతో ఓపీఎంఎస్ (ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టం) లో నమోదు కావడం లేదు. దీంతో రైతులు ధాన్యాన్ని విక్రయించినా రికార్డులకెక్కడం లేదు. లారీలు, ట్రాక్టర్లు కొనుగోలు కేంద్రాలకు రాని పరిస్థితి ఉంటే స్పందించి తగిన నిర్ణయం తీసుకోవలసిన పౌరసరఫరాల అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మిల్లుల్లో ఖాళీ లేకనే ధాన్యం తరలింపు ఆలస్యమవుతోందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. వడ్ల పైసల్ పడుతలెవ్వు .. సాధారణంగా ధాన్యం విక్రయించిన వారం రోజుల్లోపు రైతుల ఖాతాల్లోకి ధాన్యం సొమ్ము వచ్చి చేరుతుంది. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం వెళ్లిన వెంటనే ఓపీఎంఎస్ ద్వారా రైతు విక్రయించిన ధాన్యం వివరాలు ఆన్‌లైన్‌లోకి చేరతాయి. తదనుగుణంగా జిల్లా ఖజానా నుంచి రైతు బ్యాంకుల్లోకి డబ్బులు జమ అవుతాయి. అయితే ఈసారి రైతులకు ధాన్యం డబ్బులు ఆలస్యం అవుతున్నాయన్న ఫిర్యాదులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఓపీఎంఎస్లో రైతు వివరాలు చేరకపోవడమే. ఇప్పటివరకు 7.77 లక్షల మంది రైతులు రూ.8,553.79 కోట్ల విలువైన ధాన్యం విక్రయించగా, ఓపీఎంఎస్‌లోకి నమోదైన రైతుల సంఖ్య కేవలం 5.26 లక్షలే. వారికి చెల్లించాల్సిన మొత్తం 5,789.84 కోట్లు. కానీ 3.47 లక్షల మందికి మాత్రమే రూ.5,233.18 కోట్ల మేర చెల్లింపులు జరిగాయి. ఇంకా ఓపీఎంఎస్ బ్యాలెన్స్ రూ. 556.66 కోట్లు ఉండగా, ఓపీఎంఎస్‌లోకి ఎంటర్ కాని రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ.3,320.61 కోట్లుగా ఉంది. కొనుగోళ్ల తాజా స్థితి ఇదీ... ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు: 6,584 కొనుగోళ్లు ముగిసి మూతపడ్డ కేంద్రాలు: 3,252 ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం : 43.70 ఎల్ఎంటీ ఇంకా మార్కెట్‌కు రానున్న ధాన్యం (అంచనా) :12 ఎల్ఎంటీ ధాన్యం విక్రయించిన రైతులు : 7,77,013 విక్రయించిన ధాన్యం విలువ : రూ. 8,553.79 కోట్లు ఓపీఎంఎస్ అయి రైతుల ఖాతాల్లోకి చేరిన మొత్తం : రూ. 5,233.18 కోట్లు సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం అంకిరెడ్డి పల్లిలోని కొనుగోలు కేంద్రంలో రైతులు రోజుల తరబడి ధాన్యం అమ్ముకునేందుకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన వడ్ల బస్తాలను మిల్లులకు చేరవేసేందుకు లారీలు, ట్రాక్టర్లను అధికారులు సమకూర్చకపోవడంతో 15 రోజులుగా కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రైతులు అంకిరెడ్డిపల్లి వద్ద ప్రధాన రోడ్డుపై రాస్తారోకో జరిపారు. వీరానగర్ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి 15 రోజులు దాటింది. ఇప్పటికీ బస్తాలు ఇక్కడే ఉన్నాయి. వర్షం వచ్చే అవకాశం ఉన్నందున భయంగా ఉంది. రోజూ ఇక్కడే పడుకోవాల్సి వస్తోంది. – మన్నె స్వామి, రైతు, వీరానగర్, సిద్దిపేట జిల్లా -
పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి: గంగుల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ పదిరోజుల్లో పూర్తికానుందని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. 6,579 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 7.7 లక్షల మంది రైతుల నుంచి రూ.8 వేల కోట్ల విలువైన 41.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గురువారం శ్వేతపత్రం విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించకున్నా, అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకొని 13.69 కోట్ల గన్నీబ్యాగులు సేకరించి, కొనుగోళ్లు సాగిస్తున్నట్లు తెలిపారు. అకాల వర్షాలకు తడిసిన 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశామని, గోడౌన్లు, ట్రాన్స్‌పోర్టు ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు వివరించారు. జిల్లాల అంచనాల ప్రకారం కొనుగోలు కేంద్రాల్లో 7.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉండగా, కోతలు పూర్తి కావలసిన ప్రాంతాల నుంచి 4.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని మొత్తంగా 11.43 ఎల్ఎంటీ ధాన్యం రావచ్చని అంచనా వేసినట్లు చెప్పారు. -
హస్తినలో వరి యుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంగా కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు టీఆర్ఎస్ సర్కారు సిద్ధమైంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా భారీ నిరసన దీక్ష చేపట్టింది. సీఎం కేసీఆర్ ఈ దీక్షలో పాల్గొని కేంద్ర వైఖరిని ఎండగట్టనున్నారు. ఇక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు సహా రెండు వేల మందికిపైగా నిరసనలో పాల్గొననున్నారు. ఈ దీక్షకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులంతా ఆదివారం రాత్రికే ఢిల్లీకి వచ్చారు. మిగతావారు సోమవారం ఉదయం చేరుకోనున్నారు. బహుముఖ వ్యూహంతో.. రైతుల సమస్య తీర్చడంతోపాటు రాష్ట్రంలో బీజేపీకి చెక్‌పెట్టడం, జాతీయ రాజకీయాల్లోకి అరంగేట్రానికి అనుకూలతను సృష్టించుకోవడమనే బహుముఖ లక్ష్యాలతో సీఎం కేసీఆర్ చేపట్టిన ఢిల్లీ దీక్షపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీక్ష జరిగేది ఇలా.. ► ఢిల్లీలో నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి ‘తెలంగాణ రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష’గా పేరు పెట్టారు. ► ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ► మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు సహా 2 వేల మంది వరకు దీక్షలో పాల్గొంటారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ► ‘ఒకే దేశం.. ఒకే సేకరణ విధానం’ నినాదంతో పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు, జెండాల ఏర్పాటు చేశారు. ‘ఒకే దేశం.. ఒకే సేకరణ’తో.. తెలంగాణలో పండే యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల విషయంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొద్దినెలలుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. బాయిల్డ్‌రైస్ (ఉప్పుడు బియ్యం) తీసుకోబోమని.. రా రైస్ చేస్తేనే కొనుగోలు చేస్తామని కేంద్రం స్పష్టం చేయగా.. ధాన్యం కొనాల్సిందేనని టీఆర్ఎస్ సర్కారు పట్టుపడుతోంది. దీనిపై టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లోనూ డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రుల బృందం ఇటీవల కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయినా సానుకూల నిర్ణయం రాలేదు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ విస్తృతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. సోమవారం ఢిల్లీలో ‘తెలంగాణ రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష’ పేరిట ఆందోళనకు సిద్ధమైంది. ‘ఒకే దేశం.. ఒకే సేకరణ’ డిమాండ్‌తో రాష్ట్రంలో పండే ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయనుంది. ఢిల్లీలో దీక్షావేదిక రాజకీయ వ్యూహంతోనూ.. ఈ నిరసన దీక్ష ద్వారా అటు రైతులకు మేలు చేసే లక్ష్యంతోపాటు.. ఇటు రాజకీయ కోణంలోనూ టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష చూపుతోందని, రైతులను ఇబ్బందిపెడుతోందని జనంలోకి తీసుకెళ్లడం ద్వారా.. రాష్ట్రంలో ఆ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేసేలా పావులు కదుపుతోంది. ధాన్యం కొనుగోలు విషయంగా కేంద్ర ప్రభుత్వం వైఖరి చెప్పాలంటూ గత ఏడాది డిసెంబర్లో స్వయంగా సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నాకు దిగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా కేంద్రం తెలంగాణ రైతాంగాన్ని, ప్రజలను అవమానిస్తోందంటూ ఢిల్లీలోనే దీక్ష చేపడుతోంది. ఈ దీక్ష సందర్భంగా తదుపరి కార్యాచరణను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. జాతీయ రాజకీయాల్లోకి ఆరంగేట్రానికి..! దేశ పాలనలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందంటూ సీఎం కేసీఆర్ కొంతకాలంగా ప్రకటనలు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, రాజకీయ పార్టీల నేతలతో వరుసగా సమావేశమయ్యారు. తెలంగాణ సాధనకోసం దేశవ్యాప్తంగా వివిధ పార్టీల మద్దతు కూడగట్టి విజయం సాధించామని.. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీపైనా పోరు సాగించేందుకు ముందు వరుసలో ఉంటామని కూడా ప్రకటించారు. తాజాగా ఢిల్లీ దీక్ష ద్వారా దేశవ్యాప్తంగా రాజకీయపక్షాలు, ప్రజల దృష్టిని ఆకర్షించడం లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు. వారం రోజులుగా ఢిల్లీలోనే కేసీఆర్ పంటి నొప్పితో బాధపడుతున్న టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. శస్త్రచికిత్స, అనంతరం విశ్రాంతి కోసం వారం రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. ఇదే సమయంలో నిరసన దీక్ష ఏర్పాట్లపై టీఆర్ఎస్ ఎంపీలు, నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అంతా గులాబీమయం తెలంగాణ ప్రభుత్వ డిమాండ్ ఢిల్లీ అంతటా కనిపించేలా ఇండియాగేట్, తెలంగాణ భవన్ చుట్టూ దారులను హోర్డింగులు, ఫ్లెక్సీలతో నింపేశారు. ‘ధాన్యంపై కేంద్రం మొండి వైఖరి వీడాలి, మొత్తం ధాన్యాన్ని కొనాలి, రైతులను ఆదుకోవాలి’ అనే నినాదాలను వాటిపై రాశారు. ► తెలంగాణ భవన్‌లోని దీక్షావేదికను గులాబీ మయం చేశారు. కేసీఆర్, ఇతర నేతల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ధర్నా వేదిక, ప్రాంగణం ఏర్పాట్లను ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్ పర్యవేక్షించారు. ఆదివారం ఈ ఏర్పాట్లను మంత్రులు, ఎంపీలతోపాటు ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. ► తెలంగాణ భవన్, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ► ఢిల్లీకి వచ్చే ప్రజా ప్రతినిధులందరికీ మధ్యాహ్నం భోజనం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేయగా, రాత్రి ఎంపీ బీబీ పాటిల్ నివాసంలో భోజన ఏర్పాట్లు చేశారు. నేతలెవరికీ ఇబ్బందులు రాకుండా ఎంపీలు సమన్వయం చేస్తున్నారు. కేంద్రం దిగి వస్తుంది కేసీఆర్ నాయకత్వంలో చేపట్టబోయే దీక్ష చరిత్రాత్మకం అవుతుంది. వాజ్‌పేయి ప్రభుత్వహయాంలోనూ ఎఫ్‌సీఐ, కేంద్ర ఆహార మంత్రి ఇలాగే ధాన్యం కొనుగోళ్లకు నిరాకరిస్తే.. పంజాబ్ ప్రభుత్వం ఆందోళనకు దిగింది. కేంద్రం ముందుకొచ్చి కొనుగోళ్లు చేపట్టింది. కష్టపడి పండించిన పంటను అమ్ముకునే విషయంలో రైతులను క్షోభ పెట్టొద్దు. కేంద్రం మొండి వైఖరి వీడాలి. – మంత్రి నిరంజన్‌రెడ్డి బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశ ఆహార భద్రతకు ముప్పు: రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇది గుర్తుంచుకోవాలి. ఇప్పటికే రైతుల ఆందోళనతో బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంది. ధాన్యం సేకరణ విషయంలోనూ కేంద్రం మొండి వైఖరి వీడాలి. జాతీయ స్థాయిలో సమగ్ర ధాన్యం సేకరణ విధానం తేవాలి. – ఎమ్మెల్సీ కవిత -
ఇక ‘ప్రజల్లోకి’
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ ధరల పెంపుతో పాటు యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న దోబూచులాటలను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఈనెల 15 నుంచి 20 వరకు ఆరు రోజుల పాటు గ్రామాలకు బృందాలుగా వెళ్లనున్నారు. పంటపొలాలతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులతో మాట్లాడి అన్ని విషయాలను వారికి వివరించాలని కాంగ్రెస్ నేతలు, శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోళ్లను వెంటనే చేపట్టాలని కోరుతూ ఈనెల 12న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేపట్టనున్నారు. అదే రోజున టీపీసీసీ ప్రతినిధి బృందం రాష్ట్ర గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. కాగా, ఈ నెలాఖరులో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ రెండు రోజుల తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఇక ఏప్రిల్ మొదటి వారమంతా ఢిల్లీ పర్యటనలు, పార్లమెంటు సమావేశాలు, రాహుల్‌తో 40 మంది నాయకుల భేటీ, విద్యుత్‌సౌధ ముట్టడి లాంటి కార్యక్రమాలను నిర్వహించిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తాజా షెడ్యూల్‌తో ఈ నెలంతా బిజీబిజీగా గడపనున్నారు. ఓవైపు ప్రజల పక్షాన ఆందోళనలు, మరోవైపు పార్టీ అంతర్గత సర్దుబాట్లలో మమేకం కానున్నారు. -
కొట్లాడుడు.. కొనుడు..
సర్కారు ఆలోచన ఇదీ..: రాష్ట్ర రైతులు ప్రస్తుత యాసంగిలో 35 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. యాసంగి ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనబోమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గట్టిగా స్పష్టం చేసింది. ఈ క్రమంలో ధాన్యం కొనాల్సిందేనంటూ సీఎం కేసీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ నెల 11న ఢిల్లీలో వరి దీక్ష కూడా తలపెట్టారు. అయినా కేంద్రం దిగిరాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్లకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. తద్వారా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకమంటూ ఎత్తిచూపడం, బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాలన్నింటినీ తిప్పికొట్టడంతోపాటు రైతులకు అండగా నిలిచేది రాష్ట్ర ప్రభుత్వమేనన్న సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లవచ్చని భావిస్తున్నట్టు సమాచారం. సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రాన్ని దోషిగా నిలబెట్టడం.. రైతులకు అండగా నిలిచేది రాష్ట్ర ప్రభుత్వమే అన్న సందేశాన్ని జనంలోకి పంపడమే లక్ష్యంగా టీఆర్ఎస్ సర్కారు అడుగులు వేస్తోంది. అటు కేంద్రంపై పోరును కొనసాగిస్తూనే.. ఇటు రాష్ట్ర రైతులు యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. కొన్ని జిల్లాల్లో వరికోతలు ఇప్పటికే మొదలై ప్రైవేటు విక్రయాలు సాగుతున్నాయి. ఈనెల మూడో వారం నుంచి వరి కోతలు ఊపందుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 11న ధర్నా అనంతరం ధాన్యం కొనుగోళ్లపై కీలక ప్రకటన చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. మొదలైన వరి కోతలు యాసంగి వరిని బాయిల్డ్ రైస్ చేస్తే తీసుకోబోమని కేంద్రం గతంలోనే ప్రకటించింది. అయితే రాష్ట్రంలో యాసంగి ధాన్యం బాయిల్డ్ రైస్‌గా మాత్రమే పనికొస్తుందని.. ముడి బియ్యం (రా రైస్)గా మారిస్తే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ధాన్యం కొనాలని ఓ వైపు కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే.. వరిసాగు చేయవద్దని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోమని రాష్ట్ర రైతాంగానికి స్పష్టం చేసింది. అయినా రాష్ట్రంలో రైతులు 36 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈసారి వాతావరణం బాగుండటంతో దిగుబడి కూడా బాగానే వస్తుందని వ్యవసాయ శాఖ చెప్తోంది. ముందుగా నాట్లు వేసిన నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి వంటిచోట్ల ఇప్పటికే వరి కోతలు మొదలయ్యాయి. నిజామాబాద్ జిల్లా వర్ని పరిధిలోని నాలుగైదు గ్రామాల్లో 25 శాతం పంటను కోయడం, ప్రైవేటుగా విక్రయించడం కూడా జరిగింది. ఈ నెల 3వ వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ఊపందుకోనున్నాయి. మిల్లర్లు, దళారుల మాయాజాలం షురూ.. కొనుగోళ్లపై స్పష్టత రాకపోవడంతో వరి కోతలు పూర్తయిన ప్రాంతాల్లో ధాన్యం విక్రయాలపై గందరగోళం నెలకొంది. దళారులు, మిల్లర్లు మద్దతు ధరకన్నా రూ.500 వరకు తక్కువ ఇస్తున్నారు. తరుగు, తేమ అంటూ క్వింటాల్‌కు రూ.1,400 నుంచి రూ.1,500 వరకే ఇస్తున్నట్టు రైతులు చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడుతూ ‘‘తొందరపడి తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దు. ఢిల్లీ ధర్నా తరువాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం’అని రైతులకు హామీ ఇచ్చారు. పలువురు మంత్రులు కూడా ప్రైవేటు సంభాషణల్లో ఇదే విషయాన్ని చెప్తున్నా.. సీఎం కేసీఆర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని అంటున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకే.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని రైతు వ్యతిరేక సర్కార్‌గా జనం ముందు నిలబెట్టడంలో విజయం సాధించినట్టు భావిస్తున్న టీఆర్ఎస్ పెద్దలు.. ఇదే ఊపులో తాము మాత్రమే రైతాంగాన్ని ఆదుకోగలమనే సందేశం పంపేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 11న ఢిల్లీలో జరిగే ధర్నాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు పాల్గొని.. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నారు. అంతా హైదరాబాద్‌కు తిరిగొచ్చాక మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి.. పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోళ్లపై ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. గత యాసంగి కంటే వరిసాగు తగ్గడం, మిల్లర్లు, దళారుల కొనుగోళ్ల నేపథ్యంలో.. ఈసారి ప్రభుత్వ కేంద్రాలను తక్కువగానే ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కొనుగోలు ఇలా..! ► రైతులకు మద్దతుధర కింద సాధారణ ధాన్యాన్ని రూ.1,940 ధరతో, ఏ గ్రేడ్ ధాన్యాన్ని రూ.1,960 ధరతో కొనుగోలు చేసి.. ముడిబియ్యంగా మిల్లింగ్ చేయించాలనేది రాష్ట్ర సర్కారు ఆలోచన. ► గతంలో మాదిరిగా కాకుండా అవసరమైన మేరకే కొనుగోలు కేంద్రాలు తెరిచే అవకాశం. ► మిల్లర్లు ముడిబియ్యం ఎంతమేర కొంటారో చూసుకుని, మిగతా బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాలనే యోచన. ► అదనపు నూకలను ఏం చేయాలన్న దానిపై తర్జనభర్జన ► ఈ చర్యలతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,000 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా. పెరిగే నూకలను ఏం చేద్దాం? ► సాధారణంగా క్వింటాల్ ధాన్యం మిల్లింగ్ చేస్తే.. బియ్యం, నూకలు కలిపి 67 కిలోలు వస్తాయి. ఇందులో 50 కిలోల బియ్యం, 17 కిలోల నూకలు ఉండటాన్ని ఎఫ్‌సీఐ అనుమతిస్తుంది. ఈ బియ్యం, నూకలను తీసుకుని.. క్వింటాల్ ధాన్యంగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వానికి కనీస మద్ధతు ధర అయిన రూ.1,960 చొప్పున చెల్లిస్తుంది. వానాకాలం ధాన్యం మిల్లింగ్ చేసినప్పుడు ఎఫ్‌సీఐ ప్రమాణాల మేరకు బియ్యం, నూకలు వస్తాయి. దానితో సమస్య ఉండదు. ► యాసంగిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా మరో 17 కిలోల నూకలు అదనంగా వస్తాయి. అంటే సాధారణంగా వచ్చే 17 కిలోలు, ఈ 17 కిలోలు కలిపి 34 కిలోలు నూకలే వస్తాయి. మిగతా 33 కిలోలు మాత్రమే బియ్యం ఉంటాయి. ఈ క్రమంలోనే అదనపు నూకలను ఏం చేసుకోవాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. తగ్గిపోయే ఒక్కో కిలో బియ్యానికి రూ.30 చొప్పున లెక్కిస్తే.. ప్రతి క్వింటాల్ ధాన్యానికి రూ.400 నుంచి రూ.500 వరకు రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుందని అంచనా. ఈ మొత్తాన్ని సర్కారు భరించగలిగితే రైతులకు న్యాయం జరుగుతుందని మిల్లర్లు కూడా చెప్తున్నారు. సర్కారు కొనడం లేదని దళారులు వస్తున్నరు నేను ఏడెకరాలలో వరి వేసిన. ఎకరానికి 40 బస్తాల లెక్కన వచ్చింది. సర్కారు కొనడం లేదంటూ దళారులు నా దగ్గరికొచ్చి వడ్లు కొనుక్కొనిపోయిన్రు. పెట్టుబడి పోను ఎకరానికి వెయ్యి రూపాయలు కూడా మిగలలేదు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు సెంటర్లు పెట్టాలి. – శివశంకర్, జకోరా, నిజామాబాద్ జిల్లా -
అది ‘వ్యాపార’ కేంద్రం!
ఎవరిది రైతు వ్యతిరేక ప్రభుత్వం? దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతులకు నీళ్లిచ్చి, కరెంటు ఇచ్చి, రైతుబంధు ఇచ్చి, రైతు బీమా భరోసా ఇచ్చి పంటలు సాగు చేసేలా ప్రోత్సహించిన తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమా? రైతుల పంటను కొనబోమని చెప్తున్న కేంద్రానిది రైతు వ్యతిరేక ప్రభుత్వమా? కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడిన తీరు దురహంకారపూరితం. దౌర్భాగ్యం, దురదృష్టకరం. – వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ విషయంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడిన తీరు దురహంకారపూరితమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రి అత్యంత సున్నితమైన అంశంపై ఎంతో అవహేళనగా మాట్లాడారని.. తాము లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా పాతపాటే పాడారని ఆక్షేపించారు. ఈ అంశంలో సీఎం కేసీఆర్‌తో మాట్లాడాక ధాన్యం కొనుగోళ్లపై తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. గురువారం పార్లమెంట్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో మంత్రులు నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. అనంతరం నిరంజన్‌రెడ్డి తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ధాన్యం సేకరణ బాధ్యత రాజ్యాంగపరంగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని.. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి వ్యాపార ధోరణి మినహా సంక్షేమ ఆలోచన ఏమాత్రం లేదని నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. మార్కెట్లో ఏది అవసరమో అదే కొంటామన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. ‘‘పంటను ఎలా వినియోగించాలో ఆలోచించాలని, ఈ అంశంపై మేధోమథనం చేసి రైతాంగానికి దారి చూపించాలని మేం కోరితే.. అది తన పని కాదంటూ కేంద్ర మంత్రి మాట్లాడారు. వెంటనే మీడియా వద్దకు వెళ్లి రైతులను తెలంగాణ ప్రభుత్వమే తప్పుదోవ పట్టిస్తోందంటూ నిందలు వేశారు. రైతుల సమస్య పరిష్కరంపై లేని ఆతృత మీడియాతో మాట్లాడటంలో ఎందుకు? ఇది సిగ్గుమాలిన విషయం. తెలంగాణలో 35 లక్షల ఎకరా ల్లో పండే యాసంగి ధాన్యాన్ని మొత్తం కేంద్రం సేకరించాల్సిందే.. రా రైసా, బాయిల్డ్ రైసా అనేది మాకు సంబంధం లేదు. ఎట్లా పట్టించుకుంటారో మిల్లర్లతో మీరే పట్టించుకోండి. యంత్రాంగం ఉం టుంది కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఫెసిలిటేట్ చేస్తాం’’అని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. సమాఖ్య స్ఫూర్తి ఏమైంది?: ప్రధాని మోదీ 2013లో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు దేశంలో సమాఖ్య స్ఫూర్తి లేదని.. కేంద్రం వివక్ష చూపుతోందని అన్న విషయాలనే ఇప్పుడు తాము చెప్తున్నామని నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. కరోనా సమయంలో పేదలకు 6 కిలోలకు బదులుగా 60 కిలోలు బియ్యం ఇవ్వాల్సిందని.. గోదాముల్లో మురిగిపోతున్న బియ్యాన్ని పేదలకు పంచితే ఇప్పుడు ధాన్యం సేకరణకు ఇబ్బంది ఏర్పడేది కాదని పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించేందుకు ప్రధానమంత్రి స్థాయిలో ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు క్షమాపణ చెప్పే రోజు వస్తుంది ధాన్యం సేకరణ విషయంలో జరిగిన పరాభవాన్ని మరిచిపోబోమని.. తెలంగాణ ప్రజలకు కేంద్రం క్షమాపణ చెప్పే రోజు వస్తుందని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘పంజాబ్‌లో ఎలా తీసుకుంటున్నారో అలా తీసుకుంటామని కేంద్రం అంటోంది. అక్కడ యాసంగిలో వరికి బదులుగా గోధుమలు పండిస్తారన్న విషయాన్ని ఎలా మర్చిపోతున్నారు. అంటే గోధుమలను పిండిగా, పత్తిని బేళ్లు చేసి ఇస్తేనే కేంద్రం తీసుకుంటోందా? తెలంగాణలో రా రైస్ ఇస్తేనే తీసుకుంటామని ఎందుకు కొర్రీ పెడుతున్నారు? తెలంగాణలో యాసంగిలో వచ్చే వడ్లను యథాతథంగా తీసుకోవాలనే మేం కోరుతున్నాం’’అని వివరించారు. -
‘ఉప్పుడు’ నిప్పు.. పీయూష్, రాష్ట్ర మంత్రుల మధ్య వాగ్యుద్ధం
యాసంగి ధాన్యం సేకరణలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు కేంద్ర, రాష్ట్ర మంత్రుల మధ్య గురువారం హస్తినలో జరిగిన భేటీ ‘దారి’తప్పింది! ఉప్పుడు బియ్యంపై రాజకీయ నిప్పు రాజుకుంది!! పరస్పర విమర్శలు, వాగ్వాదానికి దారితీసింది!! ‘కేవలం ముడి బియ్యం ఇస్తామని చెప్పాక ఇప్పుడు కొత్త డిమాండ్లు ఏమిటి? మార్కెట్లో ఏది డిమాండ్ ఉంటే అదే కొంటాం. అలా కాదు.. ఉప్పుడు బియ్యం ఉత్పత్తే ఎక్కువగా ఉంటుందంటే మీరే కొనండి... మీరే తినండి. లేదంటే బఫర్ స్టాక్‌గా పెట్టుకోండి. దీనికి అయ్యే వ్యయాన్ని మీరే భరించండి. డిమాండ్ లేని సరుకును తీసుకొని మేమేం చేయాలి’ అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సూటిగా ప్రశ్నించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ ‘మీరు వ్యాపార ధోరణిలో మాట్లాడొద్దు. రైతుల కోణంలో దీన్ని చూడాలి. ధాన్యం ఉత్పత్తి పెరిగింది కాబట్టి దానికి అనుగుణంగా కొనాలని అంటున్నాం. దీనికి అనుగుణంగా కేంద్రం సేకరణ విధానం మార్చుకోవాలి’ అని సూచించగా ‘మీరు అధికారంలోకి వచ్చాక కొత్త విధానం తీసుకురండి’ అంటూ గోయల్ వ్యంగ్యంగా మాట్లాడినట్లు సమాచారం. దీనిపై మరో మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పందిస్తూ ‘మాకూ సమయం వస్తుంది’ అని అన్నట్లు తెలిసింది. సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి సీజన్లో ధాన్యం సేకరణకు సంబంధించి చర్చించేందుకు భేటీ అయిన కేంద్ర, రాష్ట్ర మంత్రుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వ విధానాన్ని రాష్ట్ర మంత్రులు తప్పుపడితే, డిమాండ్ లేని సరుకును మార్కెట్లో ఎలా అమ్ముతారంటూ కేంద్రమంత్రి ప్రశ్నించడంతో సమావేశంలో వేడి రాజుకుంది. ఓ దశలో ధాన్యం సేకరణ అంశం పక్కకు వెళ్లి, రాజకీయ ప్రకటనలపై ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నట్లు తెలుస్తోంది. ధాన్యం సేకరణపై జాతీయ విధానం ఉండాలని రాష్ట్ర మంత్రులంటే, మీరు అధికారంలోకి వచ్చాక కొత్త విధానం తీసుకురండంటూ పీయూష్ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలతో భేటీ మరింత వేడెక్కింది. ధాన్యం సేకరణ అంశంపై చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్.. ఎంపీలు నామా నాగేశ్వర్రావు, కేకేలతో కూడిన బృందం.. గురువారం మధ్యాహ్నం కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమయ్యింది. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ఎక్కువ సమయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించినట్లు తెలిసింది. 20 లక్షల ఎకరాల్లో వరి తగ్గించాం: నిరంజన్‌రెడ్డి తొలుత ధాన్యం సేకరణ అంశాన్ని ప్రస్తావించిన మంత్రి నిరంజన్‌రెడ్డి.. యాసంగిలో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. కేంద్రం సూచనల మేరకే 20 లక్షల ఎకరాల మేర వరి సాగును తగ్గించామని, సాగైన మేరకు ధాన్యాన్ని కేంద్రం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ ఎక్కువగా ఉంటుందని, బాయిల్డ్ రైస్‌ను తీసుకునేలా కేంద్రం విధానపరమైన నిర్ణ యం చేయాలని కోరారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కేంద్రమంత్రి.. రాష్ట్రం యాసంగిలో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాసిచ్చిన లేఖ గురించి ప్రస్తావించారు. ‘కేవలం రారైస్ ఇస్తామని చెప్పాక ఇప్పుడు కొత్త డిమాండ్లు ఏమిటి?, మార్కెట్లో ఏది డిమాండ్ ఉంటే అదే కొంటాం. అలాకాదు బాయిల్డ్ ఉత్పత్తే ఎక్కువగా ఉంటుందంటే మీరే కొనండి. మీరే తినండి. లేదంటే బఫర్ స్టాక్‌గా పెట్టుకోండి. దీనికి అయ్యే వ్యయాన్ని మీరే భరించండి. డిమాండ్ లేని సరుకును తీసుకొని మేమేం చేయాలి..’అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. వ్యాపార ధోరణిలో మాట్లాడొద్దు.. పీయూష్‌కు గట్టిగా బదులిచ్చిన నిరంజన్‌రెడ్డి.. ‘మీరు వ్యాపార ధోరణిలో మాట్లాడొద్దు. రైతుల కోణంలో దీన్ని చూడాలి. ధాన్యం ఉత్పత్తి పెరిగింది కాబట్టి దానికి అనుగుణంగా కొనమని అంటున్నాం. దీనికి అనుగుణంగా కేంద్ర విధానం మార్చుకోవాలి..’అని అన్నారు. కేంద్రమంత్రి స్పందిస్తూ.. ‘మీరు అధికారంలోకి వచ్చాక కొత్త విధానం తీసుకురండి’అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. దీంతో మాకూ సమయం వస్తుందంటూ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఘాటుగా ప్రతిస్పందించారు. పరస్పరం వీడియోలు, క్లిప్పింగ్‌ల ప్రదర్శన ఇదే సమయంలో వ్యవసాయం, రైతులకు మద్దతుగా 2013లో ప్రధాని అభ్యర్థిగా ఖరారయ్యాక గుజరాత్ అగ్రికల్చర్ సమ్మిట్‌లో మోదీ చేసిన వ్యాఖ్యల వీడియోను కేంద్రమంత్రికి రాష్ట్ర మంత్రులు చూపించారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆలోచనలు చేస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేసేలా చర్యలు తీసుకుంటామన్న మోదీ వ్యాఖ్యలను గుర్తు చేశారు. ప్రస్తు తం తెలంగాణలో వ్యవసాయానికి సంబంధించి ఓ సమస్య ఉత్పన్నమైనప్పుడు పరిష్కారం చూపాలి కదా?, సానుకూల నిర్ణయాలు చేయాలి కదా? అని అన్నారు. పీయూష్ మాట్లాడుతూ ఇది తన పరిధి కాదని, ప్రధాని స్థాయిలో నిర్ణయం చేయాలని అన్నారు. రాష్ట్ర బీజేపీ నేతల వ్యాఖ్యలను మంత్రులు భేటీలో ప్రస్తావిస్తే, సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను కేంద్రమంత్రి ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ.. ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సహా ఇతర రాష్ట్ర నేతలు ధాన్యం పండించండి. వంద శాతం కొంటామని ప్రకటనలు గుప్పిస్తున్నారు..’ అని చెప్పారు. ఆయా వ్యాఖ్యల వీడియోలు చూపించారు. కాగా ప్రధాని మోదీపై ఇటీవల సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్‌లను కేంద్ర అధికారి ఒకరు చూపించినట్టు తెలిసింది. -
ధాన్యం కొనకపోతే మద్దతు ధరకు అర్థమేముంది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు రబీ (యాసంగి) సీజన్లో పండించి విక్రయించే ధాన్యాన్ని పూర్తిస్థాయిలో సేకరించేలా కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖను ఆదేశించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. పంటను సేకరించకపోతే ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు అర్థమే లేదన్నారు. ఇది వ్యవసాయ రంగంతో పాటు మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు బుధవారం రాత్రి ప్రధానికి సీఎం లేఖ రాశారు. పంజాబ్, హరియాణ వంటి కొన్ని రాష్ట్రాల్లో ధాన్యం, గోధుమలను పూర్తిస్థాయిలో సేకరిస్తున్న కేంద్రం.. తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాల్లో భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు విభిన్నమైన విధానాలు ఉండకూడదన్నారు. జాతీయ స్థాయిలో ఆహార ధాన్యాల సేకరణకు ఒకే విధానం ఉండాలని.. నిపుణులు, సీఎంలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి జాతీయ సేకరణ విధానాన్ని రూపొందించాలని ప్రధానికి సూచించారు. లేఖలో కేసీఆర్ ఏమేం ప్రస్తావించారంటే.. ఆహార భద్రత చట్టం లక్ష్యానికి విఘాతం రాష్ట్రాల ప్రజా పంపిణీ అవసరాలను తీర్చిన తర్వా త కేంద్రమే మొత్తం ధాన్యాన్ని సేకరించాలనేది గతంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కుదుర్చుకున్న ఒప్పందం. తెలంగాణలో ఏ ధాన్యం అందుబాటులో ఉందో దాన్ని సేకరించాల్సిన బాధ్యత కేంద్రానిదే. గతంలో ఇదే ఆనవాయితీగా ఉన్నా ఆహార శాఖ రెండేళ్లుగా వరి ధాన్యాన్ని సేకరించేందుకు విముఖత చూపుతోంది. ఇది ఆహార భద్రత చట్టం లక్ష్యా న్ని ఉల్లంఘించడమే. ఈ చట్టం అమలు బాధ్యత మీదే. రాష్ట్ర ప్రభుత్వాలకు నిల్వ సామర్థ్యం, ఆహార ధాన్యాల అంతర్రాష్ట్ర తరలింపు అవకాశాల్లేవు. కాబట్టి ఆహార ధాన్యాలను సేకరించి సరఫరా చేసే బాధ్యతను ఈ చట్టం కేంద్రానికి ఇచ్చింది. తెలంగాణలో ప్రగతిశీల విధానాలు దేశంలో సగం జనాభా వ్యవసాయాన్నే ప్రధాన జీవనాధారంగా చేసుకుంది. ఇందులో భాగంగానే తెలంగాణలో వ్యవసాయ రంగంలో స్థిరమైన అధిక వృద్ధి రేటును సాధించడానికి మేం ప్రగతిశీల, రైతు అనుకూల విధానాలను అనుసరించాం. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయల కల్పన వల్ల వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. తద్వారా రైతుల ఆత్మహత్యలు, వలసలు గణనీయంగా తగ్గాయి. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాం పంటల మార్పిడి అవసరాన్ని గుర్తించి వరికి ప్రత్యామ్నాయంగా పత్తి, ఆయిల్ పామ్, ఎర్రపప్పు తదితర పంటల సాగును ప్రోత్సహించాం. తద్వారా వరి సాగు 52 లక్షల ఎకరాల నుంచి 36 లక్షల ఎకరాలకు తగ్గింది. ఈ నేపథ్యంలో రబీలో రైతులు సొంత అవసరాలకు వినియోగించుకోగా మార్కెట్‌కు వచ్చే మిగులు వరి పంటను పూర్తి స్థాయిలో కేంద్రమే సేకరించాలి. దేశం రైతుల ఆగ్రహాన్ని చవిచూసింది కేంద్రం తీసుకున్న కొన్ని అస్థిరమైన, అనిశ్చిత విధానాలు రైతుల్లో తీవ్ర నిరాశ, అసంతృప్తిని కలిగిస్తున్నాయి. గత రెండేళ్లలో దేశం మన రైతుల ఆగ్రహాన్ని చవి చూసింది. రైతు వ్యతిరేక చట్టాలను రూపొందించడం వల్ల వారు నిస్సహాయ స్థితితో తీవ్రంగా బాధపడ్డారు. రైతు ఆందోళనకు తలవంచి చివరికి ఆ చట్టాలను రద్దు చేయాల్సి వచ్చింది. -
వరి పోరు.. వదిలేది లేదు
సాక్షి, హైదరాబాద్: వరి కొనుగోలుకు సంబంధించి కేంద్రంపై తెలంగాణ ఉద్యమం తరహాలో పోరు చేస్తామన్న సీఎం కేసీఆర్.. అందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్లో జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ కార్యాచరణను ప్రకటించనున్నారు. సమావేశానికి తప్పనిసరిగా హాజరవ్వాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం తదితరులకు సంబంధిత జిల్లా మంత్రుల ద్వారా శనివారం రాత్రే ఆదేశాలు అందాయి. భేటీ ముగిశాక సీఎం నేతృత్వంలోని మంత్రుల బృందం కేంద్ర మంత్రులను కలిసేందుకు సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనుంది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీని కూడా బృందం కలవనుంది. కేంద్ర మంత్రులు, ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా ప్రస్తావించాల్సిన అంశాలకు సంబంధించిన లేఖలను సీఎస్ సోమేశ్‌కుమార్ పర్యవేక్షణలో అధికారులు సిద్ధం చేశారు. ఢిల్లీ వెళ్లే మంత్రుల బృందంలో వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌తో పాటు మరో నలుగురు మంత్రులుండే అవకాశముంది. ఉద్యమ కార్యాచరణపై ఉత్కంఠ యాసంగి వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని తీవ్రమైన సమస్యగా భావిస్తున్న కేసీఆర్.. పార్టీ నేతలు, అధికారులు, సంబంధిత రంగాల నిపుణులతో వారం రోజులు లోతుగా చర్చించినట్టు సమాచారం. దీనికి సంబంధించి కేంద్రంపై ఒత్తిడి పెంచే పోరు కార్యాచరణ షెడ్యూల్‌ను ఆయన సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై రాష్ట్ర సర్కారు చేసే ఉద్యమం ఎలా ఉంటుందోనని టీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో పాలనపై ప్రతికూల ప్రభావం పడకుండా ఆందోళనలు ఉంటాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం, శాసనసభా పక్షం, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలు ఇందిరాపార్కు వద్ద గతేడాది చివరలో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. రెగ్యులర్ ఆందోళనలు కాకుండా.. బంద్‌లు, రాస్తారోకోలు లాంటి రెగ్యులర్ ఆందోళన కార్యక్రమాలు కాకుండా కేంద్రంలోని బీజేపీని ఇరకాటంలోకి నెట్టడంతో పాటు ఇతర పార్టీలూ తమ వైఖరి చెప్పాల్సిన స్థితిలోకి నెట్టేలా ఉద్యమ కార్యాచరణ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని నిలదీసేందుకు ఢిల్లీ వేదికగా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలతో కలిసి సీఎం దీక్ష చేపట్టే అవకాశముంది. ఢిల్లీ దీక్షకు ముందు రాష్ట్రంలో వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టే ఆలోచనలో ఉన్న కేసీఆర్.. సోమవారం నాటి భేటీలో కార్యాచరణ షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. -
యాసంగిలో 10 లక్షల ఎకరాల్లోనే!
సాక్షి, హైదరాబాద్: ఈ యాసంగిలో వరి పది లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు చేసే అవకాశం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా వేశాయి. విత్తనం, ఆహార అవసరాలు, మిల్లర్లతో ఇప్ప టికే ఉన్న ఒప్పందం నేపథ్యంలో ఈ మేరకు సాగు జరిగే అవకాశం ఉందని అంటున్నాయి. కేంద్రం బాయిల్డ్ రైస్ కొనబోమని తేల్చి చెప్పడం.. యాసంగిలో వరి సాగు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ వర్గాలు ఈ అంచనాకు వచ్చాయి. అవసరాల మేరకు మినహా ఇతరత్రా సాగు పెద్దగా జరగకపోవచ్చని భావిస్తున్నాయి. వరికి బదులు ప్రత్యామ్నాయ పం టల దిశగా రాష్ట్ర రైతులు ముందుకు వెళ్తున్నా రని చెబుతున్నాయి. సీఎం కేసీఆర్ వరిసాగు విషయంలో తాజాగా మరోసారి స్పష్టత ఇవ్వడంతో.. మరోసారి వరి వేయొద్దంటూ రైతులకు చెప్పేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని వ్యవసాయ శాఖ చెబుతోంది. గతేడాది ఏకంగా 52.78 లక్షల ఎకరాల్లో..: యాసంగిలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 31.01 లక్షల ఎకరాలు. అయితే గత యాసంగిలో ఏకంగా 52.78 లక్షల ఎకరాల్లో సాగైంది. ప్రస్తుత సీజన్‌కు సంబంధించి ఈ వారంలో వరినాట్లు మొదలుకానున్నాయి. వ్యవసాయ శాఖ అంచనాల మేరకు రైతులు వరి తగ్గిస్తారా లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది. కానీ వరి కొనబోమని ప్రభుత్వం స్పష్టం చేయడంతో రైతులు రిస్క్ తీసుకోకపోవచ్చని అంటున్నారు. అదే సమయంలో సాగునీరు పూర్తిస్థాయి లో అందుబాటులో ఉండటం, ప్రతి పక్షాలు వరి కొనాల్సిందేనని సర్కారుపై ఒత్తిడి పెంచుతుండటంతో.. రైతులు ఏవిధంగా ముందుకు వెళతారన్న దానిపై కొంత సందిగ్ధత నెలకొంది. కొన్ని ప్రత్యామ్నాయ పంటల సాగు ఇప్పటికే పెరిగిందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. భారీగా మినుము సాగు: యాసంగిలో మినుము ఎక్కువగా సాగవుతోంది. మినుము సాధారణ సాగు విస్తీర్ణం 24,018 ఎకరాలు కాగా, ఇప్పటికే 54,331 ఎకరాల్లో సాగవడం గమనార్హం. అంటే ఏకంగా 225 శాతం ఎక్కువగా ఈ పంట సాగైందన్నమాట. అది 70 వేల ఎకరాలకు చేరు కోవచ్చని అంటున్నారు. కేంద్రం కూడా మినుము సాగు పెం చాలని చెప్పడం, మద్దతుధర కంటే మార్కెట్లో ఉన్న ధర ఎక్కువుంటే అంతే ధర పెట్టి రైతుల వద్ద కొనా లని సూచించడంతో ఈ పంట వైపు వెళ్తున్నారని చెబుతున్నారు. మరోవైపు కుసుమ సాగు కూడా పెరిగింది. దీని సాధారణ సాగు విస్తీర్ణం 7,609 ఎకరాలు కాగా, ఇప్పటివరకు 8,459 (111%) ఎకరాల్లో సాగైందని వ్యవసాయశాఖ తెలిపింది. ఇతర పంటల సాగు ఇలా.. శనగ సాధారణ సాగు విస్తీర్ణం 2.84 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.47 లక్షల (87%) ఎకరాల్లో సాగు చేశారు. వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.01 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.80 లక్షల (93%) ఎకరాల్లో సాగయ్యింది. మొక్కజొన్న ఇప్పటివరకు 81,640 (19%) ఎకరాల్లో (సాధారణ సాగు విస్తీర్ణం 4.32 లక్షల ఎకరాలు), జొన్న 22,206 (30%) ఎకరాల్లో (సాధారణ సాగు విస్తీర్ణం 75,274 ఎకరాలు), పెసర 7,090 (33%) ఎకరాల్లో (సాధారణ సాగు విస్తీర్ణం 21,488 ఎకరాలు) సాగయ్యింది. విత్తనాల కొరత కారణంగా పొద్దు తిరుగుడు విస్తీర్ణం పెరగకపోవచ్చని అంటున్నారు. ఈ పంట ఇప్పటివరకు 3,320 (30%) ఎకరాల్లో (సాధారణ సాగు విస్తీర్ణం 10,947 ఎకరాలు) సాగయ్యింది. -
వరికి రుణంపై కిరికిరి..
సాక్షి, హైదరాబాద్: యాసంగిలో వరిసాగుపై కొనసాగుతున్న సందిగ్ధత పంట రుణాలపై ప్రభావం చూపిస్తోంది. కొన్నిచోట్ల బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. వరి వేయొద్దని ప్రభుత్వం చెబుతుం టే, ఆ పంటకు తాము రుణం ఎలా ఇస్తామని బ్యాంకు అధికారులు ప్రశ్ని స్తున్నారు. ఇతర పంటలు వేస్తే ఇస్తామంటున్నారు. ఒకపక్క వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు యాసంగిలో రైతులకు వరి విత్తనాలు అమ్మొద్దంటూ కంపెనీలను హెచ్చరిస్తున్నారు. అమ్మితే లైసెన్సులు రద్దు చేస్తామంటూ డీలర్లకు వార్నింగ్ ఇస్తున్నారు. మరోవైపు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఉన్నతస్థాయి ఆదేశాలు ఏవీ రాకపోయినా, అక్కడక్కడ కొందరు బ్యాంకర్లు ఇలా వ్యవహరించడంపై వ్యవసాయ శాఖకు ఫిర్యాదులు వస్తున్నాయి. స్పష్టత లేకపోవడంతో.. యాసంగి ప్రారంభమై రెండు నెలలు కావొస్తోంది. ఈ సీజన్లో వరి వేయవద్దని, మిల్లర్లతో ఒప్పందాలు చేసుకున్నవారు మాత్రమే వేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. కానీ వ్యవసాయ శాఖ ఇప్పటివరకు ఎలాంటి పంటల ప్రణాళిక విడుదల చేయలేదు. గత యాసంగిలో ఏకంగా 52.78 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అయితే ఈసారి వరి వద్దంటున్న ప్రభుత్వం.. సాగు విస్తీర్ణం ఎంతమేరకు తగ్గించనుందో స్పష్టత ఇవ్వలేదు. దీంతో రైతులు, బ్యాంకర్లలో అయోమయం నెలకొంది. ప్రత్యామ్నాయ పంటలు వేయాలటూ కొన్ని పంటలను సర్కారు సూచించినా.. ఆయా విత్తనాలు సరిపడా సరఫరా చేసే పరిస్థితి లేదు. ఈ విషయంపై రైతులు అడుగుతున్నా ఏఈవోలు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ప్రస్తుత పరిస్థితి పంట రుణాల మంజూరుపైనా ప్రభావం చూపిస్తోంది. వారం పదిరోజుల్లో వరినాట్లు! 2021–22 రెండు సీజన్లలో రూ.59,440 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో ఈ వానాకాలం సీజన్ లక్ష్యం రూ. 35,665 కోట్లు కాగా, యాసంగిలో రూ.23,775 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ యాసంగిలో ఇప్పటివరకు రూ.4,755 కోట్ల (20%) వరకు మాత్రమే పంట రుణాలు ఇచ్చారని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. పంటల సాగుపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చాక రుణాలు ఇస్తామని బ్యాంకర్లు చెబుతున్నారని కొన్ని ప్రాంతాల రైతులు వాపోతున్నారు. వచ్చేనెల మొదటి వారం అంటే వారం పది రోజుల్లో వరి నాట్లు మొదలవ్వాల్సి ఉండగా.. ఇప్పటికీ రుణాలు ఇవ్వకపోతే ఎలాగని రైతులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకులు సహకరించకపోవడంతో చాలాచోట్ల రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పంట రుణాల మంజూరును ఎప్పటికప్పుడు సమీక్షించి పరిస్థితిని చక్కదిద్దాల్సిన వ్యవసాయ శాఖ యంత్రాంగం పట్టనట్టు వ్యవహరిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలపైనా.. వరికి బదులు ప్రభుత్వం వేరుశనగ, శనగ, పెసర, మినుములు, ఆవాలు, నువ్వులు, కుసుమలు, ఆముదాలు, పొద్దుతిరుగుడుతో పాటు జొన్న సాగు చేయాలని చెబుతోంది. అయితే ఏపంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలో ఇప్పటివరకు చెప్పలేదు. సబ్సిడీ విత్తనాలు ఇవ్వలేదు. ఇతర ఏర్పాట్లు ఏవీ చేయలేదు. ఎరువులూ సరిపడా సరఫరా కాలేదు. ఇలా యాసంగి సీజన్ మొత్తం గందరగోళంగా, రైతుకు పరీక్షగా మారింది. -
ఉల్లి: ఒక్క ఎకరాలోనూ పంట వేయని రైతులు
సాక్షి, హైదరాబాద్/జోగుళాంబ గద్వాల/ వరంగల్ రూరల్: ఉల్లి విషయంలో తెలంగాణ ఇప్పటికీ ఇతర రాష్ట్రాలపైనే ఆధారపడుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. అక్కడ ఏమాత్రం తేడా వచ్చినా, ఇక్కడ ఉల్లికి రెక్కలు వస్తాయి. నల్లబజారుకు వెళ్లడమే కాకుండా అధిక ధర పలుకుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉల్లి సాగును ప్రోత్సహించాలని మూడు నాలుగేళ్లుగా అధికారులు కసరత్తు చేస్తూనే ఉన్నారు. కానీ అవి ఫలితాలు ఇవ్వకపోగా, పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రస్తుత యాసంగి సీజన్లో రాష్ట్రంలో రైతులు ఒక్క ఎకరాలో కూడా ఉల్లి సాగు చేయకపోవడం ఆందోళన కలిగించే అంశం. ప్రతి ఏడాది యాసంగిలో రాష్ట్రంలో ఎంతోకొంత సాగవుతున్నా, ఈసారి ఒక్క ఎకరాలోనూ వేయలేదు. యాసంగిలో ఉల్లి సాధారణ సాగు విస్తీర్ణం 21,869 ఎకరాలు కాగా, గతేడాది 9,536 ఎకరాల్లో సాగైంది. కానీ ఈ ఏడాది ఒక్క ఎకరాలోనూ సాగు లేదని వ్యవసాయ శాఖ తాజా నివేదికలో వెల్లడించింది. ఈ సమయానికి సాధారణంగా 9,405 ఎకరాల్లో ఉల్లి సాగవ్వాలి. కానీ రైతులు ఉల్లి సాగుపై ఆసక్తి చూపించడంలేదని ఉద్యాన శాఖ వర్గాలు చెబుతున్నాయి. నెలకు 42,400 మెట్రిక్ టన్నులు అవసరం మార్కెట్ అంచనా ప్రకారం ప్రతి ఏడాది రాష్ట్రంలో 5.08 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డ అవసరం పడుతుంది. అంటే నెలకు 42,400 మెట్రిక్ టన్నులు. అయితే ఉల్లి విత్తనాలకు రాయితీ కల్పించకపోవడం, మద్దతు ధర లేకపోవడం, సరైన మార్కెటింగ్ సౌకర్యాలు సృష్టించకపోవడంతో రైతులు ఉల్లి సాగుపై ఆసక్తి చూపడం లేదు. అంతేగాక ఉత్పాదకత అత్యంత తక్కువగా ఉండటం, నాణ్యమైన విత్తనాలకు ఎక్కువ ధర పలకడం, చీడపీడల బెడద అధికంగా ఉండటం, వాటికి అవసరమైన ఎరువులు, పురుగు మందుల ధరలు ఆకాశాన్ని అంటడం, వాటి ధరల నిర్ధారణ పూర్తిగా మాఫియా చేతుల్లోనే ఉండటం వల్ల ఇటువంటి పరిస్థితి నెలకొంటోందని మార్కెటింగ్ శాఖ ఇటీవల ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపింది. 39.26 లక్షల ఎకరాల్లో వరి సాగు యాసంగి పంటల సాగు విస్తీర్ణం రాష్ట్రంలో భారీగా పెరిగింది. సాగునీటి వనరులు పెరగడంతో సాగు పెరిగినట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. ఈ సీజన్లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 36.93 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే ఏకంగా 50.35 లక్షల ఎకరాలకు చేరుకోవడం విశేషం. సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే 136.34 శాతం అధికంగా పంటలు సాగయ్యాయి. అన్ని పంటల కంటే వరి విస్తీర్ణం ఎక్కువగా పెరగడం (176.93%) విశేషం. యాసంగి సాధారణ సాగు విస్తీర్ణం కంటే 176.93% అధికంగా నాట్లు పడడంపై వ్యవసాయ శాఖ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు పప్పు ధాన్యాల విస్తీర్ణం కూడా పెరిగింది. సాధారణ సాగు విస్తీర్ణం 3.03 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3.73 లక్షల (122.71%) ఎకరాల్లో సాగయ్యాయి. ఇక నూనె గింజల సాధారణ సాగు విస్తీర్ణం 3.73 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.50 లక్షల (66.95%) ఎకరాల్లో సాగైంది. వరంగల్ రూరల్ జిల్లాలో 215% సాగు వరంగల్ రూరల్ జిల్లాలో యాసంగి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. జిల్లాలో యాసంగి సాధారణ సాగు విస్తీర్ణం 79,867 ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.72 లక్షల (215.83%) ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 76,467 ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.51 లక్షల (198.35%) ఎకరాల్లో సాగు జరిగింది. అత్యంత తక్కువగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సాగైంది. ఆ జిల్లా సాధారణ పంటల సాగు విస్తీర్ణం 26,488 ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 21,223 (80.12%) ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. యాసంగిలో పంటల సాగు వివరాలు (లక్షల ఎకరాలు) పంట సాధారణం సాగైంది వరి 22.19 39.26 శనగ 2.48 2.96 వేరుశనగ 3.05 1.90 మొక్కజొన్న 4.04 3.16 జొన్న 0.67 0.92 ధర వస్తుందో, రాదోనని.. ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు సింగిరెడ్డి మొగిలి. వరంగల్ రూరల్ జిల్లా సం గెం మండలం నార్లవాయికి చెందిన ఈయన ఏటా 20 గుంటల భూమిలో ఉల్లి సాగు చేస్తాడు. గతేడాది పంట కుళ్లు తెగులు, మార్కెట్ సౌకర్యం, ధర లేకపోవడం, అధిక వర్షాల తో నష్టపోయిన ఈయన ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఆందోళనతో సాగుకు ఆసక్తి కనబర్చలేదు. కేవలం 10 గుంటల భూమిలోనే ఉల్లి సాగుకు పెట్టుబడి పెట్టానని చెప్పాడు. గతేడాది రూ.3 లక్షలు నష్టపోయా గత యాసంగిలో 4 ఎకరాలు, ఖరీఫ్‌లో 2 ఎకరాలు సాగు చేశాను. ఖరీఫ్‌లో సాగుచేసిన పంట క్వింటాల్ రూ.600 కు అమ్మాను. మార్కెటింగ్ లేక, వర్షాల వల్ల రెండు సీజన్లలో ఉల్లి సాగుచేసి రూ.3 లక్షల వరకు నష్టపోయాను. ధర నిలకడగా లేకపోవడంతో ఈ ఏడాది యాసం గిలో నాతో పాటు మా గ్రామంలోని 30 మంది రై తులు ఉల్లి జోలికి వెళ్లలేదు. ఉల్లికి కూడా ప్రభుత్వం మద్దతు ధరనివ్వాలి. – ఖాజామియా, కొంకల, వడ్డేపల్లి మండలం, జోగుళాంబ గద్వాల జిల్లా వర్షం ఎక్కువై సాగు చేయలేదు పోయినేడాది మూడు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాను. ఈ ఏడాది కూడా సాగు చేసేందుకు రూ.10వేలతో ఉల్లి విత్తనాలు తెచ్చి, 25 నార బేడ్లు పోశాను. దురదృష్టం కొద్దీ వర్షం ఎక్కువగా కురిసింది. పొలంలో గడ్డి విపరీతంగా పెరిగిపోయింది. సరైన సమయానికి కూలీలు దొరకకపోవడంతో పొలం బీడుగా మారింది. – మద్దిలేటి, గోకులపాడు, మానవపాడు మండలం, జోగుళాంబ గద్వాల జిల్లా చదవండి: పాలకూర మొక్కలతో ఈ–మెయిళ్లు పంపొచ్చు! -
ఖరీఫ్‌ను మించి 'యాసంగిలో'..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి సీజన్లో వరి ధాన్యం మార్కెట్లను ముంచెత్తనుంది. విస్తారంగా కురిసిన వర్షాలతో నిండిన ప్రాజెక్టుల ద్వారా పుష్కలంగా నీటి సరఫరా జరగడం, చెరువుల కింద సాగు విస్తీర్ణం పెరగడంతో ధాన్యం దిగుబడి గత ఖరీఫ్ కంటే అధికంగా ఉండనుంది. ఈ యాసంగిలో ఏకంగా 59 లక్షల టన్నుల మేర ధాన్యం సేకరించే అవకాశం ఉంటుందని పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖలు అంచనా వేస్తున్నాయి. ఇది గత ఖరీఫ్ లో సేకరించిన దానికన్నా ఏకంగా 12 లక్షల టన్ను లు అధికంగా వచ్చే అవకాశం ఉండటం విశేషం. రాష్ట్రంలో ఈ ఏడాది యాసంగిలో విస్తృతంగా వరి సాగు జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతల జరిగి ఎస్సారెస్పీ పూర్తి ఆయకట్టుకు నీరు అందడం, నాగార్జునసాగర్, ఇతర మధ్యతరహా ప్రాజెక్టుల కింద నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో సాగునీటి ప్రాజెక్టుల కింద వరిసాగు పెరిగింది. గతేడాది యాసంగిలో మొత్తంగా 18.57 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరిసాగు జరగ్గా ఈ ఏడాది అది ఏకంగా 28.55 లక్షల ఎకరాలకు పెరిగింది. 10 లక్షల ఎకరాల మేర సాగు పెరగడంతో ఈ సీజన్లో వరి ధాన్యం భారీగా మార్కెట్లోకి వ స్తుందని అంచనా. గతేడాది యాసంగిలో పౌరసర ఫరాల శాఖ 37 లక్షల వరి ధాన్యాన్ని కొనుగోలు చే సింది. మొన్నటి ఖరీఫ్‌లో 47.11 లక్షల టన్నులు సేకరించింది. అయితే ఈ యాసంగిలో రాష్ట్ర చరిత్ర లో ఎన్నడూ లేనంతగా ఏకంగా 59 లక్షల టన్నులు సేకరించాల్సి ఉంటుందని పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖలు అంచనా వేశాయి. ఖరీఫ్‌కన్నా ఏకంగా 12 లక్షలు, గతేడాది యాసంగికన్నా 22 లక్షల టన్నుల మేర అధికంగా వచ్చే అవకాశాల నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లకు సిద్ధమయ్యాయి. ఖరీఫ్ లోనే 3,670 కొనుగోలు కేంద్రాలు, 12 కోట్ల గోనెసంచులు అందుబాటులో ఉంచగా ఈ ఏడాది అం తకుమించి ఏర్పాటు చేయాల్సి ఉంటుందని శాఖలు తేల్చాయి. కొనుగోలు కేంద్రాల సంఖ్యను 4 వేలకు పెంచే అవకాశాలున్నాయి. ఇక ఖరీఫ్‌లో రూ. 8,626 కోట్లు సేకరణకు వెచ్చించగా ఈ సీజన్లో రూ. 10 వేల కోట్లు అవసరం ఉంటుందని లెక్కిస్తున్నారు. ఈ సీజన్లో సైతం క్వింటాలు గ్రేడ్–ఏ వరి ధాన్యానికి రూ.1,835, కామన్ వెరైటీకి రూ. 1,815 చొప్పున అందించనున్నారు. రైతులకు అవగాహన: యాసంగి ధాన్యం సేకరణపై సన్నాహక సమావేశాన్ని సోమవారం వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖలు నిర్వహించనున్నాయి. ఈ భేటీకి మంత్రులు గంగుల కమలాకర్, నిరంజన్‌రెడ్డితోపాటు ఇరు శాఖల అధికారులు హాజరుకానున్నారు. ధాన్యం విక్రయంపై రైతులకు అవగాహన కల్పిస్తూ నాణ్యత, పరిమాణం విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరించేలా వ్యవసాయ శాఖను ధాన్యం సేకరణలో భాగస్వామిని చేయనున్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఏఈఓను ఇన్చార్జిగా నియమించడం, పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం మార్కెట్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటి అంశాలపై చర్చించనున్నారు. -
యాసంగి జోష్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులైన నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల కింద పంటల సాగు మొదలుపెట్టిన రైతాంగానికి శుభవార్త. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటితో యాసంగిలో కనిష్టంగా 7 లక్షల ఎకరాలకు.. సాధ్యమైతే గరిష్టంగా 9 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొంది స్తోంది. ప్రాజెక్టుల్లో లభ్యత నీరు, తాగునీటి అవసరా లకు పక్కనపెట్టగా సాగుకు మిగిలే నీటి వివరాలను సిద్ధం చేసిన నీటిపారుదలశాఖ... యాసంగి పంట లకు నీటి విడుదలకు సానుకూలత వ్యక్తం చేసింది. అయితే నీటిని ఎన్ని విడతలుగా విడుదల చేయాలి? ఎప్పటి నుంచి నీటి విడుదల కొనసాగించాలి? వంటి అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించాక నీటి విడుదల షెడ్యూల్ ఖరారు చేయాలని నిర్ణయించింది. ఆయకట్టుకు ఆయువు... నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల పరిధిలో చెప్పుకోదగ్గ స్థాయిలో నీటి లభ్యత ఉన్న దృష్ట్యా అక్కడ తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇస్తూనే మిగతా నీటిని యాసంగి అవసరాలకు ఇవ్వాలని నీటిపారుదల శాఖ నిర్ణ యించి తదనుగుణంగా ప్రణాళిక రచించింది. దాని ప్రకారం సాగర్‌లో ప్రస్తుతం కనీస నీటిమట్టానికి ఎగువన లభ్యతగా ఉన్న 76.13 టీఎంసీల్లో తాగునీటి అవసరాలను పక్కనపెట్టి సాగర్ ఎడమ కాల్వ కింద 25 టీఎంసీలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ నీటితో వరి వంటి పంటలకైతే 3 లక్షల ఎకరాల వరకు నీరిచ్చే అవకాశాలు న్నాయి. ఒకవేళ వారా బందీ పద్ధతిన, ఆరుతడి పంటలకు నీళ్లిచ్చిన పక్షంలో 4.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే అవకాశాలు న్నాయి. 2016–17 యాసంగిలో సాగర్ కింద 28.94 టీఎంసీల నీటితో 4.14 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వగలిగారు. గతేడాది యాసంగిలో 46.36 టీఎంసీల నీటితో 5.28 లక్షల ఎకరాలకు నీరందించారు. అయితే ప్రస్తుతం సాగర్ కాల్వల ఆధునీకరణ వంద శాతం పూర్తయిన నేపథ్యంలో ఒక టీఎంసీ నీటితో 13 వేల ఎకరాల వరకు నీరందించే అవకాశం ఉంటుందని, అలా అయితే 3.25 లక్షల ఎకరాల్లో వరి లాంటి నీటి ఆధారిత పంటలకు నీరివ్వొచ్చని అధికారులు అంచనా వేశారు. అదే ఆరుతడి పంటలయితే 4.50 లక్షల ఎకరాలకు నీరివ్వవచ్చని భావిస్తున్నారు. గతంలో నీటి విడుదల ఆరుతడి పంటల పేరుతో సాగినా రైతులు మాత్రం వరి సాగు చేయడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులతో పూర్తి స్థాయిలో చర్చించాకే నీరందించే ఆయకట్టును నిర్ణయించనున్నారు. గతంలో సాగర్ కింద నీటి విడుదలను 8 తడుల్లో ఇవ్వగా ప్రస్తుతం ఆయకట్టు విస్తీర్ణాన్నిబట్టి ఎన్ని తడులు ఇచ్చేది నిర్ణయం కానుంది. ఎస్సారెస్పీలో 34 టీఎంసీల నీరు... శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించగా ప్రస్తుతం యాసంగికి నీటి విడుదల డిమాండ్లు మొదలయ్యాయి. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 33.55 టీఎంసీల మేర నీటి లభ్యత ఉండగా ఇందులో 4.35 టీఎంసీల నీరు మిషన్ భగీరథకు అవసరం కానుంది. ఇవి పోనూ మరో 20 టీఎంసీల మేర నీరు ఎస్సారెస్పీ కింద ఆన్‌అండ్ ఆఫ్ పద్ధతిన 5 తడుల్లో నీటిని ఇవ్వగలిగితే 3.91 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చు. దీంతోపాటే మరో 2 టీఎంసీలు అలీసాగర్, గుత్పకు ఇవ్వగలిగితే రెండు తడుల ద్వారా 35 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశాలున్నాయి. అలాగే లోయర్ మానేరు డ్యామ్‌లో ప్రస్తుతం 8.45 టీఎంసీల నీటి లభ్యత ఉండగా ఇందులో 4.10 టీఎంసీలు తాగునీకి పక్కనపెట్టినా మిగతా నీటిలో 2 టీఎంసీలు మిడ్‌మానేరుకు వదిలే అవకాశం ఉంటుంది. అదే జరిగితే మిడ్‌మానేరులో నీటి నిల్వలు 6.72 టీఎంసీలకు పెరగనుండగా అందులో 4.15 టీఎంసీల నీటిని భూగర్భ జలాల ఆధారంగా సాగు చేసిన 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు రెండు తడులుగా ఇచ్చే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు తెలిపాయి. ఎటు చూసినా సాగర్, ఎస్సారెస్పీ పరిధిలో కనిష్టంగా 7 లక్షల ఎకరాల నుంచి గరిష్టంగా 9 లక్షల ఎకరాల మేర సాగుకు నీరిచ్చే అవకాశం ఉంది. దీనిపై ఆయకట్టు పరీవాహక నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చించాక నీటి విడుదలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. 60 టీఎంసీలు అవసరం... కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న జలాల్లోంచి రాష్ట్ర అవసరాలకు 60 టీఎంసీలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. ఈ మేరకు ఈఎన్సీ మురళీధర్ కృష్ణా బోర్డుకు గురువారం లేఖ రాశారు. ప్రస్తుత లెక్కల ప్రకారం కనీస నీటి మట్టాలకు ఎగువన శ్రీశైలంలో 17.12 టీఎంసీలు, సాగర్‌లో 76.13 టీఎంసీలు కలిపి మొత్తం 93.25 టీఎంసీలు లభ్యతగా ఉన్నాయని తెలిపారు. ఈ నీటిలో నిర్ణీత వాటాల మేరకు తెలంగాణకు 60.39 టీఎంసీలు, ఏపీకి 32.87 టీఎంసీలు దక్కుతాయని వివరించారు. రాష్ట్రానికి దక్కే వాటా నీటిలో శ్రీశైలం పరిధిలో ఆగస్టు వరకు మిషన్ భగీరథకు 5 టీఎంసీలు, కల్వకుర్తికి 6 టీఎంసీలు, సాగర్ పరిధిలో మిషన్ భగీరథకు 9 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 12 టీఎంసీలు, ఏఎంఆర్పీ కింద చెరువులు నింపేందుకు 3 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వ కింద రబీ అవసరాలకు 25 టీఎంసీలు వాడుకుంటామని తెలిపారు. ఈ అవసరాల దృష్ట్యా 60 టీఎంసీల నీటి కేటాయింపునకు అనుకూలంగా ఆదేశాలివ్వాలని కృష్ణా బోర్డును ఈఎన్సీ కోరారు. -
ధాన్యం బంపర్.. ధరల టెన్షన్
- యాసంగిలో మూడున్నర రెట్లు పెరిగిన దిగుబడి - గత యాసంగిలో 7,21,000 టన్నులు - ప్రస్తుతం 26,41,000 టన్నులు - ప్రభుత్వ తాజా నివేదికలో వెల్లడి - గిట్టుబాటు ధరపైనే ఆందోళన - రైతును వెంటాడుతున్న గత ఖరీఫ్ భయం సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో యాసంగి పంట పండింది. వరి ధాన్యం రాశులు వెల్లువెత్తుతున్నాయి. భూగర్భ జలాలు పెరగడం, సాగు విస్తీర్ణం పెరగడంతో యాసంగి మురిసిపోతోంది. 2015–16 యాసంగిలో ధాన్యం 7.21 లక్షల టన్నులు దిగుబడి రాగా, ఈ యాసంగిలో ఏకంగా 26.41 లక్షల టన్నులకు పెరిగింది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా మూడున్నర రెట్లు ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం తాజాగా అంచనా వేసింది. యాసంగి సాధారణ పంటల సాగు విస్తీర్ణం 29.86 లక్షల ఎకరాలు కాగా.. ఈ యాసంగిలో ఏకంగా 38.01 లక్షల (127%) ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో వరి 21.39 లక్షల ఎకరాల్లో సాగు కావడం గమనార్హం. గోదావరి జిల్లాలను తలదన్నేలా ధాన్యం దిగుబడులు వస్తున్నాయి. వరితో పాటు పప్పుధాన్యాల దిగుబడి కూడా గణనీయంగా పెరిగింది. గత యాసంగిలో పప్పుధాన్యాల దిగుబడి 60 వేల టన్నులు కాగా, ఈ యాసంగిలో 1.48 లక్షల టన్నులకు పెరిగింది. గత యాసంగిలో వేరుశనగ 1.45 లక్షల టన్నులు దిగుబడి రాగా, ఈ యాసంగిలో 2.44 లక్షల టన్నుల్లో దిగుబడులు రానున్నాయి. దాంతోపాటు మొక్కజొన్న గత యాసంగిలో 4.25 లక్షల టన్నులు పండగా, ఈ యాసంగిలో 7.80 లక్షల టన్నులు పండింది. గత యాసంగిలో శనగ 48 వేల టన్నుల దిగుబడులు రాగా, ఈ యాసంగిలో 1.24 లక్షల టన్నులు దిగుబడులు వచ్చాయి. ఇలా అన్ని రకాల ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గిట్టుబాటు ధరపైనే ఆందోళన.. గిట్టుబాటు ధర రైతును ఆందోళనకు గురిచేస్తోంది. ఖరీఫ్ పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు కుదేలయ్యాడు. ఇదే దుస్థితి రబీ పంటలకూ వస్తుందన్న ఆందోళన రైతును వేధిస్తోంది. ఖరీఫ్‌లో 2.44 లక్షల టన్నుల కంది ఉత్పత్తి జరిగిందని ప్రభుత్వం తెలిపింది. గతేడాది కందికి మార్కెట్లో క్వింటాలుకు రూ.10 వేల వరకు ధర పలకగా, ఈ ఏడాది రూ.4 వేలకు పడిపోయింది. ప్రభుత్వం రూ.5,050కి గిట్టుబాటు ధరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా చాలా మంది రైతులు వ్యాపారుల దోపిడీకి గురయ్యారు. గతేడాది ఖరీఫ్‌లో 2.61 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ప్రభుత్వ అంచనా ప్రకారం దాదాపు 3.17 లక్షల టన్నుల మిర్చి ఉత్పత్తి అయింది. ఉత్పత్తి గణనీయంగా ఉన్నా ధర మాత్రం పడిపోయింది. 2015–16 ఖరీఫ్‌లో పండిన మిర్చి ధర మార్కెట్లో క్వింటాలుకు రూ.12 వేల వరకు పలకగా, ఈ ఏడాది ఏకంగా రూ.4,500 వరకు పడిపోయింది. మిర్చిని రూ.7 వేల కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేలా అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు ఎలాంటి స్పందనా లేదు. ఆలస్యంగా కేంద్రం అనుమతిస్తే వ్యాపారులకే గిట్టుబాటు ధర లభిస్తుందన్న విమర్శలున్నాయి. రబీ ధాన్యం కొనుగోలుపై కేంద్రీకరించాలి.. రబీలో వరికి గిట్టుబాటు ధర దక్కేలా పూర్తి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వరికి కనీస మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం 3,076 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా, అవి పూర్తి స్థాయిలో రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలి. వరి ఏ గ్రేడ్ రకం ధర క్వింటాలుకు రూ.1,510, సాధారణ రకం ధర రూ.1,470 మద్దతు ధర ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మిర్చితో నష్టపోయాం: ఇందుర్తి రంగారెడ్డి, పోచారం, ఖమ్మం జిల్లా మిర్చికి సరైన ధర రాక పెద్ద ఎత్తున నష్టపోయాను. కాలం కలిసొచ్చిందన్న సంతోషం లేకుండా పోయింది. వ్యాపారుల దగా వల్ల మిర్చికి గిట్టుబాటు ధర రాకుండా పోవడంతో అప్పులే మిగిలాయి. కనీసం రబీలో పండించిన వరికైనా ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి. గిట్టుబాటు ధర కల్పించాలి: యాదయ్య, రైతు, మిడ్జిల్ (మహబూబ్‌నగర్) ఈ ఏడాది పెట్టుబడి ఖర్చులు తడిసి మోపెడయ్యింది. దిగుబడులేమో ఆశించినంతగా లేవు. కాలం లేక పంటలన్నీ ఎండిపోతున్నయి. నాలుగు గంటల సేపు బోరు నడిస్తే అర ఎకరం పొలం కూడా పార్తలేదు. పశువులకు కొంత గడ్డి పండుతదని వరి పంట ఏసినం. నాలుగు గింజలు పండుతున్నయి. కాస్త రేటు కల్పించి మమ్ముల్ని ఆదుకోవాలి. ప్రభుత్వమే ఆదుకోవాలి: వెంకట్‌రెడ్డి, రైతు, మున్ననూర్, మహబూబ్‌నగర్ ఈ ఏడాది పంటలకు సరైన గిట్టు బాటు ధరలు దక్కట్లేదు. మొక్కజొన్న, పత్తి, కంది, మిర్చికి సరైన ధరలు లభించక పోవడంతో తీవ్రంగా నష్టపోయినం. పెట్టుబడులు ఎల్లని దుస్థితి నెలకొంది. పెట్టిన పెట్టుబడి కూడా ఎల్తలేదు. ప్రభుత్వం వరి విషయంలోనైనా మంచి ధరలు లభించేలా చర్యలు తీసుకుని ఆదుకోవాలి. ప్రతి గింజా కొనుగోలు చేస్తాం: మంత్రి హరీశ్‌రావు రబీలో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గణనీయంగా మార్కెట్లోకి వరి ధాన్యం వస్తుందని ఆశిస్తున్నాం. రాష్ట్రంలో ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. జాయింట్ కలెక్టర్లను పర్యవేక్షణ చేయమన్నాం. ఎఫ్‌సీఐని, మిల్లర్లను కూడా సిద్ధంగా ఉండాలని చెప్పాం. గన్నీ బ్యాగులను సేకరించి పెట్టుకున్నాం. పక్క రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చి నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో ధాన్యం కొంటున్నారు. దానివల్ల పోటీ పెరిగి రైతులకు ఉపయోగపడుతుంది. ప్రతి గింజా కొనేందుకు ఏర్పాట్లు చేశాం.