వడ్లకు ర'వాన' భయం | Rain Threat To Yasangi Season Grain Purchases In Telangana | Sakshi
Sakshi News home page

వడ్లకు ర'వాన' భయం

Published Tue, Jun 7 2022 3:15 AM | Last Updated on Tue, Jun 7 2022 3:17 PM

Rain Threat To Yasangi Season Grain Purchases In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రోహిణి కార్తె ముగిసి రుతుపవనాలు రాష్ట్రంలోకి అడుగుపెట్టే సమయం సమీపించినా.. రాష్ట్రంలో ఇంకా యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి కాలేదు. సీజన్‌ మొదలైనప్పటి నుంచి తప్పుల తడక ప్రణాళికలతో సాగిన పౌరసరఫరాల శాఖ ధాన్యం సేకరణ ప్రక్రియ ముగింపు దశకు వచి్చనా గాడిన పడలేదు. దీంతో ఇప్పటికీ ఇంకా 12 లక్షల మెట్రిక్‌ టన్నుల (ఎల్‌ఎంటీ) ధాన్యం వరి కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోనే మూలుగుతోంది. రెండు మూడుసార్లు కురిసిన అకాల వర్షాలకు నానిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు నానా తంటాలు పడ్డ రైతన్నలు.. రుతుపవనాల ప్రభావంతో కురిసే భారీ వర్షాలను తలచుకుని భయాందోళనలకు గురవుతున్నారు.

కొత్త గన్నీ బ్యాగులు లేకపోయినా, పాత బ్యాగులతోనే యాసంగి కథ నడిపించిన పౌరసరఫరా శాఖ.. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు, మిల్లుల నుంచి గోడౌన్‌లకు రవాణా సౌకర్యాన్ని కలి్పంచేందుకు అపసోపాలు పడుతోంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోతున్నాయి. మరోవైపు మిల్లులూ ఫుల్లయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ రైతు తన వడ్లు కొనుగోలు చేయడం లేదని ఏకంగా ఐకేపీ సెంటర్‌ సీఈవోపైనే పెట్రోల్‌తో దాడి చేయగా, సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో రాస్తారోకోలు జరుగుతున్నాయి.  

పది రోజుల్లో కష్టమేనా? 
    రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ ఇప్పటివరకు 43.70 లక్షల మెట్రిక్‌ టన్నుల (ఎల్‌ఎంటీ) ధాన్యాన్ని 7.77 లక్షల రైతుల నుంచి సేకరించింది. రాష్ట్రంలో ఏర్పాటైన 6,584 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ పూర్తయిన 3,252 కేంద్రాలను ఇప్పటికే మూసేశారు. మరో పదిరోజుల్లో కొనుగోళ్లు పూర్తవుతాయని ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ప్రకటించారు. కానీ ఇంకా 12 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యం.. కొనుగోలు కేంద్రాలు, రైతుల కల్లాల్లోనే కుప్పలుగా పడి ఉంది. కిందటి యాసంగిలో ఇప్పటికే 79 ఎల్‌ఎంటీ ధాన్యాన్ని కొనుగోలు చేయగా... ఈసారి అందులో దాదాపుగా సగానికే పరిమితం కావడం, ఇంకా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశుల వద్ద రైతులు పడిగాపులు పడడం అధికారుల అలసత్వాన్ని చాటుతోంది. ఈ పరిస్థితిని బట్టి చూస్తే ఇప్పట్లో కొనుగోళ్లు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
రవాణా లేక ఇబ్బందులు 
    సిద్దిపేట జిల్లాలో 412 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌ మిల్లులకు ధాన్యాన్ని సరఫరా చేసేందుకు ముగ్గురు కాంట్రాక్టర్లను నియమించారు. కాంట్రాక్టర్లు వాహనాలు సరిగా ఏర్పాటు చేయక పోవడంతో పాటు రైస్‌ మిల్లుల్లో స్థలం లేక పోవడంతో అన్‌ లోడ్‌ ఆలస్యం అవుతోంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు జోకుతున్నా, మిల్లర్ల వద్ద దించుకోవడం సమస్యగా మారింది. మిల్లులకు వెళ్లిన ట్రాక్టర్లు, లారీలు రోజుల తరబడి అన్‌లోడింగ్‌ కోసం వేచి చూసే పరిస్థితి ఇప్పటికీ సిద్దిపేట, మెదక్, ములుగు, నాగర్‌కర్నూల్, భూపాలపల్లి వంటి జిల్లాల్లో ఉంది.

మరోవైపు కాంట్రాక్టు కుదుర్చుకున్న లారీలు కూడా సమయానికి రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. రైతులు సొంతంగా ట్రాక్టర్లు సమకూర్చుకొని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు పంపించినా తీసుకోవడం లేదనే ఆరోపణలు విని్పస్తున్నాయి. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు, రైతుల కల్లాల్లో 12 ఎల్‌ఎంటీ వరకు ధాన్యం ఉన్నట్లు అంచనా వేస్తున్న అధికారులు దాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించే విషయంలో ఎలాంటి చొరవ చూపడం లేదు.  

మిల్లుల్లోనే వానాకాలం ధాన్యం 
    గత వానాకాలం సీజన్‌కు సంబంధించిన సుమారు 30 ఎల్‌ఎంటీల వరకు ధాన్యం కస్టమ్‌ మిల్లింగ్‌ (సీఎంఆర్‌) కోసం రైస్‌ మిల్లుల్లోనే ఉంది. దీనికి తోడు ఇప్పటివరకు 43 ఎల్‌ఎంటీ ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. మిల్లుల్లో జాగ లేక ప్రైవేటు గోడౌన్‌లలో కూడా ధాన్యాన్ని నిల్వ ఉంచారు. ఈ పరిస్థితుల్లోనే ఇంకా కొనుగోలు కేంద్రాల్లో మిగిలి ఉన్న ధాన్యాన్ని తీసుకునేందుకు మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు.

ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు ధాన్యాన్ని పంపించినా, దించుకోకపోవడంతో ఓపీఎంఎస్‌ (ఆన్‌లైన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం) లో నమోదు కావడం లేదు. దీంతో రైతులు ధాన్యాన్ని విక్రయించినా రికార్డులకెక్కడం లేదు. లారీలు, ట్రాక్టర్లు కొనుగోలు కేంద్రాలకు రాని పరిస్థితి ఉంటే స్పందించి తగిన నిర్ణయం తీసుకోవలసిన పౌరసరఫరాల అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మిల్లుల్లో ఖాళీ లేకనే ధాన్యం తరలింపు ఆలస్యమవుతోందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.  

వడ్ల పైసల్‌ పడుతలెవ్వు .. 
    సాధారణంగా ధాన్యం విక్రయించిన వారం రోజుల్లోపు రైతుల ఖాతాల్లోకి ధాన్యం సొమ్ము వచ్చి చేరుతుంది. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం వెళ్లిన వెంటనే ఓపీఎంఎస్‌ ద్వారా రైతు విక్రయించిన ధాన్యం వివరాలు ఆన్‌లైన్‌లోకి చేరతాయి. తదనుగుణంగా జిల్లా ఖజానా నుంచి రైతు బ్యాంకుల్లోకి డబ్బులు జమ అవుతాయి. అయితే ఈసారి రైతులకు ధాన్యం డబ్బులు ఆలస్యం అవుతున్నాయన్న ఫిర్యాదులు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

దీనికి ప్రధాన కారణం ఓపీఎంఎస్‌లో రైతు వివరాలు చేరకపోవడమే. ఇప్పటివరకు 7.77 లక్షల మంది రైతులు రూ.8,553.79 కోట్ల విలువైన ధాన్యం విక్రయించగా, ఓపీఎంఎస్‌లోకి నమోదైన రైతుల సంఖ్య కేవలం 5.26 లక్షలే. వారికి చెల్లించాల్సిన మొత్తం 5,789.84 కోట్లు. కానీ 3.47 లక్షల మందికి మాత్రమే రూ.5,233.18 కోట్ల మేర చెల్లింపులు జరిగాయి. ఇంకా ఓపీఎంఎస్‌ బ్యాలెన్స్‌ రూ. 556.66 కోట్లు ఉండగా, ఓపీఎంఎస్‌లోకి ఎంటర్‌ కాని రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ.3,320.61 కోట్లుగా ఉంది.  

కొనుగోళ్ల తాజా స్థితి ఇదీ... 
ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు:        6,584 
కొనుగోళ్లు ముగిసి మూతపడ్డ కేంద్రాలు:        3,252 
ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం    :        43.70 ఎల్‌ఎంటీ 
ఇంకా మార్కెట్‌కు రానున్న ధాన్యం (అంచనా)    :12 ఎల్‌ఎంటీ 
ధాన్యం విక్రయించిన రైతులు        :     7,77,013 
విక్రయించిన ధాన్యం విలువ        :    రూ. 8,553.79 కోట్లు 
ఓపీఎంఎస్‌ అయి రైతుల ఖాతాల్లోకి చేరిన మొత్తం : రూ. 5,233.18 కోట్లు 

 సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం అంకిరెడ్డి పల్లిలోని కొనుగోలు కేంద్రంలో రైతులు రోజుల తరబడి ధాన్యం అమ్ముకునేందుకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన వడ్ల బస్తాలను మిల్లులకు చేరవేసేందుకు లారీలు, ట్రాక్టర్లను అధికారులు సమకూర్చకపోవడంతో 15 రోజులుగా కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రైతులు అంకిరెడ్డిపల్లి వద్ద ప్రధాన రోడ్డుపై రాస్తారోకో జరిపారు.  

వీరానగర్‌ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి 15 రోజులు దాటింది. ఇప్పటికీ బస్తాలు ఇక్కడే ఉన్నాయి. వర్షం వచ్చే అవకాశం ఉన్నందున భయంగా ఉంది. రోజూ ఇక్కడే పడుకోవాల్సి వస్తోంది. – మన్నె స్వామి, రైతు, వీరానగర్, సిద్దిపేట జిల్లా   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement