మిల్లర్లు దోచుకుంటుంటే చోద్యం చూస్తున్న సర్కారు
రైతులకు, మిల్లర్లకు మధ్యవర్తిత్వం నెరుపుతున్న వైనం
మిల్లర్లు చెప్పిన ధరకు ఇవ్వాలని ఒత్తిడి.. ఏ ఒక్క రైతుకూ దక్కని మద్దతు ధర
మంత్రి నాదెండ్ల ఆదేశించినా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ముందుకు సాగని కొనుగోళ్లు.. ఆర్భాటపు హామీలు ఇవ్వొద్దంటూ రైతుల మండిపాటు
ధాన్యం బస్తా రూ.1,200కే అడుగుతున్నారని ఆవేదన
బాపట్ల జిల్లా కొల్లూరులో మంత్రులు కొలుసు, గొట్టిపాటికి చుక్కెదురు
నంద్యాల జిల్లాలో రోడ్డుపై ధర్నా
అవనిగడ్డ/సాక్షి ప్రతినిధి, బాపట్ల/బండి ఆత్మకూరు: రాష్ట్రంలో ధాన్యం రైతుల విషయంలో ప్రభుత్వం చెబుతున్నది ఒకటి.. వాస్తవంగా క్షేత్ర స్థాయిలో జరుగుతున్నది మరొకటి. ఏ ఒక్క రైతుకూ పూర్తి స్థాయిలో కనీస మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వమే ధాన్యం దళారీగా మారి.. రైతులకు, మిల్లర్లకు మధ్య మధ్యవర్తిత్వం నడుపుతుంటే అన్నదాతలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? మిల్లర్లు చెప్పిన ధరకే ధాన్యం ఇచ్చేయాలని ఒత్తిడి తీసుకు రావడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా, ఎక్కడైనా జరిగిందా.. అని రైతులు మండిపడుతున్నారు.
రెండు మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. ‘మొన్నటి ఇబ్బందులు చెప్పొద్దు. ఈ రోజే మీ సమస్యను పరిష్కరిస్తాం. ఎన్ని సంచులు కావాలంటే అన్ని... ఎన్ని లారీలు కావాలంటే అన్ని లారీలు పంపిస్తాం. దళారులకు ధాన్యం అమ్మొద్దు. ఈ రోజు సాయంత్రానికే మీ ధాన్యం కొనుగోలు చేసి తీరతాం’ అని మంత్రి మనోహర్ బుధవారం అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని మాజేరు, లంకపల్లి, లక్ష్మీపురం, చల్లపల్లి, కప్తానుపాలెం, పెదప్రోలు గ్రామాల్లో ధాన్యం రాశులను పరిశీలించి రైతులకు హామీ ఇచ్చారు.గురువారం రాత్రి వరకు కూడా అటు వైపు ఏ అధికారీ కన్నెత్తి చూడక పోవడం గమనార్హం.
చేత కానప్పుడు ఇలాంటి వాగ్దానాలు చేయకూడదని రైతులు హితవు పలుకుతున్నారు. ‘15 రోజుల క్రితం కోత కోయించి ధాన్యం తీసుకొచ్చి రోడ్డు పక్కన ఆరబెట్టుకుంటున్నాం. వర్షం వచ్చి ధాన్యం తడిస్తే ఎందుకూ పనికిరావు. ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని చేతులెత్తి మంత్రిని వేడుకున్నా. బుధవారం సాయంత్రానికి కొనేస్తామన్నారు. గురువారం సాయంత్రం వరకు ఎవరూ పత్తాలేరు. రైతులపై కనీస కనికరం లేదు’ అని లంకపల్లికి చెందిన మోటుపల్లి జయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.
బిత్తరపోయిన మంత్రులు
బాపట్ల జిల్లా కొల్లూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం పరిశీలించేందుకు వచ్చిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి, మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా దోపిడీకి గురవుతున్న తీరును స్థానిక రైతులు ఏకరువు పెట్టారు. ‘ఏం బాబూ.. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయా’ అని మంత్రి కొలుసు పార్థసారథి ఆరా తీశారు. దీనికి కౌలు రైతు ప్రసాదరావు సమాధానమిస్తూ.. ‘ఏంటండీ కొనేది? పండించిన పంటను కొనడానికి ముప్ప తిప్పలు పెడుతున్నారు.
మిల్లర్లే దళారులుగా మారి తక్కువ ధరకు ధాన్యం తీసుకుని రైతులను నట్టేట ముంచుతున్నారు. కొల్లూరులో 6 ఎకరాల్లో పండించిన ధాన్యాన్ని మిల్లుకు తెచ్చాం. ధాన్యం కొనాలని కోరుతూ తిరగని రోజు లేదు. ఈకేవైసీ చేయించిన పత్రాలు చూపెట్టా. తేమ శాతం 21 ఉన్నా.. మిల్లర్లు వారి కింద పనిచేసే బ్రోకర్లను అడ్డం పెట్టుకుని బస్తా (75 కిలోలు) రూ.1,200కే అడుగుతున్నారు’ అని అవస్థలను ఏకరువు పెట్టాడు. దీంతో బిత్తరపోయిన మంత్రులు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు.
కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో తీవ్రంగా నష్టపోతున్నామంటూ రైతులు గురువారం నంద్యాల జిల్లా సంతజూటూరు గ్రామంలో రోడ్డెక్కారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజశేఖర్, రైతు సంఘం నాయకులు వెంకట కృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులు ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం సన్న రకం వడ్లు బస్తా రూ.1,300 నుంచి రూ.1,400 ధర పలుకుతోందని, గత ప్రభుత్వం క్వింటాకు రూ.2,600 మద్దతు ధర ప్రకటించడంతో రూ. 2,500 నుండి రూ.2,900 వరకు ధర పలికిందన్నారు. గత ప్రభుత్వంలోనే మేలు జరిగిందని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment