ధాన్యం బంపర్‌.. ధరల టెన్షన్‌ | Telangana: Yasangi yield increased three and a half times but no MSP | Sakshi
Sakshi News home page

ధాన్యం బంపర్‌.. ధరల టెన్షన్‌

Published Tue, Apr 18 2017 4:01 AM | Last Updated on Tue, Sep 5 2017 9:00 AM

ధాన్యం బంపర్‌.. ధరల టెన్షన్‌

ధాన్యం బంపర్‌.. ధరల టెన్షన్‌

- యాసంగిలో మూడున్నర రెట్లు పెరిగిన దిగుబడి
- గత యాసంగిలో 7,21,000 టన్నులు
- ప్రస్తుతం 26,41,000 టన్నులు
- ప్రభుత్వ తాజా నివేదికలో వెల్లడి
- గిట్టుబాటు ధరపైనే ఆందోళన
- రైతును వెంటాడుతున్న గత ఖరీఫ్‌ భయం


సాక్షి, హైదరాబాద్‌

రాష్ట్రంలో యాసంగి పంట పండింది. వరి ధాన్యం రాశులు వెల్లువెత్తుతున్నాయి. భూగర్భ జలాలు పెరగడం, సాగు విస్తీర్ణం పెరగడంతో యాసంగి మురిసిపోతోంది. 2015–16 యాసంగిలో ధాన్యం 7.21 లక్షల టన్నులు దిగుబడి రాగా, ఈ యాసంగిలో ఏకంగా 26.41 లక్షల టన్నులకు పెరిగింది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా మూడున్నర రెట్లు ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం తాజాగా అంచనా వేసింది. యాసంగి సాధారణ పంటల సాగు విస్తీర్ణం 29.86 లక్షల ఎకరాలు కాగా.. ఈ యాసంగిలో ఏకంగా 38.01 లక్షల (127%) ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో వరి 21.39 లక్షల ఎకరాల్లో సాగు కావడం గమనార్హం. గోదావరి జిల్లాలను తలదన్నేలా ధాన్యం దిగుబడులు వస్తున్నాయి. వరితో పాటు పప్పుధాన్యాల దిగుబడి కూడా గణనీయంగా పెరిగింది.

గత యాసంగిలో పప్పుధాన్యాల దిగుబడి 60 వేల టన్నులు కాగా, ఈ యాసంగిలో 1.48 లక్షల టన్నులకు పెరిగింది. గత యాసంగిలో వేరుశనగ 1.45 లక్షల టన్నులు దిగుబడి రాగా, ఈ యాసంగిలో 2.44 లక్షల టన్నుల్లో దిగుబడులు రానున్నాయి. దాంతోపాటు మొక్కజొన్న గత యాసంగిలో 4.25 లక్షల టన్నులు పండగా, ఈ యాసంగిలో 7.80 లక్షల టన్నులు పండింది. గత యాసంగిలో శనగ 48 వేల టన్నుల దిగుబడులు రాగా, ఈ యాసంగిలో 1.24 లక్షల టన్నులు దిగుబడులు వచ్చాయి. ఇలా అన్ని రకాల ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

గిట్టుబాటు ధరపైనే ఆందోళన..
గిట్టుబాటు ధర రైతును ఆందోళనకు గురిచేస్తోంది. ఖరీఫ్‌ పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు కుదేలయ్యాడు. ఇదే దుస్థితి రబీ పంటలకూ వస్తుందన్న ఆందోళన రైతును వేధిస్తోంది. ఖరీఫ్‌లో 2.44 లక్షల టన్నుల కంది ఉత్పత్తి జరిగిందని ప్రభుత్వం తెలిపింది. గతేడాది కందికి మార్కెట్‌లో క్వింటాలుకు రూ.10 వేల వరకు ధర పలకగా, ఈ ఏడాది రూ.4 వేలకు పడిపోయింది. ప్రభుత్వం రూ.5,050కి గిట్టుబాటు ధరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా చాలా మంది రైతులు వ్యాపారుల దోపిడీకి గురయ్యారు. గతేడాది ఖరీఫ్‌లో 2.61 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ప్రభుత్వ అంచనా ప్రకారం దాదాపు 3.17 లక్షల టన్నుల మిర్చి ఉత్పత్తి అయింది. ఉత్పత్తి గణనీయంగా ఉన్నా ధర మాత్రం పడిపోయింది. 2015–16 ఖరీఫ్‌లో పండిన మిర్చి ధర మార్కెట్‌లో క్వింటాలుకు రూ.12 వేల వరకు పలకగా, ఈ ఏడాది ఏకంగా రూ.4,500 వరకు పడిపోయింది. మిర్చిని రూ.7 వేల కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేలా అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు ఎలాంటి స్పందనా లేదు. ఆలస్యంగా కేంద్రం అనుమతిస్తే వ్యాపారులకే గిట్టుబాటు ధర లభిస్తుందన్న విమర్శలున్నాయి.

రబీ ధాన్యం కొనుగోలుపై కేంద్రీకరించాలి..
రబీలో వరికి గిట్టుబాటు ధర దక్కేలా పూర్తి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వరికి కనీస మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం 3,076 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా, అవి పూర్తి స్థాయిలో రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలి. వరి ఏ గ్రేడ్‌ రకం ధర క్వింటాలుకు రూ.1,510, సాధారణ రకం ధర రూ.1,470 మద్దతు ధర ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

మిర్చితో నష్టపోయాం: ఇందుర్తి రంగారెడ్డి, పోచారం, ఖమ్మం జిల్లా
మిర్చికి సరైన ధర రాక పెద్ద ఎత్తున నష్టపోయాను. కాలం కలిసొచ్చిందన్న సంతోషం లేకుండా పోయింది. వ్యాపారుల దగా వల్ల మిర్చికి గిట్టుబాటు ధర రాకుండా పోవడంతో అప్పులే మిగిలాయి. కనీసం రబీలో పండించిన వరికైనా ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి.

గిట్టుబాటు ధర కల్పించాలి: యాదయ్య, రైతు, మిడ్జిల్‌ (మహబూబ్‌నగర్‌)
ఈ ఏడాది పెట్టుబడి ఖర్చులు తడిసి మోపెడయ్యింది. దిగుబడులేమో ఆశించినంతగా లేవు. కాలం లేక పంటలన్నీ ఎండిపోతున్నయి. నాలుగు గంటల సేపు బోరు నడిస్తే అర ఎకరం పొలం కూడా పార్తలేదు. పశువులకు కొంత గడ్డి పండుతదని వరి పంట ఏసినం. నాలుగు గింజలు పండుతున్నయి. కాస్త రేటు కల్పించి మమ్ముల్ని ఆదుకోవాలి.

ప్రభుత్వమే ఆదుకోవాలి: వెంకట్‌రెడ్డి, రైతు, మున్ననూర్, మహబూబ్‌నగర్‌
ఈ ఏడాది పంటలకు సరైన గిట్టు బాటు ధరలు దక్కట్లేదు. మొక్కజొన్న, పత్తి, కంది, మిర్చికి సరైన ధరలు లభించక పోవడంతో తీవ్రంగా నష్టపోయినం. పెట్టుబడులు ఎల్లని దుస్థితి నెలకొంది. పెట్టిన పెట్టుబడి కూడా ఎల్తలేదు. ప్రభుత్వం వరి విషయంలోనైనా మంచి ధరలు లభించేలా చర్యలు తీసుకుని ఆదుకోవాలి.

ప్రతి గింజా కొనుగోలు చేస్తాం: మంత్రి హరీశ్‌రావు
రబీలో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గణనీయంగా మార్కెట్లోకి వరి ధాన్యం వస్తుందని ఆశిస్తున్నాం. రాష్ట్రంలో ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్‌) ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. జాయింట్‌ కలెక్టర్లను పర్యవేక్షణ చేయమన్నాం. ఎఫ్‌సీఐని, మిల్లర్లను కూడా సిద్ధంగా ఉండాలని చెప్పాం. గన్నీ బ్యాగులను సేకరించి పెట్టుకున్నాం. పక్క రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చి నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో ధాన్యం కొంటున్నారు. దానివల్ల పోటీ పెరిగి రైతులకు ఉపయోగపడుతుంది. ప్రతి గింజా కొనేందుకు ఏర్పాట్లు చేశాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement