సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఒక్క గింజ కూడా పోకుండా వీలైనంత త్వరగా సేకరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. మామూలు ధాన్యం ధరనే తడిసిన ధాన్యానికీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. రైతన్నల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుంటోందని, ఆపత్కాలంలో వారి దుఃఖాన్ని, కష్టాన్ని పంచుకునేందుకు మరోసారి సిద్ధమైందని చెప్పారు. రైతుల కష్టాల్లో భాగస్వామ్యం కావడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, అన్నదాతలు ఏమాత్రం ఆందోళన చెందవద్దని కోరారు.
యాసంగి ధాన్యంతో పాటు అకాల వర్షాల్లో తడిసిన ధాన్యం సేకరణపై మంగళవారం ఆయన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణ జరుగుతోందని, అయితే అకాల వర్షాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ధాన్యం సేకరణ త్వరలోనే పూర్తి చేస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ చెప్పారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.
వరి కోతలు వాయిదా వేసుకోవాలి..
మరో మూడు, నాలుగురోజులు వానలు కొనసాగనున్నాయని, అప్పటిదాకా వరి కోతలను వాయిదా వేసుకోవాలని కేసీఆర్ రైతులకు సూచించారు. పంట కోతలకు వెళ్లకుండా సంయమనం పాటించాలని, ధాన్యం తడవకుండా జాగ్రత్త పడాలని కోరారు. ‘రైతుల కోసం చిత్తశుద్ధి, దృఢ సంకల్పంతో కార్యాచరణ అమలు చేస్తున్నది ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. ఊహించని అకాల వర్షాలు ఎడతెరిపి లేకుండా కొనసాగుతుండడం బాధాకరం.
ప్రకృతి వైపరీత్యానికి ఎవరం ఏమీ చేయలేం. కానీ మనకేం సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండలేదు. పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలను అందిస్తూ ఇప్పటికే ఆదుకుంటోంది. రాష్ట్ర ఖజానాకు ఎంత భారమైనా వెనుకంజ వేయకుండా రైతన్నలను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది..’ అని సీఎం స్పష్టం చేశారు.
ఇక మార్చిలోనే వరి కోతలు..
గతానికి భిన్నంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాలను గుణపాఠంగా తీసుకుని భవిష్యత్తులో యాసంగి వరి కోతలు మార్చిలోపే జరిపేందుకు ఎలాంటి విధానాలను అవలంభించాలో శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని వ్యవసాయ శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ దిశగా రాష్ట్ర రైతాంగాన్ని చైతన్యం చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఏటా మార్చిలోగా వరి కోతలు పూర్తయ్యేలా ముందస్తుగానే పంట నాటుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. మార్చి తర్వాత అకాల వర్షాలకు అవకాశాలున్నందున ఆ లోపే కోతలు పూర్తి చేసుకోవడం మంచిదన్నారు. ఏప్రిల్, మే వచ్చేదాకా పంట నూర్పకుంటే ఎండలు పెరిగి ధాన్యంలో నూక శాతం కూడా పెరిగిపోతుందని పేర్కొన్నారు.
రైతులకు అవగాహన కల్పించాలి
ఎరువుల వినియోగంపై కూడా రైతులకు అవగాహన కల్పించాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలు, మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో తలెత్తే మార్పులపై ఎప్పటికప్పుడు రైతాంగానికి అర్థమయ్యే రీతిలో కరపత్రాలు, పోస్టర్లు, వాణిజ్య ప్రకటనలు తదితర ప్రచార మార్గాల ద్వారా అవగాహన, చైతన్యం కల్పించాలని సూచించారు.
ఏఈఓలు నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు తగు సూచనలందించాలని ఆదేశించారు. రైతు వేదికల్లో వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని స్పష్టం చేశారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలుంటాయన్నారు. ఈ దిశగా పనితీరును పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం ఆదేశించారు.
తడిసినా కొంటాం
Published Wed, May 3 2023 2:59 AM | Last Updated on Wed, May 3 2023 2:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment